• facebook
  • whatsapp
  • telegram

నూతన సాంకేతిక పరిజ్ఞానం

కృత్రిమ మేధ 

మానవుడి రోజువారీ కార్యకలాపాల్లో కృత్రిమ మేధ సర్వసాధారణమైంది. 

* ఎంతో మేధోసంపత్తి కలిగిన డిజిటల్‌ వ్యక్తిగత అసిస్టెంట్ల ఏర్పాటు దీనివల్లే సాధ్యమైంది. 

ఉదా: గూగుల్‌ నౌ, సిరి, కోర్టేనా, అలెక్సా మొదలైనవి. ఇవి ఎంతో సమర్థవంతంగా వాటికి నిర్దేశించిన పనిని పూర్తి చేస్తాయి. 

* దీని సాయంతో చాలా తక్కువ మానవ ప్రమేయంతో, చాకచక్యంగా విధులను నిర్వర్తించొచ్చు. 

* ఇది ఎంతో విజ్ఞానవంతమైన విషయాలను - అంటే నిజాలు, ఇతర నియమాలు, ఊహలను విశ్లేషించి, కచ్చితమైన నిర్ణయాలను తీసుకోగలదు.

* ప్రస్తుతం మనం ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌ కృత్రిమ మేధకు మంచి ఉదాహరణ. 

మెషిన్‌ లెర్నింగ్‌ 

* ఈ వ్యవస్థ కృత్రిమ మేధకు అనుబంధ సాంకేతికత. దీని ద్వారా మానవుడి ప్రమేయం లేకుండా కంప్యూటర్లో ఉన్న డేటాను విశ్లేషించి, అవసరమైన ప్రోగ్రామ్‌లను రూపొందించొచ్చు. 

* ఇవి అల్గారిథం, డేటాను ఉపయోగించుకుని అత్యంత కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని అందిస్తాయి, అంతేకాకుండా వివిధ అల్గారిథం మోడళ్లను ఉపయోగించి నూతన డేటాను కూడా అత్యంత కచ్చితత్వంతో విశ్లేషిస్తాయి. 

నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (NLP)

* ఈ వ్యవస్థ మానవులకు, వారు మాట్లాడే భాషకు అనుసంధానంగా పనిచేస్తుంది. 

* సాధారణంగా మనం కీబోర్డ్‌ను ఉపయోగించి స్మార్ట్‌ఫోన్లలో టైప్‌ చేస్తున్నప్పుడు సంబంధిత వాక్యంలో అనుబంధ పదాలు కనిపిస్తూ ఉంటాయి. పద దోషాలు సరి చేయడానికి వచ్చే సలహాలు మొదలైనవి ఈ వ్యవస్థ ద్వారానే సాధ్యమవుతుంది. స్మార్ట్‌ ఫోన్లలో వాయిస్‌ సెర్చ్‌ కూడా దీని అనుసంధానంగానే పనిచేస్తుంది. 

* ఈ సహజ భాషా ప్రాసెసింగ్‌ వ్యవస్థ ద్వారా టెక్ట్స్‌ టు స్పీచ్, స్పీచ్‌ టు టెక్ట్స్‌ కన్వర్షన్‌ అత్యంత సులభతరం అయ్యింది.

* మిషన్‌ ట్రాన్స్‌లేషన్‌ ఎన్‌ఎల్‌పీ ఆధారంగానే పనిచేస్తుంది.  

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (IOT)

* కంప్యూటర్‌లోని నెట్‌వర్క్‌ వ్యవస్థ అనుసంధానాన్ని ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌గా పేర్కొంటారు.

* ఈ నెట్‌వర్క్‌ వ్యవస్థ కంప్యూటర్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, సర్వర్, టాబ్లెట్, స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌ వాచ్‌ మొదలైన వాటిని అనుసంధానిస్తుంది. 

* ఈ అనుసంధానం ఇంటర్నెట్‌ లేదా లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌ (లాన్‌) ద్వారా సాధ్యమవుతుంది. 

* ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సాంకేతికత ద్వారా వివిధ పరికరాల హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లు ఒకదానికొకటి అనుసంధానమై, వాటి మధ్య కమ్యూనికేషన్‌కు దోహదపడుతుంది. 

* పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కనిపించే స్మార్ట్‌ హోమ్స్‌ను దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. 

* ఈ సాంకేతికత అనుసంధానం ద్వారానే ప్రస్తుతం మనదేశంలో వాడుతున్న సీసీ కెమెరాలను ఎక్కువ దూరం నుంచి కూడా ఆపరేట్‌ చేయడం సాధ్యమైంది. 

వర్చువల్‌ రియాలిటీ (VR) 

* త్రీ డైమెన్షనల్‌ వ్యవస్థ కలిగి, కంప్యూటర్‌ ఆధారంగా కృత్రిమ పరికరాల ద్వారా ఆర్టిఫిషియల్‌ భావాలను జ్ఞానేంద్రియాలకు ప్రేరేపించడమే వర్చువల్‌ రియాలిటీ. 

* మానవుడు తన జ్ఞానేంద్రియాల ద్వారా ప్రేరేపించిన వివిధ భావాలకు అనుగుణంగా వర్చువల్‌ రియాలిటీలో స్పందిస్తాడు. 

* యూజర్లు వర్చువల్‌ రియాలిటీని అనుభవిస్తున్నప్పుడు వివిధ రకాల భౌతిక వాతావరణాన్ని తమ చుట్టూ ఉన్నట్టు భావించి, దానికి అనుగుణంగా వివిధ రకాలుగా ప్రతిస్పందిస్తారు. 

* ముఖ్యంగా హెడ్‌సెట్స్‌ ధరించి ఈ వర్చువల్‌ రియాలిటీని ఆస్వాదించొచ్చు. దీని ద్వారా వివిధ రకాల అనుభూతులు (శబ్దం, ఉష్ణోగ్రత, కదలికలు లేదా ప్రయాణం, అత్యంత అగాధంలో పడిపోతున్నట్టు లేదా మేఘాల్లో తేలిపోతున్నట్లు) కలుగుతాయి. దీనిద్వారా సంబంధిత వ్యక్తి ఊహా ప్రపంచంలో ఉండేందుకు సాధ్యమవుతుంది. 

* ప్రస్తుతం ఈ సాంకేతికతను ఆన్‌లైన్‌ గేమింగ్, మిలటరీ ట్రైనింగ్, వైద్యరంగం, వినోదం, సామాజికశాస్త్రం, ఇంజినీరింగ్, సైకాలజీ మొదలైన రంగాల్లో ఉపయోగిస్తున్నారు.  

మెటావర్స్‌

* ఈ సాంకేతికత ద్వారా ఇంటర్నెట్, డిజిటల్‌ పరికరాలను ఉపయోగించి మానవుడి వాస్తవిక ప్రపంచాన్ని డిజిటల్‌ ప్రపంచంలోకి తీసుకురావొచ్చు.

* ఆగ్మెంటెడ్, వర్చువల్‌ రియాలిటీ అనుసంధానంతో యూజర్లకు కొత్త అనుభూతులను సృష్టించవచ్చు. 

* ఇది కృత్రిమ మేధ, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ మొదలైన సాంకేతికతల ఆధారంగా  పనిచేస్తుంది. 

* అధునాతన మోషన్‌ వీడియోల సహాయంతో యూజర్లు మరింత ఆనందాన్ని పొందుతారు.

* ప్రస్తుతం ఈ సాంకేతికతను ఫేస్‌బుక్‌ వినియోగిస్తోంది. 

అనువర్తనాలు:

* టెలీ మెడిసిన్, టెలీ హెల్త్‌ రంగాల్లో దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మెటావర్స్‌ త్రీడీ వర్చువల్‌ క్లినిక్స్‌ ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు వైద్య సహాయాన్ని అందిస్తున్నారు.  

* విద్యా వ్యవస్థలో త్రీడీ అనుభవాలు, వర్చువల్‌ రియాలిటీ సాంకేతికతను అనుసంధానించడం ద్వారా ఆన్‌లైన్‌ లేదా డిజిటల్‌ తరగతులకు మరింత ఉపయోగకరంగా మారింది. ఈ వ్యవస్థలో డిజిటల్‌ మాధ్యమం ద్వారానే అధ్యాపకుడు, విద్యార్థి మెరుగైన కనెక్టివిటీని కలిగి ఉంటారు. దీంతో విద్యా ప్రమాణాలు ఉన్నత స్థితికి చేరతాయి.

* వ్యాపార రంగంలో వాస్తవికతకు, ఊహా జనిత వాతావరణానికి మధ్య ఇది వారధిగా పనిచేస్తుంది. మెరుగైన ఆన్‌లైన్‌ షాపింగ్‌ సౌకర్యాలను కల్పిస్తూ, అమ్మకందార్లు - కొనుగోలుదార్లకు విస్తృత సేవలు అందిస్తోంది.

* మెటావర్స్‌ ద్వారా నవీన ఉద్యోగ కల్పన మరింత వేగవంతమవుతుంది. మారుమూల భౌగోళిక ప్రాంతాల్లో కూడా మెరుగైన ఉద్యోగ వనరుల సృష్టికి ఇది తోడ్పడుతుంది. 

* వర్చువల్‌ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ, నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్‌ మొదలైన డిజిటల్‌ కరెన్సీ వ్యవస్థలను సులభతరం చేస్తుంది.

* మెటావర్స్‌తో 360 డిగ్రీల కోణంతో సుదూర ప్రాంతాలను వీక్షించటం సాధ్యమవుతుంది. దీనిద్వారా వర్చువల్‌ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. 

సవాళ్లు: ప్రస్తుతం సైబర్‌ క్రైమ్‌లు ఎక్కువైన నేపథ్యం ఉన్న దృష్ట్యా మెటావర్స్‌ వినియోగం కొంతవరకు ప్రశ్నార్థకంగా మారింది. 

* వ్యక్తిగత సమాచార దుర్వినియోగం, సైబర్‌ దాడులు, ఆన్‌లైన్‌ మోసాలు, డేటా గోప్యత మొదలైనవి సవాళ్లుగా మారాయి. 

* మానవుడు వాస్తవిక సమాజం నుంచి ఊహాజనిత సమాజం వైపునకు ఆకర్షితుడైతే, అది మానవ ఉనికికే పెను ప్రమాదంగా మారొచ్చు.

* ఈ అధునాతన సాంకేతికత వినియోగానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చట్టాలను అమలు చేసినప్పుడు మానవ భవితకు మరింత సౌకర్యంతో కూడిన భద్రత కల్పించినట్లు అవుతుంది. 

వెబ్‌ ఆఫ్‌ థింగ్స్‌ (WOT)

* భౌతిక వాతావరణంలో మానవ అస్తిత్వాన్ని తప్ప మిగిలిన అన్ని రకాల పరికరాలను, సేవలను వెబ్‌ కనెక్టివిటీ ద్వారా ఏర్పాటు చేయడాన్ని వెబ్‌ ఆఫ్‌ థింగ్స్‌గా పేర్కొంటారు. 

* ఇది అత్యంత అధునాతనమైన స్మార్ట్‌ హోం, స్మార్ట్‌ ఆఫీస్, స్మార్ట్‌ సిటీస్‌ రూపకల్పనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 

ఉదా: ఒక గృహంలోని స్మార్ట్‌ పరికరాలన్నీ వెబ్‌ కనెక్టివిటీ ద్వారా అనుసంధానం అయితే, మానవ ప్రమేయం లేకుండా స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా సుదూర ప్రాంతాల నుంచి ఆపరేట్‌ చేయొచ్చు. 

ఆగ్మెంటెడ్‌ రియాల్టీ 

* కంప్యూటర్ల ద్వారా ప్రస్తుతం ఉన్న భౌతిక వాతావరణాన్ని మరింత మెరుగ్గా అనుభవించడానికి ఆగ్మెంటెడ్‌ రియాలిటీ ఎంతగానో ఉపయోగపడుతుంది. 

* యూజర్లు దూర ప్రాంతాల్లో ఉన్నా, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ సాయంతో అదే ప్రదేశంలో ఉన్నట్లు భావించవచ్చు. 

* లొకేషన్‌ బేస్డ్‌ ఏఆర్‌ యాప్స్‌ ద్వారా చారిత్రక ప్రదేశాలను సుదూర ప్రాంతాల నుంచి వీక్షించవచ్చు, వాటిని దగ్గర నుంచి చూస్తున్నట్లు అనుభూతి పొందొచ్చు.

బిగ్‌ డేటా 

* ‘‘మన రోజువారీ జీవితం సాంకేతికతతో ముడిపడి ఉంది’’ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

* ప్రస్తుత పరిస్థితుల్లో బిలియన్ల ఇంటర్నెట్‌ యూజర్లు టెక్నాలజీని ఉపయోగించుకుని సృష్టిస్తున్న డేటాను బిగ్‌ డేటా అంటారు.

* ఇందులో అధిక భాగం స్మార్ట్‌ ఫోన్ల నుంచి లభ్యమవుతుంది. వరల్డ్‌ వెబ్‌ ట్రాఫిక్‌లో స్మార్ట్‌ ఫోన్‌లో డేటా కీలక పాత్ర పోషిస్తుంది. 

* ప్రతి రోజూ 2.5 క్విన్టిలియన్‌ (1018) బైట్ల డేటా ఉపయోగంలోకి వస్తోంది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ప్రవేశంతో ఈ డేటా సృష్టి మరింత అభివృద్ధి చెందింది. 

* ఘనపరిమాణం, వేగం, వివిధ రూపాల్లో ఉన్న సమాచార వ్యవస్థ, యధార్థత, విలువ మొదలైనవాటిని బిగ్‌ డేటా లక్షణాలుగా పేర్కొంటారు.

అనువర్తనాలు 

* దీన్ని వివిధ రంగాల్లో అనేక ప్రయోజనాలకు ఉపయోగిస్తారు.  

* ఇది అత్యంత వేగంగా, భారీ పరిమాణంలో ప్రాసెస్‌ అవుతుంది. 

* దీన్ని వ్యాపార రంగంలో ఎంతో విలువైందిగా పరిగణిస్తారు. 

* ఈ డేటాను విశ్లేషించటం ద్వారా గోప్యమైన గణాంకాలు, విశేషమైన విషయ పరిజ్ఞానం లభిస్తుంది. 

సవాళ్లు 

* వివిధ మార్గాల నుంచి లభించే సమాచారం స్ట్రక్చర్డ్, అన్‌ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్‌ రూపంలో ఉంటుంది. ఉదాహరణకు ఈ డేటా టెక్ట్స్‌ లేదా ఇమేజెస్‌ లేదా వీడియోస్‌ లేదా వెబ్‌ పేజీల రూపంలో ఉండొచ్చు. వీటి ఆధారంగా బిగ్‌ డేటాను ప్రాసెస్‌ చేయలేం. 

* ఈ డేటా కొన్ని సందర్భాల్లో అస్థిరంగా, వివక్షను ప్రేరేపించేదిగా, అసాధారణంగా ఉండొచ్చు. విశ్వసనీయత లేని సమాచారాన్ని ప్రాసెసింగ్‌ చేయడం, దాని ఆధారంగా ఒక నిర్ణయానికి రావటం అంత సమర్థనీయ చర్య కాదు. 

* వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే భవిష్యత్తు ప్రయోజనాలకు ఉపయోగించాలి.

రచయిత

రేమల్లి సౌజన్య

విషయ నిపుణులు  

Posted Date : 19-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌