• facebook
  • whatsapp
  • telegram

సముద్ర తరంగాలు, పోటు-పాటులు

సముద్ర తరంగాలు - నిర్వచనం

పవనాల ప్రభావం వల్ల సముద్రంలోని నీరు శృంగం (Crest), ద్రోణి (Trough) రూపంలో కదలడాన్ని సముద్ర తరంగాలు అంటారు. వీటినే ‘సముద్ర కెరటాలు’ లేదా ‘సముద్ర అలలు’ అని కూడా పిలుస్తారు.

* సముద్ర తరంగాల్లో ఎత్తయిన భాగాన్ని శృంగం అని, లోతైన భాగాన్ని ద్రోణి అని అంటారు.

* వరుసగా ఉన్న రెండు శృంగాలు లేదా రెండు ద్రోణుల మధ్య దూరాన్ని తరంగదైర్ఘ్యం/ తరంగ పొడవు (wave length) అంటారు.

* శృంగం అగ్రం నుంచి ద్రోణి లోపలికి ఉన్న నిట్టనిలువు కొలతను తరంగ ఎత్తు అంటారు. తరంగం ఎత్తులోని సగభాగమే డోలనా పరిమితి (wave aptitude).

* తరంగం ఆవిర్భవించే చోట తరంగ శృంగం గానీ, ద్రోణిగానీ చాలా చిన్నగా ఉండి, కొద్దిపాటి చలనం ఉండటాన్ని స్వెల్‌ (swell) అంటారు.

* సముద్ర తరంగ శృంగం ఉవ్వెత్తున లేచి తటాలున మధ్యకు విరిగిపోవడాన్ని తరంగ విచ్ఛిత్తి అంటారు. 

* విరిగిపోయిన తరంగం ముందుభాగం తీరం వైపునకు బలంగా తోసుకుని వస్తే దాన్ని ఫ్లంజ్‌ (flunge) అంటారు.

* తీరం వైపునకు బలంగా తోసుకువచ్చిన తరంగం ఒడ్డును తాకి, మళ్లీ అదే వేగంతో వెనక్కి సముద్రంలోకి వెళ్లినట్లయితే దాన్ని బ్యాక్‌ వాష్‌ అంటారు.

తరంగాల పుట్టుక, పెరుగుదల


* సముద్ర తరంగాల ఆవిర్భావం, పుట్టుక, పెరుగుదల, నశించిపోవడం మొదలైనవన్నీ పవనాల మీదే ఆధారపడి ఉంటాయి.


* సముద్ర ఉపరితలంపై గాలి వీస్తున్నప్పుడు శక్తి నెమ్మదిగా గాలి నుంచి సముద్ర జలాల మీదకు ప్రసరిస్తుంది లేదా బదిలీ అవుతుంది. అప్పుడు సముద్ర ఉపరితల జలాల్లో ఒక మోస్తరు కదలిక ఏర్పడి, అతి చిన్న తరంగాలు పుట్టుకొస్తాయి. 


* వీటి శృంగాలు గుండ్రంగా, ద్రోణులు ×జు× ఆకారంలో ఉండి, తరంగదైర్ఘ్యం ఇంచుమించు 1.74 సెం.మీ. వరకు ఉంటుంది. వీటినే కాపిల్లరీ తరంగాలు అంటారు.


* పవనాల బలం, వేగం పెరిగేకొద్దీ తరంగం ఎత్తు, పొడవు పెరుగుతుంది. వాటి తరంగదైర్ఘ్యం 1.74 సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటే గ్రావిటీ తరంగాలు అని పిలుస్తారు.

తరంగాల కదలిక

* సముద్రం ఒడ్డున నిలబడి చూస్తే దూరం నుంచి వచ్చే తరంగాలు ఒకదాని తర్వాత మరొకటి క్రమపద్ధతిలో వస్తున్నట్లు కనిపిస్తాయి. అయితే ఇది నిజం కాదు.

* ఒక కర్రముక్కను సముద్రంలో దూరంగా పడేసి గమనిస్తే, తరంగాలకు ఉండే శృంగం, ద్రోణి వల్ల అక్కడనే పైకీ, కిందికీ కదులుతుంది తప్ప ఎంతసేపటికీ ఒడ్డుకు రాదు.

* కర్రముక్క ఒడ్డుకు రావాలంటే... గాలి కారణంగా ముందుకు వస్తుంది తప్ప, తరంగాల కదలిక వల్ల మాత్రం రాదు.

* భారీ తుపానులు (చక్రవాతాలు) సంభవించినప్పుడు పవనాల శక్తి ఎక్కువ. అప్పుడు తరంగాల ఎత్తు 15 నుంచి 18 మీటర్ల వరకు ఉంటుంది.

* రష్యా దేశానికి చెందిన ఎఫ్‌.పి.షెప్పార్డ్‌ అట్లాంటిక్‌ మహాసముద్ర ఉత్తర భాగంలో సముద్ర తరంగాల ఎత్తు దాదాపు 22 మీటర్లు అని తన పరిశోధనల ద్వారా తెలిపారు.

* 1977, నవంబరు 19న వచ్చిన ‘దివిసీమ ఉప్పెన’లో సముద్ర అలల ఎత్తు సుమారు 20 మీటర్లని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

సముద్ర పోటు - పాటులు 


* సముద్ర నీటిమట్టం ఒక క్రమపద్ధతిలో కొంత నిర్ణీత వ్యవధిలో పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది.


* నీటిమట్టం పెరగడాన్ని పోటు (High Tide), తగ్గడాన్ని పాటు (Low Tide) అంటారు.


* ఈ పోటు, పాటు ఊర్ధ్వంగా (Vertical) ఉంటాయి తప్ప క్షితిజ సమాంతరంగా (Horizontal) ఉండవు.


* ప్రతి పోటు, పాటుల కాలపరిమితి 6 గం. 12 నిమిషాలు. అంటే ఒకరోజులో రెండుసార్లు సముద్రమట్టం పెరుగుతుంది, తగ్గుతుంది.


* పోటు పాటుల వల్ల కలిగే నీటిమట్టపు వ్యత్యాసాన్ని వేలా పరిమితి అంటారు. అయితే సముద్రంలో వచ్చే పోటు, పాటుల ఎత్తు అన్ని సముద్రాల్లో ఒకేలా ఉండదు.


* సాధారణంగా పోటు ఎత్తు 3 మీటర్ల నుంచి 16 మీటర్ల వరకు ఉంటుంది.


* పోటు, పాటులకు కారణం సూర్యుడు, చంద్రుడి గురుత్వాకర్షణ బలం.

పోటు, పాటుల్లో రకాలు


* మామూలు రోజుల్లో వచ్చే పోటు, పాటులతోపాటు కొన్ని ప్రత్యేక సమయాల్లోనూ పోట్లు సంభవిస్తాయి.

* అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వచ్చే పోట్లను పర్వవేలా పోట్లు అంటారు. 

* నెల మొదటి, నాలుగో వారంలో వచ్చే పోట్లు లఘువేలా పోట్లు.

* భూభ్రమణం వల్ల ప్రతిరోజు 12.1/2 గంటల వ్యవధిలో వచ్చే పోట్లను అర్ధ పగటి పోట్లు అంటారు.

* మార్చి 21, సెప్టెంబరు 23న సూర్యుడు భూమధ్యరేఖ మీద ఉన్నప్పుడు చంద్రుడు భూమికి దగ్గరలో ఉంటాడు. ఈ రోజుల్లో వచ్చే పోట్లు విషవత్తు పోట్లు.

* జూన్‌ 21, డిసెంబరు 22న వచ్చే పోట్లను అయస్కాంత పోట్లు అంటారు.

* పోటు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు నీరు సముద్ర తీరంవైపు ప్రవహించి, పాటు వచ్చినప్పుడు తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఈ రకమైన పోటును ‘వరద పోటు’ అని, పాటుని ‘పాటి’ అని అంటారు.

పోటు - పాటుల ఉపయోగాలు

* ఉప్పు మడుల తయారీకి అనుకూలంగా ఉంటాయి.

* నదీ ముఖద్వారాల వద్ద పేరుకుపోయిన ఇసుక మేటలు, చెత్త మొదలైన వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ఇవి సహకరిస్తాయి.

* రేవు పట్టణాల్లోకి రాలేకపోయిన భారీ నౌకలు పోటు సమయంలో వచ్చి, మళ్లీ పాటు సమయంలో తిరిగి వెళ్లిపోతాయి. ఇటువంటి రేవు పట్టణాలను ‘టైడల్‌ పోర్ట్స్‌’ అంటారు. 

ఉదా: గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవు.

* సముద్రంలో ఉండే వృక్షాల పరపరాగ సంపర్కానికి  తోడ్పడతాయి.

* జపాన్, ఫ్రాన్స్‌ లాంటి దేశాలు వీటి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. దీన్ని టైడల్‌ ఎనర్జీ అంటారు.

* ఈ ఎనర్జీని తయారుచేసిన తొలిదేశం ఫ్రాన్స్‌.

సునామీలు (Tsunamis)

* సునామీలు ఒక రకమైన సముద్ర తరంగాలు. వీటి వల్ల జననష్టం, ఆస్తినష్టం ఎక్కువగా జరుగుతుంది.

* సునామీ అంటే హార్బర్‌లో వచ్చే తరంగాలు. 

* జపాన్‌ భాషలో ‘‘సు’’ (Su) అంటే రేవు, నామి (Nami) అంటే ‘‘అలలు’’.

* మహాసముద్ర అగాధాల్లో అతిపెద్ద భూకంపాలు సంభవించినప్పుడు, అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు సముద్ర గర్భం నుంచి భయంకరమైన అలలు పుట్టుకొస్తాయి. 

* ఇండోనేసియాలో క్రాకటోవా (Krakatao) అనే అగ్నిపర్వతం 1984లో సముద్రగర్భంలో పేలినప్పుడు అలలు 40 మీ.ల ఎత్తుకు లేచి తీర ప్రాంతాలను ముంచివేసింది.

* 2004లో ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో సంభవించిన సునామీ తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 8.9గా నమోదైంది. ఈ సునామీ అలల పొడవు 160 కి.మీ. వరకు ఉండగా, గంటకు 960 కి.మీ. వేగంతో పయనించి భారతదేశ తీరాన్ని చేరాయి. 

* ఈ సునామీ ప్రారంభ ప్రాంతం హిందూ మహాసముద్రంలోని ‘సిమియూల్‌’. ఇది అండమాన్‌ నికోబార్‌ దీవులకు 125 కి.మీ., భారతదేశ తూర్పు తీరానికి 1920 కి.మీ. దూరంలో ఉంది. 

* భారత్‌ను చేరిన ఈ సునామీ అలల ఎత్తు సుమారు 10 మీటర్లు. 

* ఈ అలలు అండమాన్‌-నికోబార్‌ దీవులు, తమిళనాడు ప్రాంతాలనే కాకుండా సుమారు 12 దేశాల ప్రాంతాలను ధ్వంసం చేశాయి.

* మైదాన ప్రాంతంలో సునామీ వేగం గంటకు 50 కి.మీ. ఉంటుంది.

సముద్ర తరంగాలు - వర్గీకరణ

సముద్ర తరంగాల స్వరూప స్వభావాలను అధ్యయనం చేసిన తర్వాత వీటిని రెండు విధాలుగా వర్గీకరించవచ్చు. అవి

1్శ పురోగ తరంగాలు (Progressive waves)

2్శ స్థిరమైన తరంగాలు (Stationary waves)

* పురోగ తరంగంలోని నీటి కణాల కదలిక వలయాకారంలో (ఇంచుమించు గుండ్రంగా) ఉండగా, స్థిరమైన తరంగాల్లోని నీటి కణాలు శృంగం వద్ద ముందువైపునకు, ద్రోణి వద్ద వెనుక వైపునకు క్షితిజ సమాంతరంగా కదులుతూ ఉంటాయి. 

* ఈ వర్గీకరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సముద్ర తరంగాలను మరో రెండు రకాలుగా వర్గీకరించారు. అవి.

1) స్వేచ్ఛా తరంగాలు (Free waves)

2) శక్తిమంతమైన తరంగాలు (Forced waves)

స్వేచ్ఛా తరంగాలు 

* నిర్మలంగా, నిశ్చలంగా ఉన్న ఒక తొట్టి నీళ్లలో ఒక చిన్న రాయిని వేసినప్పుడు గుండ్రంగా ఏర్పడే తరంగాలే స్వేచ్ఛా తరంగాలు. 

* ఇవి తాపీగా, నిర్మలంగా ఉండి రింగులు రింగులుగా ఒకదాని వెంట మరొకటి పుట్టుకొస్తాయి. వీటి వల్ల అపాయం లేదు. 

* ప్రాజెక్టులు కట్టినప్పుడు ఏర్పడే జలాశయాలు, పెద్ద చెరువులు, సరస్సులు మొదలైన వాటిలో ఈ రకమైన స్వేచ్ఛా తరంగాలను చూడవచ్చు.

శక్తిమంతమైన తరంగాలు 


* వీటిని విధ్వంస తరంగాలు (Destructive waves) అంటారు. ఇవి చాలా పెద్దగా వస్తాయి. అపాయకరమైనవి. 

* వీటివల్ల జన నష్టం, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

* తీర ప్రాంతాలు క్రమక్షయానికి గురవుతాయి. పవనాల వల్ల, ప్రకృతి శక్తులైన భూకంపాలు, అగ్నిపర్వతాలు, తుపానులు తదితరాల వల్ల ఇవి ఆవిర్భవిస్తాయి. 

* సునామీ శక్తిమంతమైన తరంగం.

పోటు - పాటుల ఆవిర్భావం గురించి తెలిపే సిద్ధాంతాలు

* ఈక్విలిబ్రియం సిద్ధాంతం - సర్‌ ఐజాక్‌ న్యూటన్‌

* డైనమికల్‌ సిద్ధాంతం - లాప్‌లాష్‌

* పురోగామి తరంగ సిద్ధాంతం - విలియం వేవెల్‌

* కెనాల్‌ సిద్ధాంతం - ఎయిరీ

* అచల తరంగ సిద్ధాంతం - హెరిస్‌

సముద్రంలోని నీరు ఎల్లప్పుడూ నిలకడగా ఉండకుండా కదులుతూ ఉంటుంది. ఈ కదలికలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి... 

1) ప్రవాహాల రూపం    2) పోటు-పాటులు 

3) తరంగాలు

* సముద్రంలోని నీరు పైన చెప్పిన విధంగా కదలడంతో భూగోళంపై ఏర్పడే అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలు ఒకే దగ్గర కేంద్రీకృతం కావు. వాటి విస్తరణ ప్రకృతి సిద్ధంగా జరుగుతుంది.

రచయిత

పి.కె. వీరాంజనేయులు

విషయ నిపుణులు 

Posted Date : 26-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌