• facebook
  • whatsapp
  • telegram

హర్షవర్ధునిది కాలం నాటి పరిస్థితులు


సాంఘిక పరిస్థితులు

* సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. 

* బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వారి సంప్రదాయాలను ఆచరించారు. వీరిలో ఎన్నో కులాలు, ఉపకులాలు ఉండేవి. ప్రతి వృత్తి ఒక కులంగా ఏర్పడింది. 

* బ్రాహ్మణులకు సమాజంలో ఉన్నతస్థానం ఉండేది. కసాయి, నిషాదులు, మత్స్య, చండాలురిని అపరిశుభ్ర వృత్తులుగా భావించి, ఊరికి దూరంగా ఉంచేవారు. వీరిని అంటరానివారిగా పరిగణించారు.

* కులాంతర, వర్ణాంతర వివాహాలు; సహపంక్తి భోజనాలు లేవు. బాల్యవివాహాలు ఉండేవి. వితంతు వివాహాలు లేవు. సతీసహగమనం ఉండేది. స్త్రీలకు స్వాతంత్య్రం లేదు. 

* ప్రజలు ధర్మసూత్రాలు పాటించి, ఉమ్మడి కుటుంబంగా జీవించేవారు. 
* ఎరాన్‌ శాసనంలో (క్రీ.శ. 510) ‘జోహార్‌’ అనే పదం ఉంది. దీని అర్థం యుద్ధంలో మరణించిన సైనికుల భార్యలు ఉమ్మడిగా అగ్ని ప్రవేశం చేసే ఆచారం.


ఆర్థిక పరిస్థితులు

* ఆనాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. రైతులు తృణధాన్యాలు, వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, చెరకు, కూరగాయలు, మామిడి, అరటి, పుచ్చ, నారింజ, దానిమ్మ, గుమ్మడి, వెలగ, చింత, కొబ్బరి, అల్లం, ఆవాలు పండించేవారు.

* పూంచ్, మధుర ప్రాంతాలు పండ్ల తోటలకు ప్రసిద్ధి. మగధలో సువాసన బియ్యాన్ని సాగుచేసేవారు. 

* హర్షుడి కాలంలో దేశం సిరిసంపదలతో తులతూగిందని హుయాన్‌త్సాంగ్‌ తన రచనల్లో పేర్కొన్నాడు. 

* సంపన్నులు విలువైన వస్త్రాలు, ఆభరణాలు ధరించి పెద్దభవనాల్లో నివసిస్తే, మిగిలినవారు సాధారణ జీవితం గడిపారు.

* ప్రాచీన నగరాలు తక్షశిల, పురుషపురం, పాటలీపుత్రం శిథిలమవ్వగా; కనౌజ్, వారణాసి, ప్రయాగ మొదలైన పట్టణాలు అభివృద్ధి చెందాయి. కనౌజ్‌ నగరం 5 మైళ్ల పొడవు, 4 మైళ్ల వెడల్పుతో సర్వాంగ సుందరంగా ఉండేదని హుయాన్‌ త్సాంగ్‌ పేర్కొన్నాడు. 

* పరిశ్రమల విభజన కులాలవారీగా జరిగేది. కౌశేయ(silk), క్షామ(linen), కంబళ (wollen) మొదలైనవారు విలువైన వస్త్రాలు నేసేవారు. మధుర, వారణాసి, కామరూప ప్రధాన నూలుపరిశ్రమ కేంద్రాలు. 

* కర్తన(spinning), జాతి కాకరణ(lace making), సూగేవానకర్మ(tailoring) లాంటి వృత్తులు ఉండేవి. వితంతువులు ఎక్కువగా ఈ పనులు చేసేవారు. 

* లోహ, దారు, దంత పరిశ్రమలు ఉండేవి. సౌరాష్ట్రలో ఇత్తడి; వంగదేశంలో తగరం; సూర్పారక, అంగ, సింధూ రాష్ట్రాల్లో ఖడ్గాలు తయారుచేసేవారు. 

వర్తక - వ్యాపారం

* హర్షుడి కాలంలో ఆగ్నేయాసియా దేశాలతో వర్తకం నిర్వహించేవారు. రేవుపట్టణాల్లో తామ్రలిప్తి (బెంగాల్‌), బరుకచ్చ, చారిత్ర (ఒడిశా) ప్రధానమైనవి. శ్రీలంక, ఇండోనేసియా, చైనాలకు తామ్రలిప్తి నుంచి నౌకలు వెళ్లేవి. 

* కశ్మీర్‌ కుంకుమపువ్వు, హిమాలయ ఔషధాలు, దక్షిణ భారతదేశం నుంచి సేకరించిన ముత్యాలు, సుగంధద్రవ్యాలు ముఖ్యమైన ఎగుమతులు. రాగి, గుర్రాలు, దంతాలు, మరకతం ప్రధాన దిగుమతులు. 

* ప్రతి కుటీర పరిశ్రమ ఒక శ్రేణిగా (guild) ఏర్పడింది. వీటికి కొన్ని నిబంధనలు ఉండేవి. ఇవి సంఘ శ్రేయస్సు, వ్యాపారాభివృద్ధికి కృషిచేసేవి. వీటికి సలహాలు ఇవ్వడానికి ‘నిగమసభలు’ ఉండేవి. ఆ శ్రేణులు ప్రస్తుత బ్యాంకులుగా పనిచేసేవి. 

* ఆ కాలంలో చేనేత, అల్లిక, దంత, దారు, చందన, వెండి బంగారు, కుట్టు, పోత, ఆయుధ పరిశ్రమలు ఉండేవి. 


మత పరిస్థితులు 

* హర్షుడి కాలంలో మతంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. బౌద్ధమతం క్షీణదశలో ఉండగా, హిందూమతం అభివృద్ధి చెందింది. 

* హర్షుడు బౌద్ధమతం స్వీకరించి, దాని అభివృద్ధికి కృషి చేసినప్పటికీ, ఆ మతం కనౌజ్‌ లాంటి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. అదేవిధంగా జలంధర్, నలందా, కంచి, ధాన్యకటక ఆరామాల్లో బౌద్ధమతం అభివృద్ధి చెందింది.

* గౌడశశాంకుడు, హూణులు లాంటివారు బౌద్ధారామాలను ధ్వంసం చేసి నష్టం కలిగించారు. 

* క్రీ.శ. 5వ శతాబ్దం నుంచి వర్తక, వ్యాపారం క్షీణించడం వల్ల బౌద్ధమతానికి చేయూతనిచ్చే వర్తకవర్గం ప్రాధాన్యం తగ్గింది. 

* బౌద్ధమతం అంతర్గతంగా శాఖోపశాఖలుగా విడిపోవడం (18 బౌద్ధశాఖలు), వాదోపవాదాల కారణంగా మత ప్రచారం తగ్గింది. సాంఘిక దురాచారాలు, బౌద్ధభిక్షువుల వ్యవహారశైలి, తాంత్రిక సంప్రదాయాలతో కూడిన పూజలు, దుష్టాచారాల వల్ల బౌద్ధమతం క్షీణించింది.

* హిందూమతం ‘భక్తి’ భావంతో ప్రజాదరణ పొందింది. శైవ, వైష్ణవ శాఖలు ఆదరణ పొందాయి. శైవంలో కాపాలిక, కాలముఖ శాఖలు ముఖ్యమైనవిగా ఆవిర్భవించాయి. వీరు మానవాతీత శక్తులు సాధించడానికి జంతు, నర బలులు ఇచ్చేవారని హర్షచరిత్ర, మాలతీమాధవ గ్రంథాల్లో ఉంది. వారణాసి, శ్రీశైలం శైవక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. మూఢనమ్మకాలు పెరిగాయి. 

* వైశాలి, పౌండ్రవర్ధన, సమతట, కళింగ ప్రాంతాల్లో జైనమత ప్రభావం ఉండేది.

* క్రీ.శ. 7వ శతాబ్దం నాటికి ‘వజ్రయాన’ బౌద్ధమతం ఆవిర్భవించి, మంత్రతంత్రాలతో కూడిన పూజావిధానాలు ప్రారంభమయ్యాయి.

* హర్షుడు ‘సమ్మతీయ శాఖను’ ప్రోత్సహించినట్లు; ఆ కాలంలో చంద్రకీర్తి, ధర్మపాలుడు, సంతిదేవుడు లాంటి బౌద్ధ పండితులు ఉండేవారని హుయాన్‌త్సాంగ్‌ పేర్కొన్నాడు.

హర్షుడి తర్వాతి రాజవంశాలు

* క్రీ.శ. 647లో హర్షుడు మరణించాక భారతదేశంలో రాజపుత్ర వంశాలు రాజకీయ అధికారం పొందాయి. వీరు హిందూ మత సంస్కృతిని అనుసరిస్తూ పాలించారు. 

* క్రీ.శ. 7వ శతాబ్దం మధ్యభాగం నుంచి క్రీ.శ.13వ శతాబ్దం ప్రారంభం 

(క్రీ.శ. 1206) వరకు ఉత్తర భారతదేశాన్ని రాజపుత్రులు పాలించారు. ఆ కాలాన్ని ‘రాజపుత్రయుగం’గా చరిత్రకారులు పేర్కొంటారు. 

* హర్షుడి తర్వాత మొట్టమొదట రాజకీయ అధికారాన్ని చేపట్టిన రాజపుత్ర వంశం ‘ప్రతిహారులు’. వీరు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ను, మాళ్వాను పాలించారు. 

* గహాద్వాలులు లేదా రాథోర్‌లు కనౌజ్‌ను తమ రాజ్యంగా ప్రకటించుకున్నారు. 

* చౌహాన్‌లు ‘అజ్మీర్‌’ కేంద్రంగా పాలించారు. చందేలులు ‘బుందేల్‌ఖండ్‌’ ప్రాంతంలో రాజ్యపాలన చేశారు.

  * మాళ్వాను ‘పరమారులు’, గుజరాత్‌ను ‘సోలంకీలు’, త్రిపురను (ఛేది) ‘కాలాచూరీలు’, బెంగాల్‌ను ‘పాలవంశం’ వారు  పాలించారు.


విద్య - సాహిత్యాభివృద్ధి

హర్షుడి కాలంలో సంస్కృతం, ప్రాకృత భాషల్లో సాహిత్యాభివృద్ధి జరిగింది. ఇతడు స్వయంగా కవి, కవిపోషకుడు, విద్యాభిమాని.

* హుయాన్‌త్సాంగ్‌ రచనలు, బాణుడి హర్షచరిత్ర ప్రకారం హర్షుడి కాలం నాటి రాజభాష ‘సంస్కృతం’. సాహిత్యాన్ని ఈ భాషలోనే రాశారు. 

* వాక్పతిరాజు ప్రాకృతంలో ‘గౌడవాహో’ అనే కావ్యం రాశాడు. 

* హర్షుడి ఆస్థానంలో బాణుడు, మయూరుడు, దివాకరుడు, భర్తృహరి మొదలైన కవులు ఉండేవారు. బాణుడు ‘హర్షచరిత్ర’, ‘కాదంబరి’ నాటకాలు రచించగా; హర్షుడు ‘రత్నావళి’, ‘నాగానందం’, ‘ప్రియదర్శిక’ అనే నాటకాలు రాశాడు. 

* జైనమతాన్ని ఆచరించిన మాతంగ దివాకరుడు  అనే కవి ఇతడి ఆస్థానంలో ఉండేవాడు.

* మయూరుడు ‘సూర్యశతకాన్ని’, భర్తృహరి ‘సుభాషిత శతకాన్ని’ రచించారు. కామాందకుడు ‘నీతిసారం’, ‘కుమిలుడు’, ‘శ్లోకవర్తిక’, ‘తంత్రవర్తిక’, ‘తుప్తిక’ అనే గ్రంథాలు రచించారు. భవభూతి ‘ఉత్తరరామ చరిత్ర’, ‘మహావీర చరిత్ర’, ‘మాలతీమాధవ’ నాటకాలు రాశాడు.

* హర్షుడు తన ఆదాయంలో 1/4 వంతు విద్యాభివృద్ధికి ఖర్చు చేసేవాడు. బౌద్ధవిహారాలు, హిందూ గురుకులాల్లో విద్యాబోధన జరిగేది. 

* లౌకిక విద్య బోధించేవారు. జైన, బౌద్ధ, హిందూ గ్రంథాలు; తర్కం, వ్యాకరణం, గణితం, ఖగోళ, వైద్యశాస్త్రాలను బోధించేవారు. 

* ఆచార్య నాగార్జునుడి ‘సుహృల్లేఖ’ గ్రంథం విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేది. తాళపత్ర గ్రంథాలుండేవి. 

* హర్షుడి కాలంలో నలందా, వల్లభి, తక్షశిల, ఉజ్జయిని ప్రముఖ విద్యాపీఠాలు. ఈ కేంద్రాల్లో విద్యను అభ్యసించడానికి దేశవిదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. ఈ పీఠాల్లో ప్రవేశాలకు పోటీపరీక్షలు నిర్వహించేవారు.


నలందా విశ్వవిద్యాలయం 

* నలందా విశ్వవిద్యాలయాన్ని బౌద్ధులు నిర్వహించేవారు. క్రీ.పూ.5వ శతాబ్దంలో గుప్తరాజైన మొదటి కుమారగుప్తుడు దీన్ని స్థాపించాడు. హర్షుడు దీనికి అనేక దానాలు ఇచ్చాడు. హర్షుడి కాలంలో దీనికి ‘శిలభద్రుడు’ ప్రధానాచార్యుడిగా( vice cancellor) ఉండేవాడు. చైనా యాత్రికుడు హుయాన్‌ త్సాంగ్‌ నలందలో బౌద్ధమతానికి చెందిన ‘యోగాచార’ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి, దీనిపై ‘సిద్ధి’ అనే గ్రంథాన్ని రచించాడు. ఆ సమయంలో నలందలో 1500 మంది ఉపాధ్యాయులు, 10 వేల మంది విద్యార్థులు ఉన్నారని హుయాన్‌త్సాంగ్‌ పేర్కొన్నాడు. 

* చైనా, టిబెట్, జావా, సింహళ రాజులు కూడా దీని పోషణకు గ్రామాలు దానం చేశారు. నలందలో ‘ధర్మగంజ్‌’ అనే గ్రంథాలయం ఉండేది. ఇందులో కొన్ని వేల గ్రంథాలు ఉండేవి. 

* నలందలో 8 విహారాలు, ఒక సంఘారామం, ప్రకారగోడ, మామిడితోటలు, జలాశయాలు ఉండేవి. ఇందులో తర్క, ఖగోళ పరిశోధనలు జరిగేవి. 1 : 6 నిష్పత్తిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉండేవారు. 

* మూల మాధ్యమిక గ్రంథానికి భాష్యమైన ‘ప్రసన్నపద’ను రాసిన ‘చంద్రకీర్తి’ ఇందులో మఠాధికారి.

వల్లభి విశ్వవిద్యాలయం: 

* సౌరాష్ట్రలో నలందకు దీటుగా మౌఖరీ వంశస్థులు ‘వల్లభి’ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇక్కడ 6000 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉండేవారు. ఆ కాలంలో దీనికి స్థిరమతి, గుణమతి అధికారులుగా ఉన్నారు. అన్ని మతాల వారు ఇందులో విద్యను అభ్యసించేవారు. దేశ విదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు.

Posted Date : 06-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌