• facebook
  • whatsapp
  • telegram

కేంద్రపాలిత ప్రాంతాలు - ప్రాంతీయ మండళ్లు

సమన్వయంతో సమర్థ పాలన!
 

దేశంలో పరిపాలన పరంగా పూర్తిగా లేదా పాక్షికంగా కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న ప్రాంతాలే కేంద్రపాలిత ప్రాంతాలు. రాష్ట్రాలతో పోలిస్తే వీటి పరిపాలన భిన్నంగా సాగుతుంది. పరిపాలనా సౌలభ్యం, రాజకీయ ప్రాధాన్యం, సాంస్కృతిక భిన్నత్వం, రక్షణ, వ్యూహాత్మక అంశాల ప్రాతిపదికన కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి. వీటి పరిణామక్రమం, క్రమానుగతంగా జరిగిన మార్పుచేర్పులు, సంబంధిత రాజ్యాంగ అంశాలతో పాటు దిల్లీకి సంబంధించి ఉన్న వివాదం గురించి పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. సహకార సమాఖ్యను బలోపేతం చేసే విధంగా చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రాంతీయ మండళ్ల స్వరూపం, పరిధి, పనితీరు గురించి తెలుసుకోవాలి.


వ్యూహాత్మక, పరిపాలనా పరమైన, చారిత్రక కారణాలతో కొన్ని ప్రాంతాలను రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంచారు. వాటినే కేంద్రపాలిత ప్రాంతాలు అంటారు. ఇవి కేంద్రం ప్రత్యక్ష నియంత్రణలో జాతీయ ప్రాముఖ్యత ఉన్న కేంద్రాలుగా పని చేస్తాయి. వీటికి రాష్ట్రాలకు ఉన్న స్వయంప్రతిపత్తి ఉండదు. 

రాష్ట్రాల్లో నిర్దిష్ట స్థానిక సమస్యలను పరిష్కరించుకోడానికి ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అభివృద్ధి, సాంస్కృతిక సంరక్షణ, వనరుల నిర్వహణ తదితర అంశాల్లో స్థానిక ప్రాతినిధ్యాన్ని అందిస్తారు.

భారత రాజకీయ పరిపాలనలో కేంద్రం అధికారాన్ని ప్రాంతీయ ప్రయోజనాలతో సమన్వయం చేయడంలో, భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించడంలో, దేశ వ్యాప్తంగా సమర్థ పాలనను అందించడంలో కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రాంతీయ మండళ్లు కీలకంగా వ్యవహరిస్తాయి. 

కేంద్రపాలిత ప్రాంతాలు:  రాజ్యాంగంలోని 8వ భాగంలో ఆర్టికల్‌ 239 నుంచి 241 మధ్య కేంద్రపాలిత ప్రాంతాల గురించి వివరణ ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8.

ఆర్టికల్‌ 239(1): కేంద్రపాలిత ప్రాంతాలన్నీ రాష్ట్రపతి పరిపాలన కింద ఉంటాయి. రాష్ట్రపతి కేంద్రపాలిత ప్రాంతాలకు పరిపాలకులను నియమించి వారి ద్వారా పరిపాలిస్తారు. కేంద్రపాలిత ప్రాంత పరిపాలనకు సంబంధించిన శాసనాన్ని పార్లమెంటు ప్రత్యేకంగా రూపొందిస్తే సంబంధిత శాసనమే చెల్లుతుంది.

ఆర్టికల్‌ 239(2): ఒక రాష్ట్ర గవర్నర్‌ను దానికి సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతానికి పరిపాలకుడిగా రాష్ట్రపతి నియమించవచ్చు. ఇలా నియమించిన గవర్నర్‌ సంబంధిత కేంద్రపాలిత ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తారు.

ఆర్టికల్‌ 239(A): కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి గురించి ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది. 14వ రాజ్యాంగ సవరణ చట్టం, 1962 ద్వారా దీన్ని రాజ్యాంగానికి చేర్చారు.

ఆర్టికల్‌ 239(A)(1): పుదుచ్చేరికి శాసనసభ, మంత్రి మండలిని ఏర్పాటు చేస్తూ పార్లమెంటు శాసనాన్ని రూపొందించవచ్చు.

ఆర్టికల్‌ 239(A)(1)(a): పుదుచ్చేరి శాసనసభలోని సభ్యులను ఓటర్లు ఎన్నుకోవచ్చు, నామినేట్‌ చేయవచ్చు.

ఆర్టికల్‌ 239(A)(1)(b): పుదుచ్చేరి శాసనసభ, మంత్రిమండలి నిర్మాణం, వాటి అధికారాలు, విధులకు సంబంధించిన అంశాలపై పార్లమెంటు శాసనం రూపొందించవచ్చు. పార్లమెంటు రూపొందించిన శాసనం ప్రకారం 1963లో పుదుచ్చేరికి శాసనసభను ఏర్పాటు చేశారు.

ఆర్టికల్‌ 239AA: కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి గురించి వివరిస్తుంది. 69వ రాజ్యాంగ సవరణ చట్టం, 1991 ద్వారా దీనిని నిర్దేశించారు. ఇది 1992 నుంచి అమల్లోకి వచ్చింది.

ఆర్టికల్‌ 239AAs(1): దిల్లీకి జాతీయ రాజధాని ప్రాంత హోదా కల్పించింది.

ఆర్టికల్‌ 239AA(2)(a): కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీకి శాసనసభను ఏర్పాటు చేశారు.

ఆర్టికల్‌ 239AA(2)(b): దిల్లీకి సంబంధించిన శాసనసభ స్థానాల సంఖ్య, నియోజకవర్గాల పునర్విభజన, శాసనసభ కార్యనిర్వహణాధికారాలు మొదలైన వాటికి సంబంధించిన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది.

ఆర్టికల్‌ 239AA(2)(c): ఆర్టికల్‌ 324 నుంచి 329 వరకు ఉన్న ఎన్నికల నిబంధనలు దిల్లీ శాసనసభ్యులకు కూడా వర్తిస్తాయి.

ఆర్టికల్‌ 239AA(3)(a): రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాజ్యాంగ పరిధికి లోబడి చట్టాలు చేసే అధికారం దిల్లీ శాసనసభకు ఉంది. అయితే రాష్ట్ర జాబితాలోని 1, 2, 18, 64, 65, 66 అంశాలకు సంబంధించిన వాటిపై శాసనాలు రూపొందించే అధికారం దిల్లీ శాసనసభకు లేదు.

ఆర్టికల్‌ 239AA(3)(b): కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన శాసనాలను రూపొందించే అంతిమ అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

ఆర్టికల్‌ 239AA(3)(c) : దిల్లీ శాసనసభ రూపొందించిన చట్టం, పార్లమెంటు రూపొందించిన చట్టం మధ్య విభేదాలు ఏర్పడితే పార్లమెంటు చట్టమే అమలవుతుంది. దిల్లీ శాసనసభ రూపొందించిన చట్టం రాష్ట్రపతి ఆమోదంతో అమల్లోకి వచ్చినప్పటికీ, దాన్ని సవరించే/రద్దు చేసే అధికారం పార్లమెంటుకి ఉంటుంది.

ఆర్టికల్‌ 239AA(4): దిల్లీ శాసనసభలోని శాసనసభ్యుల సంఖ్యలో 10% మించకుండా ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు పరిపాలనలో సహకరిస్తుంది.

* దిల్లీ పరిపాలనకు సంబంధించిన అంశాలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు, మంత్రిమండలికి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడితే సంబంధిత విషయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రాష్ట్రపతికి నివేదించి, రాష్ట్రపతి ఇచ్చిన ఆదేశాల మేరకు వ్యవహరించాలి.

ఆర్టికల్‌ 239AB: దిల్లీ జాతీయ రాజధాని ప్రాంత పరిపాలనకు అవసరమైన చర్యలను రాష్ట్రపతి చేపట్టవచ్చు. అంటే అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించవచ్చు.

సుప్రీంకోర్టు తీర్పు: లెఫ్టినెంట్‌ గవర్నర్ vs దిల్లీ ప్రభుత్వం కేసు-2018

2016లో దిల్లీ హైకోర్టు కీలక తీర్పునిస్తూ దిల్లీ పరిపాలనకు సంబంధించిన సర్వాధికారాలు లెఫ్టినెంట్‌ గవర్నర్‌కే ఉంటాయని పేర్కొంది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని అయిదు మంది సభ్యుల ధర్మాసనం 2018, జులై 4న దిల్లీ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పులోని కీలక అంశాలు- * దిల్లీ ప్రభుత్వం తన నిర్ణయాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు తెలియజేయాలి. * దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సర్వాధికారాలు ఉండవు. * దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లేదు.* దిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మధ్య అభిప్రాయభేదాలు వస్తే రాష్ట్రపతి పరిష్కరించాలి. * పరిపాలనకు సంబంధించిన రోజువారీ వ్యవహారాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం లేకుండానే దిల్లీ ప్రభుత్వం పని చేయవచ్చు. * భూమి, శాంతిభద్రతలు, పోలీస్‌ వంటి విషయాలు మినహా మిగిలిన అన్ని అంశాల్లో దిల్లీ మంత్రిమండలి సలహాను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తప్పనిసరిగా అనుసరించాలి.

సుప్రీంకోర్టు తీర్పును అధిగమించేందుకు 2021లో భారత పార్లమెంటు ఒక చట్టాన్ని రూపొందించింది. దీనిప్రకారం 1991 నాటి నేషనల్‌ కాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ దిల్లీ యాక్ట్‌ను 2021, మార్చిలో సవరించింది. దీనిప్రకారం దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు విస్తృత అధికారాలను కల్పించారు.

ఆర్టికల్‌ 239 (B): పుదుచ్చేరి పరిపాలనకు సంబంధించిన ఆర్డినెన్స్‌ జారీ చేసే విధానాన్ని వివరిస్తుంది.

ఆర్టికల్‌-239(B)(1): పుదుచ్చేరి శాసనసభ సమావేశాలు జరగకపోతే దాని ‘అడ్మినిస్ట్రేటర్‌’ ఆర్డినెన్స్‌ జారీ చేయాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి. రాష్ట్రపతి ఆమోదంతో జారీ చేసే ఆర్డినెన్స్‌కు చట్టంతో సమాన విలువ ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతం శాసనసభ సమావేశాలు ప్రారంభమైన 6 వారాల్లోపు ఆర్డినెన్స్‌ను శాసనసభ ఆమోదించాలి. లేకపోతే రద్దవుతుంది.

ఆర్టికల్‌ - 240: కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన రెగ్యులేషన్స్‌ను రాష్ట్రపతి జారీ చేయవచ్చు.

ఆర్టికల్‌ - 241: కేంద్రపాలిత ప్రాంతాలలో హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు. దీన్ని పార్లమెంట్‌ చట్టం ద్వారా నిర్దేశించవచ్చు. ఆర్టికల్‌ 214 ప్రకారం ఏర్పడిన హైకోర్టుకు ఎలాంటి అధికారాలు, విధులు ఉంటాయో ఈ హైకోర్టుకు కూడా అలాంటి అధికారాలు, విధులు ఉంటాయి.

కేంద్రపాలిత ప్రాంతాల పరిణామక్రమం: ఫజల్‌ అలీ కమిషన్‌ సిఫార్సుల మేరకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన దేశంలో 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. అవి: దిల్లీ, అండమాన్‌ - నికోబార్‌ దీవులు, లక్షదీవులు, హిమాచల్‌ ప్రదేశ్, మణిపుర్, త్రిపుర.

* 2019లో జమ్ము - కశ్మీర్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణతో దాని రాష్ట్ర హోదా రద్దయింది. జమ్ము-కశ్మీర్, లద్దాఖ్‌ల పేరుతో రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి.

* 2019లో భారత పార్లమెంట్‌ రూపొందించిన చట్టం ప్రకారం డయ్యూ డామన్, దాద్రానగర్‌ హవేలీలను విలీనం చేసి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఇది 2020, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది.

* ప్రస్తుతం మనదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య: 8 అవి 1) దిల్లీ 2) పుదుచ్చేరి 3) లక్షదీవులు 4) డయ్యూ డామన్, దాద్రానగర్‌ హవేలీ. 5) అండమాన్, నికోబార్‌ దీవులు 6) చండీగఢ్‌ 7) జమ్ము-కశ్మీర్‌  8) లద్దాఖ్‌.

* కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్రపతి ప్రతినిధులుగా వ్యవహరించే పరిపాలకులను చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్, లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పేర్కొంటారు.

* చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు: దాద్రానగర్‌ హవేలీ, డయ్యూ డామన్, లక్షదీవులు, చండీగఢ్‌.

* లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు: దిల్లీ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, పుదుచ్చేరి, జమ్ము-కశ్మీర్, లద్దాఖ్‌.

ప్రాంతీయ మండళ్లు: ఫజల్‌ అలీ కమిషన్‌ సిఫార్సుల మేరకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1956లో దేశంలో 5 ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల మండలి చట్టాన్ని రూపొందించి ‘ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి’ని ఏర్పాటు చేసింది. ఇది 1972 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం మన దేశంలోని ప్రాంతీయ మండళ్ల సంఖ్య 6. ఇవి చట్టబద్ధమైన సలహా సంస్థలు. సిక్కిం భారత్‌లో విలీనం అయినప్పుడు తూర్పు మండలిలో ఉండేది. 2002లో సిక్కింను ఈశాన్య రాష్ట్రాల మండలికి బదిలీ చేశారు.


ప్రస్తుతం దేశంలోని ప్రాంతీయ మండళ్ల - స్వరూపం:

1) ఉత్తర ప్రాంతీయ మండలి: ప్రధాన కేంద్రం దిల్లీ. దీనిలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు; దిల్లీ, చండీగఢ్, జమ్ము- కశ్మీర్, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.

2) పశ్చిమ ప్రాంతీయ మండలి: దీని ప్రధాన కేంద్రం ముంబయి. ఇందులో మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాలు; డయ్యూ డామన్, దాద్రానగర్‌ హవేలి కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.

3) దక్షిణ ప్రాంతీయ మండలి: ప్రధాన కేంద్రం చెన్నై. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు; పుదుచ్చేరి, లక్షద్వీప్‌ కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.

4) మధ్య ప్రాంతీయ మండలి: ప్రధాన కేంద్రం అలహాబాద్‌. ఇందులో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలున్నాయి.

5) తూర్పు ప్రాంతీయ మండలి: ప్రధాన కేంద్రం కోల్‌కతా. ఇందులో బిహార్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు; అండమాన్‌ నికోబార్‌ దీవులు ఉన్నాయి.

6) ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి: దీని ప్రధాన కేంద్రం గువాహటి. ఇందులో అస్సాం, మణిపుర్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్, నాగాలాండ్‌ రాష్ట్రాలున్నాయి.

* ప్రాంతీయ మండలి సమావేశాలు సంవత్సరానికి రెండు సార్లు జరగాలి. వాటికి కేంద్ర హోం మంత్రి అధ్యక్షత వహిస్తారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు సభ్యులుగా ఉంటారు.



రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 11-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌