• facebook
  • whatsapp
  • telegram

గ్రహణాలు

ఖగోళంలో ఛాయల చిత్రాలు!

ఖగోళంలో అనేక రకాల కదలికలు సంభవిస్తుంటాయి. అవి భూమిపై ప్రభావాన్ని చూపుతుంటాయి. ముఖ్యంగా సూర్యచంద్రుల గమనాల వల్ల భూ వాతావరణంలో మార్పులు జరుగుతుంటాయి. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే అక్షంపైకి వచ్చినప్పుడు ఏర్పడే నీడలు భూఉష్ణోగ్రతల్లో తేడాలకు కారణమై, పర్యావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. వాటినే గ్రహణాలు అంటారు. ఖగోళ రీత్యా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఈ ఛాయల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. గ్రహణాల్లో రకాలు, ఇతర ముఖ్యాంశాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. 


భూమి సూర్యుడి చుట్టూ, చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమణం చేస్తున్న సందర్భంలో ఏర్పడే నీడలే గ్రహణాలు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖ మీదకు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియను సిజిగి (syzygy) అంటారు.గ్రహణాలు రెండు రకాలు. 1) సూర్యగ్రహణం (సోలార్‌ఎక్లిప్స్‌)  2) చంద్రగ్రహణం (లూనార్‌ఎక్లిప్స్‌). 


సూర్యగ్రహణం: భూమికి, సూర్యుడికి మధ్యలో చంద్రుడు ప్రయాణిస్తూ అడ్డుగా వచ్చినపుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజున సంభవిస్తుంది. అయితే అన్ని అమావాస్య రోజుల్లో సూర్యగ్రహణం సంభవించదు. కారణం చంద్రుడి పరిమాణం భూమితో పోలిస్తే తక్కువగా ఉండటమే. అంతేకాకుడా జాబిల్లి కక్ష్యాతలం భూకక్ష్యతో 5° 9' కోణంలో ఉంటుంది. అంటే భూకక్ష్య, చంద్రుడి కక్ష్యల మధ్య భేదం ఉండటం మరో కారణం. సూర్యగ్రహణం సమయంలో రెండు రకాలైన నీడలను చంద్రుడు ఏర్పరుస్తాడు.

ఎ) ప్రచ్ఛాయ (umbra): భూమి లేదా చంద్రుడి చీకటి భాగంలో ఉండే చిన్న ప్రాంతం. ఈ ప్రదేశంలోని ప్రజలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడగలుగుతారు. ఇది గరిష్ఠంగా 7 నిమిషాల 40 సెకన్లు ఉంటుంది.

బి) పాక్షిక ఛాయ (penumbra): ప్రచ్ఛాయ చుట్టూ ఉన్న భాగాన్ని ‘పాక్షిక ఛాయ’ అంటారు. ఈ ఛాయలో సూర్యకాంతి కొంత  మాత్రమే ప్రసరిస్తుంది.


సూర్యగ్రహణ రకాలు:

1) సంపూర్ణ సూర్యగ్రహణం (టోటల్‌సోలార్‌ఎక్లిప్స్‌): సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు ఇది ఏర్పడుతుంది. ఆ సమయంలో ఆకాశంలో చీకట్లు కమ్ముకుని తాత్కాలికంగా రాత్రి మాదిరి కనిపిస్తుంది.

2) పాక్షిక/ కంకణ సూర్యగ్రహణం (పార్షియల్‌సోలార్‌ఎక్లిప్స్‌):  సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై లేనప్పుడు ఇది  ఏర్పడుతుంది.

3) వలయకార/వర్తులాకార సూర్యగ్రహణం (అన్యూలార్‌సోలార్‌ఎక్లిప్స్‌): చంద్రుడు అపోజీ (భూమికి గరిష్ఠ దూరం)లో ఉన్నప్పుడు చాలా తక్కువ పరిమాణంలో ఉండి సూర్యుడిని పూర్తిగా కనిపించకుండా చేయలేడు. అప్పుడు సూర్యుడి అంచు ప్రాంతాలు ప్రకాశవంతమైన వలయంలా కనిపిస్తాయి. చంద్రుడి చుట్టూ వలయంలా కనిపించేదే సూర్యగ్రహణం.

4) హైబ్రిడ్‌సూర్యగ్రహణం: మూడు రకాల సూర్యగ్రహణాలను కలిపి ‘హైబ్రిడ్‌సూర్యగ్రహణం’ అంటారు.


చంద్ర గ్రహణం:  సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పౌర్ణమి రోజుల్లో మాత్రమే ఇది సంభవిస్తుంది. భూమి, చంద్రుడి కక్ష్యల మధ్య భేదం ఉండటం వల్ల ఇది అన్ని పౌర్ణమి రోజుల్లో కనిపించదు. కారణం చంద్రుడి పరిభ్రమణ కోణం 5° 9'× ఉండటమే.

2024, ఏప్రిల్‌8న ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం సంభవించింది. ఇది భారతదేశంలో స్పష్టంగా కనిపించనప్పటికీ అమెరికాలో (ఉత్తర భాగం) స్పష్టంగా కనిపించింది. 


రాబోయే గ్రహణాలు:   2024, సెప్టెంబరు17 -18 - చంద్రగ్రహణం (పాక్షిక) 

అక్టోబరు 2 - సూర్యగ్రహణం (వలయాకార) 

అక్టోబరు 17 - చంద్రగ్రహణం (సంపూర్ణ)


చంద్రగ్రహణం - ముఖ్యాంశాలు:

ఎ) బ్లూమూన్‌: సాధారణంగా ఒక నెలలో ఒకే పౌర్ణమి ఏర్పడుతుంది. కానీ కొంత సుదీర్ఘకాల వ్యవధిలో రెండు పౌర్ణమిలు ఏర్పడతాయి. ఈ రెండో పౌర్ణమినే ‘బ్లూమూన్‌’ అంటారు. 2015, జులై 2, 31 తేదీల్లో రెండు పౌర్ణమిలు సంభవించాయి. ఇందులో 31న సంభవించిన పౌర్ణమే బ్లూమూన్‌.

బి) సూపర్‌మూన్‌/ పెరిజీ మూన్‌: చంద్రుడు తన కక్ష్యలో పెరిజీ స్థానం కంటే భూమికి మరింత దగ్గరగా రావడాన్ని ‘సూపర్‌మూన్‌’ అని పిలుస్తారు. నీ 1979లో ‘రిచర్డ్‌నోలే’ మొదటిసారిగా ఈ స్థితిని గమనించారు.

సి) సూపర్‌బ్లడ్‌మూన్‌: సూపర్‌మూన్, చంద్ర గ్రహణం కలిసి ఒకేసారి ఏర్పడే సంఘటన. ఈ స్థితిలో చంద్రుడు ఎర్రగా, 14 రెట్లు పెద్దగా, 30% అదనపు ప్రకాశవంతంగా కనిపిస్తాడు.నీ ఈ సంఘటనను 2033లో చూడొచ్చు.

ప్రతి 18 ఏళ్ల, 10 రోజుల తర్వాత సూర్యచంద్రగ్రహణాలు అంతకు పూర్వం ఏ క్రమంలో ఏర్పడ్డాయే మళ్లీ అదే పద్ధతిలో ఏర్పడతాయి.

సాధారణంగా ఒక ఏడాదికి 7 గ్రహణాలు సంభవిస్తాయి. ఇందులో 5 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు లేదా 4 సూర్య, 3 చంద్రగ్రహణాలు.

సూర్యకాంతి భూవాతావరణంలో దుమ్మూ, ధూళి కణాలపై పడి పరిక్షేపణం చెందినప్పుడు సూర్యకాంతిలోని మిగతా రంగుల కాంతుల కంటే ఎర్రని కాంతి ఎక్కువగా దూరం ప్రయాణిస్తుంది. అందువల్లే చంద్రగ్రహణం సంభవించినప్పుడు చంద్రుడు సాధారణంగా ఎర్రగా కనిపిస్తాడు.

సూర్యగ్రహణాన్ని ప్రజలు ముఖ్యంగా గర్భిణులు ప్రత్యక్షంగా చూడకూడదు. దీనికి కారణం గ్రహణ సమయంలో ఎక్కువగా వెలువడే అతినీలలోహిత కిరణాలు కంటిని చేరి చూపు పోయే ప్రమాదం ఉంది. అందువల్ల గ్రహణాన్ని మసిపూసిన అద్దాల ద్వారా మాత్రమే చూడాలి. 

సంపూర్ణ చంద్రగహణం గరిష్ఠంగా 90 నిమిషాలు ఉంటుంది. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం 2011, జూన్‌ 15న సంభవించింది.



     నమూనా ప్రశ్నలు     

1. సూర్య గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది?

  1) భూమికి, చంద్రుడికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడు

  2) భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు

  3) సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమివచ్చినప్పుడు        

  4) ఏదీకాదు


2. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది?

  1) చంద్రుడికి, భూమికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడు

  2) చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు

  3) భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు 

  4) చంద్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు


3. సూర్యగ్రహణం సమయంలో చంద్రుడి వెనక ఏర్పడిన చీకటి ప్రాంతాన్ని ఏమంటారు?

  1) ఛాయ        2) ఉపఛాయ 

  3) ప్రచ్ఛాయ      4) ప్రతిఛాయ 


4. ఏడాదిలో ఏర్పడే గ్రహణాల గరిష్ఠసంఖ్య?

  1) 7    2) 6    3) 5    4) 4


5. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణం?

  1) చంద్రగ్రహణం    2) సూర్యగ్రహణం

  3) వర్తులా సూర్యగ్రహణం    4) వర్తులా చంద్రగ్రహణం


6. సూర్యుడికి, భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణం?

  1) చంద్రగ్రహణం   2) వర్తులా సూర్యగ్రహణం 

  3) సూర్యగ్రహణం   4) వర్తులా చంద్రగ్రహణం


7. సూర్యగ్రహణం సాధారణంగా ఏ రోజున ఏర్పడుతుంది? 

  1) పౌర్ణమి      2) అమావాస్య 

  3) పాడ్యమి     4) అష్టమి


8. చంద్రగ్రహణం ఏ రోజున ఏర్పడుతుంది? 

 1) అమావాస్య   2) పాడ్యమి 

 3) అష్టమి       4) పౌర్ణమి


9. సూర్యగ్రహణం అమావాస్య రోజున ఏర్పడటానికి కారణమేంటి?

 ఎ) చంద్రుడి పరిమాణం భూమితో పోలిస్తే తక్కువగా ఉండటం

 బి) భూమి పరిమాణం చంద్రుడితో పోలిస్తే ఎక్కువగా ఉండటం

 సి) చంద్రుడి కక్ష్యాతలం భూకక్ష్యతలంతో  5° 9'  కోణంలో ఉండటం

 డి) భూమి, చంద్రుడి కక్ష్యల మధ్య భేధం ఉండటం

 1) ఎ, బి, డి      2) ఎ, బి, సి  

 3) ఎ, బి, సి, డి    4) బి, డి, ఎ


జవాబులు: 1-2; 2-2; 3-3; 4-1; 5-2; 6-3; 7-2; 8-4; 9-3.


రచయిత: జయకర్‌సక్కరి  

Posted Date : 11-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌