• facebook
  • whatsapp
  • telegram

శాతవాహనులు

తొలి తెలుగు చక్రవర్తులు

  ప్రాచీన భారతదేశ చరిత్రలో శాతవాహనులకు విశిష్ట స్థానం ఉంది. దక్షిణాదిన తొలి సామ్రాజ్యాన్ని స్థాపించి నాలుగు శతాబ్దాలకు పైగా జనరంజక పాలన సాగించారు. అశోకుడి అనంతరం స్వతంత్ర పాలకులైన వీరు శాంతికాముకులుగా మెలుగుతూనే శక్తిమంతమైన విశాల సామ్రాజ్యాన్ని నిర్మించారు. స్వదేశీ, విదేశీ దండయాత్రలను ఎదుర్కొని శాంతిని నెలకొల్పారు. వైదిక సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించి తర్వాతి తరాలకు అందించారు. బౌద్ధ మతోద్ధరణకు తోడ్పడ్డారు. నాటి ప్రజాజీవనం, సంస్కృతి, భాషా, సాంస్కృతిక వికాసం వంటి అంశాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి.

  ప్రప్రథమ ఆంధ్ర సామ్రాజ్య నిర్మాతలు శాతవాహనులు. ఈ సామ్రాజ్య స్థాపనతో ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 30 మంది రాజులు దాదాపు 450 సంవత్సరాలు పరిపాలించారు. దక్షిణ పథాన్ని శక, యవన, పహ్లవ విదేశీ దాడుల నుంచి కాపాడారు. వీరిని సాతవాహనులు, శాలివాహనులు, శాతకర్ణులు, ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులని కూడా అంటారు. ఆంధ్ర అనేది జాతినామం. శాతవాహన అనేది వంశనామం.

శాతవాహన రాజుల గురించి తెలుసుకోవడానికి వివిధ ఆధారాలు ఉన్నాయి. 

1) పురావస్తు ఆధారాలు

శాసనాలు: శాసనాల గురించి చేసే అధ్యయనాన్ని శాస్త్రం ఎపిగ్రఫీ అంటారు.

* ఎర్రగుడి శాసనం - అశోకుడు  

* 13వ శిలశాసనం - అశోకుడు 

* నానాఘాట్‌ శాసనం - నాగానిక 

* నాసిక్‌ శాసనం - గౌతమీ బాలశ్రీ 

* అమరావతి శాసనం - రెండో పులోమావి 

* మ్యాకదోని శాసనం - మూడో పులోమావి 

* హాతిగుంఫా శాసనం - ఖారవేలుడు 

* జునాగఢ్‌ శాసనం - రుద్రదమన

నాణేలు: నాణేల గురించి అధ్యయనాన్ని న్యూమెస్‌ మ్యాటిక్స్, నాణేలపై ఉన్న బొమ్మల అధ్యయనాన్ని సిగిలోగ్రఫీ అని అంటారు. శాతవాహనుల కాలం నాటి నాణేలను సీసం, వెండి పోటిన్‌ అనే మిశ్రమ లోహంతో తయారు చేసేవారు. మొదటి శాతకర్ణి అశ్వమేథ యాగం గుర్తుతో, గౌతమీపుత్ర శాతకర్ణి తన చిహ్నంతో, యజ్ఞశ్రీ శాతకర్ణి తెరచాప గుర్తుతో నాణేలను ముద్రించారు.

2) లిఖిత ఆధారాలు 

ఎ) పురాణాలు: మత్స్య పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, భవిష్య పురాణం, ఐతరేయ బ్రాహ్మణం 

బి) బౌద్ద మత గ్రంథాలు 

సి) జైన మత గ్రంథాలు 

డి) స్వదేశీ సాహిత్యం: బృహత్కథ - గుణాడ్యుడు, కథాసరిత్సాగరం - సోమదేవసూరి, గాథాసప్తశతి - హాలుడు, లీలావతి పరిణయం - కుతూహలుడు, సుహృల్లేఖ - ఆచార్య నాగార్జునుడు, కాతంత్ర వ్యాకరణం - శర్వవర్మ 

ఇ) విదేశీయుల రచనలు: ఇండికా - మెగస్తనీస్, ది గైడ్‌ టు జాగ్రఫీ - టాలమీ, నేచురల్‌ హిస్టరీ - ప్లీనీ, పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రియన్‌ సీ - అజ్ఞాత నావికుడు, సి-యు-కి - హుయాన్‌త్సాంగ్‌

శాతవాహనుల జన్మస్థలం మీద విభిన్న వాదనలున్నాయి. వీరిది కర్ణాటక ప్రాంతమని వి.ఎన్‌.సుక్తాంకర్, మహారాష్ట్ర వారని పి.టి.శ్రీనివాస అయ్యంగార్, విదర్భ వాసులని .వి.వి.మిరాసి, ఆంధ్రులేనని గుత్త వెంకటరావు, ఎం.రామారావు, డాక్టర్‌ స్మిత్‌ తదితరులు పేర్కొన్నారు.

శాతావాహనుల రాజధానులు 

1) శ్రీకాకుళం (కృష్ణా జిల్లా) 

2) ధరణికోట/ధాన్యకటకం (గుంటూరు జిల్లా) 

3) ప్రతిష్టానపురం (మహారాష్ట్ర) 

రాజుల్లో ప్రముఖులు


శ్రీముఖుడు (క్రీ.పూ.271-248): ఇతడికి చిముకుడు, శిముకుడు, శిశుక, సింధుక, సిప్రక, సుద్ర వంటి పేర్లు ఉన్నాయి. ఇతడే ఆంధ్ర శాతవాహన వంశ స్థాపకుడు. తండ్రి పేరు శాతవాహనుడు/శాలివాహనుడు. వీరి రాజధాని ప్రతిష్టానపురం. శ్రీముఖుడు అశోకుడికి సమకాలీనుడు. మౌర్యులకు సామంతుడిగా మెలిగాడు. 23 ఏళ్లు రాజ్యపాలన చేశాడు. మొదట జైనమతం స్వీకరించాడు. ఆ తర్వాత వైదిక మతాన్ని అనుసరించాడు. ఈయన వేయించిన నాణేలు (పోటిన్‌) కరీంనగర్‌ జిల్లాలోని కోటిలింగాల వద్ద లభించాయి. ‘సాధ్వహణ’ అనే పేరుతో నాణేలను ముద్రించాడు.

కృష్ణుడు/కన్హ (క్రీ.పూ.248-230): శ్రీముఖుడి సోదరుడు. 18 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. మహారాష్ట్రలో నాసిక్‌ వరకు రాజ్య విస్తరణ చేశాడు. నాసిక్, కన్హేరి వద్ద బౌద్ధవిహారాలను నిర్మించారు. అశోకుడి మరణం తర్వాత తన రాజ్యానికి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. ‘విదర్భ’ కోసం పుష్యమిత్ర శుంగుడితో యుద్ధం చేశాడు. ఇతడి కాలంలో నే భాగవత మతం ఆంధ్రలోకి ప్రవేశించింది. ఆ మత స్థాపకుడు వాసుదేవుడు. 

మొదటి శాతకర్ణి (క్రీ.పూ.230-220): శ్రీముఖుడి కుమారుడు. పదేళ్ల పాటు పరిపాలించాడు. మత్స్య పురాణంలో ఇతడిని మల్లకర్ణి అని పేర్కొన్నారు. ‘శాతవాహన’ అనే వంశం నామాన్ని తన పేరుకు జోడించిన మొదటి రాజు. వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించాడు. ఏకవీర, అప్రతిహతచక్ర సామ్రాట్, శూరుడు, దక్షిణ పథపతి అనే బిరుదులు ఉన్నాయి. మహారాష్ట్రను పాలిస్తున్న సామంతుడైన ‘మహారథి త్రయినోకరో’ కుమార్తె నాగానికను వివాహం చేసుకున్నాడు. ఈమె ‘నానాఘాట్‌ శాసనం’ను ప్రాకృత భాషలో వేయించింది. పుష్యమిత్ర శుంగుడిని ఓడించి ఉజ్జయినిని ఆక్రమించాడు. ఉజ్జయిని పట్టణ తోరణాన్ని నాణేలపై ముద్రించాడు. కళింగ రాజు ఖారవేలుడు మొదటి శాతకర్ణిపై దండెత్తి ఓడించినట్లుగా హాథిగుంపా శాసనంలో ఉంది. మొదటి శాతకర్ణి రెండు అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం నిర్వహించాడు. ఇతడి మరణానంతరం కుమారులు చిన్నవాళ్లు కావడంతో భార్య నాగానిక కొంతకాలం పరిపాలన చేసింది. తర్వాత రాజ్యానికి వచ్చినవారు పూర్ణోత్సాంగుడు (వేదసిరి), స్కందస్తంభి.

రెండో శాతకర్ణి (క్రీ.పూ.184-128): ఈయన ఆరో శాతవాహన రాజు. తొలి శాతవాహన రాజుల్లో సుప్రసిద్ధుడు. స్కందస్తంభి తర్వాత రాజ్యాధికారం చేపట్టాడు. 56 ఏళ్ల పాటు పాలించాడు. నానాఘాట్‌ శాసనంలో నాగానిక పేర్కొన్నది ఇతడి గురించేనని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. శకులు, కళింగులు, శుంగులతో యుద్ధాలు చేశారు. ఇతడి కాలం నాటి నాణేలు మాళ్వా, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో లభించాయి.

* రెండో శాతకర్ణి తర్వాత రాజ్యానికి వచ్చినవారు లంబోదరుడు (క్రీ.పూ.128-110), అపీలకుడు (క్రీ.పూ.110-98), మేఘ స్వాతి (క్రీ.పూ.98-80), స్వాతి (క్రీ.పూ.80-62), స్కందస్వాతి (క్రీ.పూ. 62-55).* మృగేంద్ర (క్రీ.పూ.55-52). మృగేంద్ర కాలంలోనే బెత్లహామ్‌ వద్ద ఏసుక్రీస్తు జన్మించారు.

కుంతలస్వాతి (క్రీ.పూ.52-44): ఇతడు 13వ రాజు. ఎనిమిదేళ్లు పరిపాలించాడు. ఇతడి కాలంలో ప్రాకృతం బదులు సంస్కృతం రాజ భాష అయ్యింది. కుంతలస్వాతికి సంస్కృతం నేర్పిన పండితుడు శర్వవర్మ. ఆయన రాసిన గ్రంథం కాతంత్ర వ్యాకరణం. దక్షిణాన మొదట సంస్కృత గ్రంథం ఇదే. కానీ భారతదేశంలో మొదటి సంస్కృత గ్రంథం పాణిని రచించిన ‘అష్టాధ్యాయి’. కుంతలస్వాతి కాలం నాటి మరో కవి గుణాఢ్యుడు. ఇతడి రచన ‘బృహత్కథ’. ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకొని హరిసేనుడు బృహత్కథా కోశం, క్షేమేంద్రుడు బృహత్కథా మంజరి, సోమదేవుడు కథాసరిత్సాగరం గ్రంథాలను రచించారు.

* కుంతలస్వాతి తర్వాత స్వాతికర్ణి రాజు అయ్యాడు.

మొదటి పులోమావి (క్రీ.పూ.43-19): ఇతడు స్వాతికర్ణి తర్వాత రాజు. శాతవాహునుల్లో 15వ పాలకుడు. తన రాజ్యాన్ని సామ్రాజ్యంగా మార్చాడు. అవంతి, అకర రాజ్యాలను ఆక్రమించాడు. మగధ రాజధాని పాటలీపుత్రంపై ఆంధ్ర విజయకేతనం ఎగురవేశాడు. నాటి మగధ రాజు కణ్వ వంశీయుడైన సుశర్మ.

* మొదటి పులోమావి తర్వాత గౌర కృష్ణుడు (క్రీ.పూ.19 - క్రీ.శ.6) రాజు అయ్యాడు.

హాలుడు (క్రీ.శ.7-12): ఈయన 17వ రాజు. అయిదేళ్ల పాటు పరిపాలించాడు. స్వయంగా కవి. ఎక్కువ మంది కవులను పోషించి కవివత్సలుడిగా పేరు పొందాడు. గాథా సప్తశతి అనే గ్రంథం రాశాడు. ప్రాకృత భాషకి ఇతడి కాలం స్వర్ణయుగం. హాలుడు-లీలావతి (శ్రీలంక రాకుమారి)ల ప్రేమగాథను కుతూహలుడు అనే కవి ‘లీలావతి పరిణయం’ గ్రంథంగా రాశాడు. వారి వివాహం ద్రాక్షారామంలో జరిగింది.

* హాలుడి తర్వాత రాజులు మందలకుడు (క్రీ.శ.7-12), పురీంద్రసేనుడు (క్రీ.శ.12-33), సుందర స్వాతికర్ణి (క్రీ.శ.33-34), చకోర స్వాతికర్ణి (క్రీ.శ.34), శివస్వాతి (క్రీ.శ.34-62).

గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ.62-86): శాతవాహనుల్లో గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. 23వ పాలకుడు. 24 ఏళ్లు పరిపాలించాడు. శాలివాహన శకాన్ని (క్రీ.శ.78) ప్రారంభించాడు. ఈయన బిరుదులు దక్షిణ సముద్రాదీశ్వర, ఏకబ్రాహ్మణ, ఆగమ నిలయ క్షత్రియ దర్పమాన వర్థన, త్రిసముద్ర తోయ పీతవాహన. షహరాట వంశానికి చెందిన నహపాణుడిని నాసిక్‌లోని జోగల్‌ తంబి యుద్ధంలో ఓడించాడు. దీంతో ‘షహరాట వంశ నిరీవ శేషకర’ అనే బిరుదు పొందాడు. నహపాణుడి నాణేలపై తన చిహ్నాలతో నాణేలను మళ్లీ ముద్రించాడు. శక, యవన, పహ్లవులను ఓడించాడు. ఇతడి విజయాల గురించి నాసిక్‌ శాసనం తెలుపుతుంది. ఆ శాసనం వేయించినవారు గౌతమీ బాలాశ్రీ. శాసనం రాసినవారు శివస్వామి - మహాస్వామి.

వాసిష్టపుత్ర పులోమావి/రెండో పులోమావి (క్రీ.శ.86-114): గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు. ఇతడి గురించి తెలిపే శాసనాలు నాసిక్‌లో 4, కార్లేలో 2, అమరావతి, ధరణికోటల్లో ఒక్కొక్కటి చొప్పున లభించాయి. నాసిక్‌ శాసనంలో ఇతడిని ‘దక్షిణ పథేశ్వరుడు’గా పేర్కొన్నారు. ప్రాచీనాంధ్రలో 9 నగరాలను నిర్మించి నవనగర స్వామిగా  ప్రసిద్ధికెక్కాడు. శక రాజు రుద్రదాముడు ఇతడి కాలంలో రెండుసార్లు శాతవాహన రాజ్యంపై దండెత్తాడు. అమరావతి వద్ద స్తూపం నిర్మించారు. ఇతడి నాణేలు, శాసనాలు ఆంధ్ర జిల్లాల్లో విస్తారంగా లభించాయి. అమరావతి వద్ద లభ్యమైన శాసనంలోనే ‘నాగబు’ అనే తెలుగు పదం కనిపిస్తుంది.

శివశ్రీ (క్రీ.శ.114-121): వాసిష్టపుత్ర పులోమావి తర్వాత శివశ్రీ రాజయ్యాడు. ఇతడికి క్షత్రప అనే బిరుదు ఉంది. రుద్రదాముడి కుమార్తె రుద్రదమనికను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం గురించి తెలిపే శాసనం గిర్నార్‌ లేదా జునాగఢ్‌ శాసనం. ఇతడి అనంతరం శివస్కందుడు (క్రీ.శ.121-128) రాజయ్యాడు.

యజ్ఞశ్రీ శాతకర్ణి (క్రీ.శ.128-157): ఇతడు 27వ రాజు. చివరి శాతవాహన రాజుల్లో గొప్పవాడు. రుద్రదాముడి వెండి నాణేలను పోలిన నాణేలను ముద్రించాడు. ప్రముఖ బౌద్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు ఇతడి కాలం నాటివాడే. నాగార్జునాచార్యుడి కోసం నాగార్జునకొండలో బౌద్ధవిహారం నిర్మించాడు. రోమన్‌లతో వ్యాపారం చేశాడు. తెరచాపతో కూడిన నాణేలను ముద్రించాడు. ఇతడి తర్వాత విజయశ్రీ (క్రీ.శ.157-163), చందశ్రీ (క్రీ.శ.163-166) రాజులయ్యారు.

* ఆచార్య నాగార్జునుడిని రెండో బుద్ధుడు అంటారు. ఈయన మహాయాన బౌద్ధమతాన్ని ప్రవేశపెట్టాడు. బౌద్ధంలో మార్టిన్‌ లూథర్‌ అని కూడా అంటారు. నాగార్జునుడు శూన్యవాద సిద్ధాంతం, సాపేక్ష సిద్ధాంతానికి కారకుడు. అందువల్లే ఈయనను ‘ఐన్‌స్టీన్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తారు.

మూడో పులోమావి (క్రీ.శ.166-174): శాతవాహనుల్లో చివరి రాజు. ఇతడి పరిపాలన విషయాలను మ్యాకదోని శాసనం తెలుపుతుంది. మూడో పులోమావిని ఓడించి, రాజ్యం నుంచి తరిమేసిన ఇక్ష్వాక రాజు శ్రీచాంత మూలుడు.

మాదిరి ప్రశ్నలు


1. పురాణాలు అనుసరించి శాతవాహనుల్లో చివరి రాజు.

1) శివశ్రీ 2) విజయశ్రీ 3) చంద్రశ్రీ 4) మూడో పులోమావి

2. శాతవాహనుల ప్రధాన భాష?

1) తెలుగు 2) సంస్కృతం 3) ప్రాకృతం 4) తమిళం

3. నాసిక్‌ శాసనం వేయించినవారు?

1) సుందర శాతకర్ణి 2) గౌతమీపుత్ర శాతకర్ణి 3) గౌతమీ బాలశ్రీ 4) ఒకటో శాతకర్ణి 

4. కవివత్సలుడు అనే బిరుదు పొందినవారు?

1) హాల శాతవాహనుడు 2) గౌతమీపుత్ర శాతకర్ణి 3) రాజరాజనరేంద్రుడు 4) మూడో మాధవవర్మ

5. గౌతమీపుత్ర శాతకర్ణి విజయాల గురించి తెలిపే శాసనం?

1) పితలోభోరా 2) నాసిక్‌ 3) నానాషూట్‌ 4) జున్నార్‌

1) మంత్రి  2) సైనికాధికారి 3) జిల్లా అధికారి 4) గ్రామ పెద్ద

6. అమరావతి వద్ద బౌద్ధ మత స్తూపం నిర్మించినవారు?

1) వాసిష్టపుత్ర శాతకర్ణి  2) యజ్ఞశ్రీ శాతకర్ణి  3) శ్రీముఖుడు  4) గౌతమీపుత్ర శాతకర్ణి

7. రెండో శాతకర్ణి వివాహం చేసుకున్న నాగానిక ఎవరు?

1) నహపాణుని కుమార్తె 2) మహారథి త్రయిణోకరి కుమార్తె 3) చష్టుముని కుమార్తె 4) రుద్రదమన సోదరి

8. ఆంధ్రా శాతవాహనుల రాజధాని?

1) వేంగి 2) వరంగల్లు  3) ధరణికోట  4) కొండపాడు

9. శాతవాహనుల నౌకా వ్యాపారానికి సాక్ష్యం

1) బాలశ్రీ శాసనం  2) కార్లే శాసనం  3) యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ నాణేలు 4) ది షెరిప్లెస్‌ ఆఫ్‌ ది ఎరిత్రయన్‌ సీ

10. శాతవాహనుల శాసనాల్లో వాడిన భాష

1) ప్రాకృతం  2) సంస్కృతం  3) తెలుగు   4) మరాఠి

11. కళింగ రాజు ఖారవేలుడి శాసనం

1) నాసిక్‌ శాసనం 2) నానాఘాట్‌ శాసనం  3) హాతిగుంఫా శాసనం  4) అమరావతి శాసనం

12. మ్యాకదోని శాసనాన్ని ఎవరు వేయించారు?

1) మూడో పులోమావి  2) నాగానిక  3) శివశ్రీ  4) స్కంధుడు

13. శాతవాహనుల్లో 2వ రాజు ఎవరు

1) రెండో శాతకర్ణి  2) రెండో పులోమావి  3) కన్హ  4) హాలుడు

సమాధానాలు

1-4, 2-3, 3-3, 4-1, 5-3, 6-1, 7-2, 8-3, 9-3, 10-1, 11-3, 12-1, 13-3. 

ర‌చ‌యిత‌: గ‌ద్దె న‌ర‌సింహారావు

Posted Date : 08-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌