• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యసప్లై కొలమానాలు

నగదు చెలామణి లెక్క పక్కా!

  అవసరాలను అనుసరించి నిర్దేశిత సమయాల్లో ఆర్‌బీఐ కరెన్సీని అంటే ఆర్థిక పరిభాషలో ద్రవ్యాన్ని లేదా నగదును ముద్రించి మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. అది రకరకాల ఆర్థిక కార్యకలాపాల మధ్య దేశంలో తిరుగుతుంటుంది. అయితే ఎంత ద్రవ్యం సరఫరా జరిగి, ఏవిధంగా చెల్లుబాటు అవుతోందనే విషయాలను అత్యున్నత బ్యాంకు నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. అందుకోసం కొన్ని రకాల కొలమానాలను రూపొందించింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ప్రభావాలను నియంత్రించడానికి, ఆర్థిక వృద్ధిని, స్థిరత్వాన్ని సాధించడానికి, నగదు చెలామణి లెక్కలను పక్కాగా తేల్చడానికి ఆ కొలమానాలు ఉపయోగపడతాయి. వాటికి సంబంధించిన నిర్వచనాలను, సిద్ధాంతాలను, ఇతర అంశాలను పోటీ పరీక్షల కోణంలో అభ్యర్థులు తెలుసుకోవాలి. 

  ద్రవ్య సప్లైకి సంబంధించి రెండు నిర్వచనాలు ఉన్నాయి. 

1) సంప్రదాయ నిర్వచనం: ఈ నిర్వచనంలో ప్రజల దగ్గర కరెన్సీ, బ్యాంకుల వద్ద ఉండే డిమాండ్‌ డిపాజిట్లను కలిపి ద్రవ్య సప్లైగా పేర్కొన్నారు.  

ద్రవ్యసప్లై = ప్రజల దగ్గర కరెన్సీ + బ్యాంకుల్లోని డిమాండ్‌ డిపాజిట్లు.

2) చికాగో అర్థశాస్త్రవేత్త నిర్వచనం: చికాగో   ఆర్థికవేత్త మిల్టన్‌ ఫ్రీడ్‌మన్‌ టైమ్‌ డిపాజిట్లను కూడా ద్రవ్యసప్లైలో చేర్చాడు. 

ద్రవ్యసప్లై = ప్రజల దగ్గర కరెన్సీ + బ్యాంకుల్లో ఉండే డిమాండు డిపాజిట్లు + టైమ్‌ డిపాజిట్లు 

  సంప్రదాయ ఆర్థికవేత్తలు ద్రవ్య నిర్వచనానికి సంకుచిత అర్థాన్ని ఇస్తే చికాగో ఆర్థికవేత్త ద్రవ్య నిర్వచనానికి విస్తృత అర్థాన్ని ఇచ్చాడు.

భారతదేశంలో ద్రవ్య సప్లై: 1967-68 వరకు భారత దేశంలో సంప్రదాయ ఆర్థికవేత్తల నిర్వచనాన్ని అమలు చేశారు. 1968 తర్వాత ఆర్‌బీఐ చికాగో ఆర్థికవేత్తల నిర్వచనాన్ని ప్రకటించింది. 1977లో ఆర్‌బీఐ నాలుగు రకాల ద్రవ్య సప్లై  కొలమానాలను ప్రకటించింది. అవి ఎమ్‌-1, ఎమ్‌-2, ఎమ్‌-3, ఎమ్‌-4.

నూతన ద్రవ్యం - ద్రవ్యత్వ వనరులు: 1997లో డాక్టర్‌ వై.వి రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన వర్కింగ్‌ గ్రూపు ద్రవ్య సప్లైపై అధ్యయనం చేసి 1998లో నివేదికను సమర్పించింది. ఇది మూడేసి చొప్పున నూతన ద్రవ్య కొలమానాలను, ద్రవ్యత్వ కొలమానాలను ప్రకటించింది. దాని ప్రకారం పోస్టాఫీసులోని పొదుపు డిపాజిట్లను, మొత్తం డిపాజిట్లను ద్రవ్య సప్లై  పరిధి నుంచి తొలగించారు. 

నూతన ద్రవ్యకొలమానాలు మూడు రకాలు:  అవి ఎమ్‌-1, ఎమ్‌-2, ఎమ్‌-3.

ద్రవ్యత్వ వనరులు: ఆర్‌బీఐ వర్కింగ్‌ గ్రూప్‌ కొత్తగా మూడు రకాల ద్రవ్యత్వ వనరులను  ప్రవేశపెట్టింది. అవి ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3.

రిజర్వు ద్రవ్యం: ద్రవ్య సప్లైని నిర్ణయించే 

అంశాల్లో ముఖ్యమైంది రిజర్వు ద్రవ్యం. రిజర్వు బ్యాంకు జారీ చేసి, ప్రజలు, ఇతర బ్యాంకుల వద్ద నిల్వ ఉంచే ద్రవ్యాన్ని రిజర్వు ద్రవ్యం అంటారు. దీన్ని ప్రభుత్వ ద్రవ్యం, మూలాధార ద్రవ్యం, హైపర్‌ ద్రవ్యం, ప్రాథమిక ద్రవ్యం అని వివిధ పేర్లతో వ్యవహరిస్తారు. 

  1991, మార్చి నాటికి ప్రజల వద్ద ఉన్న కరెన్సీ 63 శాతం కాగా 2021, ఆగస్టు నాటికి అది           79.46 శాతంకి పెరిగింది. ఆర్‌బీఐ వద్ద ఉన్న రిజర్వులు, బ్యాంకుల్లో ఇదే కాలంలో 36.2 శాతం నుంచి 19.03 శాతానికి తగ్గాయి. ఆర్‌బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు 2021 నాటికి 1.2 శాతం మాత్రమే. సాధారణ ద్రవ్యానికి రిజర్వు ద్రవ్యానికి మధ్య ఉన్న తేడా సాధారణ ద్రవ్యంలో డిమాండ్‌ డిపాజిట్లు ఉంటాయి. రిజర్వు ద్రవ్యంలో బ్యాంకుల వద్ద నిల్వలు ఉంటాయి.


సాధారణ ద్రవ్యం (ఎమ్‌-1) = ప్రజల వద్ద ఉన్న కరెన్సీ + బ్యాంకుల వద్ద ఉన్న డిమాండ్‌ డిపాజిట్లు + రిజర్వు బ్యాంకు ఇతర డిపాజిట్లు 


రిజర్వు ద్రవ్యం (హెచ్‌) = ప్రజల వద్ద ఉన్న కరెన్సీ + ఆర్‌బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు + వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న నగదు నిల్వలు 


ద్రవ్య ప్రసార వేగం: ఒక నిర్ణీత కాలంలో ఒక యూనిట్‌ ద్రవ్యం ఎన్నిసార్లు వస్తుసేవలు కొనుగోలు చేయడానికి చేతులు మారుతుందో తెలియజేసేదే ద్రవ్య ప్రసార వేగం. అది పలు అంశాలపై ఆధారపడుతుంది. అవి 1) పరపతి సంస్థలు 2) నగదు వ్యవహారాలు 3) వినియోగ ప్రవృత్తి 4) ఆదాయ పంపిణీ 5) ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు 6) వేతన విధానం 7) రెగ్యులర్‌ ఆదాయం 8) పారిశ్రామిక అభివృద్ధి 9) రవాణా అభివృద్ధి 10) ప్రసార సాధనాల అభివృద్ధి


భారతీయ కరెన్సీ: భారతదేశ ద్రవ్య వ్యవస్థ మూలాధార యూనిట్‌ రూపాయి. ఇది కాగితాలు, నాణేల రూపంలో ఉంటుంది. 1957కు పూర్వం రూపాయి, అణాలు, పైసలుగా కరెన్సీ వ్యవస్థ అమలులో ఉండేది. 1957, ఏప్రిల్‌ నుంచి దశాంశ వ్యవస్థను ప్రవేశపెట్టారు. 


కాగితపు కరెన్సీ: భారతదేశంలో కాగితపు కరెన్సీ జారీ 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. 1861 పేపర్‌ కరెన్సీ చట్టం భారత ప్రభుత్వానికి కాగితపు కరెన్సీ జారీ చేసే అధికారాన్ని కట్టబెట్టింది. అప్పటి నుంచి 1938 వరకు భారత ప్రభుత్వమే కరెన్సీ నోట్లను జారీ చేసేది. 1938 నుంచి రిజర్వు బ్యాంకు కరెన్సీ నోట్లను జారీ చేస్తోంది. ఒక రూపాయి నోటును ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. ప్రస్తుతం రిజర్వు బ్యాంకు రూ.10, రూ.20, రూ.50, రూ.100,   రూ.200, రూ.500, రూ.2000 విలువైన కాగితపు కరెన్సీ నోట్లను జారీ చేస్తోంది.

నాణేలు: ప్రాచీన కాలంలో ప్రపంచ ద్రవ్యవ్యవస్థలో నాణేలు జారీ చేసిన దేశాల్లో భారత దేశం ఒకటి. క్రీ.పూ. ఆరో శతాబ్దంలో సిర్కా చెలామణిలో ఉండేది. జనపదాలు, మౌర్యుల కాలం నుంచి నాణేలు వినియోగంలో ఉన్నాయి. క్రీ.పూ. 7 నుంచి 1వ శతాబ్దం మధ్యకాలం వరకు ముందువైపు చిత్రాలు ముద్రించిన వెండి నాణేలు చెలామణిలో ఉండేవి. వాటిని పంచ్‌ మార్క్‌డ్‌ నాణేలు అనేవారు. దేశవ్యాప్తంగా ఒకే విధంగా నాణేల వ్యవస్థ రూపొందడం మొగల్‌ చక్రవర్తుల పాలనలో జరిగింది. షేర్షా కాలం రూపియా పేరుతో వెండినాణెం ఉండేది. అది 178 గ్రాముల బరువు ఉండేది. ‘మొహర్‌’ అనే బంగారు నాణెం, ‘డామ్‌’ అనే రాగి నాణెం ఉండేవి. ఆధునిక భారతీయ రిపబ్లిక్‌ రూపాయి నాణేలు 1950లో మొదటిసారిగా ముద్రితమయ్యాయి. ప్రస్తుతం 1, 2, 5, 10 రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయి. 

రూపాయి చిహ్నం: భారతీయ రూపాయి చిహ్నం  2010, జులై నుంచి అమల్లోకి వచ్చింది. అంతకు పూర్వం Rs గుర్తు వాడుకలో ఉండేది. బాంబే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థి డి.ఉదయ్‌ కుమార్‌ దీని రూపకల్పన చేశారు. ఈ చిహ్నం దేవనాగరి  లిపి అక్షరం లాటిన్‌ కాపిటల్‌ అక్షరం  సమ్మేళనం.


కరెన్సీ నోట్ల రద్దు: 2016, నవôబరు 8న రిజర్వు బ్యాంకు రూ.1000 రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేసింది. ఆ రోజుకు 15.41 లక్షల కోట్ల విలువైన ఈ రెండు పెద్ద నోట్లు చెలామణిలో ఉన్నాయి. రద్దు తర్వాత 15.13 లక్షల కోట్ల చెలామణి నుంచి బ్యాంకులకు తిరిగి వచ్చాయని రిజర్వు బ్యాంకు ప్రకటించింది. 2016లో నవంబరు 10 నుంచి కొత్త రూ.2000 రూ.500 నోట్లను విడుదల చేశారు. 


రూపాయి నోటు ముద్రణ పునరుద్ధరణ:  1991 నవంబరులో రూపాయి నోటు ముద్రణను   నిలిపివేశారు. దీనికి ముద్రణ వ్యయం      పెరగడమే ప్రధాన కారణం. 1995లో రూ.2, రూ.5 నోట్ల ముద్రణ నిలిపివేశారు. 20 ఏళ్ల తర్వాత 2015, మార్చి 5 నుంచి రూపాయి నోటు ముద్రణను పునరుద్ధరించారు.  


డిజిటల్‌ చెల్లింపులు: దేశంలో ఆర్థిక లావాదేవీల్లో నగదు చెల్లింపులకు బదులుగా డిజిటల్‌ చెల్లింపును ప్రోత్సహించడానికి తగిన సూచనలివ్వడం కోసం కేంద్రప్రభుత్వం 2017, జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంఘం జనవరి 24న నివేదికను సమర్పించింది. 

ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతాలు 

సంప్రదాయ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: దీనిలో ఫిషర్‌ సిద్ధాంతం ముఖ్యమైంది. ఇతడి ప్రకారం ద్రవ్యం, వినిమయ మాధ్యమంగా పనిచేయడంతో వస్తు సేవలు కొనేందుకు ఉపయోగపడుతుంది. అందువల్ల ద్రవ్యాన్ని డిమాండ్‌ చేస్తారు. 

నవ్య సంప్రదాయ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: దీన్ని కేంబ్రిడ్జి ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. ద్రవ్యం విలువల నిధిగా పనిచేయడం వల్ల భవిష్యత్తు ఖర్చు కోసం ద్రవ్యాన్ని డిమాండ్‌ చేస్తారు. 

కీన్స్‌ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: జె.ఎమ్‌. కీన్స్‌ ప్రకారం ద్రవ్యాన్ని వినిమయ సాధనంగా మాత్రమే కాకుండా విలువల నిధిగా కూడా ఉపయోగిస్తారు. కీన్స్‌ను అనుసరించి ద్రవ్య డిమాండ్‌ను ద్రవ్యత్వాభిరుచి నిర్ణయిస్తుంది.  కీన్స్‌ తర్వాత ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతాలు మూడు రకాలున్నాయి. 

బౌమల్‌ సిద్ధాంతం: బౌమల్‌ ప్రకారం వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్‌ కూడా వడ్డీ రేటుతో వ్యాకోచత్వ సంబంధాన్ని కలిగి ఉంటుంది. వ్యక్తులు, సంస్థలు వ్యాపార వ్యవహారాలపై ద్రవ్యాన్ని తమ వద్ద ఉంచుకుంటే వడ్డీని కోల్పోవాల్సి వస్తుంది. మార్కెట్‌లో వడ్డీరేటు ఎక్కువగా ఉంటే తమవద్ద తక్కువ ద్రవ్యం ఉంచుకోగలుగుతారు. అంటే వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్‌కు వడ్డీ రేటుకు విలోమ సంబంధం ఉంటుంది. ఆదాయం పెరిగితే వ్యాపార వ్యవహారాల కోసం ఉంచుకునే ద్రవ్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆదాయం, వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్‌కు అనులోమ సంబంధం ఉంటుంది. బౌమల్‌ ప్రకారం వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్‌ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి 1) వడ్డీ రేటు 2) ఆదాయం.

టోబిన్‌ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: కీన్స్‌ ప్రకారం వ్యక్తులు తమ ఆస్తిని ఎల్లప్పుడూ బాండ్లు లేదా నగదు రూపంలో నిల్వ చేస్తారు. టోబిన్‌ దీన్ని వ్యతిరేకించారు. సాధారణంగా వ్యక్తులు తమ ఆస్తి మొత్తాన్ని ఒకే రూపంలో కాకుండా కొంత భాగాన్ని బాండ్లు, మరికొంత భాగాన్ని నగదు రూపంలో ఉంచుతారు. తమ సంపదలో కొంత భాగాన్ని బాండ్ల రూపంలోకి మారిస్తే దానిపై ప్రతిఫలం వస్తుంది. ఒక్కోసారి వడ్డీరేటు తగ్గితే మూలధనం నష్టం కూడా సంభవించవచ్చు. 

ఫ్రీడ్‌మన్‌ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: దీన్నే ఆధునిక ద్రవ్యరాశి సిద్ధాంతం అని కూడా అంటారు.‘ద్రవ్యం సంపన్నుల సంపదను పెంచే ఒక సాధనం’ అని ఫ్రీడ్‌మన్‌ పేర్కొన్నారు. 

ద్రవ్య డిమాండ్‌ను నిర్ణయించే అంశాలు నాలుగు. అవి 1) ధరల స్థాయి 2) ఆదాయ స్థాయి 3) ప్రస్తుత వడ్డీ రేటు 4) సాధారణ ధరల స్థాయిలోని మార్పు రేటు.

డిజిటల్‌ వ్యవహారాల అంబుడ్స్‌మన్‌ పథకం:  2019 జనవరిలో రిజర్వు బ్యాంకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మొబైల్‌ వ్యాలెట్లు, యూపీఏ మొదలైన బ్యాంకేతర విధానాల ద్వారా జరిగే డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించి ఫిర్యాదులను ఉచితంగా పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుంది. 

క్రిప్టో కరెన్సీ:  ఇది ఒక రకమైన డిజిటల్‌ కరెన్సీ. దీనినే ప్రత్యామ్నాయ కరెన్సీ లేదా వర్చువల్‌ కరెన్సీ అంటారు. బ్లాక్‌ చెయిన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ కరెన్సీని చెలామణీ చేశారు. భారత దేశంలో రిజర్వు బ్యాంకు ఈ కరెన్సీని నిషేధించింది. 2009లో వచ్చిన బిట్‌కాయిన్‌ కూడా ఒక రకమైన క్రిప్టో కరెన్సీ.

హవాలా: చట్ట వ్యతిరేక పద్ధతుల్లో ఆర్జించిన సంపాదన దాచుకోవడానికి వ్యక్తులు లేదా సంస్థలు అక్రమ నిధులను సక్రమ సంపాదనగా చూపడాన్ని మనీ లాండరింగ్‌ అంటారు. 1998, జులైలో మనీలాండరింగ్‌ నిరోధక చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది 2002లో చట్టరూపం దాల్చింది. 

ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ డిపాజిట్‌ పథకం: దీనిని ఏప్రిల్‌ 2015లో ప్రారంభించారు. బ్యాంకులు/  పోస్టాఫీసులు డిపాజిట్లుగా ఉన్న లెక్క చూపని ద్రవ్యాన్ని ప్రకటించడం కోసం ఉద్దేశించారు.  

రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

Posted Date : 14-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌