• facebook
  • whatsapp
  • telegram

విత్త వ్యవస్థ - మూలధన మార్కెట్‌

స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ భావనలు అంచనా వ్యాపారం/ సట్టా వ్యాపారం (Speculation Business)


షేర్ల ధరలు పెరుగుతాయని లేదా తగ్గుతాయని ముందే ఊహించి, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపడాన్ని స్పెక్యులేషన్‌ అంటారు. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో సాధారణంగా అంచనా వ్యాపారమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. 


* అంచనా వ్యాపారం చేసే సభ్యులను స్పెక్యులేటర్లు అంటారు. ఫార్వార్డ్‌ డెలివరీ కాంట్రాక్టుల్లో అంచనా వ్యాపారం జరుగుతుంది. మన దేశంలో కొన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లలో మాత్రమే అంచనా వ్యాపారానికి అనుమతి ఉంది.


అంచనా వ్యాపారాన్ని/ చేసే వ్యక్తులను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి:


1. బుల్స్‌ లేదా బుల్‌ మార్కెట్‌: 

భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని ఊహించి, ప్రస్తుత ధరల వద్ద సెక్యూరిటీలు కొని, ధరలు పెరిగాక అమ్మేవారిని బుల్స్‌ అంటారు. వీరిని ఆశావాదులుగా పేర్కొంటారు. కొన్ని రోజుల పాటు షేర్‌ ధర స్థిరంగా పెరుగుతూ ఉంటే దాన్ని ‘బుల్‌ మార్కెట్‌’ అంటారు.


2. బేర్స్‌ లేదా బేర్‌ మార్కెట్‌: 


భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని ఊహించి, సెక్యూరిటీలను అమ్మేవారిని బేర్స్‌ అంటారు. వీరిని నిరాశావాదులు అంటారు. కొన్ని రోజుల పాటు షేర్‌ ధర స్థిరంగా పడిపోతూ ఉంటే దాన్ని ‘బేర్‌ మార్కెట్‌’గా పిలుస్తారు.


3. స్టాగ్స్‌: 


వీరు బుల్స్‌ మాదిరే భవిష్యత్తులో సెక్యూరిటీల ధరలు పెరుగుతాయని ఊహిస్తారు. కొత్త కంపెనీ జారీ చేసిన సెక్యూరిటీలకు అధిక మొత్తంలో దరఖాస్తు రుసుం చెల్లిస్తారు. వీరి చర్య వల్ల సెక్యూరిటీలకు కృత్రిమ డిమాండ్‌ ఏర్పడి ధరలు పెరుగుతాయి. అయితే ఈ ధరలు త్వరలోనే తగ్గిపోతాయి.


4. లేమ్‌డక్స్‌: 


వీరు తమ వద్ద సెక్యూరిటీలు లేకపోయినా అమ్మడానికి కాంట్రాక్టు చేసుకుంటారు. దాన్ని నెరవేర్చడానికి తక్కువ ధరల వద్ద సెక్యురిటీలను కొనడానికి అన్వేషిస్తారు.


షేర్‌/ వాటా 


షేర్‌ అంటే వాటా లేదా భాగం అని అర్థం. ఏదైనా కంపెనీ షేర్లను మనం కొంటున్నామంటే ఆ కంపెనీలో భాగం కొంటున్నామని అర్థం. వ్యాపార విస్తరణకు, వస్తూత్పత్తికి, నిర్వహణ సంబంధ కార్యకలాపాల కోసం డబ్బును సమకూర్చుకునేందుకు కంపెనీలు వాటాలు లేదా షేర్లను విక్రయిస్తాయి.


షేర్ల క్రయ విక్రయాలు: ఒక కంపెనీకి మెరుగైన లాభాలు వస్తే, దాని షేర్లను కొనడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. నష్టాలు వస్తే అప్పటికే కొన్నవారు వాటిని విక్రయించాలనుకుంటారు. ఈ క్రయ, విక్రయాలు జరిపే వేదికే స్టాక్‌ మార్కెట్‌.


షేర్‌ విభజన: ఒక కంపెనీ షేర్‌ ముఖ విలువను సమానంగా విడదీయడాన్ని షేర్‌ విభజనగా పేర్కొంటారు. ఇలా చేస్తే షేర్ల సంఖ్య పెరుగుతుంది. కానీ మార్కెట్‌ విలువలో ఎలాంటి మార్పు ఉండదు.


రక్షణాత్మక షేర్‌ (డిఫెన్సివ్‌ స్టాక్‌): స్టాక్‌ మార్కెట్‌లు తీవ్ర ఒడిదొడుకులకు లోనైనప్పుడు లేదా ఆర్థిక మందగమనంలో స్థిర పనితీరును కనబరుస్తూ, వాటాదార్లకు డివిడెండ్‌ చెల్లించే కంపెనీల షేర్లను రక్షణాత్మక షేర్లుగా వ్యవహరిస్తారు. ఎఫ్‌ఎంజీసీ షేర్లను డిఫెన్సివ్‌ స్టాక్‌గా మదుపర్లు భావిస్తారు.


ఆఫర్‌: ఒక వ్యక్తి తన వద్ద ఉన్న షేర్లను ఎంత తక్కువ ధరకు విక్రయించాలని అనుకుంటున్నాడో దాన్ని ఆపÆర్‌ ధర అంటారు.


బిడ్‌: ఒక షేర్‌ను ఎంత గరిష్ఠ ధరకు కొనుగోలు చేయాలనుకుంటున్నారో దాన్ని బిడ్‌ ధరగా పరిగణిస్తారు.


ముగింపు ధర: ఒక రోజులో ట్రేడింగ్‌ అయిపోయే సమయానికి ఉన్న షేర్‌ విలువను ముగింపు ధరగా పిలుస్తారు.


ఈక్విటీ: ఒక కంపెనీలో మదుపర్లు షేర్ల రూపంలో వాటాను కలిగి ఉండటాన్ని ఈక్విటీ అంటారు.


మార్కెట్‌ విలువ: స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే కంపెనీ షేర్ల మొత్తం విలువను దాని మార్కెట్‌ విలువగా చెబుతారు. ప్రస్తుత షేర్‌ ధరను షేర్ల సంఖ్యతో గుణించడం ద్వారా మార్కెట్‌ విలువను తెలుసుకోవచ్చు.


పోర్ట్‌ఫోలియో: మదుపర్లకు వివిధ కంపెనీల్లో షేర్లు ఉన్నప్పుడు వాటన్నింటినీ కలిపి పోర్ట్‌ఫోలియోగా పేర్కొంటారు.


తొలి పబ్లిక్‌ ఆఫర్‌: ఏదైనా కంపెనీ తొలిసారి మార్కెట్‌లోకి వచ్చి షేర్లను జారీచేయడం లేదా విక్రయించడాన్ని తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ - ఐపీఓ) అంటారు.


డివిడెండ్‌ 


నిర్దిష్ట కాల పరిమితిలో కంపెనీకి వచ్చిన లాభం నుంచి మదుపర్లకు కొంతమొత్తాన్ని ప్రతిఫలంగా చెల్లించడాన్ని డివిడెండ్‌గా చెబుతారు.


ట్రేడింగ్‌ సెషన్‌ 


రోజూ ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ సెషన్‌ జరుగుతుంది. ఈ సమయంలో షేర్ల కొనుగోలు, విక్రయాలను నిర్వహిస్తారు. ప్రీ-ఓపెన్‌ సెషన్‌లో మనం పెట్టుకున్న ఆర్డర్‌ విలువకు షేర్‌ ధర చేరితే ఆర్డర్‌ ఎగ్జిక్యూట్‌ అవుతుంది.


ప్రీ-ఓపెన్‌ సెషన్‌ 


స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ ప్రారంభమవడానికి ముందు జరిగే సెషన్‌ను ప్రీ-ఓపెన్‌ సెషన్‌ అంటారు. ఉదయం 9 నుంచి 9.08 గంటల వరకు ఇది జరుగతుంది. ఈ సమయంలో ఏదైనా షేర్ల కొనుగోలు లేదా విక్రయానికి ఆర్డరు పెట్టుకోవచ్చు. ఆర్డర్లలో మార్పు-చేర్పులు, రద్దుకు కూడా వీలుంటుంది.


బ్లూచిప్‌ షేర్‌


ఆర్థిక మూలాలు పటిష్ఠంగా ఉండి, గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా డివిడెండ్‌ చెల్లించే దిగ్గజ కంపెనీల షేర్లను బ్లూచిప్‌ షేర్స్‌ అంటారు. లేదా ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీలకు చెందిన షేర్లను బ్లూచిప్‌ షేర్స్‌గా పేర్కొంటారు.


సాధారణంగా బ్లూచిప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. 


‘బ్లూచిప్‌’ అనే పదాన్ని ‘పోకర్‌’ ఆట నుంచి తీసుకున్నారు. ఆ ఆటలో తెలుపు, ఎరుపు, నీలం రంగులో చిప్స్‌ ఉంటాయి. వాటిలో నీలం చిప్‌కి ఎక్కువ విలువ ఉంటుంది.

బ్రోకర్‌/ బ్రోకరేజి సంస్థ

సంబంధిత షేర్‌ కొనుగోలు/ అమ్మకం విషయంలో కొంత రుసుము తీసుకుని సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థలు. గుర్తింపు ఉన్న బ్రోకర్‌/ బ్రోకరేజి సంస్థ మాత్రమే షేర్లపై సిఫార్సు చేయాలి.


ఏజెంట్‌: క్లయింట్ల తరఫున షేర్ల కోనుగోలు లేదా అమ్మకాలను నిర్వహించే బ్రోకరేజి సంస్థలను ఏజెంట్లు అంటారు. లావాదేవీలు జరిగే ఏ సమయంలోనూ ఏజెంట్లు షేర్లు కలిగి ఉండరు.


బాండ్లు: కంపెనీలు లేదా ప్రభుత్వాలు కొనుగోలుదార్లకు జారీ చేసే హామీ పత్రాలు. వీటిని కొంటే నిర్దిష్ట సమయం వరకు కొంత మొత్తాన్ని ఆ బాండ్లలో ఉంచినట్లు లెక్క. మెచ్యూరిటీ సమయానికి ఆ బాండ్లకు కూపన్‌ రేటు (వడ్డీరేటు) కూడా ఇస్తారు.


బుక్‌: నిర్దిష్ట షేర్లకు చెందిన కొనుగోలు, అమ్మక ఆర్డర్ల పెండింగ్‌ జాబితాను నిర్వహించే ఎలక్ట్రానిక్‌ రికార్డు. ఇందులో ఏ షేర్ల కొనుగోలుకు బిడ్‌ వచ్చాయి, ఏ షేర్ల క్రయానికి ఆఫర్‌లు వచ్చాయన్న వివరాలు ఉంటాయి.


కన్వర్టబుల్‌ సెక్యూరిటీలు:


ఏదైనా సంస్థ లేదా ప్రభుత్వం జారీ చేసిన సెక్యూరిటీ (బాండ్లు, డిబెంచర్లు, ప్రిఫర్డ్‌ స్టాక్స్‌)లను అదే సంస్థకు లేదా ప్రభుత్వానికి చెందిన మరో సెక్యూరిటీగా మారిస్తే, వాటిని కన్వర్టబుల్‌ సెక్యూరిటీస్‌ అంటారు.


సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)

దీన్ని 1988, ఏప్రిల్‌ 12న స్థాపించారు. 1992, జనవరి 30న చట్టబద్ధ సంస్థగా మారింది. దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది.


లక్ష్యాలు


స్టాక్‌ మార్కెట్, ఇతర సెక్యూరిటీల్లో వ్యాపార వ్యవహారాలను న్యాయబద్ధరీతిలో క్రమబద్ధీకరించడం. 


  స్టాక్‌ మార్కెట్‌ బ్రోకర్లు, ఇతర మధ్యవర్తుల పనితీరును క్రమబద్ధం చేయడం.


  పెట్టుబడిదారుల మూలధనానికి, వారి హక్కులకు భద్రత కల్పించడం.


విధులు


  స్టాక్‌ ఎక్స్ఛేంజీల కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించడం, నియంత్రించడం.


 మోసపూరిత, అనుచిత వ్యవహారాలను నిషేధించడం.


  సెక్యూరిటీల్లో లోపాయికారీ వ్యవహారాలను తొలగించడం. అంతర్గత సెక్యూరిటీల వర్తకాన్ని నిషేధించడం.


  స్టాక్‌ ఎక్స్ఛేంజీల తనిఖీ, ఆడిట్, పర్యవేక్షణ విధులను నిర్వహించడం.


 సెక్యూరిటీల ఒప్పందాల (నియంత్రణ చట్టం) 1956 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నుంచి బదిలీ అయిన విధులను చేపట్టడం.


  పరిశోధనలు నిర్వహించడం.


  స్టాక్‌ మార్కెట్‌లో సెక్యూరిటీ బ్రోకర్లు, ఉప-బ్రోకర్లు, వాటా బదిలీ ఏజెంట్లు, చందా పూచీదారులు, ట్రస్టీల వ్యవహారాలను నియంత్రించడం.


  మ్యూచువల్‌ ఫండ్స్‌ కార్యకలాపాలను సక్రమంగా, సమర్థవంతగా నిర్వహించడం.


  బ్రోకర్లు, ఏజెంట్లు, ఇతరులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం.


అధికారాలు


* స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల నుంచి నిర్ణీత కాలవ్యవధికి నివేదికలు తెప్పించడం.


* స్టాక్‌ ఎక్స్ఛేజ్‌లు నిర్వహించాల్సిన రిజిస్టర్లు, పుస్తకాలను నిర్ధారించడం.

Posted Date : 03-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌