• facebook
  • whatsapp
  • telegram

మృత్తికలు

ఆ నేలలు దేశ ధాన్యాగారాలు!




 

ప్రపంచంలోనే అత్యధికంగా సాగుభూమి ఉన్న దేశం భారత్‌. అందులోనూ అధికశాతం సారవంతమైంది, సహజసిద్ధమైంది. ఈ సానుకూలత వల్లే దేశం అన్నపూర్ణగా ఖ్యాతి గడించింది. ఆ నేలల రకాలు, విస్తరణ తీరు, వాటి రసాయనిక స్వభావం, పండే పంటలు, రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితుల గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. వ్యవసాయానికి, ఆహారభద్రతకు పెనుముప్పుగా మారుతున్న నేల కోతలకు ప్రధాన కారణాలు, నివారణ మార్గాలతో పాటు దేశవ్యాప్తంగా నేలల పరిశోధనా కేంద్రాలున్న ప్రాంతాలు, మృత్తికల సంరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలు, ఉద్యమాల గురించి తెలుసుకోవాలి.


భూఉపరితలంపై కర్బన, అకర్బన పదార్థాలతో కూడిన పలుచని పొరనే మృత్తిక అంటారు. ఇది ప్రకృతి ప్రసాదించిన జీవ, పునర్వినియోగ వనరు. దేశంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. పంటలు పండించడం అనేది నేలసారం, స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. మృత్తిక ఏర్పడటానికి సుమారు 200 నుంచి 1000 ఏళ్లు పడుతుంది. కానీ అదే నేల క్షీణించడానికి కేవలం కొన్ని రోజులు చాలు. మృత్తిక ఉద్భవం, స్వభావాన్ని నిర్ణయించేవి శీతోష్ణస్థితి, సహజ వృక్ష సంపద, నైసర్గిక స్వరూపం, కాలం మొదలైనవి.


మృత్తికల అధ్యయన శాస్త్రాన్ని పెడాలజీ లేదా లిథాలజీ అంటారు. ప్రపంచ మృత్తికల దినోత్సవాన్ని డిసెంబరు 5న నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం మృత్తికా పరిరక్షణ కోసం ‘మృత్తికా ఆరోగ్యపత్రం పథకం’ ప్రవేశపెట్టింది. మృత్తికా సంరక్షణ నినాదం ‘స్వాస్థ్య్‌ ధరా, ఖేత్‌ హరా (ఆరోగ్యకరమైన భూమి, పచ్చని పొలాలు)’. ప్రస్తుతం దేశంలో ఒక అంచనా ప్రకారం సుమారు 175 మిలియన్‌ హెక్టార్ల భూమి క్రమక్షయానికి గురవుతోంది. ఏటా సుమారు 16.4 టన్నుల మృత్తికా నష్టం జరుగుతోంది. ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాళ్లలో మృత్తికా సంరక్షణ ఒకటి. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ(ICAR)  దేశంలో ఉన్న నేలలను వివిధ అంశాల ప్రాతిపదికన 8 రకాలుగా వర్గీకరించింది.

1) ఒండ్రుమట్టి నేలలు: వీటినే అల్లోవియల్‌ నేలలు అంటారు. ఇవి దేశ భౌగోళిక విస్తీర్ణంలో 43.36% ఆక్రమించాయి. దేశ విస్తీర్ణంలో 143 మిలియన్‌ హెక్టార్లలో ఈ రకమైన మృత్తికలే ఉన్నాయి. ఇవి నదుల ద్వారా జరిగే క్రమక్షయం, రవాణా, నిక్షేపణం వల్ల ఏర్పడతాయి. వీటిలో బంకమన్ను, ఇసుక రేణువులు ఉంటాయి. ఈ నేలలు గంగా, బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతంలో  ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నేలలను భాబర్, టెరాయి, భంగర్, ఖాదర్, కాంకర్, ఉషర్‌లుగా విభజించారు. వీటిలో ఎక్కువగా వరి, గోధుమ, చెరకు, జనపనార, పత్తి పండిస్తారు.

2) నల్లరేగడి నేలలు: వీటినే బ్లాక్‌ సాయిల్‌ నేలలు అంటారు. అగ్నిపర్వత శిలాద్రవం (లావా) ప్రవాహం, మాతృశిలల శైథిల్యం వల్ల ఏర్పడతాయి. ఇవి  దేశంలో 49.8 మిలియన్‌ హెక్టార్ల (15.09%) మేర విస్తరించి ఉన్నాయి. నల్లరేగడి నేలలకు నీటిని నిల్వ చేసుకునే శక్తి ఎక్కువ. ఇవి పత్తి పంటకు అనుకూలం. అందుకే వీటిని బ్లాక్‌ కాటన్‌ నేలలు అంటారు. నల్లరేగడి నేలలు వర్షాకాలంలో జిగటగా ఉంటాయి. వేసవిలో ఎండిపోయి పెద్ద, పెద్ద పగుళ్లు ఏర్పడతాయి. భూ ఉపరితలంపైన ఉండే మట్టి రాలి ఆ పగుళ్లలో చేరుతుంది. ఆ విధంగా స్వయం మట్టి మార్పిడి చేసుకుంటుంది. అందుకే వీటిని ‘స్వతఃసిద్ధ వ్యవసాయ సాగునేలలు’ అంటారు. ఇవి పత్తి, పొగాకు, వరి, గోధుమ, మిరప, నూనెగింజలు, చెరకు, నిమ్మ పంటలకు అనుకూలం.

3) ఎర్రనేలలు: వీటినే ‘రెడ్‌ సాయిల్‌’ అంటారు. ఇవి పురాతన స్ఫటికాకార రూపాంతర శిలలు శిథిలమవడం వల్ల ఏర్పడతాయి. ఇనుము (ఎక్కువ శాతం), మెగ్నీషియం లాంటి లోహాలు కలిసి ఉండటంతో ఎర్రగా ఏర్పడతాయి. తేమ ఎక్కువ ఉన్నచోట ఇవి పసుపు రంగులో కనిపిస్తాయి. దేశంలో 61 మిలియన్‌ హెక్టార్లలో (సుమారు 18.91%) విస్తరించి ఉన్నాయి. ఎక్కువగా ద్వీపకల్ప పీఠభూమిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉన్నాయి. తెలంగాణలో వీటిని ‘చెలక/దుబ్బ నేలలు’ అని పిలుస్తారు. వీటిలో పొటాషియం, సిలికా, అల్యూమినియం ఎక్కువగా; నత్రజని, ఫాస్ఫరస్, సేంద్రియ పదార్థాలు తక్కువగా ఉంటాయి. వరి, పత్తి, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, వేరుశనగ, కూరగాయలకు ఈ నేలలు అనుకూలం.

4) లాటరైట్‌ నేలలు: ఇవి అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఈ నేలలు దేశంలో 12.2 మిలియన్‌ హెక్టార్లలో అంటే సుమారు 3.7% విస్తీర్ణంలో ఉన్నాయి. తక్కువ సారవంతమైనవి. వీటిలో ఇనుము, పొటాషియం ఎక్కువ; నత్రజని, క్యాల్షియం, ఫాస్ఫేట్, సేంద్రియ పదార్థాలు తక్కువ. ఈ నేలలు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, మేఘాలయ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్నాయి. తెలంగాణలోని జహీరాబాద్, నారాయణఖేడ్‌లలో, ఏపీలోని చిత్తూరు (సత్యవేడు), నెల్లూరు (కావలి, సూళ్లూరుపేట) దగ్గర ఎక్కువగా ఉన్నాయి. కాఫీ, తేయాకు, జీడిమామిడి, రబ్బరు, సుగంధ]ద్రవ్యాల పంటలకు ఈ నేలలు అనుకూలం.

5) ఎడారి నేలలు: వీటినే ‘ఆరిడ్‌ సాయిల్‌’ అంటారు. ఇవి శుష్క, అర్ధ శుష్క శీతోష్ణస్థితి ఉండే ఎడారి ప్రాంతాల్లో శిలల యాంత్రిక శైథిల్యం వల్ల ఏర్పడతాయి. వీటిలో ఇసుక రేణువులు, ఫాస్ఫరస్‌ ఎక్కువ; నత్రజని, సేంద్రియ పదార్థాలు తక్కువ. గాలి వీచే విధానానికి అనువుగా ఏర్పడతాయి. దేశంలో 14.6 మిలియన్‌ హెక్టార్లలో (సుమారు     4.42%) విస్తరించి ఉన్నాయి. ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ నేలలు సజ్జ, జొన్న, చిరుధాన్యాలు, పప్పుధాన్యాల సాగుకు అనుకూలం.

6) ఆమ్ల, క్షార నేలలు: వీటినే లవణీయత/ క్షార నేలలు అంటారు. ఈ నేలల్లో సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం లవణాలు ఎక్కువగా ఉంటాయి. శుష్క వాతావరణంలో భూమిలో నీరు నిలిచి లవణాలు బయటకు పోలేని  పరిస్థితుల్లో ఏర్పడతాయి. రాజస్థాన్,     గుజరాత్‌ల్లో ఎక్కువగా ఉంటాయి. గంగా మైదాన వాయవ్య ప్రాంతంలో వీటిని రే/కల్లార్‌/ఊసర నేలలు అంటారు. దేశ భూభాగంలో సుమారు 1.2% విస్తరించి ఉన్నాయి. 

7) అటవీ నేలలు: ఇవి దేశంలో ఎక్కువగా కొండ ప్రాంతాల్లో విస్తరించి ఉండటం వల్ల వీటిని పర్వత నేలలు అంటారు. లద్దాఖ్, జమ్ము-కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉన్నాయి. ఈ నేలలు దేశంలో 24 మిలియన్‌ హెక్టార్లలో (సుమారు 7.2%) విస్తరించి ఉన్నాయి.  ఇవి పండ్లతోటలు, సుగంధద్రవ్యాల పంటలకు అనుకూలం.

8) పీట్‌/ జీవ సంబంధ నేలలు: వీటినే ‘సేంద్రియ నేలలు’ అంటారు. వీటిలో తేమ, బురద ఎక్కువ. వ్యవసాయానికి అంత అనుకూలం కాదు. మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అక్కడక్కడా విస్తరించి ఉన్నాయి.

 

మృత్తికా క్రమక్షయం

భారతదేశంలో మృత్తికలు చాలా పురాతనమైనవి, సారవంతమైనవి. ఇవి పంటలకు అనుకూలం. సరైన వ్యవసాయ పద్ధతులు, తగు మోతాదులో ఎరువులు వాడితే పంటలు బాగా పండుతాయి. మృత్తికా క్రమక్షయం/ నేలకోత దేశంలో వ్యవసాయానికి పెద్ద సమస్య. ఏటా లక్షల టన్నుల మృత్తిక వరదల వల్ల కొట్టుకుపోతోంది. అధిక వర్షపాతం, తక్కువ సమయంలో అతి ఎక్కువ వర్షపాతం వల్ల కూడా నేల కొట్టుకుపోతోంది. భూఉపరితల వాలు, మృత్తిక పరిమాణం, మృత్తిక నిర్మాణం, అడవుల విస్తరణ, భూవినియోగం, ప్రకృతి విపత్తులు, మానవ చర్యలు, జంతువులు మొదలైనవి కూడా మృత్తికా క్రమక్షయానికి కారకాలు.


నేలకోత/ మృత్తికా క్రమక్షయాన్ని తగ్గించడానికి కాంటూర్‌ కందకాలు తవ్వడం, టెర్రస్‌ విధానంలో వ్యవసాయం, మల్చింగ్, అడవుల పెంపకం, జంతువులను నియంత్రించడం, గడ్డిభూములు పెంచడం, పంటమార్పిడి విధానం, చెక్‌డ్యామ్‌లు నిర్మించడం, వాలుకు అడ్డంగా దున్నడం, పోడు వ్యవసాయాన్ని ఆపివేయడం, గ్రామీణులను చైతన్యపరచడం వంటివి ఫలితాలనిస్తాయి.

2016లో ఇస్రో వెలువరించిన అంచనా ప్రకారం భారతదేశ వాయవ్య ప్రాంతంలో 50% భూభాగం ఎడారిగా మారే ముప్పును ఎదుర్కొంటోంది. రి కేంద్ర ప్రభుత్వం 2015, ఫిబ్రవరి 19న మృత్తికా సంరక్షణ కోసం ‘మృత్తికా ఆరోగ్య పత్రం’ (సాయిల్‌ హెల్త్‌కార్డ్‌) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని రెండేళ్లకోసారి ఇస్తారు. దీనిలో ఏ పంటలకు ఏయే పోషకాలు వాడాలో చెబుతారు. రి ‘సేవ్‌ సాయిల్‌’ అనే ఉద్యమం ఇషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భారత్‌లో మొదలైంది. ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు ‘సద్గురు’ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచే విధంగా 100 రోజులపాటు, 25కు పైగా దేశాల్లో 30 వేల కి.మీ.లు యాత్ర   నిర్వహించారు. లండన్‌లో 2022, మార్చి 21న మొదలైన ఈ యాత్ర దక్షిణ భారతదేశంలో కావేరీ నది దగ్గర ముగిసింది.

   మృత్తికా పరిశోధనా కేంద్రాలు    

‣ ఐసీఏఆర్‌ -  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్‌ సైన్స్, భోపాల్, మధ్యప్రదేశ్‌.

ఐఐహెచ్‌ఆర్‌-  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ రిసెర్చ్,   బెంగళూరు, కర్ణాటక

ఐసీఏఆర్‌ - సెంట్రల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైలాండ్‌ అగ్రికల్చర్, (క్రీడా), హైదరాబాదు

ఐసీఏఆర్‌ - ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్‌ అండ్‌ వాటర్‌ కన్జర్వేషన్, దేహ్రాదూన్, ఉత్తరాఖండ్‌

ఐసీఏఆర్‌ -  సెంట్రల్‌ సాయిల్‌ సెలైనిటి రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, కర్నాల్, హరియాణా

ఐసీఏఆర్‌ -  నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ సాయిల్‌ సర్వే అండ్‌ ల్యాండ్‌ యూజ్‌ ప్లానింగ్, బెంగళూరు, కర్ణాటక

డి.డబ్ల్యూ.ఆర్‌. హిస్సార్, హరియాణా

ఐ.సి.ఎ.ఆర్‌. - ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్‌ అండ్‌ వాటర్‌ కన్జర్వేషన్, ఊటీ, తమిళనాడు

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌ 

Posted Date : 08-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌