• facebook
  • whatsapp
  • telegram

నూతన సాంకేతిక పరిజ్ఞానం

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ 

ఇంటర్నెట్‌ను ఉపయోగించి కంప్యూటర్‌ ద్వారా నెట్‌వర్కింగ్, సాఫ్ట్‌వేర్, అనలిటిక్స్, సర్వర్లు, స్టోరేజ్‌ లాంటి సేవలు అందించడం లేదా ఆ సేవల పంపిణీని క్లౌడ్‌ లేదా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అంటారు. దీన్నే వివిధ వనరుల మధ్య భాగస్వామ్య సేవలుగా పేర్కొంటారు. 

వినియోగదారులకు వారి ప్రమేయం లేకుండానే కంప్యూటర్‌ ఆధారిత సేవలు అందించడం క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ముఖ్య ఉద్దేశం.

* ఈ వ్యవస్థ ద్వారా ఆయా సేవల నిర్వహణకు అయ్యే ఖర్చు, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.

ఈ సేవలు అందించే సంస్థలను ‘క్లౌడ్‌ ప్రొవైడర్స్‌’ అంటారు. వీటి వల్ల వివిధ కంపెనీలు వారి సొంత డేటా సెంటర్ల నిర్వహణకు బదులు నామమాత్రపు అద్దె చెల్లించి క్లౌడ్‌ సేవలను వినియోగించుకుంటున్నాయి. 


5జీ సాంకేతికత 

*మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ వ్యవస్థలో మొదటి తరమైన 1జీ సాంకేతికత 1980 లో ఆరంభమైంది. ఎనలాగ్‌ రేడియో సిగ్నల్స్‌ ద్వారా ఇది పనిచేసేది. కేవలం వాయిస్‌ కాల్స్‌కు మాత్రమే ఇది ఉపయోగపడింది.

* 2జీ సాంకేతికత 1990 దశకంలో డిజిటల్‌ రేడియో సిగ్నల్‌ ఆధారంగా డేటా ట్రాన్స్‌మిషన్, వాయిస్‌ కాల్స్‌ను అందించింది.

* 2000 దశకంలో 3జీ సాంకేతికత ఆరంభమైంది. ఇది డిజిటల్‌ టెక్నాలజీని మరింత నవీనపరుస్తూ, డిజిటలైజ్డ్‌ వాయిస్, వీడియో కాల్స్, కాన్ఫరెన్స్‌ కాల్‌ వ్యవస్థకు ఉపయోగపడింది.

* 2009లో వచ్చిన 4జీ సాంకేతికత 3దీ వర్చువల్‌ రియాలిటీ కలిగి, మెరుగైన సేవలను అందిస్తోంది.

* 5జీ సాంకేతికత మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ వ్యవస్థలో అయిదో తరానికి చెందింది. ఇది అత్యంత అధునాతన సాంకేతికత. భారతదేశంలో 2023 చివరి త్రైమాసికంలో 5జీ సేవలను ప్రారంభించనున్నారు. ఇవి మొదట 8 నగరాల్లో ప్రారంభమై, తర్వాత దేశమంతా విస్తరించనున్నాయి.

* 5జీ సేవలు సెన్సార్‌ను కలిగి ఉండటం వల్ల వ్యవసాయం, తయారీ - సేవల రంగానికి అవసరమైన సమాచారాన్ని అత్యంత కచ్చితత్వంతో, వేగంగా అందిస్తాయి. రవాణా మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా పనిచేసేలా ఇవి ఉపయోగపడతాయి.

* కొత్త తరం సాంకేతికత అయిన ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌కి 5జీ సేవలు మరింత ఊతం ఇస్తాయి.

డ్రైవర్‌ రహిత వాహనాలు, టెలీ సర్జరీ, రియల్‌ టైం డేటా ఎనలిటిక్స్‌కి 5జీ సాంకేతికత ఉపయోగకరం.

* భారతదేశంలో 5జీ వినియోగంపై తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రభుత్వం 2016 లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 5జీ నెట్‌వర్క్‌ అమలుతో భారతదేశ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని కమిటీ పేర్కొంది. ఈ సేవల కారణంగా 2035 నాటికి భారతదేశానికి ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరుతుందని ఇది అంచనా వేసింది.


 డ్రోన్‌ సాంకేతికత 

మానవ రహిత ఆకాశయాన వాహక నౌకలను (అన్‌ మాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్‌ - యూఏవీ) డ్రోన్లుగా పిలుస్తారు. ఇవి సాధారణంగా స్వయం ప్రతిపత్తిగా లేదా రిమోట్‌ కంట్రోల్‌ ఆధారంగా పనిచేసే వ్యవస్థలను కలిగి ఉంటాయి. ఇవి కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తాయి.

* భారతదేశంలో డ్రోన్‌ వ్యవస్థను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) పర్యవేక్షిస్తుంది. డ్రోన్‌ నియమాలు -2021 ఆధారంగా వీటిని నిర్వహిస్తారు.


వర్గీకరణ: డ్రోన్లను వాటి బరువు ఆధారంగా అయిదు రకాలుగా వర్గీకరించారు. అవి: 


1. నానో డ్రోన్లు: ఇవి సాధారణంగా 250 గ్రాముల కంటే తక్కువ బరువును కలిగి ఉంటాయి. 


2. మైక్రో డ్రోన్లు: 250 గ్రాముల నుంచి రెండు కేజీల బరువు కలిగి ఉంటాయి. 


3. స్మాల్‌ (చిన్న) డ్రోన్లు: 2 నుంచి 25 కేజీల బరువును కలిగి ఉంటాయి. 


4. మీడియం (మధ్యస్థ) డ్రోన్లు: 25 నుంచి 150 కేజీల బరువును కలిగి ఉంటాయి. 


5. లార్జ్‌ (భార) డ్రోన్లు: 150 కేజీల కంటే ఎక్కువ బరువును కలిగి ఉంటాయి. 


* భారతదేశంలో డ్రోన్లను మొదటిసారిగా సాయుధ దళాల వినియోగం కోసం రూపొందించారు. ఉదా: రుస్తుం-2, నిశాంత్‌ యూఏవీ, లక్ష్య, కంకజ మొదలైనవి. 


అనువర్తనాలు 

రక్షణ రంగం: ఉగ్ర దాడుల సమయంలో డ్రోన్లను జాతి భద్రత కోసం ఉపయోగించవచ్చు. వీటి ద్వారా శత్రు దాడులను దూర ప్రాంతాల నుంచే తిప్పి కొట్టొచ్చు. నిఘా వ్యవహారాల్లో వీటిని వాడతారు.

ఆరోగ్య రంగం: వివిధ రకాల మందులు, వ్యాక్సిన్ల పంపిణీలో డ్రోన్లను వివిధ దేశాలు అత్యంత సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాయి. డ్రోన్ల సాయంతో వ్యాక్సిన్ల పంపిణీ చేసుకునేలా సివిల్‌ ఏవియేషన్‌ మంత్రిత్వ శాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి లభించింది.

వ్యవసాయ రంగం: సూక్ష్మ పోషకాలు, కీటక నాశినులు, ఎరువుల పంపిణీలో డ్రోన్లను వాడుతున్నారు. మృత్తికల స్వభావాన్ని అంచనా వేయడానికి కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. నీటిపారుదల సదుపాయాలను డ్రోన్ల ద్వారా సమీక్షిస్తున్నారు. 

ఖనిజ రంగం: వివిధ రకాలైన సహజ వనరులు ఖనిజాలను గుర్తించడానికి డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 

ప్రకృతి వైపరీత్యాలు: ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, ఆపత్కాల సమయంలో కావాల్సిన ఆహారం, మందుల పంపిణీకి ప్రపంచ దేశాలు విరివిగా డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి.

అటవీ సంపద రక్షణ: కొన్ని ప్రాంతాల్లో అడవులను కార్చిచ్చు నుంచి కాపాడేందుకు, వన్యప్రాణి సంరక్షణ కోసం వీటిని ఉపయోగిస్తున్నారు.  


సవాళ్లు

* వీటిని సుదూర ప్రాంతాల నుంచి ఉపయోగించే ఆస్కారం ఉండటంతో శత్రువులు, అసాంఘిక శక్తులు వీటిని వాడి, దేశ భద్రతకు ముప్పు కలిగించొచ్చు.

* స్మగ్లింగ్, ఆయుధాల రవాణా, బాంబుల పంపిణీకి వీటిని ఉపయోగించే ప్రమాదం ఉంది.

* శత్రు దేశాలు గూఢచర్యం కోసం వీటిని వినియోగించొచ్చు.


క్లౌడ్‌ కంప్యూటింగ్‌  సేవలు - వర్గీకరణ
పంపిణీ ఆధారిత వర్గీకరణ: పంపిణీ ఆదారంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి: 

1. పబ్లిక్‌ క్లౌడ్‌: వీటిని థర్డ్‌ పార్టీ క్లౌడ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా పిలుస్తారు. ఇందులో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, మిగతా మౌలిక సదుపాయాలను క్లౌడ్‌ ప్రొవైడర్‌ కల్పిస్తే, వినియోగదారుడు వెబ్‌ బ్రౌజర్‌ ఉపయోగించి సేవలు పొందుతాడు. 


2. ప్రైవేట్‌ క్లౌడ్‌: క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సదుపాయాలు ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ ఆధ్వర్యంలో ఉంటే దాన్ని ప్రైవేట్‌ క్లౌడ్‌గా పేర్కొంటారు.


3. హైబ్రిడ్‌ క్లౌడ్‌: ఇందులో పబ్లిక్, ప్రైవేట్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థలు రెండూ కలిసి క్లౌడ్‌ని పంచుకుంటాయి. అంతేకాకుండా డేటా, అప్లికేషన్స్‌ను కూడా సంయుక్తంగా ఉపయోగించుకుంటాయి.  


మౌలిక సదుపాయాల ఆధారంగా వర్గీకరణ: క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థ అందించే మౌలిక సదుపాయాల ఆధారంగా ఈ సేవలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి: 


1. Infrastructure as a Service (IaaS): క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సర్వీసెస్‌ పంపిణీలో ఇది అత్యంత ప్రాథమిక సేవలను అందిస్తుంది. క్లౌడ్‌ ప్రొవైడర్ల నుంచి ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సదుపాయాలైన నెట్‌వర్క్స్, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ మొదలైనవన్నీ నామమాత్రపు రుసుముతో అందిస్తారు. 

2. Platform as a Service (PaaS): ఇందులో యూజర్ల సౌలభ్యం కోసం వారికి కావాల్సిన ఫ్లాట్‌ఫామ్స్, మొబైల్‌ యాప్స్, సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లకు అవసరమైన సర్వర్లు, డేటాబేస్‌లను సమకూరుస్తారు. 


3.Software as a service (SaaS): ఈ వ్యవస్థలో సబ్‌స్క్రిప్షన్‌ ఆధారంగా సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌ను యూజర్లకు అందిస్తారు. వీటి నిర్వహణను క్లౌడ్‌ ప్రొవైడరే చేస్తుంది. యూజర్లు ఇంటర్నెట్‌ ఉపయోగించుకుని వెబ్‌ బ్రౌజర్‌ ఆధారంగా పర్సనల్‌ కంప్యూటర్, టాబ్లెట్‌ ఫోన్లలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకోవచ్చు.


బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ 

* ఇందులో డిజిటల్‌ డేటాబేస్‌లో ఉన్న సమాచారాన్ని బ్లాక్‌ల రూపంలో నిక్షిప్తం చేసి, దాన్ని గొలుసుల మాదిరిగా ఉండే చెయిన్‌ టెక్నాలజీతో అనుసంధానిస్తారు. దీన్నే బ్లాక్‌చైన్‌ సాంకేతికత అంటారు.

* ఈ నెట్‌వర్కింగ్‌ వ్యవస్థ అత్యంత భద్రమైంది. దీని ఆధారంగానే క్రిప్టో కరెన్సీ పని చేస్తుంది.

* ఈ సాంకేతికత ద్వారా ట్రాన్సాక్షన్లు అత్యంత భద్రంగా, వేగంగా ఒకరి నుంచి మరొకరికి చేరతాయి. ఇందులో ఉండే  కోడ్‌లు ప్రతి ట్రాన్సాక్షన్‌ను వైవిధ్యభరితంగా నిక్షిప్తం చేస్తాయి. 

* ఈ సాంకేతికతను దేశ పౌరులకు కావాల్సిన సమాచారాన్ని నిల్వ చేసేందుకు ఉపయోగించటం వల్ల దీన్ని ‘పబ్లిక్‌ లెడ్జర్‌’గా కూడా పిలుస్తారు.

* ఒక ట్రాన్సాక్షన్‌ పూర్తవగానే అది బ్లాక్‌చైన్‌ వ్యవస్థలోని పర్మినెంట్‌ డేటాబేస్‌లో బ్లాక్‌గా నిక్షిప్తం అవుతుంది. మరో ట్రాన్సాక్షన్‌ చేసినప్పుడు అది ముందు ఉన్న బ్లాక్‌కి అనుసంధానం అవుతుంది. ఈ విధంగా బ్లాక్‌లు ఒకదానికికొకటి గొలుసుల్లా అనుసంధానమవుతాయి. 


అనువర్తనాలు: ఈ సాంకేతికత ద్వారా ఆన్‌లైన్‌ మోసాలను నిలువరించొచ్చు.

*దీని సాయంతో చేసే కార్యక్రమాలన్నీ అత్యంత పారదర్శకంగా ఉంటాయి. 

* దీనిద్వారా వ్యాపార లావాదేవీలను మరింత సమర్థవంతంగా, వేగంగా నిర్వహించొచ్చు. 

* ఇందులోని బ్లాక్‌లను హ్యాక్‌ చేయడం అసాధ్యమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

* ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్‌ను బ్లాక్‌ల రూపంలో రికార్డ్‌ చేయటం వల్ల ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ అత్యంత మెరుగ్గా నిర్వహించవచ్చు.

* బ్లాక్‌చైన్‌ అనుసంధానం ద్వారా ఎలక్షన్లలో అత్యంత భద్రతతో కూడిన ఓటింగ్‌ నిర్వహణ సాధ్యమవుతుంది 


సవాళ్లు: దీ ఈ సాంకేతికత ఆరంభ దశలో ఉండటం వల్ల దీని వినియోగం అత్యంత ఖర్చుతో కూడుకుని ఉంటుంది.

* బ్లాక్‌చైన్‌ వ్యవస్థ పని చేయడానికి అత్యంత ఎక్కువ మొత్తంలో విద్యుత్‌ అవసరం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది అనువైంది కాదని పరిశీలకుల అభిప్రాయం.

*దీన్ని ప్రభుత్వ వ్యవస్థలో వినియోగించినప్పుడు అత్యంత చాకచక్యమైన రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ ఉండటం అత్యవసరం. 

* ఈ కృత్రిమ వ్యవస్థను వినియోగించడం వల్ల సంస్థల్లో ఉండే సృజనాత్మకత ఆలోచనా విధానం, వివిధ పాలనా వ్యవస్థల మధ్య సమతౌల్యం లోపించొచ్చు.

Posted Date : 26-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌