• facebook
  • whatsapp
  • telegram

శిలలు

భూపటలానికి సంబంధించి ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఖనిజ నిర్మిత పదార్థాన్ని 'శిల' అంటారు. శిలతో నిర్మితమై, ఘనరూపంలో ఉండే భూమి ఉపరితలాన్ని 'శిలావరణం' (Lithosphere) అంటారు. గ్రీకు భాషలో "Lithos" అంటే 'శిల' అని అర్థం. నిర్దిష్టమైన, రసాయన సంఘటనం, క్రమబద్ధమైన అణు నిర్మాణం ఉండి, ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన అకర్బన (Inorganic) పదార్థాన్ని ఖనిజం అంటారు.

  ఖనిజాలతో ఏర్పడిన శిలలను ఖనిజనిర్మిత శిలలు అంటారు. శిలలు ఒకటి కంటే ఎక్కువ ఖనిజాలతో నిర్మితమై ఉంటాయి.
* ప్రకృతిలో లభ్యమయ్యే శిలలు రకరకాల ఆకారాలు, పరిమాణాలు, రంగుల్లో నిర్మితమై ఉంటాయి. కొన్ని శిలలు అత్యంత కఠినంగా ఉంటాయి. ఉదా: గ్రానైట్
* కొన్ని శిలలు మృదువుగా ఉంటాయి. ఉదా: జిప్సం, బంకమట్టి, సుద్ద మొదలైనవి.


శిలలు - వర్గీకరణ


ఏర్పడే విధానం, భౌతిక లక్షణాల ఆధారంగా శిలలను 3 రకాలుగా వర్గీకరించారు. అవి: 1) అగ్నిశిలలు (Igneous), 2) అవక్షేప శిలలు (Sedimentary) 3) రూపాంతర శిలలు (Metamorphic).


అగ్నిశిలలు 


ఇవి అగ్ని లేదా నిప్పు వల్ల ఏర్పడ్డాయి. అందుకే వీటిని అగ్నిశిలలు అంటారు. లాటిన్ భాషలో 'Ignis' అంటే Fire అని అర్థం. భూ అంతర్భాగంలో, భూమి ఉపరితలంపై ఏర్పడిన అతి ప్రాచీన శిలలు కాబట్టి వీటిని 'ప్రథమ శిలలు' (Primary Rocks) అంటారు. భూమిపై ప్రప్రథమంగా ఏర్పడటం వల్ల 'ఆది శిలలు' అని కూడా పిలుస్తారు. ఈ శిలలు అవక్షేప, రూపాంతర శిలలకు మాతృక. అందుకే అగ్నిశిలలను 'మాతృ శిలలు' (Parent Rocks) అని కూడా అంటారు.

* భూమి అంతర్భాగంలో అత్యంత వేడిగా ఉన్న మాగ్మా అనే శిలాద్రవం, అగ్నిపర్వత బిలం ద్వారా బయటకు వచ్చి (లావా) చల్లబడి ఘనీభవించి శిలగా మారడం ద్వారా 'అగ్నిశిలలు' ఏర్పడతాయి.


అవక్షేప శిలలు


అవక్షేప శిలలు పొరలు పొరలుగా ఏర్పడతాయి. కాబట్టి వీటిని స్తరిత శిలలు అని కూడా అంటారు. 'స్తరం' అంటే పొర అని, 'స్తరిత' అంటే పొరలు కలిగినది అని అర్థం. వీటిని ద్వితీయ శిలలు అని కూడా పిలుస్తారు.


* భూమి మీద, భూ అంతర్భాగంలో ఏర్పడిన అగ్నిశిలలు, రూపాంతర శిలలు కొంతకాలం తర్వాత వాతావరణ ప్రభావం, గాలి, నీరు, హిమనీనదాలు మొదలైనవాటి వల్ల క్రమక్షయం చెంది, పెద్దపెద్ద శిలలు చిన్నచిన్న రేణువులుగా మారతాయి. దీన్ని 'అవక్షేపం' (Sediment) అంటారు.


* అవక్షేపం వల్ల ఏర్పడిన శిలలను అవక్షేప శిలలు అంటారు. అవక్షేపాలు అనేక రాతి పొరలుగా ఏర్పడతాయి. ఇలా రాతి పొరలుగా ఏర్పడిన శిలా భాగాలను 'స్తరిత శిలలు' అంటారు.


రూపాంతర శిలలు 


* రూపాంతరం అంటే 'పాత రూపం పోయి కొత్త రూపం కలగడం' అని అర్థం. గ్రీకు భాషలో 'మెటామార్ఫో' అంటే పాత రూపం పోవడం (Change of form).


* భూమి లోపల, బయట ఉన్న అగ్నిశిలలు, అవక్షేప శిలలు కొన్ని వందల సంవత్సరాల తర్వాత రూపాంతరం చెందడం వల్ల 'రూపాంతర శిలలు' అనే కొత్తరకం శిలలు ఏర్పడతాయి.


రూపాంతర ప్రక్రియ - రకాలు


1. ఆర్ధో మెటమార్ఫిజం: అగ్నిశిలలు రూపాంతరం చెందడాన్ని ఆర్ధో మెటమార్ఫిజం అంటారు.


2. పారా మెటమార్ఫిజం: అవక్షేప శిలలు రూపాంతరం చెందడాన్ని పారా మెటమార్ఫిజం అంటారు.


3. పాలీ మెటమార్ఫిజం: 'రూపాంతరం' చెందిన శిల మళ్లీ రూపాంతరం చెందడాన్ని పాలీ మెటమార్ఫిజం అంటారు.


శిలలు - లక్షణాలు (Characteristics)


అగ్నిశిలల లక్షణాలు: వీటిని ప్రథమ శిలలు, మాతృశిలలు, ఆది శిలలు అని కూడా పిలుస్తారు.


* సూక్ష్మ రేణువులు ఉండవు, స్పటికాలు ఉంటాయి.


* అగ్నిశిలలో పొరలు ఉండవు కాబట్టి వీటిని అస్తరిత శిలలుగా పిలుస్తారు.


* భూపటంలో సుమారు 90 శాతం అగ్నిశిలలు విస్తరించి ఉన్నాయి.


* అగ్నిశిలలో శిలాజాలు (Fossils) ఉండవు.


* అగ్నిశిలలు తమలో నీటిని ప్రవహించనివ్వవు.


* అగ్నిశిలల్లో బాహ్య అగ్నిశిలలు, అంతర్గత అగ్నిశిలలు అని రెండు రకాలు ఉంటాయి.


* ముద్దగా గట్టిగా కఠినంగా ఉంటాయి.


* కొన్ని శిలలు ఆమ్ల గుణాలు, కొన్ని శిలలు క్షార గుణాలను కలిగి ఉంటాయి.

* ఈ శిలల్లో దీర్ఘచతురస్రాకారంగా ఉండే పెద్దపెద్ద సంధులు ఉంటాయి.


* ఇవి దక్కన్ పీఠభూమిలో ఎక్కువ.


* అవక్షేప శిలల లక్షణాలు: అగ్నిశిలలు, రూపాంతర శిలల అవక్షేపం వల్ల ఏర్పడినవి కావడంతో వీటిని అవక్షేప శిలలుగా పేర్కొంటారు.


* వీటిని ద్వితీయ శిలలు, స్తరిత శిలలు అంటారు.


* అగ్నిశిలతో పోల్చితే కాఠిన్యత తక్కువ.


* అవక్షేప శిలల కింది పొరల కంటే పైపొరలు కొత్తవిగా ఉంటాయి.


* అవక్షేప శిలలు తమ ద్వారా నీటిని ప్రవహించనిస్తాయి.


* అవక్షేప శిలల్లో శిలాజాలు (Fossils) ఉంటాయి.


* అవక్షేప శిలల్లో ముడుతలు క్రమపద్ధతిలో ఉండవు.


* జలాశయాల్లో ఏర్పడతాయి.


* హిమాలయాలు, గంగా-సింధూ మైదానాల్లో ఎక్కువ.


* రూపాంతర శిలల లక్షణాలు: రూపాంతర శిలలు అనేవి అగ్నిశిలలు, అవక్షేప శిలల నుంచి ఏర్పడినవి కాబట్టి వీటిలో ఆ రెండు శిలల లక్షణాలూ ఉంటాయి.


* కొత్త స్పటికాల వల్ల ఈ ఖనిజాలు ఏర్పడతాయి.


* పీడనం కారణంగా ఏర్పడిన రూపాంతర శిలల్లో సంధులు, ముడుతలు ప్రధానంగా కనిపిస్తాయి. అవి క్రమపద్ధతిలో ఉండవు.


* రూపాంతర శిలల్లో లీనియేషన్, పొలియేషన్ సిస్టాసిటీ, నైసాసిటీ నిర్మాణాలు కనిపిస్తాయి.


* ముద్దగా ఉంటాయి. పొరలుగా ఉండవు.


* శిలాజాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు.


* రసాయన శిలా శైథిల్యం జరుగుతుంది.


* దక్కన్ పీఠభూమిలో ఎక్కువ.


అగ్నిశిలలు - రకాలు 

   శిలలు ఏర్పడే ప్రదేశాన్ని బట్టి అగ్నిశిలలు ముఖ్యంగా రెండు రకాలు. ఎ) బాహ్య/ ఉద్గత శిలలు బి) అంతర్గత అగ్నిశిలలు.


బాహ్య అగ్నిశిలలు: భూమి లోపలి మాగ్మా, అగ్నిపర్వత బిలం ద్వారా లావా రూపంలో భూమి ఉపరితలానికి వచ్చి చల్లబడటం ద్వారా ఏర్పడే శిలలను 'బాహ్య అగ్నిశిలలు' అంటారు.
ఉదా: బసాల్ట్, ఆండిసైట్, రాయోలైట్.


అంతర్గత శిలలు: భూమి అంతర్భాగంలోని మాగ్మా, భూమి ఉపరితలానికి వచ్చే క్రమంలో పైకి రాలేక భూ అంతర్భాగంలోనే చల్లబడి, ఘనీభవించడం ద్వారా ఏర్పడిన శిలలను 'అంతర్గత అగ్నిశిలలు' అంటారు.


* అంతర్గత శిలలను అవి ఏర్పడే ప్రదేశం, చల్లబడటానికి తీసుకునే సమయం ఆధారంగా 1) పాతాళ శిలలు 2) ఉపపాతాళ శిలలుగా వర్గీకరించారు.


పాతాళ శిలలు (Plutonic Rocks): భూమి అంతర్భాగంలో చాలా లోతులో ఏర్పడతాయి. మాగ్మా అనే శిలాద్రవం చాలా లోతులో ఉండి పైకి రాలేక నెమ్మదిగా చల్లబడి, ఘనీభవించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల అక్కడ ఏర్పడిన శిలలు పెద్దపెద్ద స్పటికాలతో ఉంటాయి. ఈ శిలలనే పాతాళ శిలలు అంటారు. గ్రీకు భాషలో "Pluto" అంటే 'పాతాళ లోకపు ప్రభువు' అని అర్థం.
ఉదా: గ్రానైట్, గాబ్రో


* ఉపపాతాళ శిలలు: భూమి ఉపరితలానికి సమీప లోతులో మాగ్మా ఘనీభవించగా ఏర్పడే అగ్నిశిలలను 'ఉపపాతాళ శిలలు' అంటారు. తక్కువ లోతులో ఏర్పడటం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. భూమి లోపలి మాగ్మా ద్రవం మార్గమధ్యలో ఉన్న పగుళ్లలో ఇరుక్కుని నెమ్మదిగా చల్లబడటం వల్ల ఉపపాతాళ శిలలు ఏర్పడతాయి.


అవక్షేప శిలలు - రకాలు 


    స్తరిత శిలలు ఏర్పడిన విధానాన్ని బట్టి అవక్షేప శిలలను 3 రకాలుగా వర్గీకరించారు.
        1) శకలమయ అవక్షేప శిలలు
        2) జీవసంబంధ అవక్షేప శిలలు
        3) రసాయన అవక్షేప శిలలు


* శకలమయ అవక్షేప శిలలు: ఇవి కూడా మూడు రకాలుగా ఏర్పడతాయి.
ఎ) బంక మట్టి లేదా ఒండ్రు అణువులు లాంటి తేలికపాటి సూక్ష్మరేణువులతో అవక్షేప శిలలు ఏర్పడతాయి. ఉదా: షేల్ (Shale). వీటిని మృత్తికాసంబంధ శిలలు అంటారు.
బి) ఇసుక రేణువులు ఒత్తుగా మేళవించడం వల్ల వాలుకామయ శిలలు ఏర్పడతాయి. ఉదా: ఇసుకరాయి
సి) కంగ్లామరేట్: వివిధ పరిమాణాల్లో ఉన్న బొమ్మరాళ్ల మిశ్రమం సంఘటితమవడం వల్ల కంగ్లామరేట్ ఏర్పడుతుంది.


* జీవసంబంధ లేదా కార్బనిక అవక్షేప శిలలు: జీవరాశుల అస్థిపంజరాల అవశేషాలతో ఏర్పడిన అవక్షేప శిలలను జీవసంబంధ అవక్షేప శిలలు అంటారు. జీవ ప్రక్రియల ఫలితంగా అవక్షేప శిలలు ఏర్పడితే అలాంటి శిలలను జీవ ప్రక్రియ అవక్షేప శిలలు అంటారు. భూమి లోపల లేదా భూమి మీద, సముద్రాలు, ఇతర జలాశయాల్లో పెరిగే వృక్షాలు, జంతువులు మొదలైనవి పెద్ద ఎత్తున శిథిలమైపోయినప్పుడు అవక్షేపం ఏర్పడుతుంది. ఇది జీవుల అవక్షేపం. ఈ అవక్షేపం వివిధ రకాల మూలాధారాల నుంచి ఏర్పడుతుంది.


* రసాయన అవక్షేప శిలలు: రసాయన ప్రక్రియల వల్ల శిలలు శిథిలమై అవక్షేపంగా మారతాయి. భూమి పైభాగంలో శిలల పొరల్లోని రసాయనాలు అవపాతం చెందడం వల్ల లేదా నీటిలో ద్రావణ రూపంలో తేలియాడే రసాయనాలు అవపాతం చెందడం వల్ల రసాయన అవక్షేప శిలలు ఏర్పడతాయి.
* సోడియం క్లోరైడ్ ద్రావణం ఆవిరి అవడం - ఉప్పు (Table salt)
* కాల్షియం సల్ఫేట్ ద్రావణం ఆవిరి అవడం - జిప్సం.


రూపాంతర శిలలు - రకాలు

  భూమి మీద లేదా భూమి లోపల ఉన్న అగ్నిశిలలు, అవక్షేప శిలలు మొదలైనవి ఉష్ణోగ్రత వల్ల రూపాంతరం చెందుతాయి. అధిక ఉష్ణోగ్రతలు శిలలపై ప్రభావం చూపడం వల్ల శిలల్లో ఉన్న ఖనిజాలు, స్పటికాల్లో మార్పులు వచ్చి, శిలలు రూపాంతరం చెందుతాయి.

Posted Date : 03-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌