• facebook
  • whatsapp
  • telegram

ఉద్యోగుల విభజన - స్థానికత సమస్య

అస్తవ్యస్త పంపకాలతో అవస్థలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన అనేక చిక్కుముళ్లను సృష్టించింది. అందులో ప్రభుత్వ ఉద్యోగుల విభజన, స్థానికత అత్యంత కీలకమైనవి. విభజనతో ఎదురైన సమస్యలతో అష్టకష్టాలు పడుతున్న నవ్యాంధ్రకు ఉద్యోగుల పంపిణీ ఏళ్ల తరబడి సాగడంతో మరింత ఇబ్బందికరంగా మారింది. విద్యుత్తు ఉద్యోగుల విషయంలో తెలంగాణతో సమన్వయం కుదరకపోవడం, పరిష్కారం చూపాల్సిన కేంద్రం పెద్దగా పట్టించుకోకపోవడంతో సమస్య సంక్లిష్టమై కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. ఉమ్మడి రాష్ట్ర విభజన అధ్యయనంలో ప్రధానమైన ఈ అంశాలను అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. పంపకాల తీరు, వివాద పరిష్కారానికి జరిగిన ప్రయత్నాలతో పాటు, ఉద్యోగులకు తలెత్తిన అవస్థలనూ అర్థం చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం-2014, 8వ భాగంలోని 76 నుంచి 83 వరకు ఉన్న సెక్షన్లు రెండు రాష్ట్రాల మధ్య స్థానిక, జిల్లా, జోనల్, మల్టీజోనల్, రాష్ట్ర కేడర్లలోని అఖిల భారత సర్వీసులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ/విభజన గురించి వివరిస్తాయి. గతంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు నియామక తేదీ (అపాయింటెడ్‌ డే) రోజున లేదా ముందుగా వారి సిబ్బందిని రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌ విభజన విషయంలో ఆ విధంగా జరగలేదు.


నియామక తేదీ నాటికి రెండు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారులను కూడా పంపిణీ చేయలేదు. 10,000 మందికి తక్కువ కాకుండా రాష్ట్ర కేడరు ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రానికి పనిచేయాలని తాత్కాలికంగా ఆదేశించారు. ఇది పాలనా వ్యవస్థ పటిష్టతపై రెండు రాష్ట్రాల్లోని అధికార యంత్రాంగం ప్రతిస్పందనపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. అలాగే ఉద్యోగుల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించే అధికారాన్ని ఇస్తూ, మార్గదర్శక సూత్రాలను రాష్ట్రాలు పాటించాలని, కేంద్రానిదే తుది నిర్ణయమని విభజన చట్టంలోని నిబంధనలు తెలుపుతున్నాయి. ఇరురాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన జనాభా ప్రాతిపదికన చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కోరగా, స్థానికత ప్రాతిపదికన జరపాలని తెలంగాణ అభ్యర్థించింది.


* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన కారణంగా విభజన సమస్యలు/సవాళ్లు/అవస్థలు ఉద్యోగుల విషయంలో అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విషయంలో సొంతూరు ఒక రాష్ట్రంలో; ఉద్యోగం మరొక రాష్ట్రంలో; భార్య ఒక రాష్ట్రంలో, భర్త మరో రాష్ట్రంలో; తండ్రి లోకల్‌ స్టేటస్‌ ఒక రాష్ట్రంలో; పిల్లల లోకల్‌ స్టేటస్‌ ఇంకో రాష్ట్రంలో ఉండే విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఏ ఒక్కరూ తమ ఉద్యోగాలు వదులుకోలేరు. అదేవిధంగా ఉద్యోగుల పిల్లలు తమ సొంత రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో స్థానికత (లోకల్‌ స్టేటస్‌) కలిగి ఉండటంతో వారు పెద్దయిన తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి.


* 2014, జూన్‌ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఉద్యోగుల విభజన అంతా గందరగోళంగా మారింది. ముఖ్యంగా రాష్ట్రస్థాయి ఉన్నత ఉద్యోగులను విభజించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన సలహా సంఘాలు కిందిస్థాయి ఉద్యోగుల విషయంలో జోక్యం చేసుకోలేదు. దాంతో వారంతా ఇబ్బందులు పడ్డారు.


* మొత్తం 10 లక్షల మంది ఉద్యోగులుంటే వారిలో సుమారు 60 వేల మంది రాష్ట్ర స్థాయి ఉద్యోగులను విభజించి కేంద్రం చేతులు దులిపేసుకుంది. మిగిలిన సిబ్బందిని ఎక్కడివారిని అక్కడే అన్నట్లు వదిలేశారు. దీంతో నియామక సమయంలో తమ జోన్‌ పరిధి దాటి వేరే జోన్, వేరే జిల్లాల్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో నియమించారు. ఓపెన్‌ కేటగిరీలో ఉద్యోగం వచ్చినవారు, సబ్జెక్టు పోస్టులు ఖాళీ లేనివారు తదితర కారణాలతో రెండు రాష్ట్రాల్లోనూ స్థానికేతర ఉద్యోగులున్నారు. ఉద్యోగుల విభజన సరిగా జరగకపోవడంతో వారంతా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి రెండు రాష్ట్రాల మధ్య విభజనకు దారితీసిన పరిస్థితుల్లో ‘ఉద్యోగాలు/నియామకాలు’ కూడా ఒక కారణం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ అంశంలో కేంద్రం జోక్యం నామమాత్రంగా మిగిలింది. రాష్ట్ర స్థాయి పోస్టులను మాత్రమే విభజించింది. రెండు రాష్ట్రాలు మాట్లాడుకుని జిల్లా, జోన్, మల్టీజోన్‌ పోస్టుల పంపిణీ చేసుకోవాలని చెప్పింది. వాటి విషయంలో కూడా కొన్ని శాఖలకు సంబంధించి సంక్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి.


* రెండు రాష్ట్రాల మధ్య ముందస్తుగా అఖిలభారత సర్వీసు అధికారులను, రాష్ట్ర కేడర్‌ ఉద్యోగులను విభజించాలని నిర్ణయించారు. ముందుగా పోస్టులను విభజించి తర్వాత అధికారులు, ఉద్యోగులను విభజించారు. రాష్ట్ర కేడర్‌ పోస్టుల విభజన జనాభా ప్రాతిపదికన జరిగింది. కానీ స్థానికత ఆధారంగా జరగాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు కోరాయి.


* అఖిలభారత సర్వీసులు, రాష్ట్ర స్థాయి, సచివాలయ ఉద్యోగుల విభజన కోసం వివిధ కమిటీలను నియమించారు.

ప్రత్యూష్‌ సిన్హా కమిటీ: రెండు తెలుగు రాష్ట్రాలకు అఖిలభారత సర్వీసు ఉద్యోగులను కేటాయించడానికి కేంద్రం ప్రత్యూష్‌ సిన్హా కమిటీని ఏర్పాటు చేసింది. ఇది కూడా రాష్ట్ర కేడరు ఉద్యోగుల విభజన విషయంలో అనుసరించిన మార్గదర్శకాలనే అనుసరించింది. ఐఏఎస్‌ కేడర్‌ పోస్టులను ఆంధ్రప్రదేశ్‌కు 211, తెలంగాణకు 163 కేటాయించింది. ఐపీఎస్‌ కేడర్‌ పోస్టులు ఏపీకి 144, తెలంగాణకు 112 కేటాయించగా, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసు (ఐఎఫ్‌ఎస్‌) కేడర్‌ పోస్టులు ఆంధ్రప్రదేశ్‌కు 82, తెలంగాణకు 65 చొప్పున పంపిణీ చేశారు.


కమలనాథన్‌ కమిటీ: తెలుగు రాష్ట్రాల మధ్య రాష్ట్ర కేడర్‌ ఉద్యోగుల విభజన, పంపిణీ కోసం 2014, మార్చి 29న సి.ఆర్‌.కమలనాథన్‌ నేతృత్వంలో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇది 2014, మార్చి నుంచి 2017 మార్చి వరకు ఇరు రాష్ట్రాల మధ్య రాష్ట్ర కేడర్‌ ఉద్యోగుల విభజనకు సంబంధించి మొత్తం 153 యూనిట్ల (శాఖలు, ఉపశాఖలు)కు చెందిన ఉద్యోగులను పంపిణీ చేసింది. సచివాలయ ఉద్యోగుల విభజననూ ఈ కమిటీనే చేపట్టింది. జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగులను 58.32 : 41.68 నిష్పత్తిలో కేటాయించి పంపిణీ చేసింది.


ఉద్యోగుల పంపిణీలో జాప్యం: రాష్ట్ర విభజన జరిగి దాదాపు తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏడాదిలోకి అడుగుపెట్టినప్పటికీ కొన్ని యూనిట్లకు సంబంధించి ఉద్యోగుల విభజనలో జాప్యం జరిగింది. మరికొన్నింట్లో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 


ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (IPM):  వైద్య ఆరోగ్య శాఖలో భాగంగా పనిచేసే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎమ్‌) ఉద్యోగుల విభజనకు దాదాపు తొమ్మిదేళ్లు పట్టింది. దీంతో నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్టేట్‌ ఫుడ్‌ లేబొరేటరీ లేక ఆహార కల్తీ నమూనాల పరీక్షలు ఆలస్యమయ్యేవి. కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలోనూ జాప్యం జరిగేది. 2022, మే నెలలో ఐపీఎమ్‌లోని మొత్తం 607 ఉద్యోగులను జనాభా నిష్పత్తిలో విభజించి ఆంధ్రప్రదేశ్‌కు 350, తెలంగాణకు 257 మందిని కేటాయించారు.


వైద్యులు: ఇరు రాష్ట్రాల మధ్య వైద్యుల విభజనకు దాదాపు మూడేళ్లు పట్టింది. ఉమ్మడి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని రాష్ట్ర స్థాయి పోస్టుల్లోని 6,298 మంది ఉద్యోగులను రెండు రాష్ట్రాల మధ్య విభజిస్తూ 2017, ఫిబ్రవరిలో ఉత్తర్వులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు 3,828; తెలంగాణకు 2,470 మందిని కేటాయించారు.


సంక్లిష్టంగా విద్యుత్తు ఉద్యోగుల విభజన: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్తు సంస్థలు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకంగా విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ సంస్థల్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. దీనిలో భాగంగా విద్యుత్తు కంపెనీల పని సాఫీగా జరగడం కోసం ‘ఆర్డర్‌ టు సర్వ్‌’ ప్రకారం 2014, జూన్‌ 2న రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగులను విభజించారు. అయితే 2015, జులైలో తెలంగాణ ప్రభుత్వం సర్వీస్‌ రిజిస్టర్‌లోని జన్మస్థలం, విద్యార్హత, నియామకం ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ స్థానికతకు చెందిన 1,157 మంది విద్యుత్తు ఉద్యోగులను రిలీవ్‌ చేసింది. ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసింది. హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు చేరింది. వివాద పరిష్కారానికి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ డి.ఎం.ధర్మాధికారితో సుప్రీంకోర్టు 2018, నవంబరు 28న ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌కు కూడా మధ్యవర్తిత్వం సాధ్యపడలేదు. చివరికి ఉద్యోగుల విభజన కోసం జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగానే తన పని చేసింది. తెలంగాణ విద్యుత్తు సంస్థలు రిలీవ్‌ చేసిన 1,157 మందిలో 655 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 502 మందిని తెలంగాణకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే థ్రెషోల్డ్‌ పరిమితి మించిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 655 మంది కేటాయింపుపై ఏపీ విద్యుత్తు సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. రెండుపక్షాల వివరణాత్మక విచారణ తర్వాత ఆర్థిక సమతౌల్యతను కొనసాగించడానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు కూడా సమాన సంఖ్యలో 655 మందిని కేటాయిస్తూ జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ తుది నిర్ణయం తీసుకుంది.


* ధర్మాధికారి కమిటీ సిఫార్సు చేసిన 655 మందిలో 571 మందికి మాత్రమే పోస్టింగులు ఇచ్చి, మిలిగిన 84 మందికి ఇచ్చేందుకు తెలంగాణ నిరాకరించింది. ఈ విషయమై సుప్రీంకోర్టు 2022, అక్టోబరు 11న తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మాధికారి కమిటీ ఇచ్చిన నివేదిక, దానిలోని సిఫార్సులే అంతిమమని, వాటిని అమలుచేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.


ఉద్యోగుల పంపిణీలో రాష్ట్రాల చొరవ:  విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగాల్లో ఎక్కువమంది ఆయా జోన్లను మూడు లేదా నాలుగో ఆప్షనల్‌గా ఎన్నుకుని నియామకం పొందినవారే ఉన్నారు. వారు ఒకవేళ సొంత రాష్ట్రానికి తిరిగి వెళితే అక్కడ సర్వీసు కోల్పోయి, ప్రమోషన్లలో వెనుకబడతారు. అయినప్పటికీ ఇలాంటి వారి కోసం 2017లో మ్యూచువల్, స్పౌజ్‌ కోటాల్లో ఇరురాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీకి అవకాశం కల్పించారు. అయితే ఇందులో క్లిష్టమైన నిబంధనల కారణంగా ఈ ఏర్పాటు పెద్దగా ఉపయోగపడలేదు.


* ఉద్యోగుల విభజన సందర్భంగా తెలంగాణలో ఉండటానికి ఆప్షన్‌ ఇచ్చినప్పటికీ కొంతమందిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. తెలంగాణ స్థానికత కలిగిన అలాంటి 698 మంది 3వ, 4వ తరగతి ఉద్యోగుల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞాపనలు అందాయి. వారిని రిలీవ్‌ చేసి పంపాలని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు విజ్ఞప్తి చేసింది. దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని ఏకాభిప్రాయానికి వచ్చాయి. 2021లో వారంతా ఏపీ నుంచి రిలీవ్‌ అయ్యారు.


* రాష్ట్ర విభజన తర్వాత ఇరురాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే ఉద్యోగుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తాజాగా  తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1,808 మంది ఉద్యోగులు తెలంగాణకు వెళ్లడానికి ఆసక్తిని ప్రదర్శించారు. తెలంగాణలో పనిచేస్తున్న 1,369 మంది ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వీరికి సంబంధించి ఇరురాష్ట్రాలు నో ఆబ్జెక్షన్‌ సరిఫికెట్లు జారీ చేయాల్సి ఉంది.


* రాష్ట్ర విభజన వల్ల ఉద్యోగుల కోణంలో చూస్తే ఈ అంశం ఉద్యోగుల జీవితాలు, వృత్తితో పాటు పని, జీత సమతౌల్యతలను ప్రభావితం చేశాయి. భార్యాభర్తల ఉద్యోగాలు, పిల్లల చదువులు, వైద్య సదుపాయాలు లాంటి అనేక కారణాల వల్ల ఒక నిర్దిష్ట రాష్ట్రంలో ఉండాలనుకునే చాలామంది ఉద్యోగులు అనుకోకుండా స్థానభ్రంశం చెందారు.

రచయిత: కరుణ వారాద

Posted Date : 01-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌