• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యోల్బణం

అంచనా వేయడానికి కొలమానాలు                                                 

ప్రతిద్రవ్యోల్బణ సూచీ( price deflator )


కొన్ని సంవత్సరాల ధరల గణాంకాలను ఆధార సంవత్సర ధరల్లో తెలియజేయడానికి ఉపయోగపడే విలువను ‘ప్రతిద్రవ్యోల్బణ సూచీ’ అంటారు.


 ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల ద్రవ్య విలువలో కలిగే మార్పులను కొలిచే విలువే ప్రతిద్రవ్యోల్బణ సూచీ.


 ఇది ధరల ప్రభావాలను తగ్గించి ధరల సూచీని ప్రతిబింబించడానికి ఉపయోగపడే కొలత measure. ఇది వాస్తవిక, నామమాత్రపు ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుపుతుంది.


 ఈ సూచీ ప్రస్తుత కరెన్సీని ద్రవ్యోల్బణంతో సవరించిన కరెన్సీగా మార్చడానికి ఉపయోగపడుతుంది.


ఉత్పత్తిదారుల ధరల సూచిక( producer p[rice index-ppi )


పీపీఐ అనేది మార్కెట్‌లో ఉన్న ప్రాథమిక, మధ్యంతర, పూర్తిగా తయారైన వస్తు, సేవలు ధరల్లో వచ్చే మార్పులను గణిస్తుంది. 


 డబ్ల్యూపీఐ వస్తువులను లెక్కిస్తే, పీపీఐ వస్తువులతో పాటు సేవలను కూడా గణిస్తుంది. దీంతో ఎక్కువ దేశాలు డబ్ల్యూపీఐ స్థానంలో పీపీఐని ప్రవేశపెట్టాయి.


బీఎన్‌ గోల్డర్‌ కమిటీ సూచన: మన దేశంలో ఉత్పత్తిదారుల ధరల సూచీ గణాంకాలను వెల్లడించి, అది స్థిరత్వం సాధించాక డబ్ల్యూపీఐ స్థానంలో దీన్ని అమలు చేయాలని ఈ కమిటీ 2017లో సూచించింది. అంతేకాకుండా దీన్ని నెలవారీ ప్రాతిపదికన విడుదల చేయాలని, ఆధార సంవత్సరం 2011-12ని కొనసాగించాలని, ప్రారంభంలో 15 సేవలను తీసుకోవాలని, తర్వాత వాటిని విస్తరించాలని పేర్కొంది.


స్థూల జాతీయోత్పత్తి అవ్యక్త ద్రవ్యోల్బణ సూచిక ( gross national product price deflator )


ఇది ప్రతిద్రవ్యోల్బణానికి సంబంధించిన సూచిక. ఇది అవ్యక్తమైంది. ఎందుకంటే ప్రస్తుత రూపాయి విలువలో స్థూల జాతీయోత్పత్తికి, ప్రాతిపదిక సంవత్సర రూపాయి విలువలో స్థూల జాతీయోత్పత్తికి ఉన్న వ్యత్యాసాన్ని తెలుపుతుంది.


ఉదా: 2012-13 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తికి, ప్రస్తుత రూపాయి విలువ ఆధారంగా ధరలతో పోల్చి హెచ్చించాలి. 


 స్థూల జాతీయోత్పత్తికి ప్రాతిపదిక సంవత్సరం 2011-12. అప్పటి రూపాయి విలువను ప్రస్తుత ధరలతో హెచ్చించాలి. ఈ రెండు విలువల్లో ఏర్పడే తేడాను ద్రవ్యోల్బణంగా పరిగణించాలి.


వినియోగదారుడి వ్యయ అవ్యక్త ద్రవ్యోల్బణ సూచిక ( consumer expenditure implicit price deflator )

ఇది వినియోగదారుడి ధరల సూచికకు 


ప్రత్యామ్నాయ సూచిక. వినియోగదారుడు వ్యయం చేసే వస్తువుల ధరల్లోని మార్పును ఈ సూచిక తెలుపుతుంది. 


 స్థూల జాతీయోత్పత్తి అవ్యక్త ప్రతిద్రవ్యోల్బణ సూచికను తయారు చేసినట్లే దీన్ని కూడా నిర్మించాలి.


ఉదా: 2007లో వినియోగదారుడు వస్తువులపై చేసే వ్యయాన్ని ఆ ఏడాది రూపాయి విలువతో అంచనా వేయాలి. ఆ వ్యయాన్ని ప్రాతిపదిక సంవత్సరమైన 2000 నాటికి రూపాయి విలువతో అంచనా వేయాలి. ఈ రెండు అంచనాల్లో ఏర్పడే వ్యత్యాసమే ద్రవ్యోల్బణం.


జీవన ప్రమాణ వ్యయ సూచీ ( cost of living index)


వినియోగదారుల సూచీ లాంటిదే జీవన ప్రమాణ వ్యయ సూచీ. అయితే ఇందులో స్థిర ఆదాయాలను, కాంట్రాక్టు ఆదాయాలను, వాటి వాస్తవిక విలువను నిలకడగా ఉంచడానికి, తగిన సవరణలు చేయొచ్చు.


మూలధన వస్తువుల ధరల సూచీ ( capital goods price index)


ద్రవ్య సప్లయ్‌ పెరుగుదల వాస్తవానికి వినియోగదారుడి వస్తువుల ద్రవ్యోల్బణాన్నే కాకుండా, మూలధన వస్తువుల ద్రవ్యోల్బణాన్ని కూడా కలిగిస్తుంది. 


 ఇందులో షేర్లు, డిబెంచర్లు, రియల్‌ ఎస్టేట్, ఇతర ఆస్తుల లాంటి మూలధన వస్తువుల ధరల పెరుగుదలకు సంబంధించిన ద్రవ్యోల్బణాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. దీన్ని మూలధన వస్తువుల ద్రవ్యోల్బణమని పేర్కొంటారు.


సప్లయ్‌ వైపు కారణాలు


ప్రకృతి వైపరీత్యాలు: కరవు, వరదలు లాంటివి వ్యవసాయ ఉత్పత్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దీంతో ఆహారధాన్యాలు, ముడిసరుకుల కొరత ఏర్పడి ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.


వస్తువులను దాచడం: అధిక లాభాలను పొందాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యాపారస్తులు సట్టా వ్యాపారం, నల్లబజారు వ్యాపార కార్యకలాపాలు చేస్తుంటారు. ఇందులో వారు వస్తు, సేవలకు కృత్రిమ కొరతను సృష్టిస్తారు. దీంతో వస్తు, సేవల ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.


ఉత్పత్తికారకాల సమస్య: శ్రమ, ముడిసరుకులు, శక్తివనరులు, మూలధనం మొదలైన వాటి కొరత ఏర్పడినప్పుడు పారిశ్రామికోత్పత్తిలో తగ్గుదల నమోదై వస్తుధరలు పెరుగుతాయి.


పారిశ్రామిక తగాదాలు: దేశంలో శ్రామిక సంఘాలు ఎక్కువ శక్తిమంతంగా ఉంటే, వారు వేతనాలు పెంచాలని సమ్మెలు, లాకౌట్లు లాంటివి చేస్తారు. దీంతో పారిశ్రామికోత్పత్తి తగ్గి, వస్తూత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా ధరలు పెరగుతాయి.


ఎగుమతుల్లో పెరుగుదల: దేశీయ వినియోగాన్ని విస్మరించి ఒక దేశం అధిక మొత్తంలో వనరులను ఎగుమతి, వస్తువుల ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరిస్తే స్వదేశంలో వస్తువుల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.


విలాస వస్తువుల ఉత్పత్తి: అత్యవసర వస్తువులకు తగిన ప్రాధాన్యతను ఇవ్వకుండా, కొరత ఉన్న వనరులను విలాస వస్తూత్పత్తికి ఉపయోగిస్తే, వినియోగ వస్తువుల కొరత ఏర్పడుతుంది. దీంతో ధరలు పెరుగుతాయి.


అంతర్జాతీయ కారణాలు: అంతర్జాతీయ మార్కెట్‌లో డీజిల్, పెట్రోల్‌ లాంటి చమురు ధరలు పెరిగినప్పుడు వాటి ప్రభావం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఉంటుంది.


ఇతర కారణాలు

 మూలధన కొరత       

 వ్యవస్థాపక నైపుణ్యాల లేమి

 శ్రామిక నైపుణ్యాల కొరత  

 అవస్థాపన సౌకర్యాల కొరత

 శాస్త్రసాంకేతిక పరిజ్ఞాన లభ్యత లేమి

 విదేశీ మారకద్రవ్య కొరత    

 ఆహార భద్రత లేమి 

 శ్రామిక వేతనాల పెరుగుదల వల్ల ఉత్పత్తి వ్యయం పెరగడం

 పన్ను రేటు తగ్గించడం

ద్రవ్యోల్బణం - కారణాలు


ద్రవ్యోల్బణం ఏర్పడటంతో డిమాండ్‌ వైపు, సప్లయ్‌ వైపు అంశాలు కారణాలు అవుతాయి.


డిమాండ్‌ వైపు కారకాలు


ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల: అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లోని ప్రభుత్వాలు ప్రజోపయోగ కార్యక్రమాలు, సాంఘిక సేవలపై (విద్య, వైద్యం) గణనీయమైన ఖర్చు చేస్తాయి. ఈ ఖర్చులు ఆర్థిక వ్యవస్థలో వస్తు, సేవల సమష్టి డిమాండ్‌ను పెంచుతాయి.


వ్యయార్హ ఆదాయంలో పెరుగుదల: జాతీయాదాయంలో పెరుగుదల లేదా పన్నుల్లో తగ్గుదల లేదా పొదుపులో తగ్గుదల ఫలితంగా ప్రజల వ్యయార్హ ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల వస్తు, సేవల సమష్టి డిమాండ్‌ పెరుగుతుంది.


ద్రవ్య సప్లయ్‌లో పెరుగుదల: ద్రవ్య సప్లయ్‌లో పెరుగుదలకు అనుగుణంగా వస్తూత్పత్తిలో పెరుగుదల లేనప్పుడు సమష్టి డిమాండ్‌ ఎక్కువవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ద్రవ్య సప్లయ్‌ ఎంతమేర పెరుగుతుందో ద్రవ్యోల్బణం కూడా అంతమేర అధికమవుతుంది.


నల్లధనం black money: లంచగొండితనం, పన్నుల ఎగవేత లాంటి కారణాల వల్ల సమష్టి డిమాండ్‌ పెరుగుతుంది. ఇలాంటి అనార్జిత అనుత్పాదక డబ్బును ప్రజలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. అందువల్ల వస్తువుల డిమాండ్‌ పెరిగి ధరలు అధికమవుతాయి.


* ఆదాయపు పన్ను విభాగానికి లెక్కచెప్పని డబ్బును నల్లధనంగా పేర్కొంటారు. దీనివల్ల ప్రజల మధ్య ఆదాయ వ్యత్యాసాలు విపరీతంగా పెరుగుతాయి.


ప్రజల వినియోగ అలవాట్లు: కొంతమంది వినియోగదారులు విలాసవంతమైన వస్తు, సేవలపై అధిక మొత్తం ఖర్చు చేస్తారు. ఇలాంటి వారు పరపతి సౌకర్యాలు, అద్దె కొనుగోలు లాంటి సౌకర్యాలను వినియోగించుకుని విలాసవంతమైన జీవనం గడపడంలో భాగంగా సమష్టి డిమాండ్‌ను పెంచుతారు.


చౌకద్రవ్య విధానం: ఆర్థిక వ్యవస్థలో పరపతి ద్రవ్య విస్తరణ కోసం చౌకద్రవ్య విధానాన్ని పాటిస్తే వినియోగదారులు సులభంగా అప్పులు చేస్తారు. అందువల్ల సమష్టి సప్లయ్‌ కంటే సమష్టి డిమాండ్‌ వేగంగా పెరిగి, ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.


లోటుద్రవ్య విధానం: సామర్థ్యానికి మించిన వ్యయాలు పెరిగినప్పుడు ప్రభుత్వాలు లోటుద్రవ్య విధానం ద్వారా ప్రజల నుంచి అప్పులు సేకరించడం, ద్రవ్య సప్లయ్‌ని పెంచడం లాంటి చర్యలు చేపడతాయి. ఇందువల్ల సమష్టి డిమాండ్‌ పెరుగుతుంది.


ప్రభుత్వ రుణాలను తిరిగి చెల్లించడం: గతంలో తీసుకున్న రుణాలను ప్రభుత్వం తిరిగి ప్రజలకు చెల్లించినప్పుడు ద్రవ్య సరఫరా పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి అధికమవుతుంది. దీని వల్ల సమష్టి డిమాండ్‌ పెరుగుతుంది.


ఏకస్వామ్య అక్రమ వ్యాపార నియంత్రణ చట్టం mono polies restrictive trade practices- MRTP act 1969: ఈ చట్టాన్ని 1969లో చేశారు. 1970లో అమలైంది. అయితే ఈ చట్టం అమల్లో విఫలం కావడం వల్ల వస్తు, సేవలకు కృత్రిమ కొరత ఏర్పడి డిమాండ్‌ పెరుగుతుంది.


లోటు బడ్జెట్‌: ప్రభుత్వ వ్యయానికి, రాబడికి మధ్య అంతరం పెరిగితే లోటుబడ్జెట్‌ ఏర్పడుతుంది. ఈ ప్రభావం వల్ల వస్తు, సేవలకు డిమాండ్‌ ఎక్కువవుతుంది. బడ్జెట్‌లో కోశలోటు నియంత్రణలో ప్రభుత్వం సఫలీకృతం కాలేకపోవడం వల్ల వస్తు, సేవలకు డిమాండ్‌ పెరుగుతుంది.


 ప్రభుత్వ రుణ సేకరణ పెరిగి, అనుత్పాదక అంశాలపై వ్యయం చేయడం వల్ల దేశంలో కొనుగోలు శక్తి పెరిగి, డిమాండ్‌ అధికమవుతుంది. మొత్తం వ్యయం, మొత్తం రాబడి కంటే ఎక్కువగా ఉంటే దాన్ని బడ్జెట్‌ లోటు అంటారు. ఈ మేరకు ప్రభుత్వం 


కరెన్సీని ముద్రించి అభివృద్ధి కార్యక్రమాలపై వ్యయం చేయడం ఒక పద్ధతి. అయితే ఇది ద్రవ్యోల్బణానికి దారితీసి, ఆర్థిక అస్థిరతకు కారణమవుతుంది.


అధిక ద్రవ్య ముద్రణ: అధిక ద్రవ్య ముద్రణ వల్ల ద్రవ్య సప్లయ్‌ పెరిగి ద్రవ్య చలామణి ఎక్కువై వస్తు, సేవలకు డిమాండ్‌ పెరుగుతుంది.


రచయిత

బండారి ధనుంజయ

విషయ నిపుణులు 

Posted Date : 19-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌