• facebook
  • whatsapp
  • telegram

చట్టాలు - క్రిమినల్‌ కేసులు

రాజ్యాంగ వివరణ:

* భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్స్‌ 233 నుంచి 237 మధ్య అధీన న్యాయస్థానాలు (Subordinate Courts), జిల్లా కోర్టులు, డివిజినల్‌ కోర్టుల గురించి వివరణ ఉంది. 


 జిల్లా న్యాయమూర్తుల ఎంపిక, నియామకం, పదోన్నతి విషయాల గురించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గవర్నర్‌ సంప్రదిస్తారు.

జిల్లా న్యాయమూర్తి - అర్హతలు:

ఏడు సంవత్సరాల పాటు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర న్యాయ సర్వీసుల్లో అధికారిగా పనిచేసి ఉండాలి. హైకోర్టు సిఫార్సు చేసిన వ్యక్తిని గవర్నర్‌ న్యాయమూర్తిగా నియమిస్తారు.


తొలి సమాచార నివేదిక (FIR)


ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీస్‌ స్టేషన్‌లో రైటర్‌ నివేదికను తయారు చేస్తారు. దీన్నే ‘తొలి సమాచార నివేదిక’ (First Information Report - FIR) అంటారు.


* పోలీస్‌ స్టేషన్‌ అధికారిని ఎస్‌.హెచ్‌.ఒ.(Station House Officer)అంటారు. ఇతనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (S.I).


* ఎఫ్‌.ఐ.ఆర్‌.ఆధారంగా ఎస్‌.హెచ్‌.ఒ.పోలీస్‌ స్టేషన్‌లోని రిజిస్టర్‌లో నేరం వివరాలను నమోదు చేసి, ఎటువంటి రుసుము తీసుకోకుండా ప్రతిని ఫిర్యాదుదారుడికి ఇవ్వాలి.


* ఒకవేళ ఫిర్యాదును తీసుకోవడానికి ఎస్‌.హెచ్‌.ఒ. తిరస్కరిస్తే నేరుగా DSP లేదా మెజిస్ట్రేట్‌ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును పోస్టు ద్వారా కూడా పంపవచ్చు.


ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేసిన తర్వాత కేసును పరిశోధించి, పరిష్కరించాల్సిన బాధ్యత పోలీస్‌ అధికారులదే.


విచారణ, అరెస్టులో పోలీసుల పాత్ర


నేరానికి సంబంధించి ఏ ఫిర్యాదునైనా విచారించడం పోలీసుల ముఖ్య కర్తవ్యం. విచారణలో భాగంగా రకరకాల రుజువులు సేకరిస్తారు. సాక్షులు చెప్పిన వివరాలను నమోదు చేస్తారు. విచారణలో సాక్ష్యాలు సేకరించిన తరువాత పోలీసులు న్యాయస్థానంలో ‘‘చార్జ్‌షీట్‌’’ దాఖలు చేయాలి. నిందితుడిని శిక్షించే పని పోలీసులది కాదు. నిందితుడు దోషి అవునో, కాదో.. ఒకవేళ దోషి అని నిర్ధారణ అయితే ఏ శిక్ష విధించాలో న్యాయమూర్తులు లేదా న్యాయస్థానమే నిర్ణయిస్తుంది.


ఫిర్యాదు చేయడం ఎలా?


ప్రభుత్వాలు చట్టాలను రూపొందించి, అమలు చేస్తాయి. చట్టాలను ఉల్లంఘించిన వారు శిక్షార్హులవుతారు. ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లే వ్యక్తులు తమ ఫిర్యాదులో కింద పేర్కొన్న వివరాలు తప్పక తెలియజేయాలి.


1. పోలీస్‌ స్టేషన్‌ అధికారిని (S.H.O.) సంబోధిస్తూ ఫిర్యాదు రాయాలి


2. ఫిర్యాదు వివరాలు


3. నేరం జరిగిన తేదీ, సమయం, చోటు    

4. ఏం జరిగింది?


5. నిందితుల పేరు, లింగం, చిరునామా


6. సాక్షుల పేర్లు (నేరం ఎవరి సమక్షంలో జరిగింది)


7. విన్నపం (నిందితులను చట్ట ప్రకారం శిక్షించమని కోరడం, తెలిసి ఉంటే వర్తించే IPC సెక్షన్‌ సంఖ్యను సూచించాలి)


8. ఫిర్యాదుదారు సంతకం, చిరునామా, ఇతర వివరాలు


బెయిల్‌: బెయిల్‌ అనేది నిందితుడి హక్కు. నేర తీవ్రత, సాక్షులను బెదిరించడానికి ఉన్న అవకాశాన్ని బట్టి మంజూరు చేస్తారు. అదే సమయంలో నిందితుడిని విడుదల చేస్తే సమాజానికి, సాక్షులకు, ఫిర్యాదుదారుడికి ఏమైనా హాని జరుగుతుందేమోనని న్యాయస్థానం పరిశీలిస్తుంది. బెయిల్‌ ఇవ్వగలిగే నేరాల్లో ఎస్‌.హెచ్‌.ఒ. బెయిల్‌ మంజూరు చేస్తారు. మిగిలిన నేరాల్లో నిందితుడు సంబంధిత న్యాయస్థానంలో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి.


అప్పీలు విధానం: దిగువస్థాయి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో సంతృప్తి చెందనివారు ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోవచ్చు. మనదేశంలో న్యాయస్థానాలు మూడు స్థాయుల్లో ఉన్నాయి.


1. చాలామంది ప్రజలు ఆశ్రయించే న్యాయస్థానాలను ‘సబార్డినేట్‌’ లేదా జిల్లా న్యాయస్థానాలు అంటారు. ఇవి సాధారణంగా జిల్లా లేదా డివిజన్‌ స్థాయిలో ఉంటాయి. 


2. ప్రతి రాష్ట్రంలో ‘హైకోర్టు’ ఉంటుంది. 


3. దేశంలో అత్యున్నతమైన సుప్రీంకోర్టు దిల్లీలో ఉంది.


సివిల్, క్రిమినల్‌ నేరాలు


సివిల్‌ వివాదాలు: భూమి, ఆస్తి, ఆదాయాలపై ప్రజల హక్కులు, వారి మధ్య ఉన్న లావాదేవిలకు సంబంధించినవి. సివిల్‌ వివాదాల్లో జైలుశిక్ష వేయకపోవచ్చు. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పంద ఉల్లంఘన లేదా మోసం వల్ల నష్టపోయాననుకున్న వ్యక్తే స్వయంగా సివిల్‌ కేసు దాఖలు చేస్తాడు.


క్రిమినల్‌ వివాదాలు: దొంగతనం, దోపిడీ, లంచం ఇవ్వడం, కల్తీ మందులు తయారు చేయడం, గొడవలు క్రిమినల్‌ వివాదాలు. ఈ కేసులన్నింటినీ పోలీసులు పరిశీలిస్తారు. సాధారణంగా ఈ తరహా కేసుల్లో దోషులకు జైలుశిక్ష విధిస్తారు.


ప్రభుత్వ న్యాయవాది పాత్ర


* క్రిమినల్‌ నేరాన్ని ప్రజలపై జరిగిన అపరాధంగా భావిస్తారు. అంటే ఈ నేరం బాధితులపైనే కాకుండా సమాజంపైనా జరిగిందని భావిస్తారు. 


* న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాది ప్రజల ప్రయోజనాలకు ప్రతినిధిగా ఉంటారు. పోలీసులు విచారణ చేసి న్యాయస్థానంలో నేరారోపణ పత్రం దాఖలు చేసిన తరువాత ప్రభుత్వ న్యాయవాది పాత్ర మొదలవుతుంది.


* విచారణలో ప్రభుత్వ న్యాయవాది పాత్ర ఉండదు. అతడు ప్రభుత్వం తరపున వాదిస్తాడు. న్యాయస్థాన అధికారిగా అతడు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సాక్షులను, రుజువులను న్యాయస్థానం ముందుంచి కేసుపై నిర్ణయం తీసుకోవడానికి సహకరిస్తారు.


* చట్టం ముందు అందరూ సమానులేనని చట్టం చెబుతుంది. నేర విచారణ అమాయకులు అనే భావనతో మొదలవుతుంది 



న్యాయమూర్తి పాత్ర 


న్యాయమూర్తి ఆటలో ‘అంపైర్‌’ లాంటివారు. ఈయన విచారణ నిష్పక్షపాతంగా, బహిరంగంగా నిర్వహిస్తారు. నిందితుడు దోషి అని తేలితే శిక్ష విధిస్తూ తీర్పులిస్తారు. చట్టం ఏం చెబుతుంది అనే దాన్ని బట్టి శిక్ష విధిస్తారు. లేదా జరిమానా వేయవచ్చు లేదా రెండూ విధించవచ్చు.
 

  నేర (క్రిమినల్‌) చట్టం    పౌర (సివిల్‌) చట్టం
ఇది నేరంగా పరిగణించే చర్యలకు సంబంధించింది.
ఉదా: దొంగతనం, వరకట్నం, హత్య.
ఇది ఒక వ్యక్తి ఒప్పం దాన్ని ఉల్లంఘించడం వల్ల మరో వ్యక్తికి జరిగే నష్టానికి సంబంధించింది.
ఉదా: అద్దె, సరకుల కొనుగోలు, విడాకులు
సాధారణంగా ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదైన తరువాత పోలీస్‌ విచారణతో మొదలవుతుంది. ఆ తర్వాత న్యాయస్థానంలో కేసు వేస్తారు.

నష్టానికి గురైన వ్యక్తి న్యాయస్థానంలో దావా వేయాలి.

ఉదా: అద్దె వివాదంలో యజమాని లేదా కిరాయిదారు.

దోషి అని రుజువైతే జరిమానాతో పాటు జైలుకూ పంపించవచ్చు.  నష్టానికి గురైన వ్యక్తి కోర్టు ద్వారా ఉపశమనం పొందుతారు.


 

Posted Date : 19-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌