• facebook
  • whatsapp
  • telegram

శరీర పోషణలో శక్తి జనకాలు!

   

శరీరంలో జరిగే జీవక్రియలకు, ఇతర అవసరాలకు ప్రధాన శక్తి వనరులు కార్బోహైడ్రేట్‌లు. పండ్లు, తేనె, కూరగాయలు, ఆకుకూరలు, విత్తనాలు, మొలకలు వంటి సహజ ఆహార పదార్థాలతో పాటు చక్కెర ఉత్పత్తులు, వేపుళ్లు, చిప్స్, పిజ్జా, బిస్కెట్లు, బేకరీ ఉత్పత్తులు వంటి అనారోగ్యకర పదార్థాల్లోనూ కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఆహారంలోని కార్బోహైడ్రేట్‌లు గ్లూకోజ్‌గా మారి శరీరానికి శక్తి అందుతుంది. ఇందులో తక్షణం శక్తినిచ్చేవి, క్రమంగా శక్తిని విడుదల చేసేవి, అత్యధికంగా శక్తిని సమకూర్చేవి అని భిన్నరకాలుగా ఉంటాయి. వీటి వర్గీకరణ, లభించే పదార్థాలు, భిన్న ఉపయోగాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.


కార్బోహైడ్రేట్‌లు


జీవులకు ప్రాథమిక శక్తి జనకాలు కార్బోహైడ్రేట్‌లు. జంతువులతో పోలిస్తే మొక్కల భాగాల్లో ఇవి ఎక్కువ. మొక్కల్లో సెల్యులోజ్, పిండిపదార్థాలుగా; జంతువుల్లో గ్లైకోజెన్‌ రూపంలో నిల్వ ఉంటాయి. కార్బోహైడ్రేట్‌లు సాధారణంగా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్‌ల నిర్మితాలు. ఉన్నతస్థాయి కార్బోహైడ్రేట్‌లలో నైట్రోజన్, సల్ఫర్‌ అదనం. చక్కెర పరమాణువులు, నిర్మాణం ఆధారంగా వీటిని మూడు రకాలుగా విభజించారు.అవి 1) మోనో శాఖరైడ్‌లు 2) ఒలిగో శాఖరైడ్‌లు 3) పాలీ శాఖరైడ్‌లు.

   


1) మోనోశాఖరైడ్‌లు: ఒకే చక్కెర అణువు ఉన్న కార్బోహైడ్రేట్‌లను మోనోశాఖరైడ్‌లు అంటారు. వీటిని సరళ చక్కెరలని పిలుస్తారు. రుచికి తియ్యగా ఉండి, నీటిలో కరుగుతాయి. వీటిలో కర్బన పరమాణువులను బట్టి కార్బోహైడ్రేట్‌లను తిరిగి డైయోజ్‌లు, ట్రయోజ్‌లు, టెట్రోజ్‌లు, పెంటోజ్‌లు, హెక్సోజ్‌లు, హెప్టోజ్‌లుగా వర్గీకరించారు.


డైయోజ్‌లు: వీటిలో రెండు కార్బన్‌ పరమాణువులుంటాయి. గ్లైకోలాల్డిహైడ్‌ అనేది వీటికి ఉదాహరణ. ఇది అతి సరళ కార్బోహైడ్రేట్‌.


ట్రైయోజ్‌లు: వీటిలో మూడు కార్బన్‌ పరమాణువులుంటాయి. 


ఉదా: గ్లైసిరోజ్‌


టెట్రోజ్‌లు: వీటిలో నాలుగు కార్బన్‌ పరమాణువులుంటాయి. ఎరిథ్రోజ్, ఎరిథ్రులోజ్, థ్రియోజ్‌ అనేవి వీటికి ఉదాహరణ.


పెంటోజ్‌లు: వీటిలో 5 కార్బన్‌ పరమాణువులుంటాయి. రైబోజ్, అరాబినోజ్, క్సైలోజ్‌ అనేవి వీటికి ఉదాహరణ. రైబోజ్‌ చక్కెర కేంద్రకామ్లాలైన డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలలో ఉంటుంది. అయితే డీఎన్‌ఏలో ఉండే చక్కెరను డీఆక్సీరైబోజ్‌ చక్కెర అని అంటారు.


హెక్సేజ్‌లు: వీటిలో 6 కార్బన్‌ పరమాణువులుంటాయి. గ్లూకోజ్, మాన్నోజ్, గాలక్టోజ్, ఫ్రక్టోజ్‌లు అనేవి వీటికి ఉదాహరణ. వీటిలోని గ్లూకోజ్‌ను రక్తంలో ఉండే చక్కెర, తక్షణ శక్తినిచ్చే చక్కెర, క్రీడాకారులు వ్యాయామం తర్వాత తీసుకునే చక్కెర అని పిలుస్తారు. ఫ్రక్టోజ్‌ చక్కెరను అతి తియ్యనైన చక్కెర అంటారు. ఇది తేనె, పండ్లలో ఉంటుంది. గాలక్టోజ్‌ చక్కెర పాలలోని చక్కెర అయిన లాక్టోజ్‌లో భాగంగా ఉంటుంది.


హెప్టోజెస్‌: వీటిలో 7 కర్బన పరమాణువులుంటాయి. గ్లూకోహెప్టోజ్, గ్లూకోహెప్టులోజ్, మాన్నోహెప్టోజ్‌ అనేవి వీటికి ఉదాహరణ.

<

   


2) ఒలిగోశాఖరైడ్‌లు: వీటిలో 2 నుంచి 10 వరకు మోనోశాఖరైడ్‌లు లేదా సరళ చక్కెరలుంటాయి. వీటిలో ఉండే చక్కెర పరమాణువులను బట్టి వీటిని తిరిగి డై శాఖరైడ్‌లు, ట్రై శాఖరైడ్‌లు, టెట్రా శాఖరైడ్‌లు, పెంటా శాఖరైడ్‌లు లాంటి వాటిగా విభజించారు. 


డైశాఖరైడ్‌లు: వీటిలో రెండు చక్కెర అణువులుంటాయి. 


ఉదాహరణ: 


1) మాల్టోజ్‌: ఇది రెండు గ్లూకోజ్‌ అణువులతో ఏర్పడుతుంది (గ్లూకోజ్‌ + గ్లూకోజ్‌). మొక్కజొన్న సిరప్, మాల్ట్‌లో ఈ చక్కెర ఉంటుంది. మన జీర్ణవ్యవస్థలో పిండిపదార్థంపైన లాలాజల అమైలేజ్‌ (టయలిన్‌), పాంక్రియాటిక్‌ అమైలేజ్‌ (అమైలాప్సిన్‌) చర్య వల్ల మాల్టోజ్‌ ఏర్పడుతుంది. మాల్టేజ్‌ అనే ఎంజైమ్‌ మాల్టోజ్‌ చక్కెరపై చర్య జరపడం వల్ల రెండు గ్లూకోజ్‌ అణువులు ఏర్పడతాయి.


2) లాక్టోజ్‌: ఇది గాలక్టోజ్, గ్లూకోజ్‌ చక్కెర అణువులతో ఏర్పడుతుంది. లాక్టోజ్‌ పాలలో ఉంటుంది. దీన్ని మిల్క్‌షుగర్‌ అంటారు. మన జీర్ణవ్యవస్థలో లాక్టేజ్‌ అనే ఎంజైమ్‌ లాక్టోజ్‌ చక్కెరపై చర్య జరపడం వల్ల గాలక్టోజ్, గ్లూకోజ్‌ ఏర్పడతాయి.


3) సుక్రోజ్‌: ఇది గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌ చక్కెరలతో ఏర్పడుతుంది. పండ్ల రసాల్లో ఈ చక్కెర ఉంటుంది. చెరకు రసం, బీట్‌రూట్‌ రసంలో ఈ చక్కెర ఎక్కువగా ఉంటుంది. బాగా పండిన ఫలాల్లో మిగతా చక్కెరల కంటే ఇది ఎక్కువగా ఉంటుంది. దీన్ని అతి తియ్యనైన చక్కెర, చెరకులోని చక్కెర అని పిలుస్తారు. మన జీర్ణవ్యవస్థలో ఉండే సుక్రేజ్‌ అనే ఎంజైమ్‌ సుక్రోజ్‌పై చర్య జరపడం వల్ల గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌ ఏర్పడతాయి. సుక్రోజ్‌ 200్నది వరకు వేడి చేసినప్పుడు కారమిల్‌ అనే పదార్థంగా మారుతుంది.


ట్రైశాఖరైడ్‌లు: మూడు చక్కెర పరమాణువులు కలిగిన కార్బోహైడ్రేట్‌లను ట్రైశాఖరైడ్‌లు అంటారు. వీటికి ఉదాహరణ.


1) రాఫినోజ్‌: ఇది ఫ్రక్టోజ్, గ్లూకోజ్, గాలక్టోజ్‌ చక్కెరల కలయికతో ఏర్పడుతుంది. పత్తి గింజల పిండిలో 7 శాతం రాఫినోజ్‌ ఉంటుంది. 


2) జెన్షియానోజ్‌: ఇది ఫ్రక్టోజ్, గ్లూకోజ్, గ్లూకోజ్‌ కలయికతో ఏర్పడుతుంది.


3) రోబినోజ్‌: ఇది గాలక్టోజ్, రాహమ్‌నోజ్, రాహమ్‌నోజ్‌ల కలయికతో ఏర్పడుతుంది.


3) పాలీశాఖరైడ్‌లు: పది లేదా అంతకంటే ఎక్కువ మోనోశాఖరైడ్‌లను కలిగిన కార్బోహైడ్రేట్‌లను పాలీశాఖరైడ్‌లంటారు. పాలీశాఖరైడ్‌లకు మరో పేరు గ్లైకాన్స్‌. ఇవి రెండు రకాలు. 1) హోమో పాలీశాఖరైడ్‌లు 2) హెటిరో పాలీశాఖరైడ్‌లు


హోమో పాలీశాఖరైడ్‌లు: ఇవి ఒకేరకమైన మోనోశాఖరైడ్‌లను కలిగి ఉంటాయి. వీటికి ఉదాహరణ.


1) పిండిపదార్థం: ఇది బంగాళదుంప, చిలగడదుంప లాంటి దుంపలు, ధాన్యాలు, పండని ఫలాల్లో ఉంటుంది. మొక్కల్లో ఎక్కువగా నిల్వ ఉండే కార్బోహైడ్రేట్‌ పిండిపదార్థం.


2) గ్లైకోజెన్‌: ఇది జంతువుల్లో ఉండే కార్బోహైడ్రేట్‌. మనిషిలో గ్లైకోజెన్‌ కాలేయం, కండరాల్లో నిల్వ ఉంటుంది. దీన్ని జంతువుల పిండిపదార్థం అంటారు. కండరాల్లో ఉన్న గ్లైకోజెన్‌ కండర సంకోచానికి శక్తి జనకంగా ఉపయోగపడుతుంది. మానవునిలో ఎక్కువైన గ్లూకోజ్‌ ఇన్సులిన్‌ హార్మోన్‌ సహాయంతో గ్లైకోజెన్‌గా మారి నిల్వ ఉంటుంది. మనకు తిరిగి శక్తి కోసం గ్లూకోజ్‌ అవసరమైనప్పుడు గ్లూకాగాన్‌ హార్మోన్‌ సహాయంతో గైకోజెన్‌ గ్లూకోజ్‌గా మారుతుంది. శిలీంధ్రాలు, ఈస్ట్‌లలో కూడా కొద్దిగా గ్లైకోజెన్‌ ఉంటుంది.


సెల్యులోజ్‌: ఇది మొక్కల కణకవచాల్లో ఉంటుంది. ప్రకృతిలో అతి ఎక్కువగా ఉండే సేంద్రియ పదార్థం. జనపనార, పత్తిలో 97% నుంచి 99% వరకు, కలపలో 41% నుంచి 53% వరకు, ధాన్యాల గడ్డిలో 30% నుంచి 43% వరకు సెల్యులోజ్‌ ఉంటుంది. జంతువుల శరీరంలో సెల్యులోజ్‌ ఉండదు. సెల్యులోజ్‌ను జీర్ణం చేసే సెల్యులేజ్‌ ఎంజైమ్‌ను అనేక రకాల బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేస్తాయి. మానవ జీర్ణవ్యవస్థలో సెల్యులేజ్‌ ఎంజైమ్‌ ఉత్పత్తి కాకపోవడం వల్ల మన ఆహారంలో సెల్యులోజ్‌ ఉంటే జీర్ణం కాదు. ఆహారంలోని జీర్ణం కాని సెల్యులోజ్‌ పెద్ద పేగులో మలపదార్థం సాఫీగా కదలడానికి ఉపయోగపడుతుంది. శాకాహార జంతువుల జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా సెల్యులేజ్‌ ఎంజైమ్‌ను ఉత్పత్తి చేసి, ఆహారంలో ఉన్న సెల్యులోజ్‌ను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. సెల్యులోజ్‌ను ఉపయోగించి నైట్రోసెల్యులోజ్‌ అనే పేలుడు పదార్థాన్ని తయారుచేస్తారు.


ఇన్యులిన్‌: దీనిలో అనేక ఫ్రక్టోజ్‌ అణువులుంటాయి. చికోరి, డాహ్లియా, జెరూసలం ఆర్టిచోక్‌ మొక్కల దుంపల్లో ఇన్యులిన్‌ ఉంటుంది. ఫ్రక్టోజ్‌ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి ఇన్యులిన్‌ను వాడతారు.


హెటిరో పాలీశాఖరైడ్‌లు: వీటిలో అనేక రకాల మోనోశాఖరైడ్‌లు ఉంటాయి. కింది పదార్థాలు హెటిరో పాలీశాఖరైడ్‌లకు ఉదాహరణ.


అగార్‌: ఇది జిలీడియం, గ్రాసిలేరియా లాంటి సముద్రపు శైవలాల నుంచి లభిస్తుంది. వేడి నీటిలో కరుగుతుంది. కణజాల వర్ధనంలో ద్రవ యానకాన్ని ఘనస్థితికి తేవడానికి, జామ్‌లు, జెల్లీల తయారీకి ఉపయోగిస్తారు. మానవ జీర్ణవ్యవస్థలో అగార్‌ జీర్ణం కాదు.


గమ్‌ అరాబిక్‌: కొన్ని అకేషియా జాతుల మొక్కల బెరడు పైభాగం నుంచి దీన్ని సేకరిస్తారు. దీన్ని ఔషధాల తయారీ, వస్తువులను అతికించడానికి, ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు.


పెక్టిన్‌: నిమ్మ, ఆపిల్‌ వంటి పండ్లలో, క్యారెట్‌లో ఉంటుంది.


ఆల్జినిక్‌ ఆమ్లం: ఇది సముద్ర శైవలాల నుంచి లభిస్తుంది. దీన్ని ఆహార పరిశ్రమలో ఎమల్సిఫైయింగ్‌ పదార్థంగా, ఆహారాన్ని మెత్తపరచడానికి వాడతారు.


హెపారిన్‌: ఇది రక్తస్కంద నివారిణి. ఇది కాలేయం, థైమస్‌ గ్రంథి, ప్లీహం, రక్తంలో ఉంటుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకపోవడానికి కారణం హెపారిన్‌. ఇది రక్తం గడ్డ కట్టే ప్రక్రియలో ప్రోత్రాంబిన్‌ను త్రాంబిన్‌గా మారడాన్ని అడ్డుకొని రక్తం గడ్డకట్టే ప్రక్రియను నివారిస్తుంది.


 

Posted Date : 03-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌