• facebook
  • whatsapp
  • telegram

భూమి - భూచలనాలు, ఫలితాలు

* సూర్యుడి నుంచి భూమి మూడో స్థానంలో ఉంది. మొత్తం ఉన్న 8 గ్రహాల్లో భూమి అయిదో పెద్ద గ్రహం.


* భూమి ధృవాల వద్ద కొంత సమతలంగా ఉండి, మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. అందుకే దాని ఆకారాన్ని జియోయిడ్‌ (Geoid) గా పేర్కొంటారు.


* కాంతి, వేడి కోసం భూమికి సూర్యుడు ఒక్కడే ఆధారం.


* సూర్యుడు, భూమికి మధ్య దూరం సుమారు 150 మిలియన్‌ కిలో మీటర్లు.


* సూర్యుడి కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది.


* భూమి సూర్యుడి చుట్టూ తిరిగే మార్గాన్ని ‘కక్ష్య’ అంటారు. భూకక్ష్య దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది. అందుకే సూర్యుడికి, భూమికి మధ్య దూరం స్థిరంగా ఉండదు. భూమి తన కక్ష్యా మార్గంలో సంవత్సరంలో నిర్దిష్ట కాలంలో సూర్యుడికి అతి దగ్గరగా రావడం, అత్యంత దూరంగా వెళ్లడం జరుగుతుంది. దీన్ని పరహేళి, అపహేళితో సూచిస్తారు.


పరహేళి (Perihelion):ఇది సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న కనిష్ఠ దూరాన్ని తెలుపుతుంది. భూమి తన కక్ష్యా మార్గంలో ఏటా జనవరి 3న ఈ స్థానంలోకి వస్తుంది. ఈ స్థితిలో భూమికి, సూర్యుడికి మధ్య దూరం 147 మిలియన్‌ కి.మీ. ఉంటుంది. భూగోళ సగటు ఉష్ణోగ్రతలు జనవరి నెలలో ఎక్కువగా ఉంటాయి.


అపహేళి(Epihelion): ఇది సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న గరిష్ఠ దూరాన్ని తెలుపుతుంది. భూమి తన కక్ష్యా మార్గంలో ఏటా జులై 4న ఈ స్థితిలోకి వస్తుంది. ఇందులో భూమికి, సూర్యుడికి మధ్య దూరం 152 మిలియన్‌ కి.మీ. ఉంటుంది. భూగోళ సగటు ఉష్ణోగ్రతలు జులైలో తక్కువగా ఉంటాయి.


భూమి - చలనాలు 


భూమికి రెండు రకాల చలనాలు ఉంటాయి. అవి:


1. భూభ్రమణం (Earth Rotation)


2. భూపరిభ్రమణం (Earth Revolution)..


భూభ్రమణం


* దీన్నే భూమి ఆత్మభ్రమణం అని కూడా అంటారు.


* భూమి తన అక్షాన్ని ఆధారంగా చేసుకొని తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు.


* భూభ్రమణ వేగం గంటకు 1610 కి.మీ. ఇంత వేగంతో 


భూమి తిరుగుతున్నప్పటికీ భూమిపై నివసించే జీవరాశి కింద పడకపోవడానికి కారణం భూమి గురుత్వాకర్షణ శక్తి.


* భూభ్రమణ సమయంలో భూమి కదలికలను మనం గుర్తించలేకపోవడానికి కారణం దానితోపాటు అంతే వేగంతో మనం కూడా కదులుతూ ఉండటం.


* భూమి తన చుట్టూ తాను పడమర నుంచి తూర్పునకు తిరుగుతుంది. కాబట్టి రోజూ సూర్యుడు తూర్పున ఉదయించి, పడమరన అస్తమించడం మనం గమనిస్తాం.


* సాధారణంగా ప్రపంచంలో తూర్పు దిక్కులో చివర ఉన్న దేశాలు; దేశంలో తూర్పు చివర ఉన్న రాష్ట్రాలు మొదటగా సూర్యోదయాన్ని చూస్తాయి. దీనికి కారణం భూభ్రమణ దిశ.


* ప్రపంచంలో మొదటగా సూర్యోదయం అయ్యే దేశం జపాన్‌. భారతదేశంలో తొలి సూర్యోదయమయ్యే రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌.


* భూమి ఒకసారి తనచుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు. అంటే ఒకరోజు సమయం పడుతుంది. భూభ్రమణాన్ని ‘దిన చలనం’ అని కూడా అంటారు.


* భూభ్రమణ వేగం భూమధ్యరేఖ వద్ద గరిష్ఠంగా ఉండి, ధృవాల దగ్గర శూన్యం అవుతుంది.


అక్షం (Axis): ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతూ భూనాభి మీదుగా గీసిన ఊహారేఖను ‘అక్షం’ అంటారు. భూఅక్షం 23 1/2ా వంగి ఉంటుంది. కాబట్టి సూర్యకిరణాలు ధృవ ప్రాంతాలకు చేరవు.


అక్ష ధృవత్వం(Polarity of Axis): ఉత్తరాన ఉన్న స్థిర బిందువైన(Stationary Point) ఉత్తర ధృవం పైభాగం ఎల్లప్పుడూ ధృవనక్షత్రాన్ని చూస్తుంటుంది. దీన్నే ‘అక్ష ధృవత్వం’ అంటారు.


భూభ్రమణ ఫలితాలు (Results of Earth Rotation) 

1. రాత్రి-పగలు ఏర్పడటం (Formation of day and night): 


* భూభ్రమణ సమయంలో అంటే, భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యుడికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై సూర్య కిరణాలు (వెలుతురు) పడి కాంతిమంతంగా ఉంటుంది. మిగిలిన అర్ధభాగం చీకటితో ఉంటుంది. 


* సూర్యకాంతి పడిన అర్ధభాగాన్ని పగలు (Day) అని, సూర్యకాంతి పడని అర్ధభాగాన్ని రాత్రి (Night) అని వ్యవహరిస్తారు.


* భూమిపై వెలుతురు ఉన్న ప్రాంతాన్ని, చీకటి ఉన్న ప్రాంతాన్ని వేరు చేసే ఊహారేఖను ప్రకాశ వృత్తం (Illumination Circle) అంటారు.


* భూమిపై రాత్రి, పగలు అనేవి సంభవించకుండా ఉంటే భూమిలో సగభాగం ఎప్పుడూ చీకటిలో, మరో సగభాగం సూర్యునికి ఎదురుగా ఉండి అధిక ఉష్ణోగ్రతను గ్రహిస్తుంది. ఫలితంగా భూమి జీవి మనుగడకు ఉపయోగపడని గ్రహంగా మారుతుంది.


* రాత్రి, పగలు ఏర్పడటం వల్ల భూఉపరితలంపై ఉష్ణోగ్రత సమతౌల్యంగా ఉంటుంది.


2. భూభ్రమణంతో పోటుపాటులు ఏర్పడతాయి.


3. సమయభావనకు (Concept of time) కారణం భూభ్రమణమే.


4. కొరియాలిస్‌ ప్రభావం (Coriolis Effect) ఏర్పడుతుంది. దీని ఫలితంగా పవనాలు, సముద్ర ప్రవాహాలు ఉత్తరార్ధ గోళంలో కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో ఎడమవైపునకు వంగి ప్రయాణిస్తాయి. కొరియాలిస్‌ ప్రభావం భూమధ్యరేఖ వద్ద శూన్యంగా, ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది.


ప్రకాశ వృత్తం(Circle of Illumination): సూర్యుడు భూమిలో సగభాగాన్ని ప్రకాశవంతం చేసే అంచును ప్రకాశవృత్తం అంటారు. ఈ మహావృత్తం భూమిని వెలుతురులో ఉండే సగం, చీకటిలో ఉండే సగంగా విభజిస్తుంది. ప్రకాశవృత్తం స్థిరంగా ఉండదు. ఇది భూభ్రమణం వల్ల చలిస్తూ ఉంటుంది.


భూపరిభ్రమణం 


* భూమి తన అక్షంపై తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు.


* భూమి సూర్యుడి చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష్యా (Orbit) అంటారు. ఇది దీర్ఘవృత్తాకారంలో (Elliptical) ఉంటుంది. భూకక్ష్య పొడవు 965 మిలియన్‌ కి.మీ. భూపరిభ్రమణ వేగం గంటకి 107200 కి.మీ.


సౌర సంవత్సరం (Solar year): భూమి సూర్యుడి చుట్ట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయం 365 రోజుల 6 గంటల 9 నిమిషాలు. దీన్ని సౌర సంవత్సరం లేదా సిడరల్‌ సంవత్సరం అంటారు.


* సాధారణ సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ఏడాదిలో మిగిలే 6 గంటలను నాలుగేళ్లకోసారి ఫిబ్రవరిలో ఒకరోజు కలుపుతారు. దీన్ని ‘లీప్‌ ఇయర్‌’ అంటారు. లీప్‌ ఇయర్‌లో 366 రోజులు ఉంటాయి.


భూపరిభ్రమణ ఫలితాలు (Effects of the Revolution of Earth):  పగలు, రాత్రి సమయంలో మార్పునకు భూపరిభ్రమణమే కారణం. సాధారణంగా వేసవి కాలంలో పగటి సమయం ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉంటే; శీతాకాలంలో పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువగా ఉంటాయి.


* భూమి సూర్యుడి చుట్టూ తిరిగే స్థితుల్లో మార్పు రావడం వల్ల రుతువులు (seasons) ఏర్పడతాయి. రుతువులు ఏర్పడటానికి నాలుగు కారణాలు ఉన్నాయి. అవి: 

1) భూభ్రమణం          2) భూపరిభ్రమణం 

3) భూఅక్షం వంగి ఉండటం     4) భూమి వంపు


విషవత్తులు (Equinoxes)


* మార్చి 21, సెప్టెంబరు 23 తేదీల్లో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్టనిలువుగా పడతాయి. ఈ రెండు రోజులు ప్రపంచవ్యాప్తంగా పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. ఈ ప్రత్యేక రోజులను ‘విషవత్తులు’ అంటారు.


* మార్చి 21న ఏర్పడే విషవత్తును వసంతకాల విషవత్తు (Spring Equinox), సెప్టెంబరు 23న వచ్చే దాన్ని  శరత్కాల విషవత్తు (Autumn Equinox) అని అంటారు.


ఉత్తరాయణం (Northward movement of Sun)


* మకరరేఖ నుంచి కర్కటరేఖ వరకు ఉత్తరాభిముఖంగా సూర్యుడి ప్రయాణాన్ని ఉత్తరాయణం అంటారు. ఇది డిసెంబరు 22న ప్రారంభమై జూన్‌ 21న ముగుస్తుంది.


దక్షిణాయణం(Southward movement of Sun)


* కర్కటరేఖ నుంచి మకరరేఖ వరకు సూర్యుడి ప్రయాణం. జూన్‌ 21న మొదలై, డిసెంబరు 22న ముగుస్తుంది. 


* మార్చి 21 నుంచి సెప్టెంబరు 23 వరకు ఉత్తర ధృవంలో ఆరు నెలలు పగలుగా, దక్షిణ ధృవం వద్ద చీకటిగాను ఉంటుంది.


* సెప్టెంబరు 23 నుంచి మార్చి 21 వరకు దక్షిణ ధృవంలో ఆరు నెలలు పగలుగా, ఉత్తర ధృవంలో చీకటిగా ఉంటుంది.


గ్రహణాలు ్బని‘ఃi్ప(’(్శ


* సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరగడం వల్ల సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకేసారి ఒకే సరళరేఖపైకి వస్తాయి. అప్పుడు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడతాయి. ఈ గ్రహణాల సమయంలో సూర్యుడిపై లేదా చంద్రుడిపై నీడ పడినట్లు కనిపిస్తుంది.


రకాలు: గ్రహణాలు రెండు రకాలు. అవి: 

1. సూర్య గ్రహణం    2. చంద్ర గ్రహణం


సూర్యగ్రహణం (Solar Eclipse): భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వస్తే సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యుడి కాంతి భూమిపై పడకుండా అడ్డుకోవడంతోపాటు చంద్రుడి నీడ భూమి ఉపరితలంపై పడుతుంది.

* సూర్యగ్రహణం అమావాస్య రోజు మాత్రమే సంభవిస్తుంది.


చంద్రగ్రహణం(Lunar Eclipse):  ఏ సమయంలోనైనా భూమి సగభాగం మాత్రమే సూర్యుడికి ఎదురుగా ఉంటుంది. మిగిలిన సగభాగం నీడలో (చీకటిలో) ఉంటుంది. 


* చంద్రుడు భూమి వెనక భాగంలోకి లేదా భూమి నీడలోకి వెళ్లినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది.


* సూర్యుడు, భూమి, చంద్రుడు చాలా దగ్గరగా వచ్చి; సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడే చంద్రగ్రహణం ఏర్పడుతుంది.


* చంద్రగ్రహణం పౌర్ణమి రోజున వస్తుంది. అయితే అన్ని పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం సంభవించదు.


ప్రపంచ ప్రామాణిక రుతువులు

* ఈ రుతువుల విభజన భారతదేశానికి వర్తించదు. కారణం జూన్‌ మాసంలో అకస్మాత్తుగా నైరుతి రుతుపవనాల రాకతో వేసవికాలం వర్షరుతువుగా మారుతుంది.

Posted Date : 05-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌