• facebook
  • whatsapp
  • telegram

వివృత బీజాలు 

వివృత బీజాలు అనేక రకాల పర్యావరణాల్లో కనిపిస్తాయి. బోరియల్‌ అడవుల నుంచి ఉష్ణమండల అడవుల వరకు ఇవి ఉంటాయి. 

* ఇవి ముఖ్యంగా పొడి, చల్లటి వాతావరణాలకు బాగా అనుగుణంగా ఉంటాయి. 

వివృత బీజాలు వివిధ వన్యప్రాణులకు ఆహారం, ఆశ్రయాన్ని అందిస్తాయి. కలప, కాగితం, ఇతర ఉత్పత్తుల తయారీలోనూ వీటిని ఉపయోగిస్తారు.


సాధారణ లక్షణాలు


వివృతమైన విత్తనాలు: జిమ్నోస్పెర్మ్‌లు పండులో లేని విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. అవి సాధారణంగా కోన్‌స్కేల్స్‌ లేదా ఇతర నిర్మాణాల ఉపరితలంపై ఉంటాయి.


శంకువులు: జిమ్నోస్పెర్మ్‌లు తరచుగా శంకువులను ఉత్పత్తి చేస్తాయి. అవి పురుష శంకువులు (పుప్పొడి శంకువులు) లేదా స్త్రీ శంకువులు (విత్తన శంకువులు) కావొచ్చు. 

 పురుష శంకువులు పుప్పొడిని ఉత్పత్తి చేస్తాయి. స్త్రీ శంకువులు విత్తనాలను అభివృద్ధి చేసే అండాలను కలిగి ఉంటాయి.


సతతహరిత, చేవదేరిన వృక్షాలు: చాలా జిమ్నోస్పెర్మ్‌లు పైన్స్, స్ప్రూస్, ఫిర్స్‌ లాంటి చెక్క మొక్కలు. 

ఇవి సాధారణంగా సతతహరిత లక్షణాన్ని కలిగి ఉంటాయి. అంటే అవి ఏడాది పొడవునా తమ పత్రాలను నిలుపుకుంటాయి.


ఎడారి ఆవాస (జీరోఫైటిక్‌) అనుకూలనాలు: జిమ్నోస్పెర్మ్‌లు తరచుగా జీరోఫైటిక్‌ అనుసరణలను ప్రదర్శిస్తాయి. 

ఇవి పొడి లేదా చల్లటి వాతావరణంలో వృద్ధి చెందడానికి సహాయపడతాయి. ఈ అనుసరణల్లో సూది లాంటి ఆకులు, మందపాటి అవభాసిని పొర, లోతుగా ఉన్న పత్ర రంధ్రాలు ఉంటాయి.


నాళికాయుత కణజాల వ్యవస్థ (వాస్క్యులర్‌ టిష్యూ): నీరు, పోషకాలు, చక్కెరల రవాణా కోసం దారువు, పోషక కణజాలం (ఫ్లోయమ్‌)తో సహా బాగా అభివృద్ధి చెందిన వాస్క్యులర్‌ కణజాలాన్ని కలిగి ఉంటాయి.


భిన్న సిద్ధబీజత (హెటిరోస్పోరి): జిమ్నోస్పెర్మ్‌లు హెటిరోస్పోరీని ప్రదర్శిస్తాయి. అంటే అవి రెండు రకాల సిద్ధజీజాలను ఉత్పత్తి చేస్తాయి. 

మైక్రోస్పోర్స్‌ (పురుష సంబంధమైనవి), మెగాస్పోర్స్‌ (స్త్రీ సంబంధమైనవి). ఈ సిద్ధబీజాలు గామిటోఫైట్‌లుగా అభివృద్ధి చెందుతాయి. ఇవి గామెట్‌లను (సంయోగబీజాలను) ఉత్పత్తి చేస్తాయి.


గాలి పరాగ సంపర్కం: అనేక జిమ్నోస్పెర్మ్‌లు పురుష శంకువుల నుంచి స్త్రీ శంకువులకు పుప్పొడిని బదిలీ చేయడానికి గాలి పరాగ సంపర్కంపై ఆధారపడతాయి. ఎందుకంటే వాటికి అనేక రంగుల్లో ఆకర్షణీయ పుష్పాలు ఉండవు.మెసోజోయిక్‌ యుగంలో ఆధిపత్యం: జిమ్నోస్పెర్మ్‌లు మెసోజోయిక్‌ యుగంలో ఆధిపత్యం ప్రదర్శించిన విత్తన మొక్కల ప్రధాన సమూహం. 

కానీ ప్రస్తుతం అనేక ఆవరణ వ్యవస్థల్లో వాటి స్థానంలో యాంజియోస్పెర్మ్‌లు (పుష్పించే మొక్కలు) ఎక్కువగా ఉన్నాయి.


ఆర్థిక ప్రాముఖ్యత


అనేక జిమ్నోస్పెర్మ్‌లను అలంకార మొక్కలుగా పెంచుతారు. ఉదా: సైకస్, అరౌకేరియా, థుజా మొదలైనవి.

* సైకస్‌ రివల్యూట, సైకస్‌ రమ్ఫీ మొదలైన వాటి కాండంపై దవ్వ, వల్కలం ఉంటాయి. వాటి నుంచి సాగో స్టార్చ్‌ అనే పదార్థాన్ని సేకరిస్తారు.


* ఉబ్బసం, దగ్గు, జలుబు, బ్రాంకైటిస్‌ మొదలైన వాటికి చికిత్స చేయడానికి ఎఫిడ్రా నుంచి సేకరించిన ఎఫెడ్రిన్‌ (ఒక రకమైన ఆల్కాలాయిడ్‌)ను ఉపయోగిస్తారు.


* అరౌకేరియా, పైనస్, సిక్వోయా మొదలైన వాటి బెరడు నుంచి సేకరించిన టానిన్లను తోలు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. 


* వార్తాపత్రికలు, ప్రింటింగ్‌ పేపర్లు లాంటివాటిని పైనస్, పిసియా, అబీస్, నీటమ్‌ మొదలైన మొక్కల చెక్క గుజ్జు నుంచి తయారు చేస్తారు.


* పోడోకార్పస్‌ నుంచి ఫ్లైవుడ్, ఇతర కలప సంబంధ వస్తువులను తయారు చేస్తారు.

* జునిపెరస్‌ వర్జీనియా అనే మొక్క కలప నుంచి సేకరించిన రెడ్‌సెడార్‌ వుడ్‌ ఆయిల్‌ను మైక్రోస్కోపిక్‌ ప్రిపరేషన్స్, ఆయిల్‌ ఇమ్మర్షన్‌లెన్స్‌లను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు.


* సైకస్, మాక్రోజామియా ఆకుల నుంచి లభించే ఫైబర్లను దిండ్లు (తలగడ) నింపడానికి, దుప్పట్లు తయారుచేయడానికి ఉపయోగిస్తారు.


* అంబర్‌ అనే శిలాజ రెసిన్‌ను పైనస్‌ సక్సినిఫెరా నుంచి సంగ్రహిస్తారు. తలుపులు, స్తంభాలు, రైల్వే వ్యాగన్‌ ఫ్లోరింగ్‌ మొదలైనవాటికి పైనస్‌ చెక్కను ఉపయోగిస్తారు.


* సైకస్‌ రివల్యూట, పైనస్‌ సెంబ్ర లాంటి మొక్కల విత్తనాల నుంచి సేకరించిన నూనెలను తినదగినవాటిగా ఉపయోగిస్తారు.

* సెడ్రస్‌ డియోడరా, కుప్రెస్సస్‌ సెర్మ్‌-పెరివైరెన్స్‌ నుంచి పొందిన నూనెలను పర్ఫ్యూమ్‌ తయారీలో ఉపయోగిస్తారు. 


ఉదాహరణలు - ఉపయోగాలు

వివృత బీజాలు మానవులు, పర్యావరణానికి అనుకూలమైన మొక్కలు. అవి మనకు కలప, కాగితం, ఇతర ఉత్పత్తులను అందిస్తాయి. ఇవి పర్యావరణ సమతౌల్యంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వన్య ప్రాణులకు ఆహారం, ఆశ్రయాన్ని అందిస్తాయి.


కోనిఫర్‌లు: వీటిని కలప, కాగితం, కొవ్వు, నూనెలు, ఇతర ఉత్పత్తుల కోసం ఉపయోగిస్తారు. ఇవి వన్యప్రాణులకు ఆహారం, ఆశ్రయాన్ని కూడా అందిస్తాయి.

ఉదా: పైన్‌ చెట్లు, ఫిర్‌ చెట్లు, స్ప్రూస్‌ చెట్లు, సెడార్‌ చెట్లు, రెడ్‌వుడ్‌ చెట్లు, జునిపర్‌ చెట్లు.


గింకో బైలోబా: ఇది పురాతన కాలంగా ఉన్న చెట్టు. మిలియన్‌ సంవత్సరాలుగా ఎలాంటి మార్పులకు గురవ్వలేదు. దీన్ని ఆహారం, మందులు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. ఇది సజీవ శిలాజం.


నీటాఫైట్‌లు: వీటిని కలప, ఆహారం కోసం ఉపయోగిస్తారు.

ఉదా: ఎఫెడ్రా, నీటం, వెల్విట్షియా


సిక్వోయా సెమ్‌ఫర్‌వైరెన్స్‌: వీటిని కోస్ట్‌ రెడ్‌వుడ్‌ అని కూడా పిలుస్తారు. ఇది భూమిపై ఉండే అత్యంత ఎత్తయిన వృక్ష జాతి. ఇది కాలిఫోర్నియా, దక్షిణ ఒరెగాన్‌లోని కోస్టల్‌ఫాగ్‌ బెల్ట్‌కు చెందింది. ఇక్కడ ఇది 379 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. 2,000 సంవత్సరాలకుపైగా జీవించగలదు.

సైకడ్‌లు: కలప, ఆహారం, వివిధ మందుల తయారీ కోసం ఉపయోగిస్తారు.

ఉదా: సైకస్‌ మొక్కలు.


మాదిరి ప్రశ్నలు


1. జిమ్నోస్పెర్మ్‌లను యాంజియోస్పెర్మ్‌ల నుంచి వేరు చేసే ప్రాథమిక లక్షణం ఎమిటి?

ఎ) విత్తనాల ఉనికి     బి) పువ్వుల ఉనికి

సి) పండ్ల ఉనికి         డి) ఏదీకాదు


 

2. కిందివాటిలో ఏది సాధారణమైన జిమ్నోస్పెర్మ్‌ల సమూహం కాదు?

ఎ) కోనిఫర్‌లు   బి) సైకాడ్స్‌    సి) ఫెర్న్‌లు   డి) జింగోస్‌




3. జిమ్నోస్పెర్మ్‌లు దేని ద్వారా పునరుత్పత్తి చేసుకుంటాయి?

ఎ) పువ్వులు    బి) శంకువులు    సి) బీజాంశం    డి) దుంపలు


4. ఏ జిమ్నోస్పెర్మ్‌ దాని ఫ్యాన్‌ ఆకారపు ఆకులకు ప్రసిద్ధి చెందింది. దీన్ని తరచుగా ‘జీవన శిలాజం’గా సూచిస్తారు?

ఎ) పైన్‌ చెట్టు       బి) సైకాడ్‌ 

సి) గింకో బైలోబా    డి) స్ప్రూస్ చెట్టు



5. జిమ్నోస్పెర్మ్‌లో కోన్స్‌ ప్రధాన విధి ఏమిటి?

ఎ) పరాగ సంపర్కాలను ఆకర్షించడం 

బి) విత్తనాలను రక్షించడం

సి) కిరణజన్య సంయోగక్రియలో సహాయం చేయడం 

డి) నీటిని నిల్వ చేయడం




6. జిమ్నోస్పెర్మ్స్‌లోని స్త్రీ పునరుత్పత్తి నిర్మాణాన్ని ఏమంటారు?

ఎ) అండం    బి) పుప్పొడి కోన్‌    సి) విత్తనం    డి) కేసరం


 


7. ఏ జిమ్నోస్పెర్మ్‌ సమూహంలో పైన్స్, స్ప్రూస్, ఫిర్స్‌ లాంటి చెట్లు ఉన్నాయి?

ఎ) జింగోస్‌    బి) సైకాడ్స్‌    సి) కోనిఫర్స్‌    డి) వెల్విట్‌చియా


 

8. జిమ్నోస్పెర్మ్‌లు ఏ పరిసర ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తాయి?

ఎ) ఎడారి పరిసరాలు     బి) ఉష్ణమండల పర్యావరణాలు

సి) సమశీతోష్ణ ప్రాంతాలు   డి) పగడపు దిబ్బలు




9. కిందివాటిలో ఏ జిమ్నోస్పెర్మ్‌లు ప్రత్యేకమైన రెండు అకుల పెరుగుదల నమూనాను కలిగి ఉంటాయి, శుష్క ప్రాంతాల్లో కనిపిస్తాయి?

ఎ) సిక్వోయా   బి) వెల్విట్‌చియా   సి) పైన్‌    డి) గ్నెటమ్‌


 


10. జిమ్నోస్పెర్మ్‌లు ఏ మొక్కల సమూహానికి చెందినవి?

i) నాళికాయుత మొక్కలు     ii) పిండసహిత మొక్కలు

iii) పుష్పించే మొక్కలు

ఎ) i, ii     బి) ii, iii     సి) i, iii     డి) i, ii, iii



 

11. జిమ్నోస్పెర్మ్‌ పునరుత్పత్తిలో పుప్పొడి పని ఏమిటి?

ఎ) పరాగసంపర్కం కోసం కీటకాలను ఆకర్షించడం 

బి) పండ్లను ఉత్పత్తి చేయడం

సి) అండాశయానికి శుక్రకణాన్ని తీసుకెళ్లడం 

డి) పోషకాలను నిల్వచేయడం


 


12. ఏ జిమ్నోస్పెర్మ్‌ దాని పెద్ద కోన్‌- ఆకారపు పునరుత్పత్తి నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. సాధారణంగా దీన్ని క్రిస్మస్‌ సమయంలో అలంకరణలకు ఉపయోగిస్తారు?

ఎ) సైకాడ్‌ మొక్కలు   బి) గింకో బైలోబా   

సి) పైన్‌ మొక్కలు     డి) శంకు మొక్కలు


 

సమాధానాలు 

1-ఎ     2-సి     3-బి     4-సి     5-బి     6-ఎ     7-సి     8-సి     9-బి     10-డి     11-సి    12-సి


 

Posted Date : 25-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌