• facebook
  • whatsapp
  • telegram

ఢిల్లీ సుల్తానులు - తుగ్లక్‌ వంశం

ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌


క్రీ.శ. 1320 నుంచి 1325 వరకు రాజ్యపాలన చేశాడు. 


* ఘియాజుద్దీన్‌ మొదట అల్లాఉద్దీన్‌ కొలువులో పని చేశాడు. 


* అల్లాఉద్దీన్‌ ఇతడ్ని దీపాల్‌పూర్‌ గవర్నర్‌గా నియమించాడు. ఆ సమయంలోనే ఘియాజుద్దీన్‌ మంగోలుల దండయాత్రలను సమర్థవంతంగా అణచివేశాడు. 


* ఇతడు సుల్తాన్‌ అయ్యాక అల్లాఉద్దీన్‌ మాదిరే తన దండయాత్రలను కొనసాగించాడు. 


* 29 సార్లు మంగోలుల దాడులను ఎదుర్కొన్నాడు. ఢిల్లీకి వారి నుంచి ప్రమాదం ఉందని గ్రహించి, తుగ్లకాబాద్‌ అనే పట్టణాన్ని నిర్మించి, దాన్ని రాజధానిగా చేసుకున్నాడు. 


* ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ తపాలా విధానాన్ని పునరుద్ధరించాడు. 


* అల్లాఉద్దీన్‌ తన దక్షిణ భారతదేశ దండయాత్రల్లో భాగంగా కాకతీయ రాజైన రెండో ప్రతాపరుద్రుడ్ని ఓడించాడు. కప్పం చెల్లించాలనే షరతుపై అతడ్ని సామంతుడిగా చేసుకున్నాడు. ఘియాజుద్దీన్‌ ఢిల్లీ సుల్తాన్‌ అయ్యాక రెండో ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించడం ఆపేశాడు. దీంతో ఘియాజుద్దీన్‌ తన కుమారుడైన జునాఖాన్‌ను (మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌) కాకతీయ రాజ్యంపైకి యుద్ధానికి పంపాడు. 


* క్రీ.శ. 1323లో జునాఖాన్‌ కాకతీయ రాజ్యంపై దండెత్తి ప్రతాపరుద్రుడ్ని ఓడించాడు. 


* ప్రతాపరుద్రుడ్ని, అతడి అనుచరులను బందీలుగా తీసుకుని జునాఖాన్‌ ఢిల్లీ వస్తున్న సమయంలో మార్గమధ్యలో ప్రతాపరుద్రుడు నర్మదా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 


* జునాఖాన్‌ ఓరుగల్లు (వరంగల్‌) పేరును ‘సుల్తాన్‌పూర్‌’గా మార్చి, తన ప్రతినిధిని అక్కడ నియమించాడు. అపార సంపదను తన సొంతం చేసుకున్నాడు. 


* మార్గమధ్యలో ఒడిశా, బెంగాల్‌ మొదలైన ప్రాంతాలను జయించి, అపార ధనాన్ని దోచుకున్నాడు. 


* క్రీ.శ. 1325లో జునాఖాన్‌ తన తండ్రిని చంపించి సింహాసనాన్ని అధిష్టించినట్లు అబ్దుల్‌ మాలిక్‌ ఇసామి, అబ్ద్‌ అల్‌-ఖాదిర్‌ బదౌనీ అనే చరిత్రకారులు తమ రచనల్లో రాశారు.


మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌


క్రీ.శ. 1325 నుంచి 1351 వరకు రాజ్యపాలన చేశాడు. 


* ఇతడు విద్యావంతుడు. తుర్కీ, పారశీకంలో పండితుడు. గణిత, ఖగోళ, తర్క, వైద్య, జాతక శాస్త్రాలను అధ్యయనం చేశాడు. అనేక చర్చా వేదికల్లో పాల్గొన్నాడు.


* అయితే ఇతడి తొందరపాటు నిర్ణయాలు; ఇతరుల సలహాలు పాటించకపోవడం; ఏది మంచిదో, ఏది ఆచరించదగిందో, సాధ్యాసాధ్య విచక్షణ లేకపోవడం వల్ల ఇతడి పాలనా సంస్కరణలన్నీ విఫలమయ్యాయి.


* తుగ్లక్‌ తన వ్యక్తిత్వం కారణంగా మధ్యయుగ భారతదేశ చరిత్రలో వివాదాస్పద సుల్తాన్‌గా పేరొందాడు. 


* ఇతడి పాలనా సంస్కరణలైన రాజధాని మార్పిడి, రాగి నాణేల ముద్రణ, రెవెన్యూ విధానాలు మొదలైనవన్నీ ఆ కాలంలో వివాదాస్పదం అయ్యాయి. ఇతడి పాలనా కాలంలో ప్రజలు తీవ్ర కష్టాలకు గురయ్యారు.


* బదౌనీ అనే చరిత్రకారుడు తుగ్లక్‌ను ‘సృష్టి వైపరీత్యం’ అని పేర్కొనగా, ఇతర చరిత్రకారులు ఇతడ్ని ‘పిచ్చి సుల్తాన్‌’, ‘అసమర్థుడు’, ‘పిచ్చివాడు’, ‘విరుద్ధ గుణాలు మూర్తీభవించిన వ్యక్తి’ అని అభివర్ణించారు.


* మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ ఢిల్లీలో జహన్‌పనా అనే కోటను నిర్మించాడు. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది.


ఆశయాలు

మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌కి నాలుగు ఆశయాలు ఉండేవని బదౌనీ పేర్కొన్నాడు. అవి:


1. భూగోళంలో 4వ భాగాన్ని జయించాలి.


2. సాల్మన్‌ రాజులా పాలించాలి.


3. మొత్తం ప్రపంచం తనకు పన్నులు కట్టాలి.


4. తన ఆజ్ఞకు అందరూ బద్ధులుగా ఉండాలి.


పరిపాలనా సంస్కరణలు


తుగ్లక్‌ విశాల సామ్రాజ్యానికి సుల్తాన్‌. దీన్ని సమర్థవంతంగా పాలించాలనేది అతడి లక్ష్యం. 


* ఇతడు పర్షియా, అరబ్బీ, సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేశాడు. 


* ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించాలని భావించాడు. 


* ఢిల్లీ కోశాగారాన్ని పటిష్ఠం చేయాలని భావించి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నాడు. ఇందుకోసం భారతదేశంలోనే అత్యంత సారవంతమైన భూములుగా పేరొందిన గంగా, యమునా నదీ పరీవాహక ప్రాంతాలపై దృష్టి సారించాడు.

గంగా, యమున పరీవాహక ప్రాంతంలో 


పన్నులు పెంచడం


క్రీ.శ. 1326లో తుగ్లక్‌ ఇతర రాజ్యాలపై దండయాత్ర చేయాలని భావించాడు. దీంతోపాటు సైన్య సమీకరణకు, పాలనకు ఇతడికి ధనం అవసరమైంది. 


* అందువల్ల గంగా, యమున పరీవాహక ప్రాంతంలో వ్యవసాయం చేసే ప్రజల నుంచి అధిక పన్నులు వసూలు చేయాలని భావించాడు.


* మొదట ఆ ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నాడు. కాలువల పూడికలు తీయించాడు. నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరిచాడు. రైతులకు రుణ సౌకర్యాలు కల్పించాడు. 


* రైతులకు పంటలు బాగా పండుతాయని చెప్పి, శిస్తు కచ్చితంగా చెల్లించాలని ఆదేశించాడు. పన్ను వసూలులో కఠినంగా వ్యవహరించేవాడు. దీనికోసం వివిధ అధికారులను నియమించాడు.


* నీటిపారుదల సౌకర్యాలు కల్పించినప్పటికీ వరదల తాకిడి ఎక్కువై పండిన పంటలు కొట్టుకుపోయి రైతులు నష్టపోయారు. ఈ పరిస్థితులు తుగ్లక్‌ దృష్టికి వెళ్లలేదు. 


* వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తుగ్లక్‌ ప్రవేశపెట్టిన సంస్కరణలకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. శిస్తు వసూలు ద్వారా దాన్ని అధిగమించాలనుకున్నా లోటు పూడలేదు. 


* ఈ పరిస్థితులు రాజ్యాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయి. తర్వాత వరుసగా వచ్చిన అనావృష్టి పరిస్థితులు రాజ్యాన్ని కుంగదీశాయి. ఇవన్నీ తుగ్లక్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తికి కారణమయ్యాయి. దీని నివారణకు మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ‘దివాన్‌-ఇ-కోహి’ని (వ్యవసాయశాఖ) ఏర్పాటు చేశాడు. 


* ఇతడు కల్పించిన నీటిపారుదల సౌకర్యం వల్ల దాదాపు 60 వేల చదరపు మైళ్ల విస్తీర్ణం ఉన్న భూమి సాగులోకి వచ్చింది. 


* వీటి ఫలితంగా ఆదాయం పెరిగింది. కానీ రెవెన్యూ ఉద్యోగుల అవినీతి, లంచగొండితనం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ప్రజల్లో సుల్తాన్‌పై గౌరవం తగ్గింది.


రాజధాని మార్పిడి


క్రీ.శ.1206 నుంచి భారతదేశానికి ఢిల్లీ రాజధానిగా ఉంది. అయితే ఆ కాలంలో ఢిల్లీ కేంద్రంగా విదేశీ దండయాత్రలు జరిగాయి. ముఖ్యంగా మంగోలులు ఢిల్లీని దోచుకోవాలని అనేక దాడులు చేశారు.

* విదేశీయులకు అందుబాటులో లేని నగరం తన రాజ్యానికి రాజధానిగా ఉండాలని తుగ్లక్‌ భావించాడు. 


* అందుకే క్రీ.శ. 1327లో రాజధానిగా దేవగిరిని ఎంచుకుని దాని పేరును దౌలతాబాద్‌గా మార్చాడు. ప్రభుత్వ కార్యాలయాలు, సిబ్బందితో పాటు ఢిల్లీ ప్రజలంతా దౌలతాబాద్‌ చేరుకోవాలని ఆదేశించాడు.


* ఢిల్లీ నుంచి ప్రయాణించే సమయంలో వారికి దారి పొడవునా ఆహారం, మంచినీరు, వసతులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. 


*  అదేవిధంగా దౌలతాబాద్‌ రాజధానిగా సౌకర్యవంతంగా లేదు. అక్కడి భవనాలు, వసతి, వాతావరణం వారికి నచ్చలేదు. అక్కడ మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది.


* వేలాది మందికి నీటి సదుపాయాలు, వసతులు కల్పించడం సాధ్యపడదని తెలుసుకున్న తుగ్లక్‌ రాజధాని క్రీ.శ. 1335లో తిరిగి ఢిల్లీకి మార్చినట్లు ప్రకటించాడు. 


* దీంతో సుల్తాన్‌ తీరుపై ప్రజల్లో విసుగు, అసహనం కలిగాయి. ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. తుగ్లక్‌ చర్యలను ప్రజలు అనుమానించడం ప్రారంభించారు. 


* రాజధాని మార్పిడి వృథా ప్రయాసలకు చిహ్నంగా మిగిలిందని ‘స్టాన్లీ ఎడ్వర్డ్‌ లేన్‌ పూల్‌’ అనే చరిత్రకారుడు వ్యాఖ్యానించారు.


తిరుగుబాట్లు 


మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ దక్షిణాదిలో తన సార్వభౌమాధికారాన్ని ఏర్పాటు చేశాడు. కానీ అతడి పాలనాకాలంలో అనేక తిరుగుబాట్లు చెలరేగాయి. తుగ్లక్‌ మేనత్త కొడుకు బహాఉద్దీన్‌ గుర్షప్స్‌ (1326); కిష్లూఖాన్‌ (1327-28); జియాఉద్దీన్‌ హసన్‌షా (1335); ఫకృద్దీన్, ఐన్‌-ఉల్‌-ముల్క్‌ ముల్తానీ, కృష్ణనాయక (1343-44); కుతుబ్‌ఖాన్‌ మొదలైనవారు ఇతడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. 


* అనేక స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటయ్యాయి. సింధ్, ముల్తాన్, ఓరుగల్లు, అయోధ్య, గుల్బర్గాలు అందులో ఉన్నాయి. 


* క్రీ.శ. 1351లో గుజరాత్‌లో తిరుగుబాటు చెలరేగింది. దీనికి ధాగి నాయకత్వం వహించాడు. దాన్ని అణచివేయడానికి వెళ్లిన సుల్తాన్‌ అక్కడే అనారోగ్యంతో మరణించాడు. 


* ‘‘ఇతడి మరణ వార్త విన్న ప్రజలెవరూ చింతించలేదు. ప్రజల బాధలు అతడికి, అతడి బాధలు ప్రజలకు తప్పాయి’’ అని లేన్‌ పూల్‌ అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. 


* తుగ్లక్‌ తెలివైనవాడని, అయితే ఇతడు విజ్ఞత, వివేకం ప్రదర్శించడంలో విఫలం అయ్యాడని బదౌనీ పేర్కొన్నాడు. బదౌనీ ఇతడ్ని అరిస్టాటిల్‌తో పోల్చాడు.


 

Posted Date : 28-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌