• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ విభజన, తదనంతర పరిణామాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014: ముఖ్యాంశాలు

IV వ భాగం

ఇందులో 30 నుంచి 43 వరకు మొత్తం 14 సెక్షన్‌లు ఉన్నాయి. ఈ భాగంలో హైకోర్టుకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.


సెక్షన్‌ 30: భారత రాజ్యాంగ ప్రకరణ 214, విభజన చట్టంలోని సెక్షన్‌ 31 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త హైకోర్టు ఏర్పడే వరకు హైదరాబాద్‌లోని హైకోర్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో రాష్ట్ర అవతరణ రోజుకు ముందున్న న్యాయమూర్తులంతా విభజన రోజు నుంచి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు అవుతారు. వీరి జీతభత్యాలకు సంబంధించిన ఖర్చులను జనాభా ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు భరించాలి.


సెక్షన్‌ 31: సెక్షన్‌ 30లోని నియమాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేస్తారు. దీన్ని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని పిలుస్తారు. ఏపీకి నూతన హైకోర్టు ఏర్పడ్డాక హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి హైకోర్టు తెలంగాణ హైకోర్టుగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఎక్కడ ఉండాలనేది భారత రాష్ట్రపతి నోటిఫై చేస్తారు.


సెక్షన్‌ 32: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త హైకోర్టు ఏర్పడ్డాక ఉమ్మడి హైకోర్టులో ఉన్న న్యాయమూర్తుల్లో కొంత మందిని రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యమేరకు ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తారు. ఆ తేదీ నుంచి హైదరాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న హోదా ముగిసి, వారు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులవుతారు.


సెక్షన్‌ 33: ఏపీలో చేర్చిన భూభాగాలపై సెక్షన్‌3 లో పేర్కొన్న తేదీకి ముందు అమల్లో ఉన్న శాసనం ప్రకారం హైదరాబాద్‌ హైకోర్టుకు పూర్తి విచారణాధికార పరిధి, శక్తి, అధికారాలుంటాయి. 


సెక్షన్‌ 34: ఏపీ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదై, ప్రస్తుత హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరిస్తున్న వారు తెలంగాణ బార్‌ కౌన్సిల్‌కు తన పేరు మార్చాలని ఏడాదిలోపు కోరవచ్చు.


సెక్షన్‌ 35: సెక్షన్‌ 31(1)లో పేర్కొన్న తేదీకి ముందు హైదరాబాద్‌ హైకోర్టులో ప్రాక్టీస్, ప్రొసీజర్‌కు సంబంధించి అమల్లో ఉన్న శాసనంలో కొన్ని అవసరమైన మార్పులు చేయొచ్చు. ఈ చట్టంలోని ఈ భాగం నియమాలకు లోబడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు వర్తిస్తాయి. కాబట్టి ప్రాక్టీస్, ప్రొసీజర్‌కు సంబంధించిన నియమాలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయడానికి, నూతన హైకోర్టు ఏర్పడటానికి ముందు హైదరాబాద్‌ హైకోర్టుకు ఉన్న అధికారాలన్నీ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఉంటాయి.

సెక్షన్‌ 36: సెక్షన్‌ 31(1)లో పేర్కొన్న తేదీకి ముందు అమల్లో ఉన్న హైదరాబాద్‌ హైకోర్టు సీలు ఆధీనతకు సంబంధించి అమల్లో ఉన్న శాసనం కొన్ని అవసరమైన మార్పులతో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీల్‌ ఆధీనతకు చెందుతుంది.

సెక్షన్‌ 37: సెక్షన్‌ 31(1) పేర్కొన్న హైదరాబాద్‌లోని హైకోర్టులో ఉపయోగించే, జారీచేసే, తీర్పులు చెప్పే రిట్స్‌ రూపాలు, ఇతర విధి విధివిధానాలకు సంబంధించి అమల్లో ఉన్న శాసనం అవసరమైన కొన్ని మార్పులతో ఏపీ హైకోర్టులో వినియోగించే, జారీచేసే, తీర్పులు చెప్పే రిట్స్‌ రూపాలు, ఇతర ప్రాసెస్‌లకు వర్తిస్తాయి.

సెక్షన్‌ 38: హైదరాబాద్‌ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, ద్విసభ్య న్యాయమూర్తుల ధర్మాసనాలకు, తర్వాతి అనుబంధ కార్యక్రమాలకు సంబంధించిన అధికారాల విషయంలో సెక్షన్‌ 31(1)లో పేర్కొన్న తేదీకి ముందు అమల్లో ఉన్న శాసనం, అవసరమైన కొన్ని మార్పులతో ఏపీ హైకోర్టుకూ వర్తిస్తుంది.

సెక్షన్‌ 39: హైదరాబాద్‌ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు అప్పీలు, ఏకసభ్య, ద్విసభ్య ధర్మాసనాల విషయంలో సెక్షన్‌ 1లో పేర్కొన్న తేదీకి ముందు అమల్లో ఉన్న శాసనం, అవసరమైన కొన్ని మార్పులతో ఏపీ హైకోర్టుకు కూడా వర్తిస్తుంది.

సెక్షన్‌ 40: హైదరాబాద్‌ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు కేసుల బదిలీకి సంబంధించిన అంశాల గురించి వివరించారు.

సెక్షన్‌ 41: సెక్షన్‌ 30(1)లో పేర్కొన్న తేదీకి ముందు హైదరాబాద్‌ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీసు చేయడానికి హక్కు ఉన్న వ్యక్తి, హైదరాబాద్‌ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు సెక్షన్‌ 40 ద్వారా బదిలీ అయిన ప్రొసీడింగ్స్‌కు హాజరయ్యే అధికారం కూడా కలిగి ఉంటే, ఆ ప్రొసీడింగ్స్‌కు సంబంధించి కోర్టులో పాల్గొనడానికి హక్కు కలిగి ఉంటారు.

సెక్షన్‌ 42: సెక్షన్‌ 41 అవసరాల కోసం సెక్షన్‌ 42ను పొందుపరిచారు. సెక్షన్‌ 30(1)లో పేర్కొన్న తేదీ లేదా తర్వాత ఆ హైకోర్టుకు సంబంధించి ఏ శాసనసభ లేదా నియమాలు చేసే అధికారం ఉన్న ఇతర అధికారి జారీ చేసిన నియమాలను అనుసరించి ఈ భాగం అధికారాన్ని కలిగి ఉంటుంది.

సెక్షన్‌ 43: సెక్షన్‌ 31(1)లో పేర్కొన్న తేదీ లేదా తర్వాత ఆ హైకోర్టుకు సంబంధించి శాసన వ్యవస్థ లేదా ఇతర అధికార వ్యవస్థ ఏదైనా శాసనం చేస్తే, దాన్ని అనుసరించి ఈ భాగం పనిచేస్తుంది.

V వ భాగం 

ఇందులో 44 నుంచి 46 వరకు మొత్తం 3 సెక్షన్‌లు ఉన్నాయి. ఈ భాగం రెండు రాష్ట్రాలు వ్యయం చేసుకునే అధికారాన్ని, రెండు రాష్ట్రాల మధ్య ఆదాయం పంపిణీ అంశాలను వివరిస్తుంది.

సెక్షన్‌ 44: అవతరణ రోజుకు ముందు ఎప్పుడైనా తెలంగాణ ప్రభుత్వం సంచిత నిధి నుంచి తాను సమంజసం అనుకున్నంత వరకు అవతరణ నుంచి 6 నెలలకు మించని కాలానికి తెలంగాణలో వ్యయానికి అధికారం ఇవ్వాలి. అంతేకాకుండా అవతరణ రోజు తర్వాత అవసరం అనుకుంటే రాష్ట్ర సంచిత నిధి నుంచి ఆరు నెలల తర్వాత మరికొంత కాలానికి అంటే మరో ఆరునెలలు మించకుండా వ్యయానికి తెలంగాణ గవర్నర్‌ అధికారం ఇవ్వొచ్చు.

సెక్షన్‌ 45: అవతరణ రోజు కంటే ముందు ఏ కాలానికైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అకౌంట్‌్్సకు సంబంధించిన నివేదికలను రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 151్బ2్శ ప్రకారం కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కొత్త రాష్ట్రాల గవర్నర్‌లకు సమర్పించాలి. ఈ నివేదికలను ఆయా గవర్నర్లు సంబంధిత శాసనసభల్లో ప్రవేశపెట్టాలి. 

సెక్షన్‌ 46: 13వ ఆర్థిక సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేటాయించిన అవార్డును (సొమ్మును), రాష్ట్ర ఆదాయాన్ని జనాభా నిష్పత్తి, ఇతర ప్రాతిపదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. నూతన ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్యాకేజీ రూపొందించే సమయంలో రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాల అవసరాలను కేంద్రం పరిశీలించాలి.

VI వ భాగం

ఇందులో 47 నుంచి 67 వరకు మొత్తం 21 సెక్షన్‌లు ఉన్నాయి. విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ గురించి ఈ భాగం వివరిస్తుంది.

సెక్షన్‌ 47: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీసుకున్న నిర్ణయాలతో వచ్చే అప్పుల బాధ్యతను రెండు రాష్ట్రాలు భరించాలి. అదేవిధంగా ఉమ్మడి ఏపీ తీసుకున్న నిర్ణయాలతో వచ్చే లాభంపై రెండు రాష్ట్రాలకూ హక్కు ఉంటుంది. ఆస్తులు, అప్పుల పంపిణీ విషయంలో తలెత్తే వివాదాలను రెండు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించాలి. అది సాధ్యం కాకపోతే భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)ను సంప్రదించి కేంద్రం ఒక ఉత్తర్వు ద్వారా పరిష్కరించాలి.

సెక్షన్‌ 48: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మొత్తం భూమి, నిల్వలు, వస్తువులు, ఇతర పదార్థాలు బదిలీ అయిన ప్రదేశంలో ఉంటే అవి తెలంగాణ రాష్ట్రానికి చెందుతాయి. మిగతా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మిగులుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులకు బయట ఆస్తులు ఉంటే, జనాభా నిష్పత్తి ప్రకారం వాటిని రెండు రాష్ట్రాలకు పంచాలి. ఆస్తులను ఉనికి ఆధారంగా కాకుండా మరోవిధంగా పంచాలని కేంద్రం భావిస్తే, దానికి అనుగుణంగానే ఆదేశాలు జారీ చేసి పంచాలి. ప్రత్యేక అవసరాల కోసం ఏర్పాటైన నిల్వలు కొన్ని సంస్థల్లో, వర్క్‌షాప్‌లలో, అండర్‌ టేకింగ్స్‌లో, నిర్మాణంలో ఉన్న కొన్ని పనుల కోసం ప్రత్యేక పరికరాలు ఉన్న ప్రదేశాలు ఏ రాష్ట్రంలో ఉంటే దానికే ఆ వస్తువులు, నిల్వలు చెందుతాయి. సచివాలయం విభాగాధిపతి కార్యాలయంలోని నిల్వలను జనాభా నిష్పత్తి ప్రకారం రెండు రాష్ట్రాలకు పంచాలి.

సెక్షన్‌ 49: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ కోశాగారాల్లో, అవతరణ రోజుకు ముందు ఉన్న నగదు సొమ్ము నిల్వలను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మొదలైన బ్యాంకుల్లో ఉన్న అప్పుల నిల్వలను ఏపీ, తెలంగాణలకు జనాభా నిష్పత్తి ప్రకారం పంచాలి. అయితే పంపిణీ అవసరాల కోసం కోశాగారం నుంచి మరొక ప్రభుత్వ కోశాగారానికి నగదు మిగులు బదిలీ అవసరం లేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఖాతా పుస్తకాల్లో అవతరణ రోజు నాటి రెండు రాష్ట్రాల ఖాతా నిల్వల్లో సర్దుబాటు చేయాలి. అవతరణ రోజు తెలంగాణకు రిజర్వ్‌ బ్యాంక్‌లో ఖాతా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా సూచించిన మేరకు సర్దుబాటు చేయాలి.

సెక్షన్‌ 50: ఆస్తికి సంబంధించిన భూమి శిస్తు, పన్ను తదితర బకాయిలు ఆ ఆస్తి ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి. అవతరణ రోజు నాటికి ఆస్తుల మీద పన్ను మదింపు చేసే చోటు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి ఆ పన్ను బకాయిలు వసూలు చేసే అధికారం ఉంటుంది.

సెక్షన్‌ 51: అవతరణ రోజు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బయట ఎవరైనా వ్యక్తి లేదా సంస్థకు ఇచ్చిన రుణాలు లేదా అడ్వాన్స్‌లను వసూలు చేసే హక్కు ఏపీకి ఉంటుంది. వసూలు చేసిన తర్వాత వచ్చిన సొమ్మును జనాభా ప్రాతిపదికపై రెండు రాష్ట్రాల మధ్య పంచాలి.

సెక్షన్‌ 52: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నగదు నిల్వలు, పెట్టుబడి ఖాతా నుంచి లేదా ప్రభుత్వ ఖాతాలోని ఏదైనా నిధి నుంచి పెట్టుబడిగా పెట్టిన సెక్యూరిటీలను జనాభా ప్రాతిపదికపై రెండు రాష్ట్రాల మధ్య పంచాలి.

సెక్షన్‌ 53: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వాణిజ్య లేదా పారిశ్రామిక సంస్థలకు చెందిన ఆస్తులు, అప్పులు అవతరణ రోజు ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతంతో సంబంధం లేకుండా ఆ సంస్థలున్న ప్రాంతాన్ని ఏ రాష్ట్రంలో చేర్చారో దానికే ఇవ్వాలి.

సెక్షన్‌ 54: అవతరణ రోజుకు ముందు ఉమ్మడి ఏపీకి చెందిన ప్రజారుణం ప్రభుత్వ ఖాతా వల్ల చెల్లించాల్సిన అన్ని అప్పులను ఈ చట్టంలోని నిబంధనల ద్వారా పంచడానికి వేరే పద్ధతిని ఇతర విధానాలు నిర్దేశిస్తే, రెండు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికపై పంచాలి.

సెక్షన్‌ 55: అవతరణ రోజు నుంచి ఏర్పాటయ్యే రెండు కొత్త రాష్ట్రాల్లో ఏదైనా రాష్ట్రం పనుల నిమిత్తం స్వల్పకాలిక రుణాన్ని తీసుకుంటే, ఆ అప్పు ఆ రాష్ట్రానిదే. ఏదైనా ఇతర సందర్భంలో దాన్ని జనాభా ప్రాతిపదికపై పంచాలి.

సెక్షన్‌ 56: ఉమ్మడి ఏపీలో ఆస్తి పన్ను, సుంకం, భూమి శిస్తును పరిమితికి మించి వసూలు చేస్తే, దాన్ని తిరిగి చెల్లించే బాధ్యత, ఆ ఆస్తి ఉన్న రాష్ట్రానికే చెందుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో అధికంగా వసూలు చేసిన ఇతర పన్నులు, శిస్తులకు సంబంధించి తిరిగి చెల్లించే బాధ్యతను కొత్తగా ఏర్పడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య జనాభా ప్రాతిపదికపై పంచాలి. తిరిగి చెల్లింపులు చేసిన రాష్ట్రానికి మరో రాష్ట్రం నుంచి దాని వాటా తీసుకునే హక్కు ఉంది.

సెక్షన్‌ 57: సివిల్‌ డిపాజిట్‌ లేదా లోకల్‌ డిపాజిట్‌ను ఏ ప్రాంతంలో చేస్తారో దాని బాధ్యత ఆ రాష్ట్రానికే చెందుతుంది.

సెక్షన్‌ 58: అవతరణ రోజు సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి చెందిన ప్రావిడెంట్‌ ఫండ్‌ చెల్లింపు బాధ్యత ఆ తేదీ నుంచి ఆ ఉద్యోగిని శాశ్వతంగా కేటాయించిన రాష్ట్రానికి చెందుతుంది.

సెక్షన్‌ 59: పెన్షన్‌ల చెల్లింపునకు సంబంధించి ఉమ్మడి ఏపీపై ఉన్న బాధ్యత రెండు రాష్ట్రాలకు బదిలీ అవుతుంది. ఈ చట్టంలోని 8వ షెడ్యూల్‌లో పొందుపరిచిన నియమాల ప్రకారం ఇది జరగాలి.

సెక్షన్‌ 60: అవతరణ రోజుకు ముందు ఉమ్మడి రాష్ట్రం తన పాలనా అధికారాన్ని వినియోగిస్తూ రాష్ట్ర అవసరాల కోసం ఏవైనా ఒప్పందాలు చేసుకుంటే వాటి ప్రయోజనాలను అవతరణ రోజు తర్వాత ఆంధ్రప్రదేశ్‌ లేదా తెలంగాణాల్లో ఏది పొందితే, ఆ రాష్ట్రమే ఆ బాధ్యత తీసుకుంటుంది.

సెక్షన్‌ 61: ఒప్పంద ఉల్లంఘనలు కాకుండా దావా వేయదగిన తప్పులు అవతరణ రోజుకు ముందు చేస్తే, రెండు రాష్ట్రాల్లో దేని పరిధిలో కేసు వేయగలరో చెల్లింపు బాధ్యత ఆ రాష్ట్రానికే చెందుతుంది. మిగిలిన సందర్భాల్లో జనాభా ప్రాతిపదికన లేదా రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం ప్రకారం వాటికి పంచాలి.

సెక్షన్‌ 62: అవతరణ రోజుకు ముందు సహకార సంఘాలకు లేదా వ్యక్తులకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బాధ్యత వహిస్తే అవతరణ రోజు నుంచి ఆయా సంఘాలు లేదా వ్యక్తులు పనిచేసే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందో దానికే ఆ బాధ్యత ఉంటుంది. ఇతర సందర్భాల్లో జనాభా ప్రాతిపదికన లేదా రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్న ప్రకారం పంచాలి.

సెక్షన్‌ 63: ఎటూ తేల్చలేని లేదా సందిగ్ధంలో ఉన్న అంశాలు ఈ భాగంలోని నియమావళిలో పేర్కొన్న ఆస్తులపై లేదా బాధ్యతలపై ప్రభావం కలిగిస్తే వాటిని ఆ నియమావళి ప్రకారమే పరిష్కరించాలి.

సెక్షన్‌ 64: ఉమ్మడి రాష్ట్రం ప్రయోజనాలు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన అంశాలను ఈ భాగంలో ప్రస్తావించకపోతే మొదటగా అవి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అవుతాయి. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కుదిరే ఆర్థిక సర్దుబాటుకు లేదా అలాంటి ఒప్పందాలు లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు ద్వారా సూచించిన అంశాల ప్రకారం అవి బదిలీ అవుతాయి.

సెక్షన్‌ 65: జుఖి వ భాగంలోని నియమాలు నిర్దేశించిన ప్రకారం కాకుండా రెండు రాష్ట్రాలు ఏదైనా ఆస్తిని లేదా అప్పును మరో రకంగా పంచుకోవడానికి అంగీకరిస్తే, ఈ భాగంలో ఏమని పేర్కొన్నా ఆ ఆస్తులకు సంబంధించిన లాభాలు లేదా అప్పులను ఒప్పుకున్న రీతిలో పంచుకోవాలి.

సెక్షన్‌ 66: జుఖి వ భాగంలో ఏ నియయం ద్వారానైనా కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఏవైనా ఆస్తులు, లాభాలు పొందే హక్కు ఏర్పడినా లేదా కొత్త బాధ్యత తలెత్తినా రెండు రాష్ట్రాల్లో ఏదైనా అపాయింటెడ్‌ డే నుంచి మూడేళ్లలోగా అభ్యర్థిస్తే కేంద్ర ప్రభుత్వం న్యాయంగా ఆ ఆస్తి, లాభం ఏ రాష్ట్రానికైనా చెందాలని భావించినా, ఏ రాష్ట్రంలోనైనా పంచాలనుకున్నా లేదా బాధ్యత తీర్చడానికి మరో రాష్ట్రానికి చెల్లించాల్సిన అవసరం ఉందని భావించినా ఆ మేరకు ప్రయోజనాలను కేటాయించాలని, లేదా కేంద్రం రెండు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాక ఒక రాష్ట్రం మరో రాష్ట్రానికి చెల్లించాలని నిర్ధారించవచ్చు.

సెక్షన్‌ 67: ఈ చట్టం నియమాల ప్రకారం కొత్త రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం మరొక రాష్ట్రానికి చెల్లించాల్సిన మొత్తాన్ని, ఆయా రాష్ట్రాల సంచిత నిధి నుంచి కొత్త రాష్ట్రాలను కేంద్రం చెల్లించాల్సిన మొత్తాన్ని కేంద్ర సంచిత నిధి నుంచి తీసుకోవాలని నిర్ధారించాలి.

Posted Date : 20-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌