• facebook
  • whatsapp
  • telegram

భారత ఆర్థిక సర్వే 

ఆర్థిక సర్వే  అంటే..?

* దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఆర్థిక సర్వేను పేర్కొంటారు. ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్‌ రూపకల్పన జరుగుతుంది.

*  సాధారణంగా కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (Chief Economic Advisor-CEA) ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందిస్తారు. ప్రస్తుత CEA వి.అనంత నాగేశ్వరన్‌.


ఆర్థిక సర్వే, బడ్జెట్‌  మధ్య తేడా

* ఆర్థిక సర్వేలో ప్రస్తుత ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును విశ్లేషిస్తారు. ఆర్థిక బలోపేతానికి రానున్న కాలంలో చేయాల్సిన చర్యలను పేర్కొంటారు.

* కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాల్లో రాబడి, ఖర్చుల కేటాయింపులను మాత్రమే పేర్కొంటారు.


జీడీపీలో హెచ్చు, తగ్గులకు కారణం

* జీడీపీ పెరగాలంటే ప్రజల వినియోగం లేదా ఖర్చు లేదా కొనుగోలు శక్తి పెరగాలి. వినియోగం అధికమవ్వాలంటే ప్రజల ఆదాయం పెరగాలి. తద్వారా వినియోగం ఎక్కువై వస్తు, సేవలకు డిమాండ్‌ పెరిగి, ఉత్పత్తి అధికమవుతుంది. 

* ప్రజల ఆదాయం పెరగాలంటే వారికి దీర్ఘకాలిక ఉపాధి ఉండాలి. కాబట్టి ప్రభుత్వాలు దేశ ప్రజల జీవనోపాధికి రక్షణ కల్పించి, ప్రత్యక్ష నగదు సహాయం ద్వారా వారి కొనుగోలు శక్తిని మెరుగుపరచాలి.

ఉదా: జీడీపీ అనేది ఒక విద్యార్థి మార్కుల జాబితా లాంటిది. ఒక సంవత్సరంలో ఒక విద్యార్థి పనితీరును, ఆ పాఠ్యాంశాల్లో సదరు విద్యార్థికి ఏ విధంగా పట్టుందనే విషయాన్ని తనకు వచ్చే మార్కుల ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా దేశ ఆర్థిక కార్యకలాపాల స్థాయిని, అందులో వివిధ రంగాలు, అంశాల బలాబలాలను జీడీపీ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ బాగుందో, లేదో కూడా ఇది పేర్కొంటుంది. మందగమనం ఉన్నట్లు జీడీపీ గణాంకాలు సూచిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందని అర్థం. అంటే దేశంలో గడచిన సంవత్సరంతో పోలిస్తే తగినన్ని వస్తు, సేవల ఉత్పత్తి జరగడం లేదని భావించాలి.

* ప్రస్తుతం మన దేశంలో జాతీయ గణాంక కార్యాలయం(National Statistical Office - NSO)  ఏటా 4 సార్లు (ఏప్రిల్‌-జూన్, జులై-సెప్టెంబరు, అక్టోబరు-డిసెంబరు, జనవరి-మార్చి) జీడీపీని లెక్కిస్తుంది. 

* ప్రతి 3 నెలలకోసారి చేపట్టే ఈ లెక్కలను ఆర్థిక పరిభాషలో త్రైమాసిక గణాంకాలు అంటారు. భారత్‌ లాంటి అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాలు పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చేందుకు ఏటా అధిక జీడీపీ సాధించడం ముఖ్యం.


2022-23 ఆర్థిక సర్వే - జీడీపీ వృద్ధిరేట్ల గణాంకాలు

*  భారత్‌ ప్రపంచ దేశాలతో పోలిస్తే, అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని ఆర్థిక సర్వే తెలిపింది. 

*  దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు (జీడీపీ) 2022-23 లో 7 శాతం నమోదవుతుందని ప్రకటించింది. 2023-24 లో ఇది 6% నుంచి 6.8 శాతం మధ్య ఉండొచ్చని సర్వే అంచనా వేసింది.

* కొనుగోలు శక్తి (Purchasing Power  Parity - PPP) పరంగా ప్రపంచంలోనే భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని వెల్లడించింది. దేశీయంగా వినియోగం పెరుగుతున్నందున ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సర్వే తెలిపింది.

* 202223 సర్వే ప్రకారం, నికర జాతీయ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద రూ.1,70,620 ఉండగా, స్థిర ధరల వద్ద రూ.96,522 గా ఉంది. 

* 2021లో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల మొదటి 10 దేశాల్లో భారత్‌ ఆరో స్థానంలో ఉందని 2022, జులై 1న ప్రపంచ బ్యాంకు తెలిపింది.

* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రిసెర్చ్‌ విభాగం 2022, సెప్టెంబరు 1న విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల మొదటి 10 దేశాల్లో (2022లో) భారత్‌ అయిదో స్థానంలో ఉందని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ 6.5 - 7 శాతం వృద్ధితో 2025-26 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరొచ్చని ఈ విభాగం అంచనా వేసింది. 

* గత 30 ఏళ్లుగా భారత జీడీపీ డాలర్ల రూపేణా సగటున 9 శాతం వార్షిక వృద్ధిని కనబరిచింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణించినప్పటికీ భారత్‌ ఈ వృద్ధిని నమోదు చేసింది.

* ఒకవేళ రూపాయి బలోపేతమైతే డాలర్ల రూపేణా 9 శాతం కంటే అధికవృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది. అప్పుడు 2030 నాటికి 7 లక్షల కోట్ల డాలర్లకు ఆర్థిక వ్యవస్థ చేరొచ్చని సర్వే తెలిపింది. 

* 2022-023 ఆర్థిక సర్వే ప్రకారం, ప్రస్తుత ధరల వద్ద 2022-23 లో భారత జీడీపీ రూ.2,73,07,751 లక్షల కోట్లుగా ఉండగా, 202122లో 2,36,64,637 లక్షల కోట్లుగా ఉంది. అంటే గతేడాది నుంచి రూ.36,43,114 లక్షల కోట్లు మాత్రమే పెరిగింది.

* 2022-23లో ప్రైవేట్‌ అంతిమ వినియోగం (ప్రజల వినియోగం) ఎంతో ఆకర్షణీయంగా (60.1%) ఉంది. ద్రవ్యోల్బణం అధిక స్థాయుల నుంచి దిగి వచ్చినప్పటికీ, ఆర్‌బీఐ నిర్దేశించిన 6% కంటే అధికంగా (6.8%) ఈ ఆర్థిక సంవత్సరంలో నమోదు కావొచ్చని పేర్కొంది.

* భారత్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు (MSME)  ఆర్థిక చేయూతను అందించేందుకు కేంద్రం ఉద్దేశించిన అత్యవసర రుణ అనుసంధానిత హామీ పథకం(Emergency Credit Line Guarantee Scheme - ECLGS) వాటి ప్రగతికి దోహదం చేసిందని సర్వే తెలిపింది. 

* దేశంలో 6 కోట్ల MSME ల్లో 12 కోట్ల మంది పని చేస్తున్నారు. జీడీపీలో ఎంఎస్‌ఎంఈల వాటా 35%. 

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి ఎనిమిది నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలు 63.4% పెరిగాయి. ఈ ఏడాది నిర్దేశించుకున్న 7.5 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయాల లక్ష్యం పూర్తి కావొచ్చని  ఆర్థిక సర్వే అంచనా వేసింది.


ఆర్థిక సర్వేలో ఉండే అంశాలు

* దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి - దిగుమతులు, విదేశీ మారకనిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల లాంటి అంశాలను వివరిస్తుంది. 

* ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటివల్ల వస్తోన్న ఫలితాలను విశ్లేషిస్తుంది.


ఆర్థిక సర్వే పరిణామ క్రమం

* బడ్జెట్‌ కంటే ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మొదటిసారి 195051లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 

*  1964 నుంచి దీన్ని బడ్జెట్‌కి ముందు ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు. 

* కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపుల ప్రతిపాదనలను తేలిగ్గా అర్థం చేసుకోవడానికి  దీన్ని ప్రత్యేకంగా ప్రకటిస్తున్నారు.


స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు

* ఒక ఇంట్లో నలుగురు ఉంటే, అందరూ పనిచేసి సంపాదించిన మొత్తం సొమ్మును ఆ ఇంటి ఆదాయం అంటారు. అదే విధంగా ఒక దేశంలోని ప్రజలంతా కలిసి ఉత్పత్తిచేసే వస్తు, సేవల విలువను జీడీపీ అంటారు. 

* ప్రపంచంలోని దేశాల ఆర్థిక పరిస్థితిని జీడీపీ ఆధారంగానే అంచనావేస్తారు. ప్రస్తుత ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన మొదటి పది దేశాల జాబితాలో భారత్‌ ఉంది. 

* దేశ ఆర్థిక వ్యవస్థ ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన వస్తు, సేవల నికర విలువను జీవీఏ (Gross Value Added - GVA) అంటారు. 

* ఉత్పత్తికి ఉపయోగించిన ముడి పదార్థాల విలువను వస్తు, సేవల మొత్తం విలువ నుంచి మినహాయిస్తే జీవీఏ వస్తుది. దీనికి అన్ని ఉత్పత్తులకు సంబంధించిన పన్నులను కలిపి, సబ్సిడీలను మినహాయిస్తారు. ఈ విధంగా చేశాక వచ్చిన మొత్తమే జీడీపీ.


వివిధ సంస్థల ప్రకారం, 2023లో భారతదేశ జీడీపీ వృద్ధి రేట్ల అంచనాలు (శాతాల్లో)

సంస్థ  వృద్ధిరేటు
ఎస్‌ అండ్‌ పి 7.3
ఏషియన్‌ డెవలప్‌మెంట్‌బ్యాంక్‌    7
మూడీస్‌  7
ఫిచ్‌ 7
గోల్డ్‌మ్యాన్‌ సాక్స్‌ 7
ప్రపంచ బ్యాంకు 6.9

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 

6.8
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 6.8
ఇంటర్నేషనల్‌ మానిటరింగ్‌  ఫండ్‌ (ఐఎంఎఫ్‌) 6.8
సిటీ గ్రూప్‌ 6.7
ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ)  6.6

ఆధారం: ఆర్థిక సర్వే 2022-23 


గమనిక: సగటు వృద్ధి రేటు 6.9 శాతం

Posted Date : 19-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌