• facebook
  • whatsapp
  • telegram

స్థానిక స్వపరిపాలనా సంస్థలు

  గత గ్రూప్−4, వీఆర్‌వో, వీఆర్ఏ, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీ తదితర ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు 73, 74 రాజ్యాంగ సవరణలకు ముందున్న కమిటీలు, సిఫారసులు; స్వాతంత్రోద్యమ కాలం నాటి సమాజ వికాస కార్యక్రమాలతోపాటు బల్వంత్‌రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీలు; నూతన పంచాయతీ రాజ్ చట్టానికి సంబంధించిన అంశాలను గుర్తుంచుకోవాలి.


సమాజ వికాస ప్రయోగం - 73, 74 రాజ్యాంగ సవరణలు, వాటి అమలు

* స్థానిక పాలనా వ్యవహారాలను సమర్థంగా నిర్వహించేందుకు తోడ్పడే సంస్థలే స్థానిక ప్రభుత్వాలు. వీటినే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ (Democracy Decentralisation) అంటారు.
* భారత రాజ్యాంగంలోని 40వ నిబంధన పంచాయతీ రాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొంటుంది.
* 'గ్రామ స్వరాజ్యమే రామ రాజ్యం' - గాంధీజీ
* 'దేశ వనరులన్నింటిలో గ్రామీణ వనరులు అతి ముఖ్యమైనవి' - జవహర్‌లాల్ నెహ్రూ
* కేంద్ర ప్రభుత్వం ఎల్.ఎమ్. సింఘ్వీ కమిటీ సూచనల మేరకే పంచాయతీ రాజ్, నగరపాలక సంస్థలకు 73, 74 రాజ్యాంగ సవరణల (1992) ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించింది.


చారిత్రక నేపథ్యం


* రుగ్వేదంలో సభ, సమితి అనే రెండు స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రస్తావన ఉంది.
* కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో గ్రామిక, గ్రామ కూటమి అనే గ్రామాధికారుల గురించి ప్రస్తావించాడు.
* గ్రామాధికారిని గ్రామణి అని, పది గ్రామాలకు అధిపతిని దశగ్రామణి అని పిలిచేవారు.
* మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగరంలోని మున్సిపల్ ప్రభుత్వం గురించి ప్రస్తావించాడు.
* చోళుల పరిపాలనా వ్యవస్థను 'ఉత్తర మేరూర్' శాసనం తెలియజేస్తుంది. ఈ శాసనాన్ని వేయించిన చోళ చక్రవర్తి మొదటి పరాంతక చోళుడు. ఉత్తర మేరూర్ అనేది తమిళనాడులోని ఒక గ్రామం. చోళులు తాటాకులను బ్యాలెట్ పత్రాలుగా, కుండలను బాక్సులుగా ఉపయోగించేవారని ఈ శాసనం తెలియజేస్తుంది.
* గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ సమస్యల పరిష్కారానికి అయిదుగురు సభ్యులతో కూడిన 'పంచాస్' అనే ఒక మండలి ఉండేది. పంచాస్ అనే పదం తర్వాతి కాలంలో పంచాయతీగా మారిందని ప్రతీతి.
* ఢిల్లీ సుల్తానుల కాలంలో గ్రామస్థాయిలో పంచాయతీలు ఉండేవి. భూమిని కొలిచి, దాని ఆధారంగా శిస్తు విధించే విధానాన్ని షేర్షా ప్రారంభించాడు.
* మొగలుల కాలంలో పట్టణ పాలనకు కొత్వాల్ అనే అధికారిని నియమించేవారు. కొత్వాల్‌కు, సహాయంగా మున్సబ్ అనే అధికారి ఉండేవాడు.


బ్రిటిష్ కాలంలో స్థానిక సంస్థలు


* రెండో జేమ్స్ చక్రవర్తి జారీ చేసిన చార్టర్ (1687) ద్వారా పన్నుల వసూలు కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్‌ను స్థాపించింది. పన్ను విధింపును ప్రజలు వ్యతిరేకించడంతో 1726లో కార్పొరేషన్ స్థానంలో 'మేయర్ కోర్టుల'ను ఏర్పాటుచేశారు.
* బ్రిటిష్‌వారు జిల్లాను ఒక పరిపాలనా యూనిట్‌గా తీసుకొని 1772, మే 11న కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టారు. దీన్ని వారన్‌హేస్టింగ్స్ గవర్నర్ జనరల్‌గా ఉన్న సమయంలో చేపట్టారు.
* 1793లో మద్రాసు, కలకత్తా, బొంబాయి పట్టణాల్లో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించారు.
* భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా పనిచేసిన చార్లెస్ మెట్‌కాఫ్ (1835 − 1836) గ్రామీణ సమాజాలను 'లిటిల్ రిపబ్లిక్స్‌'గా అభివర్ణించాడు.
* 1870లో భారతదేశంలో మొదటిసారిగా వైస్రాయ్ లార్డ్ మేయో స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు.
* లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక, పాలనా పరమైన అధికారాలను బదలాయిస్తూ 1882, మే 18న ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు దీన్ని 'మాగ్నాకార్టా'గా వర్ణించారు. అందుకే లార్డ్ రిప్పన్‌ను స్థానిక స్వపరిపాలన పితామహుడు (The father of local self government) అంటారు.
* 1882 − 1884 స్థానిక ప్రభుత్వాల చట్టం ప్రకారం రిప్పన్ మూడంచెల పాలనను సూచించాడు. అవి:
     » కిందిస్థాయిలో గ్రామ పంచాయతీలు
     » మధ్యస్థాయిలో − తాలుకా బోర్డులు
     » పైస్థాయిలో − జిల్లా బోర్డులు
* వీటికి మౌలిక స్వరూపాన్ని కల్పిస్తూ, అభివృద్ధి చేయడం వల్ల లార్డ్ రిప్పన్‌ను స్థానిక స్వపరిపాలన పితామహుడిగా పేర్కొంటారు.
* స్థానిక ప్రభుత్వాలకు తొలిసారిగా 1884లో మద్రాసు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి.


రాయల్ కమిషన్ (1907)

* స్థానిక సంస్థల పనితీరును సమీక్షించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం చార్లెస్ హబ్ హౌస్ నేతృత్వంలో రాయల్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ కమిషన్ 1909లో నివేదికను సమర్పిస్తూ స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉండాలని సూచించింది.
* 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర జాబితాలో చేర్చారు. అవి:
     » జిల్లా బోర్డులు − 207
     » తాలుకా బోర్డులు − 584
* 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రాష్ట్రాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించారు.


స్వాతంత్రోద్యమ కాలంలో సమాజ వికాస కార్యక్రమాలు


1) గుర్గావ్ ప్రయోగం (1920)
* 1920లో పంజాబ్‌లోని గుర్గావ్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన ఎఫ్.ఐ. బ్రేయన్ గ్రామీణాభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించాడు. వ్యవసాయ ఉత్పత్తి, ప్రజారోగ్యాన్ని పెంపొందించడం; అభివృద్ధి ఫలాలను వ్యవస్థీకరించడం, ఉత్సవాలు, వివాహాలకు అయ్యే ఖర్చును తగ్గించి సమాజ అభివృద్ధికి తోడ్పడటం లాంటివి ఈ ప్రయోగం ముఖ్య లక్ష్యాలు. ఈ ఉద్యమ ప్రాముఖ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం 1935 − 36లో కోటి రూపాయలను దీనికి కేటాయించింది.


2) మార్తాండం ప్రయోగం (1921)
* తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో మార్తాండం అనే ప్రాంతంలో అమెరికన్ వ్యవసాయ నిపుణుడు స్పెన్సర్ హచ్ నేతృత్వంలో 70 గ్రామాలను ఎంపిక చేసి YMCA (Young Mens Christian Association) సహకారంతో గ్రామీణ ప్రజల జీవితాల్లో కీలకపాత్ర పోషించే మౌలికాంశాలపై శిక్షణ ఇస్తూ తద్వారా ప్రజలను చైతన్యపరచడానికి ఈ ప్రయోగం చేశారు.

3) శ్రీనికేతన్ ప్రయోగం (1921)
* విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తాలోని శాంతినికేతన్‌లో విద్యా బోధనలో భాగంగా సమాజ వికాసానికి కృషి చేశాడు. 1921లో 'ఆత్మగౌరవంతో స్వయం సమృద్ధిని సాధించడం' అనే అంశంతో ఒక ప్రయోగాన్ని చేశాడు. దీని ద్వారా చిన్నతరహా కుటుంబ పరిశ్రమల నిర్వహణకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తూ వయోజన విద్య, ఆరోగ్య సంరక్షణ లాంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

4) బరోడా ప్రయోగం (1932)
* బరోడా సంస్థానంలో దివాన్‌గా పనిచేసిన వి.టి. కృష్ణమాచారి ఈ ప్రయోగాన్ని నిర్వహించాడు. రోడ్లు వేయడం, కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమాభివృద్ధి మొదలైన రంగాల్లో గ్రామీణ యువతను చైతన్యవంతుల్ని చేసి స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాడు.

5) సేవాగ్రామ్ ప్రయోగం (1933)
* మహారాష్ట్రలోని వార్ధాలో ప్రయోగాత్మకంగా సేవాగ్రామ్‌ను స్థాపించారు. ఈ సంస్థ సర్వోదయ, నవోదయ సిద్ధాంతాలను అనుసరిస్తుంది. ఆచార్య వినోబాభావే, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఈ సిద్ధాంతాలకు ఆకర్షితులై అనేక సమాజ వికాస కార్యక్రమాలను నిర్వహించారు.

6) ఫిర్కా ప్రయోగం (1946)
* 1946లో అప్పటి మద్రాసు సీఎం టంగుటూరి ప్రకాశం తాలుకాలను ఫిర్కాలుగా విభజించి, వాటి అభివృద్ధికి కొన్ని ప్రయోగాలను చేశాడు. వీటినే ఫిర్కా ప్రయోగాలు అంటారు. 1952లో సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఫిర్కాలను బ్లాకుల్లో విలీనం చేశారు.

7) ఇటావా ప్రయోగం (1948)
* ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఉన్న మహేవా ప్రాంతంలో ఆల్బర్ట్ మేయర్ అనే విదేశీ ఇంజినీర్ సహాయంతో 97 గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా పౌర సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నించారు. కళారూపాల ద్వారా సామాజిక చైతన్యం, సమాజ అభివృద్ధికి సంబంధించిన అంశాలను; వ్యవసాయం, చేనేత, పాడి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఉత్తర్‌ ప్రదేశ్ ప్రభుత్వం కృషిచేస్తుంది.

8) నీలోఖేరి ప్రయోగం (1948)
* ఈ ప్రయోగం ద్వారా హరియణాలోని కర్నాల్ జిల్లాలో ఉన్న నీలోఖేరి అనే ప్రాంతంలో భారత విభజన సందర్భంగా నిరాశ్రయులైన దాదాపు 7 వేల మందికి పునరావాసం కల్పించారు. స్వయంశక్తితో అభివృద్ధి చెందేలా ఎస్.కె. డే నాయకత్వంలో వ్యవసాయ పనిముట్ల తయారీ, ఇంజినీరింగ్ వర్క్స్ మొదలైన అంశాలపై శిక్షణ ఇచ్చారు.

స్వాతంత్య్రం తర్వాత సమాజ వికాస కార్యక్రమాలు

* స్వాతంత్య్రం వచ్చే నాటికి భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితిలో ఉంది.
* భారత ప్రభుత్వం సమగ్ర గ్రామీణాభివృద్ధి ద్వారా వ్యవసాయాభివృద్ధిని సాధించాలని Grow more food అనే నినాదంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి సమాజ అభివృద్ధి కార్యక్రమాన్ని (Community Development Programme − CDP) ఏర్పాటుచేసింది.
* ఈ కార్యక్రమాన్ని మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా 1952, అక్టోబరు 2న ఏర్పాటుచేశారు.
* CDP ఛైర్మన్ వి.టి. కృష్ణమాచారి.
* అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో CDPని ప్రారంభించారు.
* కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అనే భావనను అమెరికా నుంచి స్వీకరించారు.
* ఈ పథకం అమలుకు నాటి అమెరికా రాయబారి చెస్టర్ బౌల్స్ ఫోర్డ్ ఫౌండేషన్ ద్వారా 50 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించాడు. 1971 నాటికి ఈ ఫౌండేషన్ భారత్‌కు దాదాపు 104 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించింది.

CDP ముఖ్యాంశాలు:
* దేశాన్ని కొన్ని బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకులో దాదాపు 100 గ్రామాలను చేర్చారు. దీన్ని మొదట 55 బ్లాకులతో ప్రయోగాత్మకంగా ప్రారంభించి తర్వాత 5011 బ్లాకులకు విస్తరించారు. 70 వేల జనాభాకు ఒక బ్లాకు చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి బ్లాకుకు ఒక బ్లాకు డెవలప్‌మెంట్ అధికారి (BDO)ని నియమించారు. ఇతడు బ్లాకు స్థాయిలో ప్రధాన కార్యనిర్వహణాధికారి.
* వ్యవసాయం, ప్రాథమిక విద్య, ఆరోగ్యం, గృహవసతి, గ్రామీణ కుటీర పరిశ్రమలు, సాంఘిక సంక్షేమం, గ్రామీణ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
* CDP కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి గ్రామ సేవక్ అనే అధికారి ఉండేవాడు.

జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (National Extention Service Scheme - NESS):
* జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాన్ని 1953, అక్టోబరు 2న ఏర్పాటుచేశారు.
* ఈ కార్యక్రమాన్ని మిగిలిన 1700 బ్లాకుల్లో ఏర్పాటుచేశారు.
* CDP, NESS రెండు కార్యక్రమాల ఉద్దేశం, లక్ష్యం ఒకటే. వీటికి కేంద్ర ప్రభుత్వమే నిధులను సమకూరుస్తుంది.
* NESS ఛైర్మన్ వి.టి. కృష్ణమాచారి.
* CDP కార్యక్రమాన్ని 3 సంవత్సరాల కాలపరిమితికి, NESS ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేశారు.

CDP, NESS కింద పనిచేసే పాలనా విభాగాలు:
1. కేంద్ర స్థాయి: కేంద్ర సమాజ అభివృద్ధి శాఖ, సహకార మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. కేంద్ర క్యాబినేట్ వీటి విధానాలను రూపొందిస్తుంది.
2. రాష్ట్రస్థాయి: రాష్ట్ర అభివృద్ధి మండలి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది. దీనిలో రాష్ట్ర సమాజ అభివృద్ధి మంత్రి సభ్యుడిగా, అభివృద్ధి కమిషనర్ కార్యదర్శిగా (సెక్రటరీ), కమిషనర్ కార్యనిర్వాహణాధికారిగా ఉంటారు.
3. జిల్లాస్థాయి: జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తాడు.
4. బ్లాకుస్థాయి: గ్రామాలను కొన్ని బ్లాకులుగా విభజిస్తారు. ఇది BDO పర్యవేక్షణలో ఉంటుంది.
5. గ్రామస్థాయి: విలేజ్ లెవల్ వర్కర్స్‌ని నియమిస్తారు.

CDP, NESS కి సంబంధించిన వ్యాఖ్యానాలు:
* 'సుశిక్తుడైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనం' - ఎస్.కె. డే (NESS, CDP కేంద్ర అడ్మినిస్ట్రేటర్)
* 'నిశ్శబ్ద విప్లవం' - జవహర్‌లాల్ నెహ్రూ
* ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం, ప్రజల భాగస్వామ్యం లేకపోవడం వల్ల CDP, NESS కార్యక్రమాలు విఫలమయ్యాయి.
* ప్రజల భాగస్వామ్యం 'ఆర్థిక వికేంద్రీకరణ' పేరుతో కేంద్ర ప్రభుత్వం మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బల్వంత్‌రాయ్ గోపాల్ మెహతా కమిటీని నియమించింది.

బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ

* కేంద్రప్రభుత్వం 1957, జనవరి 16న బల్వంత్‌రాయ్ మెహతా కమిటీని నియమించింది. ఇది 1957, నవంబరు 24న తన నివేదికను సమర్పించింది. జాతీయాభివృద్ధి మండలి (NDC) 1958, జనవరిలో ఈ కమిటీ సిఫారసులను ఆమోదించింది.

ముఖ్యమైన సిఫారసులు:
* మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.
     » గ్రామ స్థాయిలో − గ్రామ పంచాయతీ
     » మండల స్థాయిలో − పంచాయతీ సమితి
     » జిల్లా స్థాయిలో − జిల్లా పరిషత్
* ఈ మూడంచెల మధ్య పరోక్ష ఎన్నికల ద్వారా అంతర్గత సంబంధం ఉండాలని సూచించింది.
* ఎన్నికలను గ్రామస్థాయిలో ప్రత్యక్షంగా, జిల్లా పరిషత్‌కు పరోక్షంగా నిర్వహించాలి. పార్టీల ప్రమేయం లేకుండా ఎన్నికలు జరగాలి.
* జిల్లా పరిషత్‌కు కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
* పంచాయతీ సమితికి కార్యనిర్వాహక, జిల్లా పరిషత్‌కు పర్యవేక్షణ అధికారాలను ఇవ్వాలి.
* మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను మొదటిసారిగా రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా సికార్ గ్రామంలో 1959, అక్టోబరు 2న జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో 1959, అక్టోబరు 11న మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ (ప్రస్తుతం తెలంగాణ), తర్వాత 1959, నవంబరు 1న రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ప్రారంభించారు.
* రెండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను తమిళనాడులో ఏర్పాటుచేశారు.
* నాలుగంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటుచేసిన ఏకైక రాష్ట్రం పశ్చిమ్ బంగ.

పంచాయతీ రాజ్ వ్యవస్థ వర్తించని రాష్ట్రాలు

1) నాగాలాండ్
2) మేఘాలయ
3) జమ్మూ కశ్మీర్ (గూర్ఖా అటానమస్ ప్రాంతాలు)
4) పశ్చిమ్ బంగ (కొండ ప్రాంతాలు)
5) అరుణాచల్‌ప్రదేశ్
6) న్యూదిల్లీ

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌