• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణ సంబంధ భావనలు


ప్రతిద్రవ్యోల్బణం (Deflation): సాధారణంగా వస్తు, సేవల ధరల తగ్గుదలను ‘ప్రతిద్రవ్యోల్బణం’ అంటారు.


రిఫ్లేషన్‌: ఆర్థిక వ్యవస్థలో ధరలు తగ్గుతున్న కాలంలో ప్రభుత్వం వాటిని పెంచడానికి చర్యలు తీసుకుంటుంది. దీని ఫలితంగా చోటు చేసుకున్న ధరల పెరుగుదలను ‘రిఫ్లేషన్‌’ అంటారు. ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థలో ప్రజలపై ఎలాంటి వ్యతిరేక ప్రభావం ఉండదు. ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తీసుకున్న చర్య.


స్తబ్దత ద్రవ్యోల్బణం(Stagflation): స్టాగ్‌ఫ్లేషన్‌ అనే భావనను అమెరికన్‌ ఆర్థికవేత్త పాల్‌ శామ్యూల్‌సన్‌ ప్రతిపాదించారు. ఈ పదం ‘స్టాగ్‌నేషన్‌’, ‘ఇన్‌ఫ్లేషన్‌’ అనే పదాల నుంచి ఏర్పడింది. 1970 దశకంలో ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.


* పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిరుద్యోగిత రేటు తగ్గుదలను సూచిస్తుంది. అయితే 1970 దశాబ్దంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ద్రవ్యోల్బణ రేటు పెరుగుతుంటే మరోవైపు నిరుద్యోగిత రేటు కూడా ఎక్కువై స్టాగ్‌ఫ్లేషన్‌ ఏర్పడింది.


* ఆర్థికవృద్ధి రేటు స్తంభించి, అధిక ధరల స్థాయి వద్ద ఎక్కువ నిరుద్యోగితను తెలిపేదే స్టాగ్‌ఫ్లేషన్‌. ఈ స్థితి ఆర్థికవ్యవస్థ స్తబ్దతతో పాటు ద్రవ్యోల్బణాన్ని సూచిస్తుంది. 


* ఆర్థిక వ్యవస్థలో అధిక ద్రవ్యోల్బణరేటుతో కూడిన ‘తిరోగమన’ (Recession) దశలో స్టాగ్‌ఫ్లేషన్‌ పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే స్టాగ్‌ఫ్లేషన్‌ను ‘ద్రవ్యోల్బణ తిరోగమనం’ అంటారు.


* దీనికి ప్రధాన కారణం వస్తుమార్కెట్‌లో అవసరానికి మించిన డిమాండ్‌ ఉండటం వల్ల ధరలు పెరిగి, శ్రామిక డిమాండ్‌ తగ్గి, నిరుద్యోగిత రేటు పెరగడం.


ద్రవ్యోల్బణ విరామం (Inflationary Gap)


సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వద్ద సమష్టి డిమాండ్, సమష్టి సప్లయ్‌ కంటే ఎక్కువ ఉండే స్థితిని ‘ద్రవ్యోల్బణ విరామం’ అంటారు.


*  కెనడా ఆర్థికవేత్త రిచర్డ్‌ జార్జ్‌ లిప్సె ప్రకారం, సంపూర్ణ ఉద్యోగిత ఆదాయ స్థాయి వద్ద సమష్టి ఉత్పత్తి కంటే సమష్టి వ్యయ పరిమాణం ఎక్కువగా ఉండే పరిస్థితి ద్రవ్యోల్బణ విరామాన్ని తెలుపుతుంది.


*  జె.ఎం.కీన్స్‌ ‘హౌ టూ పే ఫర్‌ ద వార్‌’ అనే వ్యాసంలో ‘‘బేస్‌ ధర లేదా ద్రవ్యోల్బణ ప్రారంభ దశ వద్ద ఉన్న ఉత్పత్తి స్థాయి కంటే ప్రణాళికాయుతమైన వ్యయం అధికంగా ఉండటాన్ని ద్రవ్యోల్బణ విరామం’’గా పేర్కొన్నారు.


*  కీన్స్‌ ప్రకారం, ఈ సమష్టి వ్యయం ఎంతమేరకు పెరుగుతుందో ద్రవ్యోల్బణ స్థాయి కూడా అంతే మొత్తంలో పెరుగుతుంది. సగటు పొదుపు ప్రవృత్తి స్థిరంగా ఉండి, సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వద్ద ద్రవ్య ఆదాయ స్థాయి పెరిగిన కొద్దీ సప్లయ్‌ కంటే డిమాండ్‌ అధికమై ద్రవ్యోల్బణ విరామం చోటు చేసుకుంది. 


ఫిలిప్స్‌ రేఖ


ఫిలిప్స్‌ రేఖ ద్రవ్యోల్బణ రేటు, నిరుద్యోగిత రేటు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది.


*  1861 - 1957 మధ్య కాలంలో 


ఎ.డబ్ల్యూ. ఫిలిప్స్‌ బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థలో వేతన ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత రేట్లకు సంబంధించి అనేక పరిశోధనలు చేశారు. ఇది స్థూల ఆర్థిక విశ్లేషణలో ఒక మైలురాయిగా నిలిచింది. వేతన ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత మధ్య స్థిరమైన విలోమ సంబంధం ఉంటుందని ఈయన కనుక్కున్నారు. నిరుద్యోగిత అధికంగా ఉన్నప్పుడు వేతనాలు నెమ్మదిగా పెరగ్గా, నిరుద్యోగిత తక్కువగా ఉన్నప్పుడు వేతనాలు వేగంగా పెరిగాయని ఈయన తెలిపారు. 


*  ఎందుకంటే అమల్లో ఉన్న వేతనాల కంటే తక్కువ వేతనాలు ఇస్తే, శ్రామికులు తమ సేవలు అందించడానికి ఇష్టపడరు. కాబట్టి తక్కువ స్థాయి వేతనాల వద్ద శ్రామిక డిమాండ్‌ తగ్గి, నిరుద్యోగిత పెరుగుతుంది. ఇందుకు భిన్నంగా నిరుద్యోగిత తక్కువ స్థాయిలో ఉంటే ద్రవ్యవేతనాల రేటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 


నిరుద్యోగిత తక్కువగా ఉండి, శ్రామికుల డిమాండ్‌ అధికంగా ఉన్నప్పుడు యజమానులు శ్రామికులకు అధిక వేతనాలు చెల్లించాల్సి వస్తుంది. 


 *  సంఖ్యాత్మక దత్తాంశం ద్వారా, నిరుద్యోగిత అల్పస్థాయిలో ఉన్నప్పుడు వేతనరేటు వేగంగా పెరిగిందని, నిరుద్యోగిత స్థాయి అధికంగా ఉన్న స్థితిలో వేతన రేటు తగ్గిందని, కాగా శ్రామికులు పనిలో పాల్గొనే రేటు 5.5 శాతం ఉన్నప్పుడు వేతన రేటు స్థిరంగా ఉందని ఫిలిప్స్‌ తెలిపారు.


ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయడానికి కొలమానాలు


స్థిర రేటుతో ధరల పెరుగుదల కొంత కాలానికి కొనసాగితే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయొచ్చు. దీన్ని కింది విధాలుగా కొలుస్తారు. అవి:


టోకు ధరల సూచీ (Wholesale Price Index- WPI)


టోకు ధరల సూచీని మన దేశంలో ‘ఉత్పత్తిదారుల ధరల సూచిక’(Producer Price Index- PPI) అంటారు.


 * భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారు, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (Economic Advisor to the Govt. of India)   దీన్ని ప్రచురిస్తుంది. హోల్‌సేల్‌ మార్కెట్‌ వాణిజ్యం చేసిన వస్తువుల సగటు ధరల స్థాయిలో వచ్చే మార్పును కొలవడానికి టోకు ధరల సూచీని వినియోగిస్తారు.


 * వస్తు గ్రూప్‌ల ఆధారంగా డబ్ల్యూపీఐని అయిదు రకాలుగా విభజించారు. అవి: 

1. వ్యవసాయం,     

2. తయారీరంగం,    

3. క్వారీయింగ్,    

4. ఎగుమతులు, దిగుమతులు,           

5. గనులు

 * భారత్‌లో హోల్‌సేల్‌ మార్కెట్‌లు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. దీంతో వాణిజ్యం జరిపిన వస్తుధరల సమాచారం సులభంగా లభ్యమవుతుంది. టోకు ధరల సూచీ నిర్మాణంలో మార్పులు సూచించడానికి ప్రభుత్వం 2008, మేలో అభిజిత్‌సేన్‌ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది డబ్ల్యూపీఐ ఆధార సంవత్సరాన్ని 1993-94 నుంచి 2004-05 కు మార్చాలని సూచించింది.


 డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్, మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీకి చెందిన ‘ఆఫీస్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అడ్వయిజర్‌ (ఓఈఏ)’ 2017లో ఆధార సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కి మార్చింది. 


 * జీడీపీ, పారిశ్రామిక ఉత్పత్తి సూచీల ఆధార సంవత్సరాన్ని 2011-12కి మార్చారు. ప్రస్తుతం మన దేశంలో టోకు ధరల సూచీ, వినియోగదారుల ధరల సూచీల ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తున్నారు. 


 * డబ్ల్యూపీఐ ద్వారా ఇప్పటివరకు కింది ఆధార/ ప్రాతిపదిక/ మూలాధార సంవత్సరాలన (Base year) తీసుకుని ద్రవ్యోల్బణ గణాంకాలను అంచనా వేసింది. అవి:

1. 1952-53, 

2. 1961-62, 

3. 1970-71,

4. 1981-82,

 5. 1993-94, 

6. 2004-05,

7. 2011-12 (ప్రస్తుతం)

* ప్రస్తుతం ద్రవ్యోల్బణ గణాంకాలను నెలకు ఒకసారి విడుదల చేస్తున్నారు. ఇందులో ప్రాథమిక వస్తువులు (22.62%), ఇంధనం (13.15%), తయారీ వస్తువులు (64.23%) అనే మూడు గ్రూప్‌లను తీసుకుంటున్నారు.


 *  ప్రస్తుతం టోకు ధరల సూచీ ద్వారా ద్రవ్యోల్బణ గణాంకాలను లెక్కించడానికి తీసుకుంటున్న మొత్తం వస్తువుల సంఖ్య 697 (అంతకుముందు 676).


వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index- CPI)

వినియోగదారుల ధరల సూచికను సమాజంలో వివిధ వర్గాల ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారు.

* భారతదేశంలో నాలుగు రకాల వినియోగదారుల ధరల సూచీలను గణిస్తారు. అవి:


1. వినియోగదారుల ధరల సూచిక - వ్యవసాయ శ్రామికులు(Consumer Price Index for Agricultural Laboures- CPIAL): దీని ఆధార సంవత్సరం 1986-87. నెలవారీ ప్రాతిపదికన గణాంకాలు సేకరిస్తారు. 

వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ శ్రామికుల కనీస వేతనాలు సవరించేందుకు ఉపయోగపడుతుంది.


2. వినియోగదారుల ధరల సూచిక - ఇండస్ట్రియల్‌ వర్కర్స్‌ (సీపీఐ - ఐడబ్ల్యూ): పారిశ్రామిక శ్రామికుల జీవన స్థితిగతులు తెలుసుకోవడానికి దీన్ని నెలవారీ గణిస్తారు. 

* ఆధార సంవత్సరం 2001 (వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వడం). 

*  బీఎన్‌ నందా కమిటీ సిఫార్సుల మేరకు 2020, ఫిబ్రవరిలో దీని ఆధార సంవత్సరాన్ని 2016కి మార్చారు. 

* వేతన సవరణ సంఘం కూడా దీని ఆధారంగానే వేతన సవరణ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని దీని ఆధారంగానే ప్రకటిస్తారు.


3. వినియోగదారుల ధరల సూచీ - గ్రామీణ కార్మికులు(Consumer Price Index Rural Labour - CPIRL): ఆధార సంవత్సరం 1986-87. దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వారి జీవన స్థితిగతులు తెలుసుకోవడానికి ప్రతి నెలా గణిస్తారు. 


4. నూతన వినియోగదారుల ధరల సూచిక: ఇందులో New Consumer Price Index - Rural, New Consumer Price Index - Urban, సీపీఐలను (భారత్‌ మొత్తం) సూచిస్తారు.


*  భారతదేశంలో జిల్లాకు రెండు గ్రామాలు శాంపిల్‌ తీసుకుని 1183 గ్రామాల్లో ధరల కొటేషన్స్‌ సేకరించి, సీపీఐ (గ్రామీణ)ని గణిస్తున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం 9 లక్షల జనాభా కంటే ఎక్కువ జనాభా ఉన్న 310 పట్టణాల్లో సీపీఐ (పట్టణ)ని లెక్కిస్తారు. సీపీఐ (రూరల్‌), సీపీఐ (అర్బన్‌)లను కలిపి సీపీఐ కంబైన్డ్‌ (మొత్తం భారత్‌)ని రూపొందిస్తారు. 


*  కొత్త సీపీఐ గణనలో గ్రామీణ ప్రాంతాల్లో 225 వస్తువులు, పట్టణ ప్రాంతాల్లో 250 వస్తువులను తీసుకుంటారు. 20 రకాల సేవలను కూడా ఇందులో చేర్చారు. రిటైల్‌ ధరల ఆధారంగా దీన్ని గణిస్తారు. అప్పటి ఆర్బీఐ గవర్నర్‌ డా.ఉర్జిత్‌పటేల్‌ సిఫార్సుల మేరకు ‘మానిటరీ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌’ని బలోపేతం చేయడానికి ప్రస్తుతం కొత్త సీపీఐ (కంబైన్డ్‌)ని కొలమానంగా తీసుకుంటున్నారు. దీన్ని హెడ్‌లైన్‌ ఇన్‌ఫ్లేషన్‌గా తీసుకుంటారు. ఈ కొత్త సీపీఐని 2011, జనవరిలో ప్రవేశపెట్టారు. 


*  మొదటి ప్రాతిపదిక సంవత్సరం 2010. దీన్ని 2015 జనవరిలో 2012 = 100కి మార్చారు.


 

Posted Date : 25-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌