• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకుల జాతీయీకరణ  

 సంపద పెంచి.. పరపతి విస్తరించి!
 


ప్రజా సంక్షేమమే లక్ష్యంగా భారత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో బ్యాంకుల జాతీయీకరణ ఒకటి. ఇది బ్యాంకుల సేవలను సామాన్యులకు చేరవేసిన విప్లవాత్మక సంస్కరణ. సంపద వికేంద్రీకరణ, ప్రాధాన్య రంగాలకు రుణ సాయం లాంటి లక్ష్యాలతో ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేయడంతో బ్యాంకింగ్‌ వ్యవస్థ స్వరూపమే మారిపోయింది. బ్యాంకుల వ్యాపార శైలి, వ్యవహార సరళి, దృక్పథాల్లో మార్పులు వచ్చాయి. బ్యాంకుల శాఖలు గ్రామాల బాట పట్టాయి. బ్యాంకింగ్‌లో ఆధునిక విధానాలు వచ్చాయి. సామాన్యుడి పరపతిని, ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని అనూహ్యంగా పెంచిన బ్యాంకుల జాతీయీకరణ పూర్వాపరాలపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. బ్యాంకుల జాతీయీకరణ ఫలితాలు, సంక్షేమ పథకాల్లో బ్యాంకుల పాత్ర, ప్రస్తుత బ్యాంకుల వర్గీకరణ-ప్రాతిపదికలనూ తెలుసుకోవాలి.

స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థలో వ్యాపార సంస్థలన్నీ లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తుంటాయి. ఇదే తరహాలో వాణిజ్య బ్యాంకులు కూడా లాభాల కోసమే కార్యకలాపాలు నిర్వర్తిస్తూ పోవడంతో వ్యవసాయం లాంటి ప్రాధాన్య రంగంతోపాటు పారిశ్రామిక అవసరాలకు నిధుల కొరత తలెత్తి ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. 1967లో హజారే కమిటీ ‘ఇండస్ట్రియల్‌ ప్లానింగ్‌ అండ్‌ లైసెన్సింగ్‌ పాలసీ’పై ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో... పరిశ్రమలు, బ్యాంకుల మధ్య అనుసంధానం లేకపోతే పరపతి ప్రణాళిక తీసుకురావడం కష్టమని చెప్పింది. దీంతో ప్రభుత్వం తొలుత ‘సోషల్‌ కంట్రోల్‌’ని ప్రవేశపెట్టింది. ఈ విధానంతో అనుకున్న ఫలితాలు రాకపోవడంతో 1969, జులై 19న నాటి ప్రధాని ఇందిరా గాంధీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. రూ.50 కోట్లు, అంతకంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న 14 వాణిజ్య బ్యాంకుల్ని జాతీయం చేశారు.

జాతీయీకరణ అనంతరం ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రధాన లక్ష్యాలు:

ఎ) బ్యాంకులు లేని గ్రామీణ ప్రాంతాలకు శాఖలను విస్తరించి డిపాజిట్లు సేకరించడం.

బి) ప్రాధాన్య రంగానికి సరిపడా రుణ సహాయం అందించడం.

జాతీయం చేసిన 14 బ్యాంకులు:  

1) సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

2) బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

3) పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు

4) కెనరా బ్యాంకు

5) యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంకు

6) సిండికేట్‌ బ్యాంకు

7) బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

8) యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

9) యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

10) దేనా బ్యాంకు

11) అలహాబాద్‌ బ్యాంకు

12) ఇండియన్‌ బ్యాంకు

13) ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు

14) బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర

1) బ్యాంకుల విస్తరణ:  జాతీయీకరణ అనంతరం బ్యాంకుల విస్తరణ వేగంగా జరిగింది. అందుకోసం పలు రకాల చర్యలు చేపట్టారు. 

లీడ్‌ బ్యాంకు పథకం: 1962లో జాతీయ పరపతి మండలి, డి.ఆర్‌.గాడ్గిల్‌ అధ్యక్షతన ఒక అధ్యయన బృందాన్ని నియమించి, సాంఘిక లక్ష్యాల అమలు కోసం బ్యాంకింగ్‌ వ్యవస్థలో మార్పులు సూచించాల్సిందిగా కోరింది. 1969లో ఎఫ్‌.కె.ఎఫ్‌. నారీమన్‌ అధ్యక్షతన రిజర్వ్‌ బ్యాంకు ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సంఘం లీడ్‌ బ్యాంకు పథకాన్ని ఆమోదించింది. ముంబయి, కోల్‌కతా, మద్రాస్, దిల్లీ, చండీగఢ్, గోవాల్లో తప్ప దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చింది. 2004, మార్చి నాటికి 587 జిల్లాలకు లీడ్‌ బ్యాంకు పథకం విస్తరించింది.

శాఖల విస్తరణ:

ఎ) బ్యాంకుల జాతీయీకరణ, లీడ్‌ బ్యాంకు పథకం తర్వాత బ్యాంకుల శాఖలు వేగంగా పెరిగాయి.  ఎస్‌బీఐ, ఇతర జాతీయం చేసిన బ్యాంకుల శాఖలు 92% పెరిగాయి.

బి) బ్యాంకుల శాఖల విస్తరణలో గుణాత్మక మార్పులొచ్చాయి. గ్రామాల్లో శాఖలు అధికమయ్యాయి. 1969 నాటికి గ్రామాల్లో బ్యాంకుల శాతం 22% కాగా, 2023, మార్చి నాటికి 34%కి చేరింది.  

సి) అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కంటే వెనుకబడిన ప్రాంతాల్లో బ్యాంకు శాఖల వృద్ధి ఎక్కువగా జరిగింది.

2) డిపాజిట్ల సేకరణ: వాణిజ్య బ్యాంకుల వద్ద మొత్తం డిపాజిట్ల విలువ 1969లో 43 బిలియన్‌ రూపాయలు ఉంటే, అది 2023, మార్చి నాటికి 1,70,087 బిలియన్‌ రూపాయలకు పెరిగింది. టైమ్‌ డిపాజిట్లు వేగంగా పెరుగుతున్నాయి. వీటి సేకరణలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది.మొత్తం డిపాజిట్లలో 1/4వ వంతు ఈ రాష్ట్రం నుంచే లభిస్తున్నాయి. పంజాబ్, హరియాణాలు అభివృద్ధి చెందిన రాష్ట్రాలైనప్పటికీ వీటి నుంచి 5.4% మాత్రమే లభిస్తున్నాయి.ఇవి వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలు కావడమే ఇందుకు కారణం.

3) బ్యాంకు రుణాలు: 1969 తర్వాతే వ్యవసాయ రంగానికి అనుకున్నంత స్థాయిలో రుణాలిస్తూ వచ్చారు. 1969లో బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.34 బిలియన్లు ఉంటే, అది 2023, మార్చి నాటికి రూ.1,22,587 బిలియన్లకు పెరిగాయి. ఇదే కాలంలో డిపాజిట్లు వృద్ధి చెందినంతగా రుణాలు వృద్ధి చెందలేదు. ఫలితంగా క్రెడిట్‌ డిపాజిట్‌ రేషియో (సీడీఆర్‌) 1976లో 80.8%గా ఉండగా 2023, మార్చి నాటికి 71.2%కి తగ్గింది.

4) రంగాల వారీగా పరపతి అభివృద్ధి: 1968లో వ్యవసాయ రంగానికి కేవలం 2.2% రుణాలే అందించారు. జాతీయీకరణ తర్వాత ఇవి పెరిగాయి. ‘గోర్వాల్‌ కమిటీ’ సమర్పించిన అఖిల భారత గ్రామీణ పరపతి సర్వే నివేదిక ప్రాధాన్య రంగాలకు (వ్యవసాయం, చిన్నపరిశ్రమలు) 18 శాతం రుణాలివ్వాలని సూచించింది. 2023, మార్చి నాటికి 19.15% పెరిగాయి. 1980లో ఆర్‌బీఐ ప్రాధాన్య రంగాలకు 40% రుణాలివ్వాలని పేర్కొంది. 2015, ఏప్రిల్‌లో ప్రాధాన్య రంగానికి నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, ఎగుమతి పరపతి, విద్యారంగం, హౌసింగ్, సాంఘిక అవస్థాపనా సౌకర్యాలు, పునరుత్పాదక విద్యుత్తు, ఇతర రంగాలు మొదలైన వాటిని ప్రాధాన్య రంగంలో చేర్చింది. ఆర్‌ఆర్‌బీలు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, యూకో బ్యాంకులు, 75% ప్రాధాన్య రంగానికి రుణాలివ్వాలని ఆర్‌బీఐ సిఫార్సు చేసింది. 2023, మార్చి నాటికి ప్రాధాన్య రంగానికి 42.90% ప్రభుత్వరంగ బ్యాంకులు, 43.71% ప్రైవేటు బ్యాంకులు, 43.52% షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు రుణాలిచ్చాయి. 1969లో బ్యాంకుల పరపతిలో ప్రాధాన్య రంగాలకు ఇచ్చింది 12% కాగా, 2022 - 23 నాటికి 39.92%కి పెరిగింది.

5) సామాజిక బ్యాంకింగ్‌ - పేదరిక నిర్మూలన పథకాలు: ప్రభుత్వం అమలుచేసే పథకాలకు అవసరమైన నిధులు సమకూర్చడానికి వాణిజ్య బ్యాంకుల సేవలు వినియోగించుకున్నారు.ఉదాహరణకు 1972లో ప్రవేశపెట్టిన వ్యత్యాస వడ్డీ రేట్ల పథకం ద్వారా బలహీన వర్గాలవారికి ఇచ్చే రుణాలపై 4% వడ్డీ రేటు అమలైంది. ఐఆర్‌డీపీ, పీఎంఆర్‌వై, ఎస్‌యూఎంఈ, ఎస్‌ఈఈయూవై, ఎస్‌ఈపీయూపీ, పీఎంఐయూపీఈపీ లాంటి పథకాలకు రాయితీ రుణాలు ఇచ్చారు.

6) బ్యాంకింగ్‌ వైవిధ్యీకరణ: బ్యాంకుల జాతీయీకరణ తర్వాత వాటి పనితీరు, దృక్పథంలో మార్పు వచ్చింది.సంప్రదాయబద్ధమైన బ్యాంకింగ్‌ విధానాల స్థానంలో  ఆధునిక విధానాలు అనుసరించాయి. 
మరికొన్ని బ్యాంకుల జాతీయీకరణ జాతీయీకరణ తర్వాత బ్యాంకులు గణనీయమైన ప్రగతి సాధించాయి. ఇదేక్రమంలో ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు, ప్రజా సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు 1980, ఏప్రిల్‌ 15న రూ.200 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న 6 వాణిజ్య బ్యాంకుల్ని కేంద్రం జాతీయం చేసింది. అవి

1) ఆంధ్రా బ్యాంకు

2) కార్పొరేషన్‌ బ్యాంకు

3) న్యూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

4) ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌

5) విజయా బ్యాంకు

6) పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకు

న్యూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాలతో నడుస్తుండటంతో 1993లో దాన్ని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో విలీనం చేశారు. 2017లో అయిదు ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో విలీనం చేశారు. భారతీయ మహిళా బ్యాంకు కూడా ఎస్‌బీఐలో విలీనమైంది. 2019లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో దేనా బ్యాంకు, విజయా బ్యాంకు విలీనమయ్యాయి. 2019, ఆగస్టులో మరికొన్ని బ్యాంకులు విలీనమయ్యాయి. అవి ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులు విలీనమయ్యాయి. సిండికేట్‌ బ్యాంకు, కెనరా బ్యాంకులో విలీనమైంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులు. విలీనమయ్యాయి. అలహాబాద్‌ బ్యాంకు.. ఇండియన్‌ బ్యాంకులో విలీనమైంది. ప్రస్తుతం ఎస్‌బీఐతో కలిపి జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య 12.

భారతీయ మహిళా బ్యాంకు: 2013, నవంబరు 19న మొదటి మహిళా బ్యాంకును దిల్లీ ప్రధాన కేంద్రంగా ప్రారంభించారు. దీని తొలి ఛైర్మన్‌ ఉషా అనంత సుబ్రహ్మణ్యం. ప్రపంచంలో మహిళలకు ప్రత్యేకంగా బ్యాంకును ఏర్పాటు చేసిన మూడో దేశం ఇండియా. (మొదటిది పాకిస్థాన్, రెండోది టాంజానియా) 2017లో ఈ బ్యాంకు ఎస్‌బీఐలో విలీనమైంది.

ప్రైవేటు బ్యాంకులు: ప్రైవేటు వాటాదారులతో కలిసి స్థాపించిన బ్యాంకులే ప్రైవేటు బ్యాంకులు. వీటిని పాత, కొత్త ప్రైవేటు బ్యాంకులుగా విడదీయవచ్చు. 1969, 1980ల్లో బ్యాంకులను జాతీయం చేసినప్పుడు మిగిలిపోయినవి పాత ప్రైవేటు బ్యాంకులు. తక్కువ డిపాజిట్ల పరిమాణంతో, ప్రాంతీయంగా ఉండటమే ఇందుకు కారణం. 
ఉదా: కర్ణాటక బ్యాంకు, లక్ష్మీవిలాస్‌ బ్యాంకు, ధనలక్ష్మీ బ్యాంకు, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు.

* నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత ఏర్పాటు చేసిన వాటిని కొత్త ప్రైవేటు బ్యాంకులు అంటారు. ఉదా: యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు లాంటి 21 బ్యాంకులు.

విదేశీ బ్యాంకులు:  2023, మార్చి నాటికి దేశంలో 45 విదేశీ బ్యాంకులున్నాయి. 2013 ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రూ.500 కోట్ల్ల మూలధనంతో విదేశీ బ్యాంకును ఏర్పాటు చేయవచ్చు. 
బంధన్‌ బ్యాంకు: 2015లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కోల్‌కతాలో ఈ బ్యాంకు సేవలు ప్రారంభించారు.

ఐడీఎఫ్‌సీ: 2015, అక్టోబరు 19న నాటి ప్రధాని న్యూదిల్లీలో ప్రారంభించారు. దీని ప్రధాన కేంద్రం ముంబయి.

రచయిత:  ధరణి శ్రీనివాస్‌  
 

Posted Date : 03-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌