• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యోల్బణం - ప్రభావాలు

ద్రవ్యోల్బణ ప్రభావాలను రెండు రకాలుగా విభజించారు.

1) పంపిణీపై ప్రభావం     2) ఉత్పత్తిపై ప్రభావం

పంపిణీపై ప్రభావం


ఆదాయ పంపిణీపరంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ప్రభావాలు కింది విధంగా ఉంటాయి.


రుణగ్రహీత, రుణదాతలు


ద్రవ్యోల్బణ కాలంలో రుణగ్రహీతలు (అప్పు తీసుకున్న వ్యక్తి) లాభం పొందితే, రుణదాతలు (అప్పు ఇచ్చిన వ్యక్తి) నష్టపోతారు.


* ద్రవ్యోల్బణ సమయంలో ధరలు పెరగడం వల్ల ప్రజల ద్రవ్య కొనుగోలు శక్తి తగ్గుతుంది.


* రుణదాతలు తాము అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి పొందినప్పటికీ సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల ద్రవ్యం విలువ పడిపోతుంది.


* అప్పు చేసిన మొత్తాన్నే రుణగ్రహీతలు తిరిగి చెల్లించినప్పటికీ ధరల్లో పెరుగుదల వల్ల సేవల రూపంలో వీరు లబ్ధి పొందుతారు. ఇలా రుణగ్రహీతలు చేసిన అప్పు తిరిగి చెల్లింపుల్లో రుణదాతలకు తక్కువ ద్రవ్య కొనుగోలు శక్తికి కట్టబెడతారు.


స్థిర ఆదాయ వర్గాలు


స్థిర ఆదాయ వర్గాలైన పెన్షనర్లు, అద్దెలు, వడ్డీలు పొందేవారు ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోతారు.


* స్థిర వడ్డీరేట్లు ఉన్న డిపాజిట్‌దారులు, సెక్యూరిటీల డిబెంచర్లు ఉన్న వారూ ఈ కాలంలో నష్టపోతారు.


వేతనాలు, జీతాలు పొందేవారు


* స్థిరమైన రూపంలో జీతాలు, వేతనాలు పొందేవారు ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోతారు.


* ఎందుకంటే వీరు ఆదాయాలను మారుతున్న ధరల సూచీ, జీవన వ్యయ సూచీ అనుగుణంగా సర్దుబాటు చేయరు.


* బలమైన కార్మిక సంఘాలు ఉంటే వారి బేరమాడే శక్తిని అనుసరించి వేతనాలు జీవన వ్యయ సూచీకి అనుగుణంగా మారతాయి.


* అయితే పెరిగిన ధరలకు, వేతనాల పెరుగుదల మధ్య తీవ్ర జాప్యం ఉంటుంది. కాగా ఉద్యోగం కాంట్రాక్టు రూపంలో ఉంటే వారి వేతనం స్థిర రూపంలో ఉంటుంది. అందువల్ల ద్రవ్యోల్బణ కాలంలో వీరు నష్టపోతారు.


పెట్టుబడిదారులు


వివిధ కంపెనీల స్టాక్స్, వాటాలు పొందినవారు ద్రవ్యోల్బణ కాలంలో లాభం పొందుతారు.


* ద్రవ్యోల్బణ కాలంలో వ్యాపారాల విస్తరణ పెరగడంతో కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు వస్తాయి. లాభాలు పెరిగితే ఈక్విటీల ప్రకారం వాటాదారులకు వాటిని పంపిణీ చేస్తారు.


* మధ్యతరగతి పెట్టుబడిదారులు, స్థిర ఆదాయాన్ని సమకూర్చే డిబెంచర్లు, సెక్యూరిటీలు, బాండ్‌లు లాంటివి కలిగి ఉండి ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోతారు.


* ధనవంతులైన పెట్టుబడిదారులు లాభం పొందితే, మధ్యతరగతి పెట్టుబడిదారులు నష్టపోతారు.


వ్యాపారస్తులు


వ్యాపార వర్గాలైన ఉత్పత్తిదారులు, వర్తకులు, స్థిరాస్తి వ్యాపారులు ద్రవ్యోల్బణ కాలంలో అధికంగా సంపాదిస్తారు. వీరికి ద్రవ్యోల్బణం ఒక వరంగా ఉపకరిస్తుంది. ధరల్లో పెరుగుదల వల్ల సంస్థలు గాలివాటు లాభాలను పొందుతాయి.


* ఉత్పత్తి వ్యయాల కంటే అమ్మకాల వల్ల రాబడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ధరల స్థాయిలో వచ్చిన పెరుగుదలకు అనుపాతంగా తక్షణమే ముడిసరకులు, వేతనాలు లాంటి వాటి ధరలు పెరగవు. భూముల ధరలు పెరగడం వల్ల స్థిరాస్తి వ్యాపారులు అధిక లాభం పొందుతారు.


ద్రవ్యోల్బణం- ఉత్పత్తిపై ప్రభావం


ద్రవ్యోల్బణం ఉత్పాదక కార్యకలాపాలకు ఎప్పుడూ హానికరంగా ఉంటుందని చెప్పలేం. 


పాక్షిక లేదా తేలికపాటి ద్రవ్యోల్బణం నిజానికి ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది. ప్రత్యేకించి వనరులు అసంపూర్ణంగా ఉపయోగించినప్పుడు ద్రవ్యోల్బణం దోహదకారిగా పనిచేస్తుంది.  
 

* ఈ స్థితిలో పెట్టుబడుల ద్వారా ఉత్పత్తి, ఆదాయం, ఉద్యోగిత పెరుగుతాయి. ధరల్లో వచ్చిన పెరుగుదలకు అనుపాతంగా ఉత్పత్తి వ్యయాలు పెరగవు. కాబట్టి సంస్థలు గాలివాటు లాభాలను పొందుతాయి. అయితే సంపూర్ణ ఉద్యోగిత చేరేవరకు మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది. 


* సంపూర్ణ ఉద్యోగిత అనంతరం ధరల స్థాయిలో పెరుగుదల తీవ్రమైతే దూకుతున్న ద్రవ్యోల్బణం లేదా అతితీవ్రమైన ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. 


* ఇలాంటి ద్రవ్యోల్బణం వల్ల ఉత్పత్తిపై వచ్చే ప్రభావాలు కింది విధంగా ఉంటాయి. 


వినియోగ వస్తువుల కొరత


ద్రవ్యోల్బణ కాలంలో పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని ఉద్యమదారులు వనరులను వినియోగ వస్తురంగం నుంచి అధిక ఆదాయాన్ని ఇచ్చే విలాస వస్తువుల ఉత్పత్తికి బదిలీ చేస్తారు. ఫలితంగా వినియోగ వస్తువుల కొరత ఏర్పడుతుంది.


ఉత్పత్తిలో తగ్గుదల


పెరుగుతున్న ధరల అంచనాలతో వస్తూత్పత్తికి ఉపకరించే ఉత్పత్తి సాధనాల ధరలు కూడా పెరగడంతో ద్రవ్యోల్బణ కాలంలో ఉత్పత్తి రంగం, ఉత్పత్తి పరిమాణం దెబ్బతింటాయి.


ప్రమాణాలు పడిపోవడం


ధరల్లో వచ్చే నిరంతర పెరుగుదల అమ్మకందారుల ఇష్టానుసార చర్యలకు తోడ్పడుతుంది. ఇలాంటి స్థితిలో అధిక లాభం కోసం వారు తక్కువ ప్రమాణం కలిగిన వస్తువులను అమ్మడానికి ప్రయత్నిస్తారు. అంతేగాక ద్రవ్యోల్బణ కాలంలో వీరు కల్తీ వ్యాపారం చేపడతారు.


అక్రమ నిల్వ, నల్లబజారు (black marketing)


అధిక లాభం కోసం కొందరు వ్యాపారస్తులు సరకులను అక్రమంగా నిల్వ చేసి, కృత్రిమ కొరతను సృష్టిస్తారు. అంతేగాక వీరు నల్లబజారులో వస్తువులను అమ్మడంతో ద్రవ్యోల్బణాన్ని విస్తృతం చేయడంలో తోడ్పడతారు. 


*భవిష్యత్‌లో ధరల పెరుగుదలను అంచనా వేయటం ద్వారా వినియోగదారులు కూడా అధిక మొత్తం వస్తువులను కొనుగోలు చేసి దాచుకుంటారు. దీంతో కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి.


పొదుపులో తగ్గుదల


ద్రవ్యోల్బణ కాలంలో వస్తు, సేవలపై చేసే ఖర్చు గతంలో కంటే ఎక్కువ మొత్తంలో పెరుగుతుంది. ఫలితంగా పొదుపులు తగ్గుతాయి. పొదుపులో వచ్చే తగ్గుదల పెట్టుబడిని ప్రభావితం చేస్తుంది. దీంతో మూలధన కొరత ఏర్పడి, ఉత్పత్తి స్థాయి పడిపోతుంది.


విదేశీ మూలధనంలో తగ్గుదల


ద్రవ్యోల్బణం వల్ల ఉత్పతి కారకాల ధరలు పెరిగి ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఈ కారణంగా ఆశాజనక లాభాలను పొందే అవకాశం ఉండదనే ఉద్దేశంతో విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టేందుకు సంకోచిస్తారు. అంతేకాకుండా ఈ పెట్టుబడులు ఇతర దేశాలకు తరలివెళ్లే ప్రమాదం ఉంటుంది. 


సట్టా వ్యాపారానికి ప్రోద్బలం


ధరల్లోని పెరుగుదల వల్ల అనిశ్చిత పరిస్థితులు ఏర్పడతాయి. అధిక లాభం కోసం వ్యాపారస్తులు సట్టా వ్యాపారం చేసేందుకు సిద్ధపడతారు.


* వీరు వస్తూత్పత్తి ప్రక్రియ పట్ల ఆసక్తిని చూపకుండా ఉత్పత్తికి ఉపకరించే ముడిసరుకుల ఉపయోగితలో సట్టా వ్యాపార కార్యకలాపాలు చేపడతారు.


ప్రభుత్వ కార్యక్రమాలపై ద్రవ్యోల్బణ ప్రభావం


ధరల పెరుగుదల అనేది ప్రభుత్వ ఆర్థిక కార్యక్రమాల కేటాయింపులు, పంపిణీలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రజల ఆదాయాలు పెరిగితే ప్రభుత్వ పన్నుల రాబడి పెరుగుతుంది. 


* ఇది ద్రవ్యసంబంధ పెరుగుదలేకానీ వాస్తవిక పెరుగుదల కాదు. 


1) ధరలు పెరిగితే ఉత్పాదక ప్రాజెక్టులపై ప్రభుత్వం చేయాల్సిన వ్యయం పెరుగుతుంది.


2) పరిపాలన వ్యయం పెరిగి ప్రభుత్వ వ్యయ విధానంలో సవరణ చేయాల్సి వస్తుంది.


3) ప్రభుత్వం చేసిన రుణ వనరుల వాస్తవిక ఉత్పాదకత క్షీణించి రుణ వినియోగం అభిలషణీయంగా ఉండదు. 


4) ధరల పెరుగుదలతో ద్రవ్య విలువ తగ్గి, ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ వాస్తవిక విలువ తగ్గి ప్రయోజనం చేకూరుతుంది.


వ్యవసాయదారులు


భూమికి అద్దె స్థిరంగా ఉండటంతో ద్రవ్యోల్బణ కాలంలో భూస్వాములు నష్టపోతారు.


* భూమిని కౌలుకు తీసుకుని సాగుచేసే రైతులకు వారి ఉత్పత్తి వ్యయం కంటే ఉత్పత్తి అమ్మకాల రాబడి అధికంగా ఉంటుంది. అందువల్ల వీరు లాభాన్ని పొందుతారు.


* భూమిలేని వ్యవసాయాధారిత శ్రామికులు నష్టపోతారు. ఎందుకంటే వినియోగ వస్తు ధరల్లో పెరుగుదలకు అనుగుణంగా భూయజమానులు వీరి వేతనాలను పెంచరు.


* సన్నకారు రైతులు కూడా నష్టపోతారు.


ప్రభుత్వం


ప్రభుత్వం ప్రజలు, సంస్థల నుంచి అప్పులు చేస్తుంది. కాబట్టి ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోదు. ప్రభుత్వం జారీచేసే బాండ్‌లపై స్థిరమైన వడ్డీరేటు ఉండటం వల్ల ఇది సాధ్యపడుతుంది. 


* పైన పేర్కొన్న విధంగా ద్రవ్యోల్బణం వేతనాలు ఆర్జించే వారు, స్థిర ఆదాయాలు పొందేవారి నుంచి లాభాలనార్జించే వర్గాలకు, రుణదాతల నుంచి రుణగ్రహీతలకు ఆదాయాలను పునఃపంపిణీ చేస్తుంది. ఇక సంపదల పంపిణీకి సంబంధించి మధ్యతరగతితో పోల్చినప్పుడు అధిక ధనవంతులు, అతిపేదవారు ఎక్కువ మొత్తంలో నష్టపోతారు.


* ద్రవ్యోల్బణం అసమానంగా తగ్గడం కంటే పెరగడం జరుగుతుంది. అంటే విధాన నిర్ణాయక అనిశ్చితి కారణంగా ద్రవ్యోల్బణం ఏర్పడుతుందని చెప్పవచ్చు.


విదేశీ చెల్లింపుల శేషంపై  ద్రవ్యోల్బణ ప్రభావం


నిరంతరం పెరిగే వస్తు సేవల ధరల వల్ల దేశీయ మార్కెట్‌ అనిశ్చితంగా మారి దాని దుష్ప్రభావాలు అంతర్జాతీయ మార్కెట్‌కు కూడా విస్తరిస్తాయి. విదేశీ మారక చెల్లింపులు అనుకూలంగా మారతాయి.


* దేశీయ వస్తువు ధరలు పెరిగితే, అంతర్జాతీయ మార్కెట్‌లో మన దేశ వస్తువులు ఇతర దేశాల వస్తువులతో పోటీపడలేకపోతాయి. అప్పుడు మన ఎగుమతులు తగ్గుతాయి.


* విదేశీ వస్తువుల ధరలు సాపేక్షంగా మనకు చౌకగా లభిస్తాయి అందువల్ల మన దిగుమతులు పెరుగుతాయి. నీ ఎగుమతుల విలువ తగ్గి, దిగుమతుల విలువ పెరగడంతో విదేశీ చెల్లింపుల శేషంలో లోటు ఏర్పడుతుంది. ఇది మన దేశ అంతర్జాతీయ వ్యాపారంపై ప్రభావాన్ని చూపిస్తుంది.


 

Posted Date : 02-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌