• facebook
  • whatsapp
  • telegram

భారత ద్రవ్య వ్యవస్థ - కరెన్సీ

ద్రవ్యం - రకాలు

స్వభావం ఆధారంగా ద్రవ్యాన్ని కింది విధాలుగా వర్గీకరించారు. అవి:

1. పదార్థాన్ని బట్టి ద్రవ్యం రకాల

2. చట్టబద్ధతను బట్టి ద్రవ్యం రకాలు

3. ద్రవ్యత్వాన్ని బట్టి ద్రవ్యం రకాలు

 4. ఇతర రకాలు

ద్రవ్యత్వాన్ని బట్టి ద్రవ్యం రకాలు ద్రవ్యం, ద్రవ్యత్వం రెండూ వేర్వేరు. ద్రవ్యత్వం అంటే నగదుగా లేదా అతి తక్కువ కాలంలో నగదుగా మార్చుకోవడానికి వీలున్న లక్షణాన్ని కలిగి ఉండటం.


ద్రవ్యత్వం ఆధారంగా ద్రవ్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించారు. అవి: 

1. సామాన్య ద్రవ్యం (Ordinary money)

2.  సమీప ద్రవ్యం (Near money)

సామాన్య ద్రవ్యం: ప్రజల వద్ద చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలు, బ్యాంకులోని డిమాండ్‌ డిపాజిట్లను సామాన్య ద్రవ్యంగా పేర్కొంటారు. వీటిలో కరెన్సీ నోట్లు, నాణేలు నగదు రూపంలో ఉంటాయి. డిమాండ్‌ డిపాజిట్లను అతి తక్కువ కాలంలో నగదుగా మార్చుకోవచ్చు.

సమీప ద్రవ్యం: ట్రెజరీ బిల్లులు, బాండ్లు, డిబెంచర్లు, కాలపరిమితి డిపాజిట్లు, ప్రామిసరీ నోట్లు మొదలైనవాటిని సమీప ద్రవ్యంగా పేర్కొంటారు.


ఇతర రకాలు

రిజర్వ్‌ ద్రవ్యం లేదా అధిక శక్తిమంతమైన ద్రవ్యం (High powerd money)

ఆర్‌బీఐ జారీ చేసిన డబ్బును ప్రజలు చలామణి చేస్తారు. వారు తమ వద్ద అధికంగా ఉన్న మొత్తాన్ని ఇతర బ్యాంకుల్లో నిల్వ చేసుకుంటారు. దీన్నే రిజర్వ్‌ ద్రవ్యం లేదా మూలాధార ద్రవ్యం అని కూడా అంటారు. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి.

RM=C+OD+CR

ఇందులో C= కరెన్సీ; OD = రిజర్వ్‌ బ్యాంకు వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు; CR= వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న నగదు నిల్వలు.

* ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా అనేది రిజర్వ్‌ ద్రవ్య పరిమాణం, ద్రవ్య గుణకంపై ఆధారపడి ఉంటుంది.

ద్రవ్య గుణకాన్ని కింది విధంగా నిర్వచిస్తారు.

ద్రవ్య సప్లయ్‌ లేదా నిల్వ ద్రవ్యం (రిజర్వ్‌ ద్రవ్యం)

M=m,RM

m=M/RM

ఇందులో M = ద్రవ్య సప్లయ్‌ 

RM = రిజర్వ్‌ లేదా నిల్వ ద్రవ్యం సప్లయ్‌

m = ద్రవ్య గుణకం

అకౌంట్‌ మనీ: దేశంలోని అకౌంట్స్‌ను నిర్వచించడానికి ఉపయోగించే ద్రవ్యాన్ని అకౌంట్‌ ద్రవ్యం అంటారు. 

ఉదా: భారత్‌లో రూపాయి, అమెరికాలో డాలర్, జపాన్‌లో యెన్‌.

వ్యవహారిక ద్రవ్యం: వ్యాపార వ్యవహారాలను నిర్వహించడానికి ఉపయోగించే సాధనాన్ని వ్యవహారిక ద్రవ్యం అంటారు.

వాస్తవ ద్రవ్యం: ఒక దేశంలో ఆచరణలో ఉన్న ద్రవ్యాన్ని వాస్తవ ద్రవ్యం అంటారు.

ఐచ్ఛిక ద్రవ్యం: ప్రజలు దీన్ని అంగీకరిస్తారు. కానీ వీటికి చట్టబద్ధ అనుమతి ఉండదు. ఉదా: చెక్కులు

ప్రాతినిధ్య ద్రవ్యం (Representative money) : చలామణిలో ఉండి, వినిమయ మాధ్యమంగా పనిచేసే ద్రవ్యం.

ఫ్లోటింగ్‌ మార్పిడి ధర

మార్కెట్‌ శక్తుల డిమాండ్, సప్లయ్‌ ఆధారంగా నిర్ణయించే మారకం ధరను ఫ్లోటింగ్‌ మార్పిడి ధర అంటారు. దీన్నే హెచ్చుతగ్గులు లేదా అనువైన మారకపు రేటు అని కూడా పిలుస్తారు.

పదార్థాన్ని బట్టి ద్రవ్యం రకాలు

ద్రవ్యంగా ఉపయోగించే పదార్థం ఆధారంగా ద్రవ్యం రెండు రకాలుగా ఉంటుంది. అవి: 1. లోహ ద్రవ్యం    2. కాగితం ద్రవ్యం

లోహ ద్రవ్యం: 

ప్రత్యేక లోహాన్ని ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. దీన్నే వస్తు ద్రవ్యం Commodity money అని కూడా అంటారు. లోహ ద్రవ్యంలో బంగారం, వెండి, రాగి, నికెల్‌ మొదలైన నాణేలు ఉంటాయి. పూర్వం అమెరికాలో 23.2 గ్రెయిన్‌ల బరువున్న బంగారాన్ని ఒక డాలర్‌గా వాడేవారు.

* లోహ ద్రవ్యంలో 3 రకాలు ఉన్నాయి.

ఎ) ప్రామాణిక ద్రవ్యం standard money : దీన్నే పూర్తి ప్రమాణం కలిగిన నాణేలు అంటారు. వీటిని బంగారం లేదా వెండితో తయారు చేస్తారు.

* ప్రామాణిక ద్రవ్యాన్ని ముఖ ద్రవ్యం లేదా పూర్తి ఆకారం ఉన్న ద్రవ్యంగా కూడా పిలుస్తారు.

* ప్రామాణిక నాణేన్ని ఒకే లోహంతో తయారుచేస్తే ఈ ద్రవ్యవ్యవస్థను ఏకధాతు విధానం అంటారు.

* ప్రామాణిక నాణేలను బంగారం, వెండి కలయికతో చేస్తే ద్విధాతు విధానం అంటారు. 

* ప్రామాణిక ద్రవ్యం ముఖ విలువ, అంతర్గత విలువ (లోహ విలువ) ఒకేలా ఉటుంది. ప్రస్తుతం ఇది చలామణిలో లేదు. 

ఉదా: 1835-93 మధ్య మన దేశంలో 10 గ్రా. బరువున్న వెండి రూపాయి నాణెం ఉండేది.


బి) చిహ్నద్రవ్యం/ లాంఛన ద్రవ్యం ( Token money) : చిహ్న ద్రవ్యం ముఖ విలువ కంటే దాని అంతర్గత విలువ (లోహ విలువ) తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న నాణేలు ఈ రకానికి చెందుతాయి.

* చిహ్న ద్రవ్యాన్ని కృతిక నాణేలు, తక్కువ ప్రమాణం ఉన్న నాణేలు అని కూడా పిలుస్తారు.

*  వీటిని సాధారణంగా రాగి, నికెల్‌ లాంటి నాసిరకం, తేలిక లోహాలతో తయారు చేస్తారు. 

ఉదా: ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న 5 రూపాయల నాణెం.


సి) అనుబంధ ద్రవ్యం( Subsidiary money) : తేలిక లోహాలతో తయారుచేసిన తక్కువ విలువ ఉన్న నాణేలను అనుబంధ నాణేలు అంటారు. ఉదా: పావలా, పదిపైసల నాణేలు.

కాగితపు ద్రవ్యం: 

మన దేశంలో కాగితం ద్రవ్యాన్ని 3 రకాలుగా చెప్పొచ్చు. అవి: 

ఎ) పరివర్తనీయ కాగిత ద్రవ్యం( Convertible paper currency) : బంగారం, వెండి లాంటి లోహాలతో మార్పిడి చేసుకోవడానికి వీలుండే కాగితపు ద్రవ్యాన్ని పరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటారు.

బి) అపరివర్తనీయ కాగితం ద్రవ్యం( Non-Convertible paper currency)  : బంగారం, వెండి లాంటి లోహాలతో మార్పిడి చేసుకోవడానికి వీలుకాని కాగితపు ద్రవ్యాన్ని అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటారు.

సి) ఆజ్ఞాపూర్వక లేదా శాసన కాగితం ద్రవ్యం: కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శాసనం ద్వారా ద్రవ్యంగా చలామణిలో ఉంచే ద్రవ్యం. ఇది కొద్ది కాలం మాత్రమే ఉపయోగంలో ఉంటుంది.


చట్టబద్ధతను బట్టి ద్రవ్యం రకాలు

చెల్లింపు మాధ్యమం ఆధారంగా చట్టప్రకారం సమ్మతించే బ్యాంకు నోట్లు, నాణేలను చట్టబద్ధమైన ద్రవ్యం(legal tender money) అంటారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అవి:

ఎ) పరిమిత చట్టబద్ధ ద్రవ్యం ( limmited legal tender money)

బి) అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం (unlimited legal money)


పరిమిత చట్టబద్ధ ద్రవ్యం: 

ఒక పరిమితికి మించి అధిక మొత్తంలో ఒకేసారి చెల్లిస్తే చట్టప్రకారం నిరాకరించడానికి అవకాశం ఉన్న ద్రవ్యాన్ని పరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటారు. 

* భారతదేశంలో 25 పైసలు అంతకంటే తక్కువ విలువున్న నాణేలను ఒక పరిమితికి మించి అధిక మొత్తంలో చెల్లిస్తే చట్టప్రకారం నిరాకరించవచ్చు.

అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం: 

ఒకేసారి ఎంత మొత్తంలో చెల్లించినా చట్టప్రకారం అంగీకరించి తీరాల్సిన కరెన్సీ నోట్లు, నాణేలను అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటారు.

* భారతదేశంలో 50 పైసల నాణేలు, ఒక రూపాయి నోటు, కేంద్రబ్యాంకు జారీ చేసే అన్ని రకాల కరెన్సీ నోట్లు ఈ ద్రవ్యం పరిధిలోకి వస్తాయి.


గ్రేషమ్‌ సూత్రం 

ఇంగ్లండ్‌ రాణి ఎలిజబెత్‌ - I ఆర్థిక సలహాదారుడు సర్‌ థామస్‌ గ్రేషమ్‌ ద్రవ్య చలామణి గురించి ఒక సూత్రాన్ని పేర్కొన్నాడు. దీన్ని గ్రేషమ్‌ సూత్రం అంటారు.

*  ఈ సూత్రం ప్రకారం, మంచి ద్రవ్యం (మేలైన నాణేలు), చెడు ద్రవ్యం (నాసిరకమైన నాణేలు) చట్టబద్ధంగా చలామణిలో ఉంటే మేలైన ద్రవ్యాన్ని నాసిరకమైన ద్రవ్యం చలామణి నుంచి తరిమేస్తుంది.

* కొత్త నాణేలు, పాత నాణేలకు ఒకే ద్రవ్య విలువ ఉంటే ప్రజలు కొత్తగా ఉన్న నాణేలను తమ వద్ద దాచుకుని; అరిగిపోయి, బరువు తగ్గిన పాత నాణేలను చలామణి చేస్తారు. 

* ఈ సూత్రం ఏకలోహ ప్రమాణం, ద్విలోహ ప్రమాణం, కాగితం కరెన్సీ అమల్లో ఉన్నప్పుడు కూడా పనిచేస్తుంది.

Posted Date : 21-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌