• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ ఎన్నికల వ్యవస్థ

ప్రజాస్వామ్య పరిరక్షణలో సర్వస్వతంత్రం!

పాలనలో ప్రజలకు సమగ్ర ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాత, నిర్బంధరహిత ఎన్నికల నిర్వహణ వ్యవస్థ అత్యంత కీలకం. అందుకోసం భారతదేశంలో రాజ్యాంగబద్ధ ఎలక్షన్‌ కమిషన్‌ ఉంది. ఇది రాష్ట్రాల శాసనసభల నుంచి పార్లమెంటు వరకు అన్ని రకాల ఎన్నికలను జరుపుతుంది. తద్వారా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంతోపాటు, పాలనలో అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తుంది. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ ప్రక్రియలో అనుసరిస్తున్న విధానాలు, రాజకీయ పార్టీల పాత్ర మొదలైన అంశాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. సర్వ స్వతంత్రంగా ఉంటూ శక్తిమంతంగా వ్యవహరించే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన విధులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి గురించి వివరంగా తెలుసుకోవాలి.


భారతదేశం ప్రాతినిధ్య ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరిస్తోంది. పాలనా నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రజాసంక్షేమ విధానాలను రూపొందించడంలో ప్రజల తరఫున ప్రజాప్రతినిధులు పాల్గొనే వ్యవస్థనే ‘ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం’ అంటారు. ఆధునిక ప్రజాస్వామ్యాలన్నీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాలే.


* మన దేశంలో పరిపాలనా నిర్వహణ కోసం ప్రజలు తమ ప్రతినిధులను ఎంపిక చేసుకోవడానికి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల నిర్వహణకు భారత రాజ్యాంగం ఏర్పాటు చేసిన వ్యవస్థే ఎన్నికల సంఘం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఏర్పాటైన భారత ఎన్నికల సంఘం స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్ణీత కాలవ్యవధుల్లో, సమర్థంగా ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తోంది.


ఓటు హక్కు:  ప్రజలు తమ రాజకీయ ప్రతినిధులను ఎన్నుకోవడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326 అవకాశం కల్పిస్తోంది. దాని ప్రకారం అర్హత ఉన్న వారందరికీ ఓటు హక్కు లభించింది. దీనినే సార్వజనీన వయోజన ఓటుహక్కు అంటారు. కుల, మత, జాతి, లింగ, విద్య, ఆర్థిక స్థితి, ప్రాంతం, వర్గం తదితర అంశాలతో సంబంధం లేకుండా, వివక్ష రహితంగా, నిర్ణీత వయసు నిండిన వయోజనులంతా ఓటుహక్కు పొందవచ్చు. ఈ విధంగా ఓటుహక్కు ఉన్న ఓటర్ల సముదాయాన్ని ‘ఎలక్టోరేట్‌’ అంటారు. నీ రాజ్యాంగం ప్రకారం 1988కి ముందు ఓటుహక్కు పొందడానికి కనీస వయసు 21 సంవత్సరాలుగా ఉండేది. 1988లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో పార్లమెంటు 61వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం 18 ఏళ్లు నిండిన భారత పౌరులంతా ఓటుహక్కు పొందేందుకు అర్హులు.


జాతీయ ఓటర్ల దినోత్సవం: భారత ఎన్నికల సంఘం 1950, జనవరి 25న ఏర్పడింది. 2010, జనవరి 25 నాటికి 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏటా జనవరి, 25న ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. కొత్తగా ఓటు పొందే వయసు వచ్చిన యువతలో చైతన్యం నింపడం దీని ఆశయం. ఏటా జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి, వారి పేర్లు ఓటరు జాబితాలో చేర్చి, జనవరి 25న ఓటరు గుర్తింపు కార్డులు అందజేస్తున్నారు. ఓటర్లు తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎన్నికల సంఘం లోక్‌సభకు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహిస్తుంది.


ఎన్నికల సంఘం: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324(2) ప్రకారం భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల అధికారిని, ఇతర ఎన్నికల అధికారులను నియమిస్తారు. ఎన్నికల సంఘం ఏర్పాటైన ప్రారంభంలో ఏకసభ్య సంఘంగా ఉండేది. అందులో ఒకే ఒక్క ప్రధాన ఎన్నికల అధికారి ఉండేవారు. 1989లో చేసిన ఎన్నికల సంఘం సవరణ చట్టం ప్రకారం బహుళసభ్య సంస్థగా మారింది. దీని ప్రకారం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు అదనపు ఎన్నికల అధికారులు ఉండే ‘త్రిసభ్య సంఘం’గా కొనసాగుతోంది. ఈ సభ్యులు సాధారణంగా ఐఏఎస్‌ అధికారులై ఉంటారు. వీరి పదవీకాలం పదవి చేపట్టిన తేదీ నుంచి 6 ఏళ్లు లేదా 65 సంవత్సరాలు వయసు నిండే వరకు ఉంటుంది.


* భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. దీనినే ‘నిర్వాచన్‌ సదన్‌’ అంటారు. సర్వోన్నత, స్వతంత్ర అధికారాలు ఉండే ఎన్నికల సంఘం కమిషనర్‌ను అభిశంసన తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించాలంటే పార్లమెంటు ఉభయసభల్లో 2/3 వంతు సభ్యుల అంగీకారం అవసరం.


కేంద్ర ఎన్నికల సంఘం విధులు: 

*  నియోజకవర్గాల భౌగోళిక పరిధులు నిర్ణయించడం 

*  ఓటర్ల జాబితాలు రూపొందించడం

* సాధారణ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేయడం 

* నిర్ణీత కాలవ్యవధిని అనుసరించి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం 

* ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన నియమావళి రూపొందించడం నీ వివిధ రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇవ్వడం, గుర్తులు కేటాయించడం 

* ఎన్నికల షెడ్యూల్‌ను, పోలింగ్‌ తేదీలను ప్రకటించడం 

* ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన 

* దేశవ్యాప్తంగా ఎన్నికల యంత్రాంగాన్ని నడిపించడం 

* ఎన్నికల్లో జరిగే అక్రమాల నియంత్రణకు విచారణ అధికారులను నియమించడం.


ఎన్నికల సిబ్బంది: కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది ఉండరు. ఆర్టికల్‌ 324(6) ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ల అనుమతితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటుంది. ఆ సమయంలో సిబ్బందిపై కేంద్ర ఎన్నికల సంఘానికే సర్వాధికారం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా వారిని బదిలీ చేయడం లేదా పదోన్నతులు కల్పించడం చేయకూడదు. నీ 1990-1996 కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం పదో ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన టి.ఎన్‌.శేషన్‌ ఎన్నికల చట్టాలను, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అత్యంత కఠినంగా అమలుచేసిన అధికారిగా ప్రసిద్ధులయ్యారు. అర్హులైన ఓటర్లందరికీ ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయడం, ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చుపై పరిమితులు విధించడం మొదలైన వాటిపై దృష్టి సారించారు.


రాజకీయ పార్టీలు-ఎన్నికల మేనిఫెస్టో:  ఉమ్మడి రాజకీయ విశ్వాసాలు, ఆసక్తులు ఉండి రాజకీయ అధికారాన్ని పొందడానికి సంఘంగా ఏర్పడిన వ్యక్తుల సముదాయాన్ని ‘రాజకీయ పార్టీ’ అంటారు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల తరఫున పోటీ చేసేవారిని ఆయా పార్టీల అభ్యర్థులు అంటారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేసేవారిని ‘స్వతంత్ర అభ్యర్థులు’ అంటారు. ఎన్నికల సంఘం వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తుంది. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం వారి స్వేచ్ఛా సంకేతాల జాబితాలో నుంచి అందుబాటులో ఉన్న గుర్తులు ఎంచుకునే అవకాశం కల్పిస్తుంది.

* రాజకీయ పార్టీలు తమ విధివిధానాలను, ప్రాధాన్యాలను ఒక విధానపత్రం ద్వారా ఎన్నికల కంటే ముందే ప్రజలకు తెలియజేస్తాయి. దీనినే ‘ఎలక్షన్‌ మేనిఫెస్టో’ అంటారు. ఇందులో వివిధ అంశాలపై పార్టీ దృక్పథాలను, ఆశయాలను, అధికారంలోకి వస్తే చేయబోయే పనులను, సేవలను, అభివృద్ధి ప్రణాళికలను పొందుపరుస్తాయి. ఓటర్లు ఏ రాజకీయ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలో నిర్ణయించుకోవడానికి ఎలక్షన్‌ మేనిఫెస్టో తోడ్పడుతుంది.


సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు: 

*  లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు సాధారణంగా 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటారు. 1952లో లోక్‌సభకు తొలి సాధారణ ఎన్నికలు జరిగాయి.

*  చట్టసభలకు ఎన్నికైన సభ్యులు పదవీకాలం ముగియక ముందే తమ పదవికి రాజీనామా చేసినా, మరణించినా, ఇతర కారణాల వల్ల ఆ నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడుతుంది. ఆ విధంగా ఏర్పడిన ఖాళీలకు ఎన్నికల సంఘం నిర్ణీత వ్యవధిలోపు ఎన్నికలు నిర్వహించి భర్తీ చేస్తుంది. వీటినే ఉపఎన్నికలు అంటారు.

* లోక్‌సభ, శాసనసభల పదవీకాలం పూర్తి కాకుండానే ఎన్నికలు నిర్వహిస్తే వాటిని ‘మధ్యంతర ఎన్నికలు’ అంటారు. లోక్‌సభకు తొలి మధ్యంతర ఎన్నికలు 1971లో జరిగాయి.

ఎన్నికల నిర్వహణ: ఎన్నికల నిర్వహణకు రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉంటారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. నియోజకవర్గ స్థాయిలో ఒక ప్రభుత్వ అధికారి ‘రిటర్నింగ్‌ ఆఫీసర్‌’గా వ్యవహరిస్తారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పిస్తారు. ఆ అధికారి నామినేషన్‌ పత్రాలను పరిశీలించి, సరిగ్గా ఉన్న నామినేషన్‌ల జాబితాను ప్రకటిస్తారు. నిర్ణీత గడువులో నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం అభ్యర్థులకు ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక తుది అభ్యర్థుల జాబితాను ప్రతి నియోజకవర్గంలోను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)లను సిద్ధం చేస్తారు. ఈవీఎంలను తొలిసారిగా 1989-1990 లలో దేశంలోని 16 శాసనసభా నియోజకవర్గాలలో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. 

*  సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి భారత ఎన్నికల సంఘం ఈవీఎంలకు వీవీపాట్‌ (ఓటర్‌ వెరిఫైయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌)ను అనుసంధానం చేసింది.

* పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వర్తించేందుకు ‘ప్రిసైడింగ్‌ అధికారి’ని, పోలింగ్‌ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి నియమిస్తారు. ప్రిసైడింగ్‌ అధికారి ఓటరు గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాత ఓటరు ఎడమచేతి చూపుడువేలిపై ‘ఇండెలిబుల్‌ సిరా’తో గుర్తు పెట్టించి, ఓటు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తారు.


రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 08-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌