• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యోల్బణం


అదుపు తప్పితే అంతా అస్థిరం!

ఒకప్పుడు పాతిక రూపాయలుండే లీటరు పాల ధర ఇప్పుడు వంద వరకు వచ్చేసింది. అదేమంటే రవాణా వ్యయాలు పెరిగాయంటారు. అవి ఎందుకు ఎక్కువయ్యాయంటే, డీజిల్‌ - పెట్రోల్‌ ధరలు పెరిగిపోయాయని చెబుతారు. వాటి పెరుగుదలకు కారణాలు అడిగితే అంతర్జాతీయంగా చమురు బ్యారెల్‌ ధరలు పెరిగాయంటారు. అక్కడెక్కడో బ్యారెల్‌ రేటు పెరిగితే, ఇక్కడ ఇంటికి వచ్చే పాల ధర దాకా ఆ ప్రభావం పడుతుంది. ఈ ఖర్చులు తట్టుకోలేకపోతున్నాం, ఇంకా జీతాలు పెంచమని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తుంటారు. ఇదే ద్రవ్యోల్బణం.  దాని వల్ల చేతిలోని డబ్బు విలువ, వినియోగదారుల కొనుగోలు శక్తి రెండూ తగ్గిపోతాయి. ద్రవ్యోల్బణం పాకుతుంది, నడుస్తుంది, పరిగెత్తుతుంది, ఏకంగా దూకుతుంది. ఆర్థిక అసమానతలను పెంచుతుంది. అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. అదుపు తప్పితే ఆర్థిక వ్యవస్థలను అస్థిరం చేస్తుంది. ఈ విధంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ద్రవ్యోల్బణం రకాలు, కారణాలు, నియంత్రణ చర్యలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. 

ద్రవ్యోల్బణం ఒక స్థూలమైన జాతీయ సమస్య. ఇది వివిధ వర్గాల ప్రజలపై పలు రకాల ప్రభావాలను చూపి, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దశ స్థాయులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల తగిన నివారణ చర్యలను ప్రభుత్వం చేపట్టకపోతే హెచ్చు స్థాయి ద్రవ్యోల్బణం ఆర్థిక అస్థిరతను కలిగిస్తుంది. సాధారణంగా ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. కానీ, వాస్తవానికి వస్తుసేవలకు ఉన్న అత్యధిక డిమాండ్‌ వల్ల ద్రవ్య విలువ తగ్గి ధరలు పెరిగితే దాన్ని ద్రవ్యోల్బణంగా పేర్కొంటారు.

బాక్స్‌ నిర్వచనాలు:

‘అధిక కరెన్సీ నోట్లను జారీ చేయడమే ద్రవ్యోల్బణం’ - హాట్రే

‘తక్కువ వస్తురాశిని ఎక్కువ ద్రవ్యం తరమడమే ద్రవ్యోల్బణం’ - డాల్టన్‌ 

‘ధరల స్థాయి పెరిగి ద్రవ్య విలువ తగ్గడమే ద్రవ్యోల్బణం’ - క్రౌథర్‌

‘నిలకడగా, నిరంతరంగా ధరల స్థాయిలో వచ్చే పెరుగుదలే ద్రవ్యోల్బణం’ - షాపిరో

ద్రవ్యోల్బణ సంబంధిత భావనలు: ద్రవ్యోల్బణ సంబంధిత భావనలు అయిదు రకాలుగా ఉన్నాయి. అవి

1) సాధారణంగా ధరల తగ్గుదల - ప్రతి ద్రవ్యోల్బణం

2) ద్రవ్యోల్బణ రేటులో తగ్గుదల - డిజ్‌ఇన్‌ఫ్లేషన్‌

3) నియంత్రించడానికి వీలుకాని ద్రవ్యోల్బణ విస్ఫోటం - హైపర్‌ ఇన్‌ఫ్లేషన్‌

4) ద్రవ్యోల్బణం పెరుగుతున్న నిరుద్యోగిత, తక్కువ స్థాయి ఆర్థికవృద్ధి రేటు మిశ్రమ స్థితి - స్టాగ్‌ఫ్లేషన్‌

5) ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడానికి ధరలు పెంచే ప్రయత్నం - రిఫ్లేషన్‌

ద్రవ్యోల్బణ స్థాయి: కొందరు ఆర్థిక శాస్త్రవేత్తలు 1.5 శాతం రేటు ధరల పెరుగుదల స్వల్పమని, అది సంపూర్ణ ఉద్యోగిత, ఆర్థికాభివృద్ధి సాధించడానికి అవసరమని భావించారు. అందువల్ల 1.5 శాతం రేటు కంటే ఎక్కువ రేటును ధరల పెరుగుదల ద్రవ్యోల్బణంగా నిర్ణయించారు. దాన్ని నిర్ణయిండంలో కాలం ఒక ముఖ్య అంశం. పరిస్థితులను అనుసరించి ఆ కాలాన్ని 3 నుంచి 12 నెలల వరకు పరిగణించాలి.

ద్రవ్యోల్బణ రకాలు

ఆర్థికవేత్తలు ద్రవ్యోల్బణాన్ని స్థూలంగా 6 రకాలుగా వర్గీకరించారు. అవి 

1) ద్రవ్యోల్బణ రేటును బట్టి ద్రవ్యోల్బణ రకాలు. 

2) ద్రవ్యం, ద్రవ్య ప్రసారవేగం బట్టి ద్రవ్యోల్బణ రకాలు.

3) కీన్స్‌ ఆర్థికవేత్త ప్రకారం ద్రవ్యోల్బణ రకాలు. 

4) ధరల నియంత్రణ స్థాయిని బట్టి ద్రవ్యోల్బణ రకాలు. 

5) రాబర్ట్‌ జె.గార్డెన్‌ ప్రకారం ద్రవ్యోల్బణ రకాలు.

6) ఇతర రకాలు.

పాకే ద్రవ్యోల్బణం: ఏటా ధరల స్థాయిలో పెరుగుదల అతి తక్కువ మోతాదులో ఉంటే దాన్ని పాకే ద్రవ్యోల్బణం అంటారు. అంటే సంవత్సరానికి 3% కంటే తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని కెంట్‌ అనే అర్థ శాస్త్రవేత్త వివరించారు.

నడిచే ద్రవ్యోల్బణం: ఏడాదిలో ధరల పెరుగుదల 3% నుంచి 4% మధ్యలో ఉండటాన్ని నడిచే ద్రవ్యోల్బణం అంటారు.

పరిగెత్తే ద్రవ్యోల్బణం: సంవత్సరంలో ధరల పెరుగుదల 10% వరకు ఉంటే దాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటారు.

దూకుతున్న ద్రవ్యోల్బణం: చాలా ఎక్కువ స్థాయిలో ధరల పెరుగుదల ఉంటే దాన్ని దూకుతున్న ద్రవ్యోల్బణం అంటారు. ధరల పెరుగుదల 100% కూడా ఉండొచ్చు. దీన్నే హైపర్‌ ద్రవ్యోల్బణం అంటారు.

అంతర్జాతీయంగా పెట్రోల్‌ ధరలు పెరగడం వల్ల 1973లో భారత్‌లో ద్రవ్యోల్బణం రెండు అంకెలకు చేరింది. అప్పటి ప్రభుత్వం ప్రజల వ్యయార్హ ఆదాయంపై ఆంక్షలు విధించడంతో 1975 నాటికి ద్రవ్యోల్బణం తగ్గింది. అప్పటి నుంచి ఆర్‌బీఐ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ద్రవ్యపరమైన చర్యలు చేపడుతోంది.

ద్రవ్యోల్బణ రేటుపై అభిప్రాయాలు

చక్రవర్తి కమిటీ: 4% ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు ఆమోదయోగ్యమైంది.

భారత ప్రభుత్వం: 4% - 6% మధ్య ద్రవ్యోల్బణం ఆమోదయోగ్యమైంది.

సి.రంగరాజన్‌: ద్రవ్యోల్బణం ప్రారంభంలో 6.7%, తర్వాత 5 - 6% మధ్య ఉండాలి.

ఎ.తారాపుర్‌ కమిటీ: 3% - 5% మధ్యలో ద్రవ్యోల్బణం అనుకూలం.

ఉర్జిత్‌ పటేల్‌: ద్రవ్యోల్బణ లక్ష్యం 4% అయితే +/-2 ఉండవచ్చు.

ద్రవ్య ద్రవ్యోల్బణం: ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా పెరగడంతో డిమాండ్‌ పెరిగి, ధరలు పెరిగితే దాన్ని ద్రవ్య ద్రవ్యోల్బణం అంటారు.

ధరల ద్రవ్యోల్బణం: ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరిగినప్పుడు, అవి ఇంకా పెరగవచ్చని ప్రజలు భయపడి, వచ్చిన ద్రవ్యాన్ని వచ్చినట్లే ఖర్చు పెట్టడంతో ద్రవ్య ప్రసార వేగం పెరుగుతుంది. ఇది పెరగడం వల్ల మళ్లీ ధరలు పెరిగితే దాన్ని ధరల ద్రవ్యోల్బణం అంటారు.

పాక్షిక ద్రవ్యోల్బణం: ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత స్థాయి చేరడానికి ముందు కొన్ని ఉత్పత్తి కారకాల కొరత వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి, ధరలు కూడా పెరిగితే దాన్ని పాక్షిక లేదా సెమీ ద్రవ్యోల్బణం అంటారు.

వాస్తవిక ద్రవ్యోల్బణం: ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరిన తర్వాత సమష్టి డిమాండ్‌తో పాటు ధరలు కూడా పెరుగుతాయి. దీన్ని వాస్తవిక లేదా నిజ ద్రవ్యోల్బణం అంటారు.

హైపర్‌ ద్రవ్యోల్బణం: ద్రవ్య ప్రసార వేగం పెరగడం వల్ల ధరలు అధికంగా పెరగడాన్ని హైపర్‌ ద్రవ్యోల్బణం అంటారు.

బహిరంగ ద్రవ్యోల్బణం: ధరల పెరుగుదల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల బహిర్గతంగా ధరలు పెరిగితే దాన్ని బహిరంగ ద్రవ్యోల్బణం అంటారు.

అణచివేసిన ద్రవ్యోల్బణం: రేషనింగ్, ధరల నియంత్రణ లాంటి ప్రభుత్వ విధానాల వల్ల ధరల పెరుగుదలను అణచి ఉంచుతారు. ప్రభుత్వం నియంత్రణలను ఎత్తివేస్తే ధరలు మళ్లీ పెరుగుతాయి. దీన్నే అణచివేసిన ద్రవ్యోల్బణం అంటారు.

డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం: సమష్టి సప్లయి కంటే సమష్టి డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరిగితే దాన్ని డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. దీనికి కారణం వినియోగ, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయాల పెరుగుదల కావచ్చు.

వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం: ఉత్పత్తి వ్యయాలు పెరిగితే ధరలూ పెరుగుతాయి. దీన్నే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు.

ఉదా: శ్రామికుల వేతనాలు పెరగడం వల్ల ధరలు పెరిగితే దాన్ని వేతన ద్రవ్యోల్బణమని, లాభాలు పెరగడం వల్ల ధరలు పెరిగితే అది లాభప్రేరిత ద్రవ్యోల్బణం లేదా మార్క్‌ అప్‌ ద్రవ్యోల్బణమని; ముడి పదార్థాల కొరత వల్ల ధరలు పెరిగితే దాన్ని ముడిపదార్థాల ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం ఒకేసారి సంభవిస్తే అది మిశ్రమ ద్రవ్యోల్బణం అని చార్లెస్‌ షుల్జ్‌ పేర్కొన్నారు.

అంతర్లీన ద్రవ్యోల్బణం: వేతనాలు పెరగాలని కార్మికులు, ఉద్యోగులు చేసే డిమాండ్లే ద్రవ్యోల్బణానికి ప్రేరణ కల్పిస్తాయి. దీనివల్ల వ్యయం పెరిగి మళ్లీ ధరలు పెరిగితే అంతర్లీన ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. దీన్నే హ్యాంగోవర్‌ ఇన్‌ఫ్లేషన్‌ అంటారు.

రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం: ఉత్పత్తి రంగంలోని ఒక తరహా పరిశ్రమలో తయారైన వస్తుసేవల ధరలు పెరగడాన్ని రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం అంటారు.

ఉదా: ముడిచమురు ధర పెరిగితే దాన్ని ఉపయోగించే ఇతర పరిశ్రమల ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి.

ధరశక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం: పారిశ్రామిక, వ్యాపార సంస్థలు తమ లాభాలు పెంచుకోవడానికి వాటి ఉత్పత్తి, అమ్మకపు ధరలు పెంచడాన్నే ధరశక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం అంటారు.

ఉదా: పరిమితస్వామ్య మార్కెట్‌లో లాభాలు పెంచుకోవాలనే ఆసక్తితో ధరలు పెంచొచ్చు. అందువల్ల దీన్ని పరిమితస్వామ్య లేదా పాలిత ద్రవ్యోల్బణం అంటారు.

కోశ సంబంధిత ద్రవ్యోల్బణం: ప్రభుత్వం రాబడి కంటే ఎక్కువ వ్యయం చేయడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం. ప్రభుత్వ బడ్జెట్‌ లోటు వల్ల కలిగే ధరల పెరుగుదలను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

ద్రవ్యోల్బణ విరామం 

జె.ఎం.కీన్స్‌ ‘హౌ టు పే ఫర్‌ ది వార్‌’ అనే గ్రంథంలో దీన్ని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఉత్పత్తి విలువ కంటే చేసే వ్యయం ఎక్కువగా ఉంటే, వాటి మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యోల్బణ విరామం అంటారు. సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వద్ద ఉన్న జాతీయ ఆదాయ స్థాయి కంటే వినియోగ పెట్టుబడి కలిపి ఎక్కువగా ఉంటే ఇది ఏర్పడుతుంది. సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వద్ద ఉన్న జాతీయ ఆదాయ స్థాయి కంటే సమష్టి డిమాండ్‌ ఎక్కువగా ఉంటే ద్రవ్యోల్బణ విరామం ఏర్పడుతుంది. దీన్ని పొదుపు పెంచడం ద్వారా కానీ, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం ద్వారా కానీ, పన్నులు పెంచడం ద్వారా కానీ తొలగించవచ్చు. దీర్ఘకాలంలో ఉత్పత్తిని పెంచడం ద్వారా తగ్గించవచ్చు.

ద్రవ్యోల్బణానికి కారణాలు: ద్రవ్యోల్బణానికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయి అవి 

1) డిమాండ్‌ 

2) సప్లయి

డిమాండ్‌: సమష్టి డిమాండ్‌ పెరగడంతో ముఖ్యంగా ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. లోటు విత్తాన్ని అవలంబించడం వల్ల ధరలూ పెరుగుతాయి.

కారణాలు: 

1) ప్రభుత్వ వ్యయం పెరగడం 

2) లోటు విత్తం 

3) జనాభా పెరుగుదల  

4) ప్రజల వినియోగం పెరుగుదల 

5) సులభ ద్రవ్య విధానం  

6) ఎగుమతులు పెరగడం 

7) ద్రవ్య సరఫరా పెరగడం

సప్లయి: ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల ఆశించిన స్థాయిలో ఉత్పత్తి పెరగకపోతే, సప్లయి తగ్గి ధరలు పెరుగుతాయి.

కారణాలు: 

1) వ్యవసాయ రంగంలో అస్థిర వృద్ధి 

2) నిత్యావసర వస్తువుల దాచివేత 

3) ప్రభుత్వ వ్యవసాయ ధరల విధానం 

4) పాలిత ధరలు పెరగడం 

5) ఉత్పత్తి కారకాల సప్లయి కొరత 

6) అధిక వేతన రేట్లు 

7) అధిక పన్ను రేట్లు 

ద్రవ్యోల్బణ కాలంలో లాభాలు పొందేవారు: 

1) రుణగ్రహీతలు 

2) వ్యాపారస్థులు 

3) ఉత్పత్తిదారులు 

4) వాటాదారులు 

5) అంచనా వ్యాపారం చేసేవారు 

6) బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసేవారు.

ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోయేవారు:  

1) రుణదాతలు 

2) వినియోగదారులు 

3) స్థిర ఆదాయం పొందేవారు 

4) వేతనాలు పొందేవారు, పింఛన్‌దారులు 

5) స్థిరమైన భాటకాన్ని పొందే భూస్వాములు.

ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ ప్రభావం: 

1) ఉత్పత్తిపై ప్రభావం 

2) పంపిణీపై ప్రభావం 

3) ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రభావం 

4) విదేశీ చెల్లింపుల శేషంపై ప్రభావం 

5) ఆర్థిక అసమానతలు పెరుగుతాయి 

6) ఆర్థికాభివృద్ధికి ఆటంకం 

7) సాపేక్ష ధరల మార్పులు

ద్రవ్యోల్బణ నివారణ చర్యలు: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వు బ్యాంకు, ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటాయి. రిజర్వు బ్యాంకు తీసుకునే వాటిని ద్రవ్యపరమైన చర్యలు, ప్రభుత్వం తీసుకునే వాటని కోశపరమైన చర్యలు అంటారు.

ద్రవ్యపరమైన చర్యలు: 

1) పరిమాణాత్మక చర్యలు 

2) గుణాత్మక చర్యలు.

పరిమాణాత్మక పరపతి నియంత్రణ చర్యలు: 

1) బ్యాంకు రేటు పెంపు. 

2) నగదు నిల్వల నిష్పత్తి (సి.ఆర్‌.ఆర్‌.) పెంపు. 

3) చట్టబద్ధ ద్రవ్యత్వ నగదు నిల్వల నిష్పత్తి (ఎస్‌.ఎల్‌.ఆర్‌.) పెంపు. 

4) రెపో రేటు పెంపు. 

5) రివర్స్‌ రెపో రేటు పెంపు. 

6) బహిరంగ మార్కెట్‌ చర్యల్లో భాగంగా ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకం.

ఏప్రిల్‌ 6, 2023న ఆర్‌బీఐ ప్రకటించిన పరిమాణాత్మక ద్రవ్యవిధాన అంశాలు:  

1) బ్యాంకు రేటు - 6.75 శాతం 

2) నగదు నిల్వల నిష్పత్తి - 4.50 శాతం 

3) చట్టబద్ధ ద్రవ్యత్వ నిల్వల నిష్పత్తి - 18.0 శాతం 

4) స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ - 6.25 శాతం 

5) మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ - 6.75 శాతం 

6) రెపో రేటు - 6.50 శాతం 

7) రివర్స్‌ రెపో రేటు - 3.35 శాతం

గుణాత్మక పరపతి నియంత్రణ చర్యలు: 

1) మార్జిన్‌లు పెంచడం 

2) డౌన్‌ పేమెంట్‌ పెంచడం  

3) వాయిదాల సంఖ్యను పెంచడం  

4) వినియోగదారుడికి పరపతిపై గరిష్ఠ పరిమితి విధించడం.

కోశ చర్యలు: వీటిని ప్రభుత్వం అమలు చేస్తుంది. అవి  

1) ప్రభుత్వ అభివృద్ధేతర వ్యయాన్ని తగ్గించడం  

2) ప్రైవేటు పెట్టుబడిదారులకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వడం 

3) లోటు విత్తాన్ని విడిచిపెట్టి మిగులు బడ్జెట్‌ను అనుసరించడం 

4) ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరకులు అందించి ధరల నియంత్రణ 

5) సప్లయి పెంచేందుకు దిగుమతులు అనుమతించడం 

6) ధరల విధానం ద్వారా వాటిపై గరిష్ఠ పరిమితి విధించడం 

7) ఆదాయ విధానం ద్వారా హేతుబద్ధమైన వేతనాలు, జీతాలు, పింఛన్లు నిర్ణయించడం

రచయిత: ధరణి శ్రీనివాస్‌
 

Posted Date : 22-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌