• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహానికి ముందు సంఘటనలు

తెలుగు నేల చాటిన విప్లవ స్ఫూర్తి!

ఆంధ్ర ప్రాంతంలో జాతీయ నాయకుల పర్యటనలతో స్వరాజ్యకాంక్ష రగిలింది. సహాయ నిరాకరణ ఉద్యమం పెద్ద ఎత్తున సాగింది. ప్రభావితులైన అల్లూరి లాంటి మన్నెం వీరులు ప్రత్యక్ష సాయుధ పోరాటాల్లోకి దిగారు. ఆంగ్లేయులను గడగడలాడించారు. కాంగ్రెస్‌ నాయకుల మద్దతు లేకపోయినప్పటికీ ఉప్పు సత్యాగ్రహానికి ముందు ఆంధ్రలో జరిగిన ఉద్యమాల్లో సీతారామరాజు రంప విప్లవం అతి ముఖ్యమైంది. అదే సమయంలో అవతరించిన స్వరాజ్యపార్టీలోనూ ఆంధ్రులు కీలకంగా వ్యవహరించారు. సైమన్‌ కమిషన్‌నూ సమర్థంగా వ్యతిరేకించారు. అడ్డుకున్న బ్రిటిష్‌ పోలీసు తుపాకులకు ఎదురు నిలిచి ఆంధ్రకేసరి గర్జించారు. అనంతర పరిణామాల్లో భాగంగా జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో పాల్గొని చైతన్యాన్ని చాటారు. ఈ సంఘటనలను పోటీ పరీక్షార్థులు అధ్యయనం చేయాలి. తెలుగు ప్రజల స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. 


జాతీయ కాంగ్రెస్‌ నాయకులు ఆంధ్రాలో పర్యటించడంతో ఇక్కడ జాతీయోద్యమం బాగా వ్యాప్తి చెందింది. వారు స్థానిక నాయకులను ఉత్తేజపరిచారు. ప్రజల్లో చైతన్యం తెచ్చారు. బిపిన్‌ చంద్రపాల్, గాంధీజీ, మహ్మద్‌ అలీ, షౌకత్‌ అలీ లాంటి   ప్రముఖులు తెలుగు ప్రాంతాల్లో ప్రచారాలు నిర్వహించారు. 


దీనికి నాయకుడు అల్లూరి సీతారామరాజు. ఈ ఉద్యమం ఆంధ్రాలోని తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితమైనప్పటికీ, సహాయ నిరాకరణ ఉద్యమం కంటే ఎక్కువగా ఇంగ్లండ్‌ వారిని ఇబ్బంది పెట్టింది.


అల్లూరి సీతారామరాజు 1897లో పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్లు గ్రామంలో జన్మించాడు. తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. వెంకట రామరాజు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో అధికారిక ఫొటోగ్రాఫర్‌గా పని చేసేవారు. సీతారామరాజు పాఠశాల విద్య సమయంలో తండ్రి మరణించారు. దాంతో ఆయన తన మేనమామ రామచంద్రరాజు వద్ద పెరిగాడు.


అల్లూరి 1921లో సహాయ నిరాకరణ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు సిద్ధమయ్యాడు. కానీ గాంధీజీ పద్ధతులపై ఆయనకు నమ్మకం కుదరలేదు. క్షత్రియుడు కావడంతో తన ఆశయం నెరవేరడానికి యుద్ధమే సరైన మార్గమని విశ్వసించాడు. 1921లో చిట్టగాంగ్‌కు వెళ్లి అక్కడ జరిగిన విప్లవకారుల సమావేశంలో పాల్గొన్నాడు. తిరిగి వచ్చిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలోని కొండలను నివాసంగా చేసుకున్నాడ. ఈ ప్రాంతాల్లోని గిరిజనులు ఆంగ్లేయుల చట్టాలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో వారిని సులభంగా ఉద్యమం వైపు ఆకర్షించవచ్చని సీతారామరాజు భావించాడు. ఈయన ప్రధాన అనుచరుల్లో గంటం దొర, మల్లుదొర, వీరయ్యదొర, సత్తిరాజు మొదలైనవారు ఉన్నారు. సీతారామరాజు పర్యవేక్షణలో వారు ఆయుధాలు సమకూర్చుకోవడం కోసం పోలీసు స్టేషన్‌లపై దాడి చేశారు. 1922, ఆగస్టులో చింతపల్లి పోలీసుస్టేషన్‌పై మొదటి దాడి నిర్వహించారు. అదే సంవత్సరం ఆగస్టులో కృష్ణదేవిపేట పోలీస్‌స్టేషన్‌పై రెండో దాడి, రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్‌పై మూడో దాడి చేశారు.


‘గం సోదరులు’గా ప్రసిద్ధికెక్కిన మల్లు దొర, గంటం దొర రామరాజుకి నమ్మిన బంట్లు. ఆయన తన కార్యక్రమాలను చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేశాడు. ఈ చర్యలను తీవ్రంగా భావించిన ఆంగ్లేయులు అతడిని అణచివేయడానికి స్కాట్‌ కవార్డ్, హేటస్‌ల న్యాయకత్వంలో సాయుధ దళాలను పంపారు. ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న రామరాజు దామినపల్లి ఘాట్‌ వద్ద పొంచి ఉండి వారిపై మెరుపుదాడి చేశాడు. స్కాట్‌ కవార్డ్, హేటస్‌లను చంపేశాడు. ఆ ధాటికి తట్టుకోలేక పోలీసులు వెనక్కి మళ్లారు. ఈసారి బ్రిటిష్‌ ప్రభుత్వం మలబారు నుంచి ప్రత్యేక దళాలను రప్పించింది. 1922, డిసెంబరు 6న పెగడపల్లి వద్ద పోలీసులు రామరాజుపై ఆకస్మిక దాడి చేశారు. దాని నుంచి తప్పించుకున్న ఆయన కొంతకాలంపాటు అజ్ఞాత జీవితం గడిపాడు. తర్వాత 1923, ఏప్రిల్‌ 18న అన్నవరం పోలీస్‌స్టేషన్‌పై దాడితో మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించాడు.


 1923, సెప్టెంబరులో నడింపల్లి గ్రామం వద్ద మల్లు దొరను కొరన్స్‌ అనే ఆంగ్లేయ పోలీసు అధికారి అరెస్టు చేశాడు. ఈ సంఘటన అల్లూరికి మొదటి ఎదురుదెబ్బ. రామరాజును పట్టుకోవడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం రెండు అసోం రైఫిల్స్‌ దళాలను రప్పించింది. దీనికి ప్రత్యేక అధికారి రూథర్‌ఫర్డ్‌. ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ రామరాజు కార్యకలాపాలను అడ్డుకోలేక పోయింది. కానీ, 1924, మే 6న అల్లూరి అనుచరుడైన అగ్గిరాజు ప్రభుత్వానికి దొరికిపోయాడు. మరుసటి రోజే రామరాజును పట్టుకుని కోయ్యూరు వద్ద కాల్చి చంపారు. సీతారామరాజు చేసిన ఈ పోరాటాన్ని ‘రంప విప్లవం’ అంటారు. ఈ ఉద్యమం ఆంధ్రా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. కానీ సమకాలీన కాంగ్రెస్‌ నాయకులు ఈ పోరాటానికి మద్దతు ఇవ్వలేదు. పైగా అణచివేతకు అనుకూలంగా ఉన్నారు. ఆంధ్ర మహాసభ వార్షిక సమావేశాల్లో సీతారామరాజు దేశభక్తిని, త్యాగనిరతిని ప్రశంసిస్తూ ఎలాంటి తీర్మానం చేయలేదు.


ఆంధ్రా స్వరాజ్‌పార్టీ

1922, ఫిబ్రవరి 5న 22 మంది పోలీసుల సజీవ దహనానికి కారణమైన చౌరా-చౌరీ సంఘటనతో మనస్తాపం చెందిన గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేశారు. మహాత్ముడి చర్యను అనేకమంది కాంగ్రెస్‌ నాయకులు నిరసించారు. వారిలో మోతీలాల్‌ నెహ్రూ, విఠల్‌భాయ్‌ పటేల్, చిత్తరంజన్‌ దాస్‌ తదితర ప్రముఖులు ఉన్నారు. వీరంతా కలిసి 1923, జనవరి 1న భారత ఖిలాఫత్‌ స్వరాజ్‌ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సి.ఆర్‌.దాస్‌. కార్యదర్శి మోతీలాల్‌ నెహ్రూ. ఆంధ్రా శాఖ అధ్యక్షుడు అయ్యదేవర కాళేశ్వరరావు, కార్యదర్శి ఉన్నవ లక్ష్మీనారాయణ. ఆంధ్రా శాఖలో సభ్యులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, రామదాసు. 1923లో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేసింది. 


సైమన్‌  కమిషన్‌


1919 మాంటేగ్‌ ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలను సమీక్షించడానికి సర్‌ జాన్‌ సైమన్‌ అధ్యక్షతన 1927, నవంబరు 8న ఒక కమిషన్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అందులోని ఏడుగురు సభ్యుల్లో ఒక్క భారతీయుడు కూడా లేడు. దాంతో రాజకీయ పార్టీలన్నీ కమిషన్‌ను బహిష్కరించాయి. దీన్ని ‘వైట్‌ కమిషన్‌’ అని కూడా అంటారు. తిరుపతి, కర్నూలు, విజయవాడ, ఏలూరు, శ్రీకాకుళం పురపాలక సంఘాలు సైమన్‌ కమిషన్‌ను బహిష్కరించాలని తీర్మానించాయి. న్యాపతి సుబ్బారావు లాంటి ఉదారవాదుల నిర్ణయం కూడా ఇదే. 1928, ఫిబ్రవరి 3న కమిషన్‌ రాక సందర్భంగా ఆంధ్రాలోని అన్ని పట్టణాల్లో హర్తాళ్లు నిర్వహించారు. ఈ కమిషన్‌ పర్యటనకు ఎంపిక చేసినవి ఒంగోలు, గుంటూరు. తెనాలి, గుంటూరు రైల్వేస్టేషన్‌ల్లో ‘సైమన్‌ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి నాయకుడు జి.వి.ఉన్నయ శాస్త్రి. గుంటూరు వద్ద నడింపల్లి నరసింహారావు, విజయవాడ మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఉన్న అయ్యదేవర కాళేశ్వరరావు కమిషన్‌కు ‘సైమన్‌ గో బ్యాక్‌’ అని రాసి ఉన్న కవర్‌ పంపారు. ఆంధ్రాలో సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలకు మద్దూరి అన్నపూర్ణయ్య ప్రేరణ ఇచ్చారు. ఈయన ‘కాంగ్రెస్‌’ అనే పత్రికను స్థాపించాడు. ఆంధ్రాలో సైమన్‌ కమిషన్‌ బహిష్కరణ కమిటీ అధ్యక్షుడు ఎస్‌.సత్యమూర్తి.


  సైమన్‌ కమిషన్‌ 1928, ఫిబ్రవరి 26న మద్రాసు నగరాన్ని సందర్శించింది. దానికి వ్యతిరేకంగా అక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు విశేష ప్రచారం చేశారు. దాంతో కొన్ని అలజడులు జరిగాయి. పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. మృతుడిని చూడటానికి అనుచరులతో ప్రకాశం పంతులు బయలుదేరినప్పుడు పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో ప్రకాశం రొమ్ము విరుచుకుని ‘మేం ముందుకు సాగిపోయి మా సోదరుడి శవం చూడటానికి నిర్ణయించుకున్నాం. కావాలంటే నన్ను కాల్చండి’ అని పోలీసుల ఎదుట నిలిచారు. ఈ సంఘటనతోనే టంగుటూరికి ‘ఆంధ్ర కేసరి’ అనే పేరు వచ్చింది. 


రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు: 1930 నుంచి 1932 మధ్య మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు లండన్‌ నగరంలో జరిగాయి. వీటికి అధ్యక్షుడు రామ్‌ సెమెక్‌ డొనాల్డ్‌. సైమన్‌ కమిషన్‌ నివేదికను ప్రకటించిన తర్వాత అవి జరిగాయి. మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని 1930, నవంబరులో నిర్వహించారు. ఈ సమావేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరించడంతో ఒక్క ఆంధ్రుడు కూడా దీనికి హాజరు కాలేదు. 


రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశం: ఇది 1931, సెప్టెంబరులో జరిగింది. కాంగ్రెస్‌ తరఫున గాంధీజీ, సరోజిని నాయుడు హాజరయ్యారు. సమావేశానికి గాంధీజీ బయలుదేరే సమయంలో పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు ఆయనను కలిసి ప్రత్యేక ఆంధ్ర విషయాన్ని ప్రస్తావించారు. అయితే స్వరాజ్యం వచ్చిన తర్వాత ఆ ఏర్పాటు పరిశీలిద్దామని బాపూజీ హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో వి.వి.గిరి, ఎం.రామచంద్రరావు, బొబ్బిలిరాజా తదితర ఆంధ్రా నాయకులు ఇంగ్లండ్‌లోని భారతదేశ అండర్‌ సెక్రటరీ లార్డ్‌ లోథెన్‌ను కలిసి కొత్త రాష్ట్రాల ఏర్పాటు జాబితాలో ఆంధ్రాను కూడా చేర్చాలని విన్నవించారు. అయితే ఒరియా నాయకులు సంఘటితంగా ప్రయత్నించి ప్రత్యేక ఒరిస్సా రాష్ట్రం పొందారు.


మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశం: 1932, నవంబరులో జరిగింది. ఇందులో 1935 భారత ప్రభుత్వ చట్టానికి తుది రూపం ఇచ్చారు. ఈ సమావేశ సమయంలో ఆంధ్రా నాయకులు పెద్దగా స్పందించలేదు.

రచయిత: గద్దె నరసింహారావు


 

Posted Date : 13-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌