• facebook
  • whatsapp
  • telegram

నదీ జలాల పంపిణీ(సంబంధిత అంశాలపై విభజన ప్రభావం)

 నీటి వాటాలో తెగని తగవులు!

ఉమ్మడి ఆంధ్ర]ప్రదేశ్‌ విభజన సృష్టించిన క్లిష్టమైన, దీర్ఘకాలిక సమస్యల్లో నదీ జలాల పంపిణీ ప్రధానమైనది.  ముందు నుంచే నీళ్ల విషయంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య వివాదాలు ఉన్నాయి. విభజనతో అవి మరింత తీవ్రమయ్యాయి. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం, ప్రాజెక్టులపై పోలీసులు ఘర్షణకు దిగడం తదితర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నదీ జలాల పంపిణీ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్న అంశాలు, వాటి పూర్వాపరాలు, విభజన చట్టంలో ఉన్న పరిష్కారాలు, విభజన అనంతర పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల గురించి అభ్యర్థులు వివరంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా కృష్ణా జల వివాద ట్రైబ్యునళ్లు ఇచ్చిన అవార్డులు, వాటిపై తెలుగు రాష్ట్రాల అభ్యంతరాలు, కేంద్రం పోషిస్తున్న పాత్రను అర్థం చేసుకోవాలి.


  ఉమ్మడి రాష్ట్రంలోనే గోదావరి, కృష్ణా, నాగావళి, పెన్నా, వంశధార, తుంగభద్ర తదితర నదులకు సంబంధించి అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన నదీజలాల పంపిణీకి సంబంధించి మరిన్ని సంక్లిష్ట పరిస్థితులను సృష్టించింది. ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా, గోదావరి నదీజలాల పంపిణీ వివాదాలకు దారితీసింది. 


నవ్యాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు నీరందించే కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ, అమలును ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం-2014’.. ‘నదీ యాజమాన్య మండళ్ల’ నియంత్రణ కిందకు తెచ్చింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి రాష్ట్రాల ప్రత్యేక అధికార పరిధిలో ఉన్న జలవనరుల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇది ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల అంశాల్లో రెండు రాష్ట్రాల అధికారాన్ని, విచక్షణను గణనీయంగా తగ్గించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాల క్రమబద్ధీకరణ అంతర్‌ రాష్ట్ర అంశంగా మారింది. ముఖ్యంగా కరవు కాలంలో శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో లభ్యమయ్యే నీటి పరిమాణంలో క్రమబద్ధీకరణ, నిర్వహణ అత్యంత క్లిష్టతరంగా మారాయి. 


* రాష్ట్ర విభజనకు ముందు మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మధ్య నీటి పంపకాలకు సంబంధించి వివాదాలున్నాయి. రాష్ట్రవిభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రకు కృష్ణానదిపై ఉమ్మడిగా ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నిర్వహణ, అమలు విషయంలో వివాదాలు మరింత పెరిగాయి.


విభజన చట్టంలో ఏముంది?


‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం-2014’లోని 9వ భాగంలో ‘జలవనరుల నిర్వహణ, పంపిణీ, అభివృద్ధి’కి సంబంధించిన అంశాలు సెక్షన్‌-84 నుంచి 91 వరకు ఉన్నాయి. సెక్షన్‌-84లో గోదావరి, కృష్ణా నదీజలాల యాజమాన్య మండలి అవతరణ తేదీ నుంచి రెండు నదీ జలాల యాజమాన్య బోర్డుల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక శిఖరాగ్ర మండలి (అపెక్స్‌ కౌన్సిల్‌)ని కేంద్రం ఏర్పాటు చేస్తుంది. దీనికి కేంద్ర జలవనరుల మంత్రి అధ్యక్షులుగా, ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ మండలి ఏర్పాటుతో రాష్ట్ర అంశంగా ఉన్న నదీజలాల నిర్వహణ, అమలు కేంద్రం చేతుల్లోకి వెళ్లింది.


* సెక్షన్‌-89 (ఎ), (బి)ల్లో నీటివనరుల కేటాయింపునకు సంబంధించి ‘అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం-1956’ కింద ఏర్పాటైన ట్రైబ్యునల్, ప్రాజెక్టుల వారీగా నీటిజలాలు కేటాయించకపోతే తాజాగా కేటాయింపులు జరుపుతుంది. తక్కువ నీటి ప్రవాహం సందర్భాల్లో ప్రాజెక్టుల వారీగా నీటిని విడుదల చేయడానికి విధివిధానాలను రూపొందించడంతో పాటు విచారణాంశాల కోసం కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ కాలాన్ని కేంద్రం పొడిగిస్తుంది.


---------------

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య అంతర్‌ రాష్ట్ర నదీజల వివాదాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ప్రధానంగా గోదావరి, కృష్ణా నదీ జలాల విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య గోదావరి నదీజలాల వివాద పరిష్కారం కోసం భారత ప్రభుత్వం 1969, ఏప్రిల్‌ 10న జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.బచావత్‌ ఛైర్మన్‌గా ‘గోదావరి జలవివాదాల ట్రైబ్యునల్‌’ను ఏర్పాటు చేసింది. ఈ ట్రైబ్యునల్‌ 1980, జులై 7న తుది అవార్డును అందజేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటివాటాను తిరిగి తెలంగాణ, నవ్యాంధ్ర మధ్య విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనల మేరకు పంపిణీ చేశారు.


* కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా నదీజలాల వివాద పరిష్కారం కోసం భారత ప్రభుత్వం 1969, ఏప్రిల్‌ 10న జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.బచావత్‌ ఛైర్మన్‌గా ‘కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-I ఏర్పాటు చేసింది.ఈ ట్రైబ్యునల్‌ 1976, మే 27న అవార్డు ప్రకటించింది.


గమనిక: 1969, ఏప్రిల్‌ 10న గోదావరి, కృష్ణా జల వివాదాల పరిష్కారానికి భారత ప్రభుత్వం ఉమ్మడిగా ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసింది.


* కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-I అవార్డు విషయంలో రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో భారత ప్రభుత్వం 2004, ఏప్రిల్‌ 2న జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ఛైర్మన్‌గా ‘కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-I ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలను విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించారు. ఈ పంపిణీ విషయంలోనూ ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది.

రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన కృష్ణానది జలాల కేటాయింపు:  అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం-1956లోని సెక్షన్‌-3 కింద తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యర్థనతో 2023, అక్టోబరు 4న ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న కృష్ణాజల వివాదాల ట్రైబ్యునల్‌-I.. ‘టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌’ జారీకి ఆమోదం తెలిపింది. కృష్ణా జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ కోసం బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ -II కు కొత్త విధివిధానాలను ప్రతిపాదిస్తూ 2023, అక్టోబరు 6న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం - 1956లోని సెక్షన్‌-3, 5(1), 12లను అనుసరించి ఈ ట్రైబ్యునల్‌కు రెండు విధి విధానాలను కేంద్రం నిర్దేశించింది.


* కృష్ణాజల వివాదాల ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలు, దానికి మించి కేటాయించిన అదనపు జలాలు, పోలవరం ప్రాజెక్ట్‌ ద్వారా కృష్ణాకు తరలించడానికి వీలుగా గోదావరి ట్రైబ్యునల్‌ ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లోని వాటాను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం రెండు విధివిధానాలను రూపొందించింది. 


1) ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగి కొనసాగుతున్నాయి. అలాగే ప్రతిపాదిత ప్రాజెక్టులకు కూడా నీటి కేటాయింపు చేయాలి.


2) కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఉమ్మడి కేటాయింపులను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సూచించిన విధంగా పంపిణీ/కేటాయింపు చేయాలి.


(i) కృష్ణాజల వివాద ట్రైబ్యునల్‌-I ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలతో పాటు, దానికి మించి ఏదైనా అదనపు కేటాయింపులు జరిపి ఉంటే వాటి పంపిణీ/ కేటాయింపు జరగాలి.


(ii) పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణాకు తరలించేందుకు వీలుగా గత ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్‌ కేటాయించిన నీటిలో వాటాను, ఒకవేళ పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలించాలని ప్రతిపాదిస్తే వాటిని కూడా పంపిణీ చేయాలి.


దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘కృష్ణాజల వివాదాల ట్రైబ్యునల్‌-II’ కాలపరిమితిని 2023, అక్టోబరు 6న ఇచ్చిన నోటిఫికేషన్‌లో 2024, మార్చి 31 వరకు పొడిగించింది.


ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి తన అభ్యంతరం తెలిపింది. తాజా విధివిధానాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను మినహాయించి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మాత్రమే పరిమితం చేయడం సరికాదని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని తాజా విధివిధానాలపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ట్రైబ్యునల్‌ ద్వారా జరిగిన కేటాయింపులకు భంగం కలగకుండా చట్టపరంగా న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని పునరుద్ఘాటించింది.

కృష్ణాజల వివాద ట్రైబ్యునల్‌-II నేపథ్యం: ‘అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం-1956’లోని సెక్షన్‌-3 ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మధ్య కృష్ణా నదీ జలాల వివాదం పరిష్కారం కోసం భారత ప్రభుత్వం 2004, ఏప్రిల్‌ 2న కృష్ణాజల వివాద ట్రైబ్యునల్‌-II ని ఏర్పాటు చేసింది. ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్, సభ్యులుగా అలహాబాదు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.పి.శ్రీవాస్తవ, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ డి.కె.సేథ్‌లను నియమించింది. (శ్రీవాస్తవ మరణించడంతో అతడి స్థానంలో జస్టిస్‌ బి.పి.దాస్‌ నియమితులయ్యారు) ఈ ట్రైబ్యునల్‌-II 2010, డిసెంబరు 30; 2011, మార్చి 29; 2013, నవంబరు 29 తేదీల్లో మూడు నివేదికలను కేంద్రానికి సమర్పించింది. అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్‌-12 ప్రకారం తుది నివేదిక సమర్పించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునల్‌ను నిలిపివేయాలి. అయితే ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌-89 ట్రైబ్యునల్‌ కాలపరిమితిని పొడిగించేందుకు అవకాశం కల్పించింది.


రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ జలాల వినియోగం, పంపిణీ, నియంత్రణ వివాదంపై 2014, జులై 14న భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. 2015లో మరోసారి ఉమ్మడి రాష్ట్రంలోని నీటి కేటాయింపులను పరిశీలించి మళ్లీ కేటాయింపులు చేసే విధంగా కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. అయితే మహారాష్ట్ర, కర్ణాటక ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గతంలో బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో అయిదు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు (ఎస్‌ఎల్‌పీ) దాఖలయ్యాయి. అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టంలోని సెక్షన్‌ 5(2) ప్రకారం ట్రైబ్యునల్‌ నివేదికను పక్కన పెట్టాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కూడా గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్లన్నీ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. 2011, సెప్టెంబరు 16న బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.


* ఈ ట్రైబ్యునల్‌ 2016, అక్టోబరు 19న ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన అవార్డునే కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాలు పంచుకోవాలని తీర్పునిచ్చింది. దీనిలో భాగంగా ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన 811 టీఎంసీలలో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలుగా నిర్ణయించింది.


* కృష్ణా జలాల పంపకాల్లో తెలుగు రాష్ట్రాలకు మాత్రమే వర్తించే విధంగా కృష్ణాజల వివాదాల ట్రైబ్యునల్‌-ఖిఖి తో పునఃసమీక్ష చేయించాలని తెలంగాణ 2018లో కేంద్రాన్ని కోరింది.


* 2020లో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ లేవనెత్తిన విషయాన్ని చర్చించారు. ఈ చర్చల నేపథ్యంలో 2021లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.


ఈ నేపథ్యంలోనే కృష్ణా జలాల కేటాయింపులపై పునఃపరిశీలన కోసం తాజాగా కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌-II కి రెండు విధివిధానాలను ప్రతిపాదించి, ట్రైబ్యునల్‌ కాలపరిమితిని 2024, మార్చి 31 వరకు పెంచింది. ఏపీ విభజన చట్టం-2014లోని సెక్షన్‌-89(a)(b) ల కింద ప్రతిపాదించిన అంశాల పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌ పునఃపరిశీలన చేస్తుంది.


* 2004లో ఏర్పాటు చేసిన కృష్ణాజల వివాద ట్రైబ్యునల్‌-II కాలపరిమితిని 2012, మార్చి 29న, 2012 సెప్టెంబరు 28, 2013 ఏప్రిల్‌ 2, 2013 సెప్టెంబరు 27, 2013 నవంబరు 27న, 2014 ఫిబ్రవరి 5, 2014 మే 15, 2016 జులై 18, 2017 జులై 31, 2018 ఆగస్టు 9, 2019 ఆగస్టు 29, 2020 జులై 23, 2021 జులై 20, 2022 జూన్‌ 27న పొడిగించగా, తాజాగా 2024 మార్చి 31 వరకు పొడిగించారు.

రచయిత: వి.కరుణ


 

Posted Date : 07-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌