• facebook
  • whatsapp
  • telegram

గ్రామ పంచాయతీ - అధికారాలు, విధులు

స్వయంపాలనలో పల్లె ప్రగతి!

  పక్క పట్టణానికి పల్లెని కలిపే రోడ్డు, ఇంటికి దగ్గర్లో పాఠశాల, చిన్న చిన్న అనారోగ్యాలకు వైద్యశాల, దృఢమైన యువత కోసం వ్యాయామశాల, ప్రభుత్వ పథకాల ప్రత్యక్ష అమలు, క్షేత్రస్థాయిలో అన్ని రకాల గణాంకాల సేకరణ, మార్కెట్లకు ఏర్పాట్లు, ప్రకటనలకు అనుమతుల వంటి ఎన్నో రకాల స్థానిక పాలనా నిర్ణయాలను గ్రామ పంచాయతీ తీసుకుంటుంది. స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో మొదటిది, ముఖ్యమైనది అయిన ఈ గ్రామ పంచాయతీ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తున్న వ్యవస్థాగత నిర్మాణం. గ్రామీణ ప్రగతికి అదే పునాది. ప్రాథమిక పాలనా సంస్థగా, రాజకీయ వేదికగా నిలిచే ఈ పంచాయతీల అధికారాలు, విధుల గురించి పోటీ పరీక్షార్థులకు సమగ్రమైన అవగాహన ఉండాలి.

  మూడంచెల పంచాయతీరాజ్‌ విధానంలో మొదటి అంచె ‘గ్రామ పంచాయతీ’. దీనికి సర్పంచ్‌ రాజకీయ అధిపతి. సర్పంచ్‌కు పరిపాలనలో సహకరించేందుకు ‘పంచాయతీ కార్యదర్శి’ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరిద్దరి సమన్వయంతో గ్రామ పంచాయతీ తన అధికారాలు, విధులు నిర్వహిస్తుంది.

సర్పంచ్‌:  సర్పంచ్‌ పదవికి ప్రత్యక్ష పద్ధతి ద్వారా రహస్య ఓటింగ్‌ నిర్వహించాలని జలగం వెంగళరావు కమిటీ, నరసింహం కమిటీ, దంత్‌వాలా కమిటీలు సిఫార్సు చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1981 నుంచి సర్పంచ్‌ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో, రహస్య ఓటింగ్‌ ఎన్నిక నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సర్పంచ్‌ పదవికి ఇదే తరహాలో ఎన్నిక జరుగుతోంది. గ్రామ పంచాయతీ పరిధిలోని 18 సంవత్సరాలు నిండి, నమోదైన ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు.

అధికారాలు, విధులు: * గ్రామ పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. 

* పంచాయతీ ప్రథమ పౌరులుగా వ్యవహరిస్తారు.

* పంచాయతీ స్థాయిలో రాజకీయ అధిపతిగా ఉంటారు.

* పంచాయతీకి సంబంధించిన రికార్డులు తనిఖీ చేస్తారు.

* పంచాయతీ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి సమాచారం కోరవచ్చు.

* పంచాయతీ వార్షిక ఖాతాలను ఏటా క్రమం తప్పకుండా ఆడిట్‌ చేయించాలి.

* పంచాయతీ కార్యదర్శిపై పరిపాలనాపరమైన నియంత్రణ కలిగి ఉంటారు. 

* పంచాయతీ చేసిన తీర్మానాల అమలుకు కృషి చేస్తారు.

* తన పరిధిలోని ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం మొదలైన కార్యాలయాలను సందర్శించి, పనితీరును పరిశీలిస్తారు.

* గ్రామ పంచాయతీలోని వార్డు సభ్యుల అనర్హతలను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) దృష్టికి తీసుకెళ్తారు.

తొలగింపు: సర్పంచ్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడినా, ప్రభుత్వ చర్యలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగిస్తుంది. ఇలా పదవి కోల్పోయిన వారు రెండేళ్ల వరకు సంబంధిత పదవులకు తిరిగి పోటీ చేసే అవకాశం ఉండదు. 

* సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వీల్లేదు. దీనికి కారణం ఓటర్లు ప్రత్యక్ష పద్ధతిలో సర్పంచ్‌ని ఎన్నుకోవడం.

* సర్పంచ్‌ పదవీకాలం 5 సంవత్సరాలు. పదవీకాలం కంటే ముందే తన పదవికి రాజీనామా చేయవచ్చు.

* సర్పంచ్‌ తన రాజీనామాను పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలి. అది వీలు కానప్పుడు డీపీఓకి ఇవ్వాలి.

* ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో సర్పంచ్‌ గ్రామ సభ సమావేశాలను నిర్వహించడంలో విఫలమైతే పదవి కోల్పోతారు. ఆ విధంగా పదవి కోల్పోయినవారు ఏడాది పాటు సంబంధిత పదవులకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయకూడదు. 

ఉపసర్పంచ్‌: పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం అదే రోజు లేదా మరో రోజు ఉప సర్పంచ్‌ పదవికి ఎన్నిక జరుగుతుంది. వార్డు సభ్యుల నుంచి ఒకరిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులు చేతులు పైకి ఎత్తి ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. ఉపసర్పంచ్‌ ఎన్నిక విధానం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరోక్షంగానే ఉంటుంది. సర్పంచ్‌ అందుబాటులో లేని సమయంలో ఉపసర్పంచ్‌ గ్రామ సభ, గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఉపసర్పంచ్‌ పదవీకాలం అయిదేళ్లు. పదవీ కాలం కంటే ముందే రాజీనామా చేయవచ్చు. రాజీనామా పత్రాన్ని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)కి సమర్పించాలి. ఎంపీడీఓ అందుబాటులో లేకపోతే డివిజినల్‌ పంచాయతీ ఆఫీసర్‌ (డీఎల్‌పీఓ)కి ఇవ్వాలి.

అవిశ్వాస తీర్మానం: * సర్పంచ్, వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానం ద్వారా ఉపసర్పంచ్‌ను తొలగించవచ్చు.

* ఏపీలో ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే పదవి చేపట్టిన తేదీ నుంచి నాలుగేళ్ల తర్వాతే సాధ్యం. అంటే పదవీకాలంలో ఒక్కసారి మాత్రమే ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. తెలంగాణలో పదవి చేపట్టిన తేదీ నుంచి 2 సంవత్సరాల అనంతరం ఈ తీర్మానాన్ని ప్రయోగించవచ్చు.

* మొత్తం సభ్యుల్లో 2/3 వంతు ఆమోదం తెలిపితే, ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం అమలవుతుంది.

* అనంతరం ఉపసర్పంచ్‌ను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ పదవి నుంచి తొలగిస్తారు.

* సస్పెండ్‌ అయిన వార్డు సభ్యులు కూడా అవిశ్వాస తీర్మానంలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

* ఏదైనా కారణం వల్ల ఉపసర్పంచ్‌ పదవికి ఖాళీ ఏర్పడితే 30 రోజుల్లోపు ఉపఎన్నిక ద్వారా ఆ ఖాళీని భర్తీ చేయాలి.

* సర్పంచ్, ఉప సర్పంచ్‌ పదవులు రెండూ ఏకకాలంలో ఖాళీ అయితే వార్డు సభ్యుల్లో ఒకరిని సర్పంచ్‌గా పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నియమిస్తారు.

* గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతాయి.

పంచాయతీ కార్యదర్శి: సర్పంచ్‌కు పరిపాలనా వ్యవహారాలలో సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉద్యోగి పంచాయతీ కార్యదర్శి. ఆదాయ వనరులు ఎక్కువగా ఉండే మేజర్‌ గ్రామ పంచాయతీలో అయితే కార్యనిర్వహణాధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. సమైక్యాంధ్రప్రదేశ్‌లో జనవరి 1, 2002న గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవిని సృష్టించారు.

అధికారాలు - విధులు: * పంచాయతీ పరిపాలనలో సర్పంచ్‌కు సహకరించడం. 

* పంచాయతీ తీర్మానాలు, కమిటీల తీర్మానాలు అమలు.

* సర్పంచ్‌ ఆదేశంతో గ్రామ పంచాయతీ సమావేశాల ఏర్పాటు.

* పంచాయతీ సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొనడం. 

* పంచాయతీ ఆస్తులు, భూములు పరిరక్షించడం. 

* పంచాయతీలో పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేయడం.

* సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి పంచాయతీ వార్షిక బడ్జెట్‌ను రూపొందించడం. 

* జనన, మరణాల నమోదు, రికార్డుల నిర్వహణ.

* పంచాయతీలో పనిచేసే ఉద్యోగులపై నియంత్రణ.

* నిధులు దుర్వినియోగం కాకుండా నియంత్రించడం.

* మండల స్థాయిలో జరిగే సమావేశాలకు హాజరుకావడం.

* మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) నుంచి పాలనకు సంబంధించిన సమాచారం పొందడం.

పంచాయతీ అధికారాలు - విధులు

గ్రామ పంచాయతీ అధికారాలు, విధులు రెండు రకాలుగా ఉంటాయి. అవి 

1) ఆవశ్యక విధులు (తప్పనిసరిగా నిర్వహించేవి) 

2) వివేచనాత్మక విధులు (ఆర్థిక వనరుల లభ్యత ఆధారంగా నిర్వహించేవి)

ఆవశ్యక విధులు: * ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు, నిర్వహణ 

* కంపోస్టు ఎరువుల తయారీ 

* బందెలదొడ్ల ఏర్పాటు, నిర్వహణ 

* పంచాయతీ స్థాయిలో ఆర్థిక వనరుల సమీకరణ 

* కలరా, మలేరియా, డయేరియా లాంటి అంటువ్యాధుల నివారణ 

* శ్మశానవాటికల నిర్మాణం, నిర్వహణ 

* మంచినీటి బావులు, చెరువుల ఏర్పాటు, నిర్వహణ, రక్షిత తాగునీటి సరఫరా 

* పంచాయతీ పరిధిలోని వీధులు, బజార్లలో చెత్త తొలగింపు 

* డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, నిర్వహణ 

* వీధిదీపాల ఏర్పాటు 

* గ్రామ పంచాయతీ పరిధిలో భవనాలు, వంతెనలు, కట్టడాల నిర్మాణం

వివేచనాత్మక విధులు: * రోడ్లు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం.

* వైద్యశాలల నిర్మాణం, నిర్వహణ 

* ఆటస్థలాలు, వ్యాయామశాలల నిర్మాణం, నిర్వహణ 

* వికలాంగులు, వ్యాధిగ్రస్తులకు సహాయ కార్యక్రమాలు. 

* గ్రంథాలయాలు, ఇతర పఠన మందిరాల నిర్మాణం, నిర్వహణ 

* ప్రయాణికులకు ధర్మశాలలు, విశ్రాంతి గృహాల నిర్మాణం, నిర్వహణ 

* పూర్వప్రాథమిక విద్య, ప్రాథమిక విద్య అభివృద్ధికి కృషి 

* కుటీర పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ 

* గ్రామ ప్రజల నైతిక, సాంఘిక, భౌతిక సంక్షేమం పెంపొందించడం 

* కమతాల ఏకీకరణ, భూసంస్కరణల అమలు 

* పబ్లిక్‌ మార్కెట్ల ఏర్పాటు, నిర్వహణ 

* ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం 

* నిరుద్యోగ గణాంకాల తయారీ 

* ప్రసూతి, శిశుసంక్షేమ పథకాల ఏర్పాటు, నిర్వహణ 

* గ్రామ నివేశన స్థలాల విస్తరణ 

* వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రదర్శనల నిర్వహణ 

* సహకార సంఘాల ఏర్పాటు, అభివృద్ధి 

* పశువుల కొట్టాల ఏర్పాటు, నిర్వహణ 

* కుక్కలు, పందుల సంచారాన్ని నియంత్రించడం 

* గిడ్డంగులు, ధాన్యాగారాల ఏర్పాటు, నిర్వహణ 

* మెరుగైన వ్యవసాయ పద్ధతుల అభివృద్ధి 

* సామాజిక సంక్షేమ పథకాల రూపకల్పన, అభివృద్ధి 

* మద్యపానం, మత్తుపదార్థాల సేవనం నియంత్రణ 

* అస్పృశ్యత నివారణకు కృషి 

* సంతలు, జాతరలు, ఉత్సవాల నిర్వహణ

ఇతర విధులు: * పంచాయతీ పరిధిలో దురాక్రమణల తొలగింపు. 

* రోడ్లపై ఆటంకాలు, గుంతల తవ్వకం నియంత్రించడం. 

* ఇళ్ల నిర్మాణానికి అనుమతుల మంజూరు 

* పబ్లిక్‌ రోడ్లపై విక్రయాల నిషేధం.

* అనుమతులు లేని ప్రకటనలు తొలగించడం. 

* ప్రైవేట్‌ మార్కెట్లు, సెల్‌టవర్ల ఏర్పాటుకు అనుమతుల మంజూరు. 

* పంచాయతీ నియమాలు ఉల్లంఘించిన వారికి జరిమానాల విధింపు. 

* వివిధ యంత్రాల వల్ల కలిగే శబ్దాలు నియంత్రించడం. 

* అనుమతి లేకుండా రోడ్లపై చెట్లు నాటడం లేదా కొట్టివేయడాన్ని నియంత్రించడం.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 10-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌