• facebook
  • whatsapp
  • telegram

భారతీయ రక్షణరంగం - వర్తమాన అంశాలు

శిక్షణా సంస్థలు

  రాష్ట్రీయ ఇండియన్‌ మిలటరీ కాలేజ్‌ (ఆర్‌ఐఎంసీ): దీన్ని 1922, మార్చి 13న వేల్స్‌ యువరాజు ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌-8 ప్రారంభించారు. ఆ సమయంలో దీని పేరు ‘ది ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ రాయల్‌ ఇండియన్‌ మిలటరీ కాలేజ్‌’గా ఉండేది. ప్రధాన కేంద్రం డెహ్రాడూన్‌లో ఉంది. భారత త్రివిధ దళాలకు కావాల్సిన సిబ్బంది శిక్షణ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. సుమారు 12 ఏళ్ల వయసున్న బాలురను ప్రవేశపరీక్ష ద్వారా ఎనిమిదో తరగతిలోకి తీసుకొని, దశల వారీగా శిక్షణ ఇస్తారు. 2022లో అయిదుగురు బాలికలు ఆర్మీ శిక్షణకు ఎంపికయ్యారు.  

ఆర్మీ క్యాడెట్‌ కాలేజ్‌ (ఏసీసీ): 1929లో కిచెనర్‌ కాలేజ్‌ పేరుతో మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో స్థాపించారు. 1960లో దీని  పేరును ఏసీసీగా మార్చారు. 1977లో దీని  ముఖ్యకేంద్రాన్ని డెహ్రాడూన్‌కు తరలించారు. ఇందులో మూడేళ్ల డిగ్రీ ప్రోగ్రాం ఉంటుంది. 2027 మధ్య వయసు కలిగి, రెండేళ్లు సర్వీస్‌లో పనిచేసిన వారు దీనికి అర్హులు.

ఇండియన్‌ మిలటరీ అకాడమీ (ఐఎంఏ): 1932లో డెహ్రాడూన్‌ కేంద్రంగా దీన్ని ప్రారంభించారు. ఇండియన్‌ ఆర్మీకి ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. ‘వీరతా ఔర్‌ వివేక్‌’ (శౌర్యం - వివేకం) దీని ప్రధాన లక్ష్యం.

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ): దీన్ని 1954, డిసెంబరు 7న ప్రారంభించారు. త్రివిధ దళాలకు కావాల్సిన సిబ్బందిని ఇక్కడ సమర్థవంతంగా తీర్చిదిద్దుతారు. దీని ముఖ్యకేంద్రం ఖడక్‌వాస్లా, పుణెలో ఉంది. 

ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఓటీఏ): దీన్ని  1963, జనవరి 15న చెన్నైలోని అలందుర్‌లో స్థాపించారు. ఇండియన్‌ ఆర్మీకి కావాల్సిన ఆఫీసర్‌ స్థాయి సిబ్బందికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఎంపికైన  స్త్రీ, పురుష ఆఫీసర్లకు 49 వారాల పాటు ఇక్కడ శిక్షణ అందిస్తారు. 2011లో బిహార్‌లోని గయలో చెన్నైలోని సంస్థకు అనుబంధంగా  ఓటీఏను నెలకొల్పారు. 

ఇండియన్‌ నేవల్‌ అకాడమీ (ఐఎన్‌ఏ): ఐఎన్‌ఏ తాత్కాలిక కేంద్రాన్ని 1969లో కొచ్చిన్‌లో స్థాపించారు. ప్రస్తుతం దీని ప్రధానకేంద్రం కేరళలోని ఎజిమలలో ఉంది. భారత నావికా దళం, కోస్ట్‌గార్డ్‌లకు కావాల్సిన శిక్షణను ఇక్కడ అందిస్తారు. ఇది 2,452  ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలో మూడో, ఆసియాలో అతి పెద్ద నావికాదళ శిక్షణా సంస్థగా గుర్తింపు పొందింది.  

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ (ఐఏఎఫ్‌ఏ): దీని ముఖ్యకేంద్రాన్ని తెలంగాణలోని దుండిగల్‌లో 1969 అక్టోబరు 11న స్థాపించారు. 1971 నుంచి ఇది తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇందులో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ క్యాడర్‌ ఆఫీసర్లకు కావాల్సిన శిక్షణను అందిస్తారు. 1993 నుంచి మహిళా అభ్యర్థులకు కూడా శిక్షణ ఇస్తున్నారు.

నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజ్‌: దీని ప్రధానకేంద్రం న్యూదిల్లీలో ఉంది. దీన్ని 1960లో స్థాపించారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై ఇందులో శిక్షణ ఇస్తారు.

హై ఆల్టిట్యూడ్‌ వార్‌ఫేర్‌ స్కూల్‌ (హెచ్‌ఏడబ్ల్యూఎస్‌): దీన్ని మొదట ‘ఫార్మేషన్‌ సిక్లీ స్కూల్‌’ పేరుతో  1948లో కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ఏర్పాటు చేశారు. 1962లో దీని పేరును హెచ్‌ఏడబ్ల్యూఎస్‌గా మార్చారు.  ఎత్తయిన ప్రదేశాలు, మంచుతో ఉన్న పర్వతాలపై యుద్ధ మెలకువలపై ఇందులో శిక్షణ ఇస్తారు.

కౌంటర్‌ ఇన్‌సర్జెన్సీ అండ్‌ జంగిల్‌ వార్‌ఫేర్‌ స్కూల్‌: శత్రువులు దాడి చేసినప్పుడు, యుద్ధ సమయాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, యుద్ధ రీతుల గురించి భారత సాయుధ దళాలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. దీన్ని 1967లో మిజోరంలోని వైరెంగ్టేలో స్థాపించారు.

కాలేజ్‌ ఆఫ్‌ కంబాట్‌/ ఆర్మీ వార్‌ కాలేజ్‌:

దీన్ని 1971 ఏప్రిల్‌ 1న మధ్యప్రదేశ్‌లోని మౌలో స్థాపించారు. ఇందులో భారత సైన్యం, పారా మిలటరీ బలగాలకు చెందిన అధికారులు శిక్షణ పొందుతారు.

ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ కాలేజ్‌ (ఏఏడీసీ): ఒడిశాలోని గోపాల్‌పూర్‌లో 1989, నవంబరు 1న దీన్ని నెలకొల్పారు. ఇది సాయుధ బలగాలకు సాంకేతిక పరమైన శిక్షణను అందిస్తుంది.

అగ్నిపథ్‌

భారతదేశ రక్షణరంగ నూతన సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం 2022, జూన్‌ 14న  అగ్నిపథ్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది.  దీని ద్వారా కేంద్రం ఈ ఏడాదికి 46 వేల మంది అగ్నివీరులను త్రివిధ దళాల్లోకి ఎంపిక చేయనుంది.

ఇది భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ ద్వారా రూపొందించిన పరివర్తన పథకం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశ యువతలో వివక్ష లేకుండా సమాన అవకాశాలను కల్పించి, జాతీయ సమైక్యతను పెంపొందించాలని ఈ పథకాన్ని రూపొందించారు. దేశంలో అధికశాతం ఉన్న యువతకు సాధికారత, నైపుణ్య శిక్షణ కల్పించి దృఢమైన భారతదేశాన్ని నిర్మించాలనేది ఈ పథకం లక్ష్యం. యువకులకు సైనిక క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం పట్ల అవగాహన కల్పించి, మెరుగైన సమాజాన్ని ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో ఇప్పటివరకు రక్షణరంగంలో క్రియాశీలంగా లేని మహిళలను కూడా ఇందులో భాగస్వాములుగా చేసి, భారతీయ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు.

ముఖాంశాలు:

* ఈ పథకం ద్వారా కమిషన్‌ ఆఫీసర్ల స్థాయి దిగువన నాన్‌ కమిషన్‌ స్థాయుల్లో అగ్నివీరులను (సైనికులు/ నావికులు/ ఎయిర్‌ మెన్‌లు) నాలుగేళ్ల కాలపరిమితి (శిక్షణతో కలిపి) వరకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. 

* దీనికి 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు వయోపరిమితి నిర్దేశించారు. ్బ202223 అభ్యర్థులకు ఈ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచారు.) నియామక ప్రక్రియ జాతీయ స్థాయిలో అకడమిక్‌ మార్కుల ఆధారంగా అత్యంత పారదర్శకంగా జరుగుతుంది.

* ఇందులో ఎంపికైన అగ్నివీరులను వారి ప్రతిభ ఆధారంగా నాలుగేళ్ల తర్వాత శాశ్వత ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.  

* ఎంపికైనవారికి ప్రతి నెలా రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ వేతనం లభిస్తుంది. 

* నాలుగేళ్ల తర్వాత వారి ప్రతిభ, సంస్థాగత అవసరాల మేరకు 25% మందిని 15 సంవత్సరాల పాటు భారత త్రివిధదళాల్లోని వివిధ స్థాయుల్లో విధుల్లోకి తీసుకుంటారు. 

* మిగిలిన 75% మందికి ఉద్యోగ భద్రత, పెన్షన్లు ఉండవు. ఉద్యోగ విరమణ సమయంలో ఎలాంటి ట్యాక్సులు లేకుండా రూ.11.78 లక్షలు వీరికి అందిస్తారు.

* వీరిని సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఏపీఎఫ్‌), అసోం రైఫిల్, ఇతర పోలీసు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.

నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ - ఎన్‌సీసీ

దీన్ని భారత సాయుధ దళాల యువజన విభాగంగా పేర్కొంటారు. ఎన్‌సీసీలో పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకూ ఉన్న విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొంటారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో చిన్న వయసు నుంచే క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందుతాయి. దీని ముఖ్యకేంద్రం న్యూదిల్లీలో ఉంది. ఎన్‌సీసీ చిహ్నంలోని మూడు రంగులు (రెడ్, డార్క్‌ బ్లూ, లైట్‌ బ్లూ) ఇండియన్‌ ఆర్మీ, ఇండియన్‌ నేవీ, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ను సూచిస్తాయి.

మాదిరి ప్రశ్నలు

1. భారత ప్రభుత్వం 202223 ఆర్థిక సంవత్సరానికి రక్షణ రంగానికి ఎంత మొత్తం నిధులు కేటాయించింది?

1) రూ.5,25,166 కోట్లు 

2) రూ.4,16,234 కోట్లు

3) రూ.3,24,178 కోట్లు 

4) రూ.1,25,167 కోట్లు

2. భారత సైన్యానికి కావాల్సిన సాంకేతిక శిక్షణ ఇచ్చే ‘మిలటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌’ ఎక్కడ ఉంది?

1) న్యూదిల్లీ      2) డెహ్రాడూన్‌ 

3) పుణె      4) సికింద్రాబాద్‌

3. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి రక్షణశాఖ మంత్రి ఎవరు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ

2) బల్‌దేవ్‌సింగ్‌ చొక్కర్‌ 

3) కె.ఎం.మున్షీ   4) వల్లభ్‌భాయ్‌ పటేల్‌

4. స్వీడన్‌కి చెందిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక ్బళీఖిశిళిఖ్శి ప్రకారం ఆయుధాల ఉత్పత్తిలో వరుసగా మొదటి, రెండు స్థానాల్లో ఉన్న దేశాలు?

1) అమెరికా, జపాన్‌   2) చైనా, రష్యా

3) రష్యా, భారత్‌     4) అమెరికా, చైనా

5. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో  నిర్వహించిన ఈస్ట్రన్‌ బ్రిడ్జ్‌ విన్యాసం ఏ వాయుదళాల మధ్య జరిగింది? (2022, ఫిబ్రవరిలో దీన్ని నిర్వహించారు.)

1) భారత్, బంగ్లాదేశ్‌   2) భారత్, భూటాన్‌ 

3) భారత్, ఒమన్‌    4) భారత్, శ్రీలంక

6. ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇండియా, ఇటలీ, యునైటెడ్‌ కింగ్‌డమ్, అమెరికా సంయుక్త రాష్ట్రాల ఎయిర్‌ఫోర్స్‌ల మధ్య బ్లూ ఫ్లాగ్‌ విన్యాసాన్ని ఏ దేశంలో నిర్వహించారు?

1) ఇండియా      2) యూకే 

3) ఇజ్రాయెల్‌      4) ఫ్రాన్స్‌

7. షాంఘై కో ఆపరేషన్‌ (ఎస్‌సీఓ) దేశాల ఆర్మీల మధ్య నిర్వహించిన పీస్‌ మిషన్‌ - 2021 విన్యాసాన్ని ఏ దేశంలో నిర్వహించారు?

1) ఇండియా      2) చైనా 

3) రష్యా     4) నేపాల్‌

8. భారత్, మాల్దీవులు, శ్రీలంక కోస్ట్‌గార్డుల మధ్య 2021, నవంబరులో మాల్దీవ్స్‌లో నిర్వహించిన విన్యాసం పేరు ఏమిటి? 

1) మైత్రి     2) దోస్తీ 

3) మిత్ర శక్తి     4) ఇంద్ర

9. భారత సైన్యం కోసం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొబైల్‌ అప్లికేషన్‌ ఏది? (ఇది 2021, డిసెంబరులో ప్రారంభమైంది.) 

1) రక్షా పెన్షన్‌ షికాయత్‌ నివారణ్‌ పోర్టల్‌       

2) ఆర్మీ సెక్యూర్‌ ఇండీజీనియస్‌ మెసేజింగ్‌ అప్లికేషన్‌ (ఏఎస్‌ఐజీఎంఏ) 

3) నేషనల్‌ టెస్ట్‌ అభ్యాస్‌ యాప్‌               

4) లిటిల్‌ గురు

10. భారత ప్రభుత్వం ఏ తేదీని పరాక్రమ దివస్‌గా జరపాలని నిర్ణయించింది? (నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జన్మదినం సందర్భంగా 2021 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు.)

1) జనవరి 23     2) ఫిబ్రవరి 23

3) మార్చి 23     4) ఏప్రిల్‌ 23

11. భారతీయ రక్షణరంగం గురించి భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో ఏ  జాబితాలో పొందుపరిచారు?

1) కేంద్ర జాబితా     2) రాష్ట్ర జాబితా 

3) ఉమ్మడి జాబితా   4) ప్రత్యేక జాబితా

12. అమెరికా ఇటీవల ఏ లేజర్‌ గైడ్‌ క్షిపణితో అల్‌ఖైదా అధినేత అల్‌ జవహరీని ఆఫ్గనిస్థాన్‌లో హతమార్చింది?

1) హెల్ప్‌ఫైర్‌ ఆర్‌9ఎక్స్‌ 

2) షహీన్‌ 1తి మిస్సైల్‌ 

3) హ్వాసాంగ్‌-8      4) నూర్‌ మిస్సైల్‌

13. 2021, నవంబరులో ప్రయోగించిన షహీన్‌ 1తి మిస్సైల్‌ ఏ దేశానికి చెందింది? 

1) యూఏఈ      2) బంగ్లాదేశ్‌ 

3) పాకిస్థాన్‌      4) ఇజ్రాయెల్‌

సమాధానాలు

1 - 1  2 - 4  3 - 2  4 - 4  5 - 3  6 - 3  7 - 3  8 - 2  9 - 2  10 - 1  11 - 1  12 - 1  13 - 3

విధి-విధానాలు 

* ప్రభుత్వం 2021 వార్షిక బడ్జెట్‌లో ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా రక్షణ రంగానికి రూ.4.78 లక్షల కోట్లు (67 బి.డా.) కేటాయించగా, 2022 బడ్జెట్‌లో 10 శాతం పెంచి రూ.5.25 లక్షల కోట్లు (70.06 బి.డా.) కేటాయించింది. 2022 బడ్జెట్లో 9.8% నిధులు రక్షణ రంగానికే దక్కాయి.

* రక్షణరంగానికి కేటాయించిన నిధులను దాని ఆధునికీకరణకు, భారత త్రివిధ దళాలకు మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వినియోగిస్తారు.

* భారతదేశ మిలటరీ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది. దీనిలో 1.44 మిలియన్‌ ఉద్యోగులు, 51 లక్షల వాలంటరీ సిబ్బంది పనిచేస్తున్నారు.

* ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల దిగుమతుల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో సౌదీ అరేబియా ఉంది. 

* భారతదేశ రక్షణ రంగ పరిశ్రమల్లో 80% ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. వీటిలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. అవి: భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ), దాని ఆధ్వర్యంలోని 50 ప్రయోగశాలలు; 4 రక్షణరంగ నౌకాశ్రయాలు (డిఫెన్స్‌ షిప్‌యార్డ్స్‌); 5 ప్రభుత్వ రంగ సంస్థలు; 41 ఆర్డినెన్స్‌ పరిశ్రమలు.ఇవి దేశ రక్షణకు కావాల్సిన ఆయుధాలు, వివిధ రకాల పరికరాల తయారీ మొదలైనవాటిని నిర్వహిస్తున్నాయి.

* ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా నూతన సాంకేతికతకు కావాల్సిన దిగుమతులను తగ్గించి, దేశీయంగానే వాటిని అభివృద్ధి చేసి, స్వయం సమృద్ధిని సాధించాలని రక్షణరంగ పరిశ్రమలు తీర్మానించాయి.

భారత రక్షణరంగ విధానం 

* రక్షణరంగం కోసం నిర్వహించే కొనుగోళ్లను పూర్తి పారదర్శకంగా జరిపేందుకు ప్రభుత్వం 2002లో Defence Procurement Procedure ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన విధి విధానాలను సమీక్షించేందుకు ప్రభుత్వం 2013లో ధీరేంద్ర సింగ్‌ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 2015లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీని ఆధారంగా ప్రభుత్వం దీశిశి 2016ను తీసుకొచ్చింది.

* 2020లో ప్రభుత్వం దీశిశి 2016 లోని నియమ నిబంధనలకు మరిన్ని సవరణలు చేసి, దీని పేరును  Defence Aquisition Procedure (DAP) 2020 గా మార్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 2020, సెప్టెంబరు 28న దీతిశి 2020 ను విడుదల చేశారు. ఇందులో రక్షణరంగ విధివిధానాలను పొందుపరిచారు. 

వాటిలోని ముఖ్యాంశాలు:

* భారత త్రివిధ దళాలు, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ మొదలైన వ్యవస్థలకు కావాల్సిన పరికరాలు, మౌలిక సదుపాయాలను ప్రపంచ పోకడలకు తగినట్లుగా ఆధునికీకరించడం.

* భారతదేశాన్ని గ్లోబల్‌ మ్యానుఫాక్చరింగ్‌ హబ్‌గా తయారు చేయడం. 

* ఆత్మ నిర్భర్‌ భారత్, మేక్‌ ఇన్‌ ఇండియా ద్వారా రక్షణరంగ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించి, స్వదేశీ ఉత్పత్తులను పెంచి, దిగుమతులను తగ్గించటం.

* ఆత్మ నిర్భర్‌ అభియాన్‌ ప్రోగ్రాం ద్వారా భారత వాయుదళం, భారత రక్షణరంగ పరిశ్రమలను ప్రముఖ రంగాలుగా గుర్తించడం. 

అనువర్తనాలు 

* డీఆర్‌డీఓ రూపొందించిన సాంకేతికత రక్షణరంగంలోనే కాకుండా పౌర సంబంధ అనువర్తనాల్లోనూ ఉపయోగపడుతుంది.

* వ్యవసాయం, మెటలర్జీ, హిమపాత అంచనా (avalanche forecasting), వివిధ రకాలైన ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలకు డీఆర్‌డీఓ టెక్నాలజీని అందిస్తోంది.

* డీఆర్‌డీఓ ఆటోమేటిక్‌ వాటర్‌ క్యానన్‌ను రూపొందించింది. ఇందులో వివిధ రకాలైన ఆటోమేటిక్‌ పల్సేటింగ్‌ జెట్లు ఉంటాయి. నీటిని వేగంగా, ఎక్కువ దూరానికి పంపేందుకు ఈ క్యానన్లు ఉపయోగపడ్డాయి. వ్యవసాయ రంగానికి ఇవి ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నాయి.

* డీఆర్‌డీఓ రూపొందించిన అధునాతన స్టీల్‌ను ప్రస్తుతం బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల రూపకల్పనలో ఉపయోగిస్తున్నారు.

* బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఫీల్డ్‌ ట్రయల్స్‌లో ఉపయోగించే గామా రేడియేషన్‌ ఫెసిలిటీ, టియర్‌ గ్యాస్, మెడికల్‌ స్టెరిలైజేషన్‌ లాంటివాటిని ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆరోగ్య రంగాల్లో విరివిగా వాడుతున్నారు.

* డీఆర్‌డీఓ మొదటగా ప్రారంభించిన హిమపాత అంచనా వ్యవస్థ అతి శీతల ప్రదేశాల్లో నివసించే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది.

* పేస్‌ మేకర్, తక్కువ బరువు ఉన్న పోలియో బూట్లు, టైటానియం ఇంప్లాంట్లు మొదలైనవాటిని డీఆర్‌డీఓ రూపొందించింది. ఇవి సామాన్య పౌరులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 

* సియాచిన్‌ లాంటి అతి శీతల ప్రదేశాలు, సుదూర ప్రాంతాల్లో ఉండే సైనికుల కోసం రూపొందించిన రెడీ టు ఈట్‌ మీల్స్‌ ప్రస్తుతం దేశమంతా లభిస్తున్నాయి. 

* ఇవే కాకుండా బయో డైజెస్టర్‌ టాయిలెట్లు, హెర్బల్‌ మస్కిటో రిపెల్లెంట్‌లు, పేలుడు పదార్థాలను గుర్తించే పరికరాలను డీఆర్‌డీఓ తయారు చేసింది.

* అత్యంత ఎత్తులో, చల్లగా ఉండే సియాచిన్, లద్దాఖ్‌ లాంటి ప్రాంతాల్లో విధులు నిర్వహించే సైనికుల కోసం డీఆర్‌డీఓ ప్రపంచంలోనే మొదటిసారి బయో డైజెస్టర్‌ టాయిలెట్లను రూపొందించింది. వీటిని నిలివీవ్బీ ELOO(eco friendly) గా పిలుస్తారు. ఇవి 6 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వరకు మెరుగైన పనితీరును కనబరుస్తాయి. ప్రస్తుతం వీటిని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఉపయోగిస్తున్నాయి. 

* డీఆర్‌డీఓ రూపొందించిన డై ఇథైల్‌ ఫినైల్‌ ఎసిటమైడ్, మల్టీ ఇన్సెక్ట్‌ రిపెల్లెంట్‌లను అన్ని ప్రదేశాల్లో వాడొచ్చు. ఈ రిపెలెంట్లు దోమల్ని చంపకుండా, వ్యక్తుల నుంచి దూరంగా వెళ్లేలా చేస్తాయి.

ది చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ - సీడీఎస్‌

* భారత రక్షణరంగం మరింత సమర్థవంతంగా పనిచేసి, మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం 2020, జనవరి 1న సీడీఎస్‌ను నియమించింది. సీడీఎస్‌ పదవీకాలం మూడేళ్లు లేదా 65 ఏళ్లు వయసు వచ్చే వరకు ఉంటుంది.

* భారత సాయుధ దళాలకు, మిలటరీ స్టాఫ్‌కు ప్రధాన అధికారిగా సీడీఎస్‌ వ్యవహరిస్తారు. వీరు మిలటరీ అఫైర్స్‌ విభాగానికి ముఖ్య అధికారిగా ఉంటారు. భారత సాయుధ దళాలకు అత్యన్నత స్థాయి ర్యాంక్‌ కలిగిన కమాండింగ్‌ ఆఫీసర్‌గానూ వీరు బాధ్యతలను నిర్వహిస్తారు. భారత ప్రభుత్వానికి, రక్షణరంగ విభాగానికి ముఖ్య సలహాదారుగా పని చేస్తారు. 

* మొదటి సీడీఎస్‌గా జనరల్‌ బిపిన్‌ రావత్‌ పనిచేశారు. ఈయన పదవిలో ఉండగానే 2021, డిసెంబరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ప్రస్తుతం సీడీఎస్‌ పోస్టు ఖాళీగా ఉంది.

* ప్రస్తుతం త్రివిధ దళాల అధిపతుల కమిటీ ఛైర్మన్‌ (Chairman Chiefs of Staff Commmittee)గా జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నర్వాణే ఉన్నారు.

* త్రివిధ దళాల అధిపతులు సీడీఎస్‌ విభాగంలో పనిచేస్తారు.

త్రివిధ దళాల అధిపతులు: 

ఆర్మీ: జనరల్‌ మనోజ్‌ పాండే 

ఎయిర్‌ ఫోర్స్‌: ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి

నేవీ: అడ్మిరల్‌ ఆర్‌.హరి కుమార్‌

యుద్ధ పరికరాలు 

Arjun-MBT (Main Battle Tank)

* ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ ట్యాంక్‌. దీన్ని డీఆర్‌డీఓ 1972లో రూపొందించింది.


* దీని అధునాతన వెర్షన్‌ Arjun MBT MK IA ను ప్రధాని నరేంద్ర మోదీ 2021, ఫిబ్రవరిలో భారత సైన్యానికి అంకితం చేశారు.


* ఈ ట్యాంక్‌ అధిక జ్వలనశక్తిని (fire power), చలనాన్ని కలిగి ఉండి అత్యున్నత రక్షణను కల్పిస్తుంది. 


* ఇందులో 120 మిల్లీమీటర్ల రైఫిల్డ్‌ గన్‌ ఉంటుంది. 


* ఈ ట్యాంక్‌లో FSAPDS (Fin Stabilized Armour Piercing Discarding Sabot) అనే వ్యవస్థ ఉంది. దీని ద్వారా నిర్దేశిత షూటింగ్‌ రేంజ్‌లో ఉన్న లక్ష్యాలను సమర్థవంతంగా నాశనం చేస్తుంది.  

Arjun MK II: ఇందులో అత్యంత తేలికైన ఎలక్ట్రో ఆప్టికల్‌ సెన్సార్లు, అధునాతన లేజర్లు ఉన్నాయి.

S-400: ఇది అత్యాధునిక లాంగ్‌ రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌ వ్యవస్థ (MLRSAM - Modern Long Range Surface to Air Missile). 


* ఈ క్షిపణి వ్యవస్థను రష్యా అభివృద్ధి చేస్తోంది. ఇది 2025 నాటికి అందుబాటులోకి రానుంది.

* S-400 కు మూడు రకాలైన క్షిపణులను నాశనం చేసే సామర్థ్యం ఉంది. 

* దీని పరిధి 400 కి.మీ. ఇది గాలిలో 30 కి.మీ. ఎత్తులో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్స్, బాలిస్టిక్‌ - క్రూయిజ్‌ క్షిపణిలను, డ్రోన్‌లను  సమర్థవంతంగా కూల్చగలదు. 

క్రూయిజ్‌ మిస్సైల్స్‌:

* వీటిని భూమిపై, సముద్రంపై, గాలిలో నుంచి ప్రయోగించొచ్చు. శత్రువులు ప్రయోగించే యుద్ధనౌకలను ఎదుర్కొనేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇవి ముందుగా నిర్దేశించిన లక్ష్యాన్ని లేదా లక్ష్యాన్ని వాటంతటవే నిర్దేశించుకుని అత్యంత సమర్థవంతంగా ఛేదించగలవు. ఇవి జీపీఎస్‌ నావిగేషన్‌ వ్యవస్థను ఉపయోగించుకుని లక్ష్యంవైపు ప్రయాణిస్తాయి.

* వీటిని సబ్‌ సోనిక్, సూపర్‌ సోనిక్, హైపర్‌ సోనిక్‌ ప్రాంతాల్లో అత్యంత వేగంగా ప్రయోగించొచ్చు. ఇవి భూ ఉపరితలం నుంచి ఎక్కువ ఎత్తులో వెళ్తాయి. దీంతో వీటిని గుర్తించడం కష్టం. వీటిలో పేలోడ్, ఎయిర్‌క్రాఫ్ట్, ప్రొపల్షన్‌ సిస్టం ఉంటాయి. ఎక్కువ బరువైన పేలోడ్లను అత్యంత కచ్చితంగా ఛేదించే లక్ష్యంతో వీటిని రూపొందించారు. 

బాలిస్టిక్‌ మిస్సైల్స్‌: 

* వీటిని ఎయిర్‌క్రాఫ్ట్స్‌, సబ్‌మెరైన్స్, యుద్ధ నౌకలు, భూమిపై నుంచి ప్రయోగించొచ్చు.ఇవి భూ వాతావరణం అవతలకు కూడా ప్రయాణిస్తాయి. 

* వీటిని రాకెట్‌ ద్వారా ప్రయాణించే స్వీయ నిర్దేశం కలిగిన ఆయుధ వ్యవస్థ rocket propelled self guided weapon system)గా పిలుస్తారు. 

* ఈ క్షిపణి వ్యవస్థలోని వార్‌హెడ్‌లు ముందే నిర్దేశించిన లక్ష్యాన్ని అత్యంత సమర్థవంతంగా ఛేదిస్తాయి.

Posted Date : 16-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌