• facebook
  • whatsapp
  • telegram

పంచాయతీరాజ్ వ్యవస్థ

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1959 అక్టోబరు 11న నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో మొదటి పంచాయతీ సమితిని లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండోది. ఆ తర్వాత అశోక్ మెహతా సిఫారసులను అనుసరించి 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి రామారావు పంచాయతీ వ్యవస్థను రద్దుచేసి, మండల పరిషత్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మండల పరిషత్ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1987 నుంచి అమల్లోకి వచ్చింది. తర్వాత కొన్ని కమిటీలు చేసిన సిఫారసులు, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఆధారంగా 1994లో నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం 1994 మే 30 నుంచి అమల్లోకి వచ్చింది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా 1986లో సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. 1995 మే 30 తర్వాత ఇద్దరు పిల్లలకు మించి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదా పదవిలో కొనసాగడానికి అనర్హులు. మహిళలకు 1/3వ వంతు రిజర్వేషన్లు కల్పించడానికి, రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే సూత్రానికి వ్యతిరేకం కాదని సుప్రీం కోర్టు అబ్దుల్ అజీజ్ అసాద్ Vs ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేసులో పేర్కొంది. ప్రస్తుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని బి.పి.ఆర్. విఠల్ కమిటీ సూచనల ప్రకారం ఏర్పాటు చేశారు.
 

గ్రామసభ
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పారదర్శకతను, బాధ్యతాయుతమైన పరిపాలనను ఇనుమడింపజేసేదే గ్రామసభ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి గ్రామసభకు సర్పంచ్, సర్పంచ్ లేనప్పుడు ఉపసర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. గ్రామ పంచాయతీ సరిహద్దు లోపల సభ్యులకు అనుగుణంగా సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయంలోపు గ్రామసభ సమావేశాన్ని ఎప్పుడైనా నిర్వహించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామసభను సంవత్సరానికి నాలుగుసార్లు (జనవరి 2, ఏప్రిల్ 14, జులై 1, అక్టోబరు 3) తప్పనిసరిగా నిర్వహించాలి. అయితే అవసరాన్ని బట్టి గ్రామసభను ఎన్నిసార్లయినా సమావేశపరచవచ్చు. కనీసం 50 మంది లేదా కనీసం 10% మంది సభ్యులు (ఏది ఎక్కువైతే అది) సభను ఏర్పాటు చేయమని లిఖితపూర్వకంగా కోరినట్లయితే సర్పంచ్ తప్పనిసరిగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం గ్రామసభ నిర్వహణకు కోరం నిర్ణయించలేదు.

రాజీవ్‌గాంధీ స్వశక్తీకరణ అభియాన్
పన్నెండో పంచవర్ష ప్రణాళికలో భాగంగా 2013 మార్చి 7న కేంద్ర ప్రభుత్వం రాజీవ్‌గాంధీ స్వశక్తీకరణ అభియాన్ (RGPSA) పథకాన్ని ప్రారంభించింది. గ్రామసభను మరింత సమర్థంగా నిర్వహించడం, పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, సమర్థ సేవల నిర్వహణ (Transparency, accountability and efficient delivery services) ఈ పథకం ముఖ్యోద్దేశం. ఇందులో సమాచార సేకరణ వ్యవస్థ ఏర్పాటు, సాంకేతిక సామర్థ్యం పెంపు, బాధ్యతతో వ్యవహరించడం మొదలైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు.

గమనిక: రాజీవ్‌గాంధీ స్వశక్తీకరణ అభియాన్ (RGPSA) పథకానికి అనుగుణంగా పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయటానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013 నవంబరు 7న ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అనుసరించి సంవత్సరంలో నాలుగుసార్లు గ్రామసభను నిర్వహించాలి.
 

ఈ - పంచాయత్
2004లో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో సమాచార సాంకేతికతను స్థానిక ప్రభుత్వాల ద్వారా గ్రామీణాభివృద్ధికి ఉపయోగించాలని తీర్మానించింది. పంచాయతీరాజ్‌లో సాంకేతికతతో కూడిన పాలననే ఈ - పంచాయత్ అంటారు. నేషనల్ ఈ - పంచాయత్ 2006లో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక భాగంగా ఏర్పడింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. 2013లో ప్రవేశపెట్టిన రాజీవ్‌గాంధీ స్వశక్తీకరణ అభియాన్ కూడా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొంది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌