• facebook
  • whatsapp
  • telegram

నాటి ప్రధాని హామీలు-అమలు (ఏపీ విభజన చట్టం)

చట్టంలో భరోసా.. ఆచరణలో నిరాశ!


అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజనతో అష్టకష్టాలపాలై, అన్నివిధాలుగా నష్టపోయిన నవ్యాంధ్రకు విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా కేంద్రం నుంచి సరైన సాయం అందడం లేదు. ఆర్థిక చేయూతతో పాటు, అవస్థాపనా సౌకర్యాల కల్పనలోనూ రాష్ట్రానికి గత పదేళ్లుగా నిరాశే ఎదురవుతోంది. చట్టంలో పేర్కొన్న హామీలతో పాటు, పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన భరోసాలెన్నో ఆచరణకు నోచుకోలేదు. ఈ పరిస్థితిని పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. విభజన నాటి నుంచి నేటి వరకు ముఖ్యమైన హామీల అమలు తీరు, దానికి సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య నడిచిన సంప్రదింపులు, అవసరమైన గణాంకాలను గుర్తుంచుకోవాలి.


  ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం - 2014లోని వివిధ నిబంధనల కింద, విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక, అవస్థాపనా మద్దతు కల్పించే విధంగా ఎన్నో హామీలున్నాయి. వీటికితోడు నాటి ప్రధాని రాజ్యసభలో మరిన్ని వాగ్దానాలిచ్చారు. వెనుకబడిన జిల్లాల కోసం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, అసెంబ్లీ స్థానాల పెంపు, గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఆర్థికసాయం, రైల్వే జోన్‌ ఏర్పాటు, పలు జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, దుగరాజపట్నం పోర్టు నిర్మాణం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం, వైజాగ్‌ - చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రో రైలు, వనరుల మధ్య అంతరాన్ని భర్తీ చేయడం, నూతన రాజధాని నగరానికి కేంద్ర సాయం, గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం, క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుతో పాటు పలు పన్ను ప్రోత్సాహకాలు ఇందులో ఉన్నాయి. వీటిలో కొన్ని పాక్షికంగా, కొన్ని నామమాత్రంగా అమలయ్యాయి.


వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ: ఈ అంశం గురించి విభజన చట్టంలోని సెక్షన్‌ 46(2), 46(3), 94(2)ల్లో ఉంది. ఏపీ విభజన బిల్లుపై 2014, ఫిబ్రవరి 20న రాజ్యసభలో చర్చ సందర్భంగా వెనుకబడిన జిల్లాల విషయం ప్రస్తావనకు వచ్చింది. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమలోని నాలుగు జిల్లాలు (కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం); ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం) ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని బిల్లులో చేరుస్తామని నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చారు. ఈ ప్యాకేజీ ఒడిశాలోని ‘కోరాపుట్‌- బొలంగేర్‌- కలహండి’ (కె.బి.కె.) ప్రత్యేక ప్రణాళిక; మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రత్యేక ప్యాకేజీ తరహాలో ఉండే విధంగా విభజన చట్టాన్ని సవరించాలని నవ్యాంధ్రలో ఏర్పాటైన తొలి ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 7 జిల్లాల అభివృద్ధికి రూ.24,350 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని కోరుతూ 2014, అక్టోబరు 16న కేంద్ర ప్రణాళికా సంఘానికి నివేదిక సమర్పించింది. అయితే కేంద్రం మాత్రం నీతిఆయోగ్‌ సిఫార్సుల మేరకు ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున ఏటా రూ.350 కోట్లను అయిదేళ్లలో (2014-15 నుంచి 2020-21) మొత్తం రూ.1,750 కోట్లను ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీగా ఇచ్చింది. బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ కింద వెనుకబడిన ప్రాంతాలకు తలసరి రూ.4,115 లెక్కన కేటాయించిన కేంద్రం ఏపీకి రూ.426.57 మాత్రమే ఇచ్చింది.


ఏపీ అసెంబ్లీ స్థానాల పెంపు: విభజన చట్టంలోని సెక్షన్‌ 26(1) ప్రకారం ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌-170లోని నియమాలకు లోబడి, విభజన చట్టంలోని సెక్షన్‌-15లోని నియమాలకు భంగం కలగకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభలో సీట్ల సంఖ్యను 175 నుంచి 225కు పెంచాలి. ఆ మేరకు ఎన్నికల కమిషన్‌ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ను నిర్ధారిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ హామీని అమలుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం 2016, ఫిబ్రవరి 29న కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరింది. నాటి ముఖ్యమంత్రి 2017, జులై 24న ప్రధానికి లేఖ కూడా రాశారు. ఈ విషయమై 2018, డిసెంబరు 19న పార్లమెంట్‌లో సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పందించింది. ఆర్టికల్‌-170 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సీట్ల పునర్విభజన 2026 తర్వాత చేపట్టే జనాభా లెక్కల సేకరణ అనంతరమే చేయాల్సి ఉంటుందని సమాధానమిచ్చింది. ఆ విధంగా నియోజకవర్గాల పెంపు పెండింగ్‌లో పడిపోయింది.


గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సాయం:  వామపక్ష, తీవ్రవాద సమస్య ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర విభజనతో గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం లేకుండా పోయింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 9(2)లో హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్‌ కేంద్రమే ఉమ్మడి శిక్షణ కేంద్రంగా ఉంటుందని పేర్కొనడంతో సమస్య మరింత జఠిలమైంది. విభజన చట్టంలోని సెక్షన్‌ 9(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన చోట గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సాయం చేస్తుందని ఉంది. దీని ప్రకారం గత రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు డివిజన్‌లో భూమిని ఎంపికచేసింది. గ్రేహౌండ్స్‌కు మౌలిక సదుపాయాలు, శిక్షణ సౌకర్యాలు ఏర్పాటుకు రూ.858.37 కోట్ల వ్యయమవుతుందనే ప్రతిపాదనను కేంద్రం హోం శాఖకు గత రాష్ట్ర ప్రభుత్వం పంపింది. దీంతో కేంద్రం ఏపీలో గ్రేహౌండ్స్‌ కేంద్రం ఏర్పాటును ఆమోదిస్తూ 2018, ఏప్రిల్‌లో రూ.219.16 కోట్లు మంజూరుచేసింది. చివరికి రూ.9.08 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో ఆ ప్రతిపాదన పెండింగ్‌లో పడిపోయింది. ఏపీ నూతన ప్రభుత్వం 2020, జూన్‌లో గ్రేహౌండ్స్‌ శిక్షణ సంస్థ ఏర్పాటుకు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం, జగన్నాథపురం గ్రామ పరిధిలో 385 ఎకరాలను గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021, నవంబరు 14న జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి (సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌) సమావేశంలో ఈ అంశంపై కేంద్రం స్పందించింది. కొత్తగా ఏర్పాటయ్యే గ్రేహౌండ్స్‌ కేంద్రంలో భారత ప్రభుత్వ ఏజెన్సీలకు 50 శాతం ట్రైనింగ్‌ స్లాట్‌లను కేటాయించాలని, అప్పుడైతే మొత్తం ఖర్చును భరిస్తామంటూ మెలిక పెట్టింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.385 కోట్ల భూ వ్యయం, రూ.27.54 కోట్ల వార్షిక నిర్వహణ వ్యయంతో 2022, అక్టోబరులో సవరించిన ప్రతిపాదనను కేంద్రానికి పంపారు.


పోలవరం జాతీయ ప్రాజెక్టు: విభజన చట్టంతోనే పోలవరం ప్రాజెక్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే 7 మండలాలను తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉంచి రాష్ట్రాన్ని విభజించారు. దీనిపై ఏపీ నుంచి అభ్యంతరం రావడంతో మళ్లీ 2014, జులై 17న గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా విభజన చట్టాన్ని సవరించి పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా రిజర్వాయర్, స్పిల్‌వే, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం అనే మూడు భాగాలున్నాయి. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా మార్చడం, నిర్వహణ, కేంద్ర సహాయం లాంటి అంశాలను విభజన చట్టంలోని సెక్షన్‌ 90లో పేర్కొన్నారు. సెక్షన్‌ 90(1) ప్రకారం దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. సెక్షన్‌ 90(2) ప్రకారం ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి అవసరాల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్వహణ, నియంత్రణ, అభివృద్ధి కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలి. సెక్షన్‌ 90(3) ప్రకారం పోలవరం నిర్మాణానికి కొత్తగా ఏర్పడే తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లే భావించాలి. సెక్షన్‌ 90(4) ప్రకారం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టడంతో పాటుగా దానికి అవసరమైన పర్యావరణ, అటవీ అనుమతులు, పునరావాసం సమకూర్చే బాధ్యతలన్నీ కేంద్రమే తీసుకోవాలి. రి 2014, ఏప్రిల్‌ 29నాటి కేంద్ర కేబినెట్‌ నోట్‌ ప్రకారం ‘‘ప్రస్తుత సత్వరనీటి పారుదల ప్రయోజనాల కార్యక్రమం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు బాధ్యతలను పర్యవేక్షిస్తుంది’’ అని పేర్కొంది. ప్రాజెక్టు అంచనా వ్యయం 2010-11 లెక్కల ప్రకారం రూ.16,010.45 కోట్లు కాగా, ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి పెరిగే అదనపు ఖర్చులు, భూసేకరణ, ఆయకట్టు అభివృద్ధి పనులు, ముంపు బాధితులకు మెరుగైన పరిహారం వంటివన్నీ భూసేకరణ, పునరావాస చట్టం - 2013 ప్రకారం ఎప్పటికప్పుడు పెరుగుతాయని కూడా నోట్‌లో ఉంది. దీన్ని 2014, మే 1న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. రి పోలవరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయాన్ని రాష్ట్రప్రభుత్వం 2017-18 నాటి ధరల ప్రాతిపదికపై రూ.57,297 కోట్లుగా సవరించి పోలవరం ప్రాజెక్టు ఆథారిటీకి సమర్పించింది. సాంకేతిక సలహా కమిటీ సూచనలతో అంచనా వ్యయాన్ని రెండోసారి సవరించి రూ.55,548 కోట్లుగా పేర్కొంది. సాంకేతిక సలహా కమిటీ ఆ ప్రతిపాదనలను ఆమోదిస్తూనే కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ పరిశీలనకు పంపింది. అక్కడ అంచనా వ్యయాన్ని రూ.47,725 కోట్లకు కుదించి తుది ఆమోదం కోసం జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపింది. 2013-14 నాటి అంచనాల్లోని తాగునీటి అంశాన్ని, విద్యుత్తు ప్లాంట్‌ నిర్మాణాన్ని తాము పరిగణన లోకి తీసుకోమని, కేవలం ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ మాత్రమే పూర్తిచేస్తామని, దానికి తగ్గట్టుగా మొత్తం ప్రాజెక్టు నిర్మాణ అంచనాను రూ.20,418 కోట్లకు పరిమితం చేసింది. ఈ విషయంలో కేంద్ర వైఖరిని ఏపీ ప్రభుత్వం తప్పుపట్టింది. రి పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సంబంధించి 2022, మార్చి 15న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా తక్షణం రూ.10 వేల కోట్లు విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి 2022, జులై 15న లేఖ రాశారు. ప్రాజెక్టు తొలిదశ నిర్మాణంలో 41.15 మీటర్లు (వాస్తవ ఎత్తు 45.72 మీటర్లు) వరకు నీటిని నిల్వ చేసేందుకు, మిగిలిన పనులు పూర్తిచేయడానికి సవరించిన అంచనాల ప్రకారం రూ.17,144.06 కోట్లు వ్యయం అవుతుందని 2023, జూన్‌ 5న మరో లేఖ పంపారు. దాంతో కేంద్రం ఇంతవరకు ఇచ్చిన నిధులకు అదనంగా రూ.12,911.55 కోట్లు (మొదటి దశలో 41.15 మీటర్ల నీటి నిల్వకు, మిగిలిన పనులు పూర్తి చేసేందుకు రూ.10,911.15 కోట్లు, వరదలతో దెబ్బతిన్న ప్రాజెక్టు మరమ్మతులకు రూ.2,000 కోట్లు) కేటాయిస్తున్నట్లు తెలిపింది.


నోట్‌: 2023, మే వరకు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.14,969.39 కోట్లు విడుదల చేసింది. మరో 12,911.15 కోట్లకు ఆమోదం వచ్చినా ఇంకా విడుదల కాలేదు.


ప్రాజెక్టు జాప్యానికి కారణాలు:  ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడంతో, విభజన వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి కష్టంగా మారింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తొలుత తన సొంత నిధులను ఖర్చు చేసి కేంద్రానికి బిల్లులు సమర్పిస్తే కేంద్రం రీయంబర్స్‌మెంట్‌ చేస్తుంది. జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నప్పటికీ దాని నిర్మాణంలో కేంద్రం పాత్ర ఏమీ లేదు. రాష్ట్రం పంపిన ప్రతిపాదనల విషయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ పేరుతో అనేక ప్రశ్నలు వేస్తూ, అవాంతరాలు సృష్టిస్తోంది. 2013 నాటి భూసేకరణ చట్టం వల్ల ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. విభజన చట్టంలోని సెక్షన్‌ 90(4)లో పేర్కొన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. చాలావరకు బహుళార్థక సాధక ప్రాజెక్టుల విషయంలో మూడు రకాల విభాగాలు (నీటిపారుదల, తాగునీరు, విద్యుత్తు ఉత్పత్తి) ఉంటాయి. దేశంలోని జాతీయ ప్రాజెక్టులన్నింట్లో ఇవి ఉంటాయి. కానీ పోలవరం విషయంలో అందుకు భిన్నంగా కేవలం ఇరిగేషన్‌ (నీటిపారుదల) వ్యయానికే మాత్రమే నిధులు మంజూరు చేస్తామంటోంది. దీంతో పోలవరం నిర్మాణం ఆలస్యమవుతూ ఖర్చు విపరీతంగా పెరుగుతోంది.


నోట్‌: పోలవరం ప్రాజెక్టు తొలి ప్రతిపాదన 1941లో జరిగింది. నాడు ప్రాజెక్టు పేరు శ్రీరామపాద సాగర్‌ ప్రాజెక్టు. 2005లో ఇందిరాసాగర్‌ పేరుతో పనులు ప్రారంభమయ్యాయి. విభజన చట్టం-2014 ద్వారా దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు.


ప్రాజెక్టు జాప్యానికి కారణాలు:  ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడంతో, విభజన వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి కష్టంగా మారింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తొలుత తన సొంత నిధులను ఖర్చు చేసి కేంద్రానికి బిల్లులు సమర్పిస్తే కేంద్రం రీయంబర్స్‌మెంట్‌ చేస్తుంది. జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నప్పటికీ దాని నిర్మాణంలో కేంద్రం పాత్ర ఏమీ లేదు. రాష్ట్రం పంపిన ప్రతిపాదనల విషయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ పేరుతో అనేక ప్రశ్నలు వేస్తూ, అవాంతరాలు సృష్టిస్తోంది. 2013 నాటి భూసేకరణ చట్టం వల్ల ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. విభజన చట్టంలోని సెక్షన్‌ 90(4)లో పేర్కొన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. చాలావరకు బహుళార్ధక సాధక ప్రాజెక్టుల విషయంలో మూడు రకాల విభాగాలు (నీటిపారుదల, తాగునీరు, విద్యుత్తు ఉత్పత్తి) ఉంటాయి. దేశంలోని జాతీయ ప్రాజెక్టులన్నింట్లో ఇవి ఉంటాయి. కానీ పోలవరం విషయంలో అందుకు భిన్నంగా కేవలం ఇరిగేషన్‌ (నీటిపారుదల) వ్యయానికే మాత్రమే నిధులు మంజూరు చేస్తామంటోంది. దీంతో పోలవరం నిర్మాణం ఆలస్యమవుతూ ఖర్చు విపరీతంగా పెరుగుతోంది.


నోట్‌: పోలవరం ప్రాజెక్టు తొలి ప్రాతిపాదన 1941లో జరిగింది. ప్రాజెక్టు పేరు శ్రీరామపాద సాగర్‌ ప్రాజెక్టు. 2005లో ఇందిరాసాగర్‌ ప్రాజెక్టు పేరుతో పనులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం-2014 ద్వారా దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు.

- రచయిత వి. కరుణ
 

Posted Date : 18-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌