• facebook
  • whatsapp
  • telegram

మొక్కలు -  కాండం రూపాంతరాలు

* బంగాళాదుంప లాంటి కొన్ని మొక్కలు భూగర్భ కాండాన్ని కలిగి ఉన్నప్పటికీ, అది భూమిపై కనిపిస్

* ఎగబాకే మొక్కల్లో పొడవైన, సన్నటి కాండాలు ఉంటాయి. ఇవి దేన్నైనా ఆధారంగా చేసుకుని పైకి ఎదుగుతాయి. నిటారుగా పెరగకుండా, నేలపై వ్యాపించే బలహీనమైన కాండం ఉన్న మొక్కలను ‘లతలు’ అంటారు.


కాండం అంతర్నిర్మాణం

* బాహ్య చర్మ కణజాలం, మృదు కణజాలం (గ్రౌండ్‌ టిష్యూ), ప్రసరణ కణజాలం (వాస్కులర్‌ టిష్యూ) అనే మూడు కణజాలాలు కలిసి ఒక కాండం అంతర్నిర్మాణపరంగా తయారవుతుంది.

బాహ్య చర్మ కణజాలం కాండం బయటి ఉపరితలాన్ని కప్పి ఉంచుతుంది. ఇది తరచుగా వాయు వినిమయ నియంత్రకంగా పనిచేస్తూ కొన్నింటి నుంచి (మొక్కకు హాని కలిగించేవాటికి) అవరోధంగా, రక్షణగా పనిచేస్తుంది.

ప్రసరణ కణజాలం చుట్టూ మృదు కణజాలం నిండి ఉంటుంది. కొన్ని మొక్కల్లో మృదు కణజాలం హరిత రేణువులతో ఉండి, కిరణజన్య సంయోగక్రియలోనూ పాల్గొంటుంది.

* ప్రసరణ కణజాలం మొక్కల్లో నీరు, పోషకాల రవాణాకు ఉపయోగపడుతుంది. వివిధ మొక్కల జాతుల మధ్య ప్రసరణ కణజాలం వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది.


కాండం రూపాంతరాలు - వర్గీకరణ

మొలకెత్తే విత్తనం ప్లుమ్యుల్‌ లేదా ప్రథమ కాండం నుంచి కాండం అభివృద్ధి చెందుతుంది. కాండం  ప్రధాన లక్షణం కణుపులు లేదా నోడ్స్, కణుపు మధ్యమాలు లేదా ఇంటర్‌నోడ్స్‌ను కలిగిఉండటం.

కొన్ని మొక్కల్లో కాండం రూపాంతరం చెంది ఉంటుంది. ఇది వాయుగత, ఉప వాయుగత లేదా భూగర్భ రూపాంతరాలు కావొచ్చు. 

రూపాంతర కాండాలు నిర్దేశిత విధులను నిర్వహించడానికి ఉపయోగపడతాయి. ఇవి సాధారణంగా కాండంతో బాహ్య సారూప్య సంబంధాన్ని కలిగి ఉండవు. కొన్ని మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ, ఏపుగా వ్యాప్తి చెందడం లాంటి వివిధ విధులను నిర్వహించడానికి కాండాలు రూపాంతరం చెందుతాయి. 

కాండ రూపాంతరాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:

1. భూగర్భ రూపాంతర కాండాలు: రైజోమ్, బల్బ్, మొక్కజొన్న, చిలకడ దుంప

2. ఉపవాయుగత (సబ్‌ ఏరియల్‌) రూపాంతర కాండాలు: రన్నర్, సక్కర్, ఆఫ్‌సెట్‌లు, స్టోలోన్‌

3. వైమానిక లేదా వాయుగత రూపాంతర కాండాలు: టెండ్రిల్స్, ముళ్లు, బల్బిల్స్, క్లాడోడ్, ఫిలోక్లేడ్‌


భూగర్భ కాండ రూపాంతరాలు

* ఇవి భూగర్భంలో ఉన్నాయి. ఆహార నిల్వ, వ్యాప్తి, శాశ్వతత్వం లాంటి వివిధ ప్రయోజనాలను అందిస్తాయి. నోడ్స్, ఇంటర్‌నోడ్స్‌ ఉనికి ద్వారా వాటిని మూలాల నుంచి గుర్తించవచ్చు.

ఇవి అలైంగిక పునరుత్పత్తి ద్వారా మొక్కలను వ్యాప్తి చేయడంలో; మొక్క నిద్రాణస్థితిలో జీవించడంలో సహాయపడతాయి. ఈరకం రూపాంతరాలు జంతువులు, పర్యావరణ ఒత్తిడి నుంచి  మొక్కలకు రక్షణ ఇస్తాయి.

రైజోమ్‌: ఇది భూమికి సమాంతరంగా పెరుగుతుంది. ఎగువభాగం పొలుసుల ఆకులను ఉత్పత్తి చేస్తే, దిగువ భాగం అబ్బురపు మూలాలను కలిగి ఉంటుంది. రైజోమ్‌లో నోడ్స్, ఇంటర్‌నోడ్స్, మొగ్గలు ఉంటాయి. ఇవి ఆహారాన్ని నిల్వ చేస్తాయి. ఉదా: అల్లం, పసుపు

బల్బ్‌: కాండం కుచించుకుపోయి, పొలుసు ఆకులతో చుట్టి ఉంటుంది. ఉదా: తులిప్స్, లిల్లీస్, డఫోడిల్స్, ఉల్లిపాయ, వెల్లుల్లి

కారమ్‌: కాండం పొలుసుల ఆకులతో చుట్టి, నిటారుగా ఉంటుంది. బల్బ్‌తో పోలిస్తే ఇది చాలా సంక్షిష్టమైంది.

ఉదా: కొలకేసియా, యామ్‌

స్టెమ్‌ ట్యూబర్‌: ఇందులో కాండం కండ కలిగి, ఆహారాన్ని నిల్వ చేస్తుంది. ఇందులో నోడ్స్, ఇంటర్‌నోడ్స్‌ ఉంటాయి. కానీ ఘనపరిమాణం కారణంగా అవి కనపడవు. నోడ్స్‌ వద్ద పొలుసుల ఆకులను కణుపులు లేదా మచ్చలుగా చూడొచ్చు.

ఉదా: బంగాళదుంప

ఉపవాయుగత (సబ్‌ ఏరియల్‌) రూపాంతర కాండాలు

* ఈ రకమైన కాండం నేలపై లేదా పాక్షికంగా భూగర్భంలో ఉంటుంది. ఇది ఎక్కువగా గడ్డి మొక్కల్లో కనిపిస్తుంది. ఇవి స్వల్పకాలిక, బలహీన, గుల్మ కాండాన్ని కలిగి ఉంటాయి. కాండం వేగవంతమైన వ్యాప్తికి ఉపయోగపడుతుంది.

రన్నర్‌: ఇది ఆధార కణుపు మాధ్యమం పొడుగు భాగం నుంచి ఉద్భవించింది. నేలపై అడ్డంగా పెరుగుతుంది. కణుపుల (నోడ్స్‌) వద్ద వేరు అభివృద్ధి జరుగుతుంది. ఈ వేర్లు మట్టిని పట్టి ఉంచుతాయి. ఉదా: గడ్డి, సైనోడాన్, ఆక్సాలిస్‌

స్టోలోన్‌: ఒక చిన్న, బలహీన వాయుగత శాఖ ప్రధాన అక్షం నుంచి ఆవిర్భవిస్తుంది. అది కిందికి వంగి నేలలో మూలాలను ఏర్పర్చి, అక్కడ ఒక కొత్త మొక్క అభివృద్ధి చెందుతుంది.

ఉదా: పుదీనా, స్ట్రాబెర్రీ

సక్కర్‌: సక్కర్‌ కాండం భూగర్భ భాగం నుంచి పుడుతుంది. ఇది నేల కింద అడ్డంగా పెరిగి, భూమిపైకి వస్తుంది. ఇది ఆకులతో అబ్బురపు మూలాలను, రెమ్మలను అభివృద్ధి చేసి, కొత్త మొక్కను ఏర్పరుస్తుంది.

ఉదా: చామంతి, అరటి, పైనాపిల్‌

ఆఫ్‌సెట్‌లు: ఇవి ఎక్కువగా జల ఆవాస మొక్కల్లో కనిపిస్తాయి. ఒక పార్శ్వ శాఖ చిన్న ఇంటర్‌నోడ్స్‌ను కలిగి ఉంటుంది. కణుపుల వద్ద పైభాగంలో, దిగువ మూలాల వద్ద రోసెట్‌ వలయంలో ఆకులు అభివృద్ధి చెందుతాయి.

ఉదా: పిస్టియా, ఐకార్నియా


వాయుగత రూపాంతర కాండాలు

*ఈరకమైన కాండ రూపాంతరాలు నేలపై వాయుగతంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలికమైనవి, బలమైనవి, దారుయుత దృఢ కాండం కలిగి ఉంటాయి. మొక్క రక్షణ, ఆధారానికి ఉపయోగపడతాయి.

టెండ్రిల్స్‌: ఇది ఒక సున్నిత భాగం. ఆక్సిలరీ (పార్శ్వ) మొగ్గ నుంచి అభివృద్ధి చెందుతాయి. మొక్క ఎత్తుకు పాకడానికి ఉపయోగపగుతుంది.

ఉదా: ద్రాక్ష, పుచ్చకాయ, గుమ్మడి, దోస

ముళ్లు: ఇవి ఆక్సిలరీ మొగ్గల నుంచి అభివృద్ధి చెందుతాయి. ఇవి మొనదేలిన దారుయుత గట్టి నిర్మాణాలు. ఇవి పశువుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

ఉదా: బోగెన్‌విల్లా, నిమ్మకాయ

బల్బిల్స్‌: ఇది రూపాంతరం చెందిన ఆక్సిలరీ మొగ్గ. ఆహారాన్ని నిల్వ చేసి, కండగలదిగా మారుస్తుంది. ఇది తల్లి మొక్క నుంచి విడిపోయి కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది.

ఉదా: డయోస్కోరియా

క్లాడోడ్, ఫిలోక్లేడ్‌: ఇవి ఆకుపచ్చగా ఉండి, కిరణ జన్య సంయోగక్రియను నిర్వహిస్తాయి. నీటి నష్టాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇవి సాధారణంగా జీరోఫైటిక్‌ మొక్కల్లో కనిపిస్తాయి.

ఉదా: యుఫర్బియ, ఆస్పరాగస్‌

కాండం విధులు

 మొక్క కాండం ప్రధాన పని దాని ఆకులు, పువ్వులు, మొగ్గలను పట్టుకోవడం ద్వారా మొక్కకు ఆధారాన్ని ఇవ్వడం. అప్పుడప్పుడు అది మొక్క ఆహార నిల్వ నిర్మాణాలుగా కూడా పనిచేస్తుంది. అదనంగా, అది మొక్క గ్రహించిన ఖనిజాలు, నీటి రవాణలో సహాయపడుతుంది.

* అనేక మొక్కల్లో కాండం నిల్వ, రక్షణ, కిరణజన్య సంయోగక్రియ, మద్దతు, ప్రత్యుత్పత్తి, శాశ్వతత్వం లాంటి విభిన్న విధులను నిర్వహిస్తుంది. రూపాంతరాలు లాంటి మెరుగైన అనుసరణ, మనుగడలో సహాయపడుతుంది.

* మొక్కకు దాని పుష్పాలు, పండ్లను పట్టుకోవడానికి కాండం ఒక స్థలాన్ని ఇస్తుంది. దోసకాయ, ద్రాక్ష, పుచ్చకాయ కాండం టెండ్రిల్స్‌ సహాయక నిర్మాణాలుగా ఉపయోగపడతాయి.

* ఇది పోషకాలను నిల్వ చేసే నిర్మాణం కూడా. బంగాళదుంప, అల్లం, ఉల్లిపాయ, మొక్కజొన్న లాంటి మొక్కల్లో ఆహార నిల్వకోసం కాండం రూపాంతరం చెందుతుంది. 

* ఇవి మూలాలు, కొమ్మల్లోని దారువు, పోషక కణజాలం మధ్య ఖనిజాలు, నీటిని రవాణా చేయడంలో సహాయపడుతుంది.

* మొక్కను రక్షించడంలో కాండం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సిట్రస్, బోగెన్‌విల్లా కాండం పార్శ్వ లేదా ఆక్సిలరీ మొగ్గలు మొక్కకి రక్షణ కల్పించేందుకు ముళ్లుగా పెరుగుతాయి. అవి జంతువుల నుంచి మొక్కలను కాపాడతాయి.

* కాండం కొత్త జీవ కణజాలాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది. మొక్క కణాల జీవితకాలం సాధారణంగా ఒకటి నుంచి మూడేళ్లు ఉంటుంది. కాండంలోని విభాజ్య లేదా మెరిస్టెమ్‌ కణాలు ప్రతివిభజనలో కొత్త జీవ కణజాలాన్ని ఉత్పత్తి చేస్తాయి. మల్లె, పుదీనా, భూగర్భ గడ్డిలోని పార్శ్వ శాఖలు ఏపుగా పెరిగి, పునరుత్పత్తి నిర్మాణాలుగా పనిచేస్తాయి. మొక్కల కాండం మరొక ముఖ్యమైన విధి ఆహార సమీకరణ. 

* ఒపన్షియాలోని చదునైన కాండం కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తుంది. ఇది క్లోరోఫిల్‌ను కలిగి ఉంటుంది.


మాదిరి ప్రశ్నలు 


1. ఒక మొక్కలో కాండం విధి ఏమిటి?

1) పునరుత్పత్తి    2) కిరణజన్య సంయోగక్రియ

3) పోషకాల నిల్వ    4) ఆధారాన్ని ఇవ్వడం


2. కాండం ఆకుల్ని అంటుకున్న ప్రాంతాన్ని ఏమంటారు?

1) నోడ్‌ (కణుపు)     2) ఇంటర్‌నోడ్‌    3) అపెక్స్‌    4) ఆక్సిల్‌


3. ఏరకమైన కాండం సన్నగా, అనువుగా ఉంటూ ద్వితీయ పెరుగుదలను కలిగి ఉండదు?

1)  హెర్బాసియస్‌ కాండం (గుల్మ రకపు కాండం)       2)  చెక్క కాండం

3)  మోనోకాట్‌ కాండం    4)   డైకాట్‌ కాండం


4. కాండంలోని కాంబియం పొర విధి ఏమిటి?

1)  నీరు, ఖనిజాలను రవాణా చేస్తుంది      2)  కాండానికి మద్దతు ఇస్తుంది

3) ద్వితీయ వృద్ధికి కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది  4)   పోషకాలను నిల్వ చేస్తుంది


5. కింది వాటిలో కాండం రూపాంతరం కానిది ఏది?

1)   ముల్లు   2)   రన్నర్‌     3)  బల్బ్‌    4)   పిటియోల్‌


6. బంగాళదుంప ఉబ్బిన భూగర్భ కాండాన్ని సూచించే సరైన పదం ఏది?

1) బల్బ్‌     2)   రైజోమ్‌     3)  స్టెమ్‌ ట్యూబర్‌        4)   స్లోలోన్‌

సమాధానాలు

1-4         2-1      3-1      4-3       5-4      6-3   

Posted Date : 30-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌