• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - భౌతిక అమరిక

భారతదేశం - ద్వీపకల్పం  (India as Peninsula)


మూడు వైపులా జలభాగం, ఒకవైపు భూభాగం ఉన్న ప్రాంతాన్ని ద్వీపకల్పం అంటారు.


 భారతదేశానికి వాయవ్య, ఉత్తర, ఈశాన్య దిశల్లో తరుణ ముడత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి.


 సుమారు 22 ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా భారతదేశ భూభాగ విస్తీర్ణం తగ్గుతూ హిందూ మహాసముద్రం వైపు విస్తరించింది. ఆ భూభాగం దాన్ని రెండు సముద్రాలుగా - పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతంగా విభజిస్తుంది.


 భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇది ప్రపంచంలో రెండో పెద్ద ద్వీపకల్పంగా పేరొందింది. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా ద్వీపకల్పం.

భారతదేశంలోని ద్వీపకల్పాలు:


1. దక్కన్‌ ద్వీపకల్పం  - దక్షిణ భారతదేశం


2. కన్యాకుమారి ద్వీపకల్పం  - తమిళనాడు


3. కథియావార్‌ ద్వీపకల్పం - గుజరాత్‌


4. కచ్‌ ద్వీపకల్పం - గుజరాత్‌ ( gujarat )


5. కొలాబా ద్వీపకల్పం - ముంబయి


ప్రపంచంలో భారతదేశం


భారతదేశం అక్షాంశాల ఆధారంగా ఉత్తరార్ధ గోళంలో, రేఖాంశాలపరంగా పూర్వార్థగోళం (East Part) లో ఉంది.


 తూర్పు, పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో భారత భూభాగం ఉంది. ఆసియా ఖండానికి దక్షిణ దిశలో విస్తరించిన ప్రాంతమే భారతదేశం.


 హిందూ మహాసముద్రం మీదుగా పశ్చిమాన ఐరోపాను, తూర్పున ఆసియా దేశాలను కలిపే ప్రయాణ మార్గాలకు భారతదేశం వ్యూహాత్మక కేంద్రంగా ఉంది.


 దక్కన్‌ ద్వీపకల్పం హిందూ మహాసముద్రంలోకి పొడుచుకు వచ్చింది. దీనివల్ల భారతదేశ పశ్చిమతీరం పశ్చిమాసియా, ఆఫ్రికా, ఐరోపాలతో; తూర్పుతీరం ఆగ్నేయ, తూర్పు ఆసియాలతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి దోహదపడింది.


 భారతదేశం హిందూ మహాసముద్రంతో సుదీర్ఘ తీరప్రాంతాన్ని పంచుకుంటుంది. 


 1869లో సూయజ్‌ కాలువను తెరవడంతో ఐరోపా నుంచి భారతదేశానికి మధ్య సుమారు 7000 కి.మీ./ 4500 మైళ్ల దూరం తగ్గింది. సూయజ్‌ కాలువ మధ్యధరా సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని కలుపుతుంది.


వాణిజ్య సంబంధాలు:


అనేక యుగాలుగా భారత్‌ బయటి ప్రపంచంతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తోంది. సముద్ర మార్గాల కంటే భూమార్గాల ద్వారా ఏర్పడిన సంబంధాలే ప్రాచీనమైనవి.


 పర్వత కనుమల నుంచి ప్రయాణ మార్గాలను ఏర్పాటు చేసి, వర్తక వాణిజ్యాన్ని కొనసాగించారు.


 ప్రాచీన కాలం నాటి భావాలు, వస్తు మార్పిడికి ఈ వ్యాపార మార్గాలు దోహదపడ్డాయి.


 ఉపనిషత్తులు, రామాయణాల సందేశాలు; పంచతంత్ర కథలు; భారతీయ సంఖ్యామానం, దశాంశ పద్ధతి మనదేశం నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. 


 సుగంధ ద్రవ్యాలు, మస్లిన్‌ వస్త్రం, ఇతర సరకులు భారతదేశం నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయి.


భారతదేశానికి వివిధ పేర్లు


జంబూద్వీపం: మార్కండేయ పురాణం, సూర్య సిద్ధాంతం గ్రంథాల్లో మన దేశాన్ని జంబూద్వీపంగా పేర్కొన్నారు.


 జంబుక అంటే నేరేడు వృక్షం.


హిందుస్థాన్‌: పర్షియన్‌ భాషలో ‘స’ అక్షరాన్ని ‘హ’గా పిలుస్తారు. ఉదాహరణకు సప్తసింధును హప్తహింధు అంటారు. వారు సింధు స్థానంలో హిందు అనే పదాన్ని వినియోగించారు.


 మధ్యయుగానికి చెందిన మిన్హజ్‌ ఇ సిరాజ్‌ అనే పర్షియన్‌ చరిత్రకారుడు తన గ్రంథాల్లో మన దేశాన్ని హిందుస్థాన్‌ అనే పేరుతో పిలిచాడు.


తియాన్‌జు/ తెన్‌జికు: ప్రాచీన కాలంలో చైనా వర్తకులు మన దేశాన్ని ఈ పేరుతో పిలిచారు.


నభీవర్షం: మొదటి జైన తీర్థంకరుడైన వృషభనాథుడి తండ్రి పేరు మీదుగా మన దేశాన్ని నభీవర్షం అని పిలిచారు.


ఆర్యావర్తనం, ద్రవిడదేశం: ఆర్యులు దండయాత్ర చేసి ఆక్రమించుకున్న భారతదేశ ఉత్తర ప్రాంతాన్ని ఆర్యావర్తం అని, దక్షిణ ప్రాంతాన్ని ద్రవిడ దేశం అని పిలుస్తారు.


 మనుస్మృతి గ్రంథంలో వింధ్య పర్వతాలకు ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని ఆర్యావర్తనం అని, దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని ద్రవిడ దేశంగా పేర్కొన్నారు.


హిమవత్‌ ప్రదేశ్‌: మహా భారతంలో భారతదేశాన్ని ఈ పేరుతో పేర్కొన్నారు. మన దేశానికి ఉత్తర సరిహద్దులో విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాల పేరు మీదుగా మన దేశాన్ని ‘హిమవత్‌ ప్రదేశ్‌’ అని పిలిచారు.


హొదూ: మన దేశం పేరును బైబిల్‌లో ‘హొదూ’గా పేర్కొన్నారు. హిబ్రూ భాషలో రాసిన ‘ఎస్తేరు’ అనే క్రైస్తవ కథల్లో ఈ పేరు ఉపయోగించారు.


భరతవర్షం: పురాణాల్లో (వాయుపురాణం, విష్ణుపురాణం), మహాభారత ఇతిహాసంలో భరతుడు అనే చక్రవర్తి (శకుంతల - దుష్యంతుల కుమారుడు) మన దేశాన్ని పాలించినట్లు ఉంది. అందుకే దీనికి భరతవర్షం అనే పేరు వచ్చింది.


ఇండియా: భారతదేశానికి వచ్చిన గ్రీకులు వాయవ్య భారతదేశంలో ప్రవహిస్తున్న సింధూ నదిని ‘ఇండస్‌’ అని పేర్కొన్నారు. దాని పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఇండోయిలు అని పిలిచారు. ఈ కారణంగానే మన దేశానికి ఇండియా అనే పేరు వచ్చింది.


భారత్‌: ప్రస్తుతం మన దేశాన్ని అధికారికంగా భారత రాజ్యాంగంలోని మొదటి అధికరణలో “india that is Bharat, shall be a Union of States.”(ఇండియా అంటే భారత్‌)గా పేర్కొన్నారు.


భూభాగ సరిహద్దు - పొరుగు దేశాలు


భారతదేశానికి మొత్తం 15,200 కి.మీ. పొడవైన భూభాగ సరిహద్దు ఉంది. దీన్ని దేశంలోని 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు 7 దేశాలతో కలిసి పంచుకుంటున్నాయి.


బంగ్లాదేశ్‌: భారతదేశంతో పొడవైన (4096 కి.మీ) భూభాగ సరిహద్దును కలిగిన పొరుగు దేశం బంగ్లాదేశ్‌. బంగ్లాదేశ్‌తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు అయిదు. అవి: పశ్చిమ్‌ బంగా, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం.


చైనా: చైనా భారతదేశంతో సుమారు 3916 కి.మీల సరిహద్దును కలిగి ఉంది. ఈ దేశంతో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు నాలుగు. అవి: హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌.


 చైనాతో భూభాగ సరిహద్దును కలిగి ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌.


 చైనాతో పొడవైన భూభాగ సరిహద్దు కలిగిన భారత భూభాగం లద్దాఖ్‌.


పాకిస్థాన్‌: బంగ్లాదేశ్, చైనాల తర్వాత పొడవైన సరిహద్దు కలిగి ఉన్న పొరుగుదేశం పాకిస్థాన్‌.


 పాకిస్థాన్, భారతదేశంలోని 3 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి సుమారు 3300 కి.మీల సరిహద్దు కలిగి ఉంది.


 పాకిస్థాన్‌తో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు - గుజరాత్, రాజస్థాన్‌ (పొడవైన సరిహద్దు), పంజాబ్‌; కేంద్రపాలిత ప్రాంతాలు - జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌.


నేపాల్‌: నేపాల్‌ భారతదేశంతో సుమారు 1752 కి.మీ. సరిహద్దు కలిగి ఉంది. నేపాల్‌తో సరిహద్దు కలిగి ఉన్న భారత రాష్ట్రాలు అయిదు. అవి. ఉత్తరాఖండ్, ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, పశ్చిమ్‌ బంగా, సిక్కిం.


 నేపాల్‌తో పొడవైన సరిహద్దు పంచుకునే రాష్ట్రం - ఉత్తర్‌ ప్రదేశ్‌.


మయన్మార్‌: భారతదేశంతో సుమారు 1458 కి.మీ. భూ సరిహద్దు కలిగి ఉంది.


 మయన్మార్‌తో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు నాలుగు. అవి: అరుణాచల్‌ ప్రదేశ్, నాగాలాండ్, మణిపుర్, మిజోరం.


 మయన్మార్‌తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌.


భూటాన్‌: భూటాన్‌ భారతదేశంతో సుమారు 598 కి.మీ. పొడవైన సరిహద్దును కలిగి ఉంది.


 భూటాన్‌తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు నాలుగు. అవి: సిక్కిం, పశ్చిమ్‌ బంగా, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌.


 భూటాన్‌తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం అసోం.


ఆఫ్గనిస్థాన్‌: భారతదేశంతో అతి తక్కువ భూభాగ సరిహద్దు కలిగిన దేశం ఆఫ్గనిస్థాన్‌. కేవలం 80 కి.మీ.ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది.


 ఆఫ్గనిస్థాన్‌తో లద్దాఖ్‌ (కేంద్రపాలిత ప్రాంతం) మాత్రమే సరిహద్దును కలిగి ఉంది.


 మూడు వైపులా మూడు దేశాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు - సిక్కిం, పశ్చిమ్‌ బంగా, అరుణాచల్‌ ప్రదేశ్‌.


 సముద్రతీర రేఖను, పొరుగు దేశాలతో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు - గుజరాత్, పశ్చిమ్‌ బంగా.

భూపరివేష్టిత రాష్ట్రాలు (Land Locked States)


ఇతర దేశాలతో భూభాగ సరిహద్దు లేదా సముద్ర తీరం లేని రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు.


* మన దేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలు 5, కేంద్రపాలిత ప్రాంతాలు 2 ఉన్నాయి.


అవి: రాష్ట్రాలు: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, హరియాణా, తెలంగాణ.


కేంద్రపాలిత ప్రాంతాలు: దిల్లీ, చండీగఢ్‌.


రచయిత

పి.కె. వీరాంజనేయులు

విషయ నిపుణులు 

Posted Date : 05-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌