• facebook
  • whatsapp
  • telegram

సరిహద్దు దేశాలతో సంబంధాలు

భారతదేశం - పాకిస్థాన్‌


 భారతదేశం, పాకిస్థాన్‌ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దురేఖ సర్‌ రాడ్‌క్లిఫ్‌ రేఖ. దీన్ని 1947 భారతీయ స్వాతంత్య్ర చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. 


 ఈ విభజన రేఖను డికి బర్డ్‌ ప్రణాళిక( dikie bird pian) లేదా జూన్‌ 3 ప్రణాళిక లేదా మౌంట్‌బాటన్‌ ప్రణాళికలో చేర్చారు.  పాకిస్థాన్, గుజరాత్‌ను 24oసమాంతర రేఖ వేరు చేస్తోంది.


వివాదాస్పద ప్రాంతాలు


రాణ్‌ ఆఫ్‌ కచ్‌: ఇది గుజరాత్‌లో ఉంది. రాణ్‌ అంటే ఉప్పు పొరతో ఉన్న భూభాగం.


 ఈ ప్రాంతంలో సహజవాయు నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే పాకిస్థాన్‌ 1948లో గుజరాత్, పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌పై దాడి చేసి, కొంత భాగాన్ని ఆక్రమించింది. 


 రాణ్‌ ఆఫ్‌ కచ్‌ మొత్తం విస్తీర్ణం 9000 చ.కి.మీ. అందులో 8000 చ.కి.మీ భూభాగాన్ని పాకిస్థాన్‌ ఆక్రమించింది.


సర్‌ క్రీక్‌ వివాదం sir creek dispute): భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సన్నటి జలభాగాన్ని ‘క్రీక్‌’ అంటారు. గుజరాత్‌ తీరప్రాంతంలో సర్‌ క్రీక్, కోరీ క్రీక్, పీర్‌ సనాయ్‌ క్రీక్, కాజర్‌ క్రీక్‌ మొదలైనవి  ఉన్నాయి.


 గుజరాత్‌కి పశ్చిమాన 96 కి.మీ. పొడవైన టైడల్‌ ఈస్టుయరీ సర్‌ క్రీక్‌ ఉంది.


 సర్‌ క్రీక్‌ అనేది గుజరాత్‌లోని కచ్, పాకిస్థాన్‌లోని సింధ్‌కి మధ్యలో ఉన్న వివాదాస్పద ప్రాంతం. దీన్ని స్థానికంగా ‘బాన్‌ గంగా’ అంటారు.


సముద్రంలో 6 మీటర్ల కంటే తక్కువ లోతు ఉన్న జలాలను ‘షాలో జలాలు’ అంటారు. ఈ జలాల్లో విస్తరించి ఉన్న సర్‌ క్రీక్‌ ప్రాంతంలో మత్స్య సంపద విరివిగా ఉంది. ఇక్కడే ముడి చమురు నిక్షేపాలూ ఉన్నట్లు వెల్లడైంది. దీంతో 1965లో ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్‌ ఆక్రమించింది.


1982 అంతర్జాతీయ సముద్ర జలాల ఒప్పందం ప్రకారం, ఉమ్మడి జలాల్లోని నిక్షేపాలను, సంపదను రెండు దేశాలు సమానంగా పంచుకోవాలి. ఇందుకోసం పాకిస్థాన్‌తో భారతదేశం సుమారు 32 సార్లు సమావేశాలు నిర్వహించింది. చివరికి 2012లో సర్‌ క్రీక్‌ ప్రాంతాన్ని రెండు దేశాలు సమానంగా పంచుకున్నాయి. 


జమ్మూ-కశ్మీర్‌ వివాదం


భారత్, పాకిస్థాన్‌ మధ్య పరిష్కారం లేని శాశ్వత సమస్యగా దీన్ని పేర్కొంటారు.


జమ్మూ-కశ్మీర్‌ ఆంగ్లేయుల అధీనంలోకి వెళ్లడం: సింధ్‌/ పంజాబ్‌ను పాలిస్తున్న సిక్కులకు, ఇంగ్లండ్‌ వారికి మధ్య 1845-46లో మొదటి ఆంగ్లో - సిక్కు యుద్ధం జరిగింది.


అప్పటి సింధ్‌ పాలకురాలు రాణి జిందాన్‌ సైన్యం బ్రిటిష్‌ వారి చేతిలో ఓడిపోయి లాహోర్‌ ఒప్పందంపై సంతకాలు చేసింది. దీని ప్రకారం, సింధ్‌ పాలకులు రూ.1.75 కోట్లు యుద్ధ నష్టపరిహారంగా చెల్లించాల్సిరాగా, బదులుగా సింధ్‌ రాణి తమ రాజ్యంలో భాగంగా ఉన్న జమ్మూ-కశ్మీర్‌ను ఆంగ్లేయులకు అప్పగించింది.


 బ్రిటిష్‌ వారి నుంచి గులాబ్‌సింగ్‌ కశ్మీర్‌ ప్రాంతాన్ని పొందాడు. 1947లో అతడి మనవడు హరినాథ్‌సింగ్‌ జమ్మూ-కశ్మీర్‌ పాలకుడిగా ఉన్నాడు. 1947, అక్టోబరు 23న( treaty of acceleration ) హరినాథ్‌సింగ్‌ సంతకం చేయడంతో జమ్మూ-కశ్మీర్‌ భారతదేశంలో భాగమైంది.


 1972లో భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం జమ్మూ-కశ్మీర్‌ నుంచి పాకిస్థాన్‌ను వేరు చేస్తూ  LOC  ని ఏర్పాటు చేశారు.


సింధూ జలాల వివాదం


సింధూ నది భారతదేశం నుంచి పాకిస్థాన్‌ భూభాగంలోకి ప్రవహిస్తుంది. దీని జలాల పంపకం, ప్రాజెక్టుల నిర్మాణం రెండు దేశాల మధ్య వివాదాస్పదమైంది.


 ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం ద్వారా భారత్‌ - పాక్‌లు 1960, సెప్టెంబరు 19న సింధూ నది జలాలపై కరాచీ నగరంలో ఒప్పందం చేసుకున్నాయి.


ఒప్పందంలోని అంశాలు: సింధూ నదీ వ్యవస్థ మొత్తం జలాల్లో భారతదేశం 20 శాతం కంటే ఎక్కువ నీటిని వినియోగించుకోకూడదు. పాకిస్థాన్‌ 80 శాతం జలాలను ఉపయోగించుకుంటుంది.


 తూర్పు నదులైన బియాస్, రావి, సట్లెజ్‌లు భారత నియంత్రణలో ఉంటాయి. పశ్చిమ నదులైన సింధు, జీలం, చినాబ్‌లు పాకిస్థాన్‌ అధీనంలో ఉంటాయి.


 ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు 7 లక్షల ఎకరాలకు మించి సాగు నీటిని సింధూ నది నుంచి ఉపయోగించకూడదు. సింధూ నదిపై విద్యుత్‌ ప్రాజెక్టులను నిర్మించాలంటే పాకిస్థాన్‌ అంగీకారం ఉండాలి.


బాగ్లిహార్‌ జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ వివాదం: భారతదేశం చినాబ్‌ నదిపై  1999లో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం 2008లో పూర్తయ్యింది. దీన్ని run off water project    గా పిలుస్తారు. 


 సింధూ నది జలాల ఒప్పందం 1960ను ఉల్లంఘించి భారతదేశం ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టిందని పేర్కొంటూ పాకిస్థాన్‌ దీనికి అభ్యంతరం తెలిపింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రపంచ బ్యాంక్‌ 2005లో స్విట్జర్లాండ్‌ సివిల్‌ ఇంజినీర్‌ రేమండ్‌ లఫిట్‌ను నియమించింది.


కిషన్‌ గంగా జల విద్యుత్‌ ప్రాజెక్టు: భారత్‌ 2007లో కిషన్‌ గంగా నదిపై  (జీలం ఉపనది) 330 మెగావాట్ల విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం ఉన్న ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇది పాకిస్థాన్‌ - భారత్‌ల మధ్య వివాదానికి కారణమైంది.


జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్‌లను పాకిస్థాన్‌ నుంచి వేరు చేసే   రేఖలు


1. LOC (line of control ): ఇది జమ్మూ-కశ్మీర్‌లోని సంగం ప్రాంతం నుంచి నార్త్‌ జస్కర్‌ (NJ 9842) వరకు ఉంది. 

 దీని పొడవు సుమారు 778 కి.మీ.


2. AGPL(actual ground position line ) :  NJ9842 నుంచి ఇందిరాకాల్‌ వరకు సుమారు 50 కి.మీ. ఉంది.


3. IBL (international boarder line): పంజాబ్‌లోని మాధోపుర్‌ నుంచి జమ్మూ-కశ్మీర్‌లోని సంగం వరకు సుమారు 198 కి.మీ. ఉంది. 


సియాచిన్‌ వివాదం 


సియాచిన్‌ ఒక హిమనీనదం. లద్దాఖ్‌లోని కారకోరంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం. బాల్టి భాషలో సియాచిన్‌ అంటే ‘గులాబీలతో నిండిన ప్రాంతం’ అని అర్థం.హిమనీనదాలతో ఉన్న కారకోరం పర్వత శ్రేణిని భూమికి మూడో ధృవం 

 (third pole) )గా పిలుస్తారు.1972 సిమ్లా ఒప్పందం ప్రకారం, సియాచిన్‌ను సైన్య రహిత ప్రాంతంగా గుర్తించారు. పాకిస్థాన్‌ 1980లో సియాచిన్‌కి తమ దేశం నుంచి పర్వతారోహకులను పంపి, ఆ ప్రాంతం తమ అధీనంలో ఉన్నట్లు పేర్కొంది. భారత సైన్యం 1984, ఏప్రిల్‌ 13న ఆపరేషన్‌ మేఘదూత్‌ను (operation meghdoot) నిర్వహించి, సియాచిన్‌ను తన అధీనంలోకి తెచ్చుకుంది.


భారతదేశం- శ్రీలంక

 శ్రీలంకను పూర్వం సింహళ ద్వీపం, సిలోన్‌ అని పిలిచేవారు. ఇది భారత్‌కు ఆగ్నేయంగా హిందూ మహాసముద్రంలో ఉంది. శ్రీలంక న్యాయ, కార్యనిర్వాహక రాజధాని కొలంబో; శాసన రాజధాని శ్రీ జయవర్థనేపుర కోట. శ్రీలంకను హిందూ మహాసముద్ర అశ్రుబిందువు  [Tear drop of indian ocean] అంటారు.


భారత్‌ - శ్రీలంక మధ్య ఉన్న ప్రాంతాలుపంబన్‌ దీవి లేదా రామేశ్వరం దీవి:


 ఈ దీవిలో శ్రీలంకకు దగ్గరగా ఉండే దీవి ధనుష్కోడి (తమిళనాడు). ఇది బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే ప్రాంతంలో ఉంది.


మన్నార్‌ దీవి: ఇది శ్రీలంకకి చెందింది. ఈ దీవిలో భారతదేశానికి దగ్గరగా ఉన్న ప్రాంతం తలైమన్నార్‌. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌ నుంచి శ్రీలంకకు ఈ దీవి ద్వారా వెళ్తారు.


రామసేతు/ ఆడమ్స్‌ బ్రిడ్జ్‌: పంబన్, మన్నార్‌ దీవుల మధ్య ఉన్న బ్రిడ్జ్‌ లాంటి నిర్మాణమే రామసేతు. ఇది మన్నార్‌ సింధూ శాఖను, పాక్‌ జలసంధి నుంచి వేరు చేస్తోంది.


 శ్రీరాముడు లంకను చేరడానికి వానర సైన్యంతో కలిసి దీన్ని నిర్మించాడని హిందువుల విశ్వాసం. రామసేతు నిర్మాణం వల్ల భారత వాణిజ్య నౌకలు సుమారు 400 కి.మీ. లేదా 30 గం. ప్రయాణం చేసి, శ్రీలంక దేశాన్ని చుట్టి రావాల్సి వస్తోంది.


 ఈ ప్రయాణ దూరాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం 2005, జులై 2న సేతు సముద్రం షిప్పింగ్‌ కెనాల్‌ ప్రాజెక్ట్‌ను ఆమోదించింది.  దీని నిర్మాణం కోసం రామసేతు బ్రిడ్జ్‌ను 20 మీ. లోతు, 200 మీ. వెడల్పు తవ్వాల్సి ఉండగా, దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది.

 ఈ ప్రాజెక్టు నిర్మాణం గురించి పరిశీలించడానికి సుప్రీంకోర్టు పచౌరీ కమిటీని ఏర్పాటు చేసింది. దీని నివేదిక ఆధారంగా 2017లో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని భారత ప్రభుత్వం శాశ్వతంగా నిలిపివేసింది.


పాక్‌ జలసంధి: రెండు భూభాగాల మధ్య ఉన్న విశాల జలభాగాన్ని జలసంధి [Strait] అంటారు.  జలసంధి రెండు విశాల సముద్రాలను కలుపుతుంది.


 పాక్‌ జలసంధి బంగాళాఖాతాన్ని (పాక్‌ అఖాతం), హిందూమహాసముద్రాన్ని (మన్నార్‌ సింధుశాఖ) కలుపుతుంది. పాక్‌ జలసంధి  తమిళనాడు, ఉత్తర శ్రీలంకను వేరు చేస్తుంది. ఇది రామసేతుకు ఉత్తర దిక్కులో ఉంది.


మన్నార్‌ సింధుశాఖ  [Gulf of mannar]: దక్షిణ తమిళనాడు, శ్రీలంకను వేరుచేస్తున్న జలభాగాన్ని మన్నార్‌ సింధుశాఖ అంటారు.


కచ్చతీవు దీవి  [Kachchatheevu island]: 1974లో జరిగిన భారత్, శ్రీలంక ఒప్పందం మేరకు ఈ దీవిని భారతదేశం శ్రీలంకకి అప్పగించింది. అయితే భారత్‌ దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చేయలేదు. దీంతో తమిళనాడు ఈ దీవిని భారత్‌కి చెందిందిగా  పేర్కొంటోంది.


రచయిత

పి.కె. వీరాంజనేయులు

విషయ నిపుణులు 

Posted Date : 08-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌