• facebook
  • whatsapp
  • telegram

విజయనగర సామ్రాజ్యం (సామాజిక, మత పరిస్థితులు, సాహిత్యం)

సామరస్య జీవనం.. సాహితీ స్వర్ణయుగం 

దక్షిణాదిన కాకతీయుల తర్వాత సువిశాల సామ్రాజ్యాన్ని నెలకొల్పి సుదీర్ఘకాలం స్థిరంగా, సుభిక్షంగా పరిపాలించిన ఘనత విజయనగర రాజులకే దక్కుతుంది.  వీరు చివరి వరకు హైందవ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించి, సాహిత్యం, కళలను పోషించి భావితరాలకు అపూర్వ సంపదను అందించారు. వ్యవస్థాగత పాలనా పద్ధతులు, పన్నుల విధానం, కట్టుబాట్ల పరంగా ఎన్నో అంశాల్లో ఆదర్శంగా నిలిచారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించి, పరమత సహనాన్ని పాటించి ఆదర్శ పాలకులయ్యారు. నాటి సామాజిక పరిస్థితులు, ప్రజల జీవన స్థితిగతులు, మత నియమాలు, సాహిత్యానికి లభించిన విశేష ఆదరణతో పాటు సాంఘిక దురాచారాలపైనా పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. అష్టదిగ్గజ కవుల ప్రత్యేకతలు, వారి రచనలనూ తెలుసుకోవాలి.
 

మధ్యయుగంలో ఉత్తర భారతదేశాన్ని ముస్లిం రాజులు పరిపాలిస్తున్నప్పుడు, దక్షిణ భారతదేశంలో తుంగభద్ర నదికి దక్షిణ భాగంలో విజయనగర సామ్రాజ్యం ఆవిర్భవించింది. దీనినే కర్ణాటక సామ్రాజ్యంగా కూడా పిలుస్తారు. రాజధాని హంపి/విజయనగరం. 1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఇక్కడి రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక జీవనంలో పలు మార్పులు వచ్చాయి. ఆంధ్ర దేశంలో కొంత భాగం ముస్లిం పాలకుల అధికారంలోకి వెళ్లింది. మరికొంత గజపతుల హస్తగతమైంది. అధికభాగాన్ని విజయనగర రాజులు పరిపాలించారు.

సామాజిక పరిస్థితులు:

​​​​వర్ణ వ్యవస్థ: విజయనగర రాజ్యంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. దాదాపు 18 కులాలు ఉన్నాయి. బ్రాహ్మణులు. వైదికులు, నియోగులు అని రెండు రకాలుగా ఉండేవారు. వైదికులు అర్చకత్వం, వేదాధ్యయనం చేస్తే, నియోగులు రాజాస్థానంలో ఉన్నత ఉద్యోగాల్లో ఉండేవారు. క్షత్రియులు సూర్యవంశ క్షత్రియులు, చంద్రవంశ క్షత్రియులని రెండు రకాలు. సూర్యవంశ క్షత్రియులు చోళులు, గజపతులు అయితే, చంద్రవంశ క్షత్రియులు పాండ్యులు, విజయనగర రాజులు. క్షత్రియుల్లో సాధారణంగా సతీసహగమనం ఉండేది. ఈ దురాచారం గురించి తెలియజేసిన విదేశీ యాత్రికుడు ‘బార్బోస’. రాజ్యంలో మరొక ప్రముఖ కులం వైశ్య కులం. వీరిని కోమట్లు, శెట్లు అని పిలిచేవారు. వీరిలో ఆర్య వైశ్యులు శాకాహారులు, కళింగ వైశ్యులు మాంసాహారులు. వీరి ప్రధాన వృత్తి వ్యాపారం. చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రుల్లో ఉన్నత స్థానం పొందినవారు కమ్మ, రెడ్డి, వెలమ. రెడ్డి కులంలో పంట రెడ్లు, దీసటి రెడ్లు అనే రకాలు, కాపుల్లో వెలనాటి కాపులు, కమ్మనాటి కాపులు, పంట కాపులు లాంటి రకాలున్నాయి. శూద్ర కులాల వారి ప్రధాన వృత్తి వ్యవసాయం. రాజ్యానికి వెన్నెముక శూద్ర కులం. కొందరు శూద్రులను ‘అమర నాయకులు’గా నియమించేవారు. విజయనగర రాజుల కాలంలో ‘పంచాణం’ అనే 5 కులాలు ఏర్పడ్డాయి. వారు కంసాలి, కమ్మరి, కాసె, స్వర్ణకారుడు, వడ్రంగి. ఈ పంచాణం వారు దొంగ వస్తువులు కొనేవారు. వీరిపై రక్షకభటుల నిఘా ఉండేది. పంచములు అనే 6వ కులం ఉండేది. పద్మశాలీలు, కుంభలు, మాల వారి వృత్తి చేనేత. నేత పనివారిని ‘కైక్కోళ్లు’ అని పిలిచేవారు. విజయనగర సామ్రాజ్యంలో ఆంధ్రదేశ సాంఘిక వ్యవస్థలో ప్రత్యేకించి తెలంగాణాలో ముస్లింలు ఒక ప్రత్యేక తరగతిగా రూపొందారు. ముస్లింల కోసం ఆంధ్ర దేశంలో ‘లంగర్‌ ఖానాలు’ అనే సత్రాలు, మసీదులు నిర్మించారు. షేక్‌లు, సయ్యద్‌లు అనే ముస్లిం సాధువులు దేశసంచారం చేస్తూ మతబోధ చేసేవారు.  ముస్లిం మత గురువుల సమాధులైన దర్గాల వద్ద ఉరుసు పేరుతో వార్షిక ఉత్సవాలు జరిగేవి. ఇస్లాంలో సున్నీలు, షియా వర్గాలు ఉండేవి.


విజయనగర సామ్రాజ్యంలో వేశ్యా వృత్తికి గౌరవప్రదమైన స్థానం ఉండేది. వీరికి ప్రభుత్వ గుర్తింపు ఇచ్చి, పన్నులు వసూలు చేసేవారు. సంవత్సరానికి ఒక వేశ్య 12,000 పణాల పన్ను చెల్లించేది. వేశ్యా వృత్తి ద్వారా వచ్చిన మొత్తం పన్ను సైనికుల జీతాలకు సరిపోయేదని అబ్దుల్‌ రజాక్‌ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. వీరిపై విధించే పన్నును ‘గణాచారి’ పన్ను అనేవారు. వేశ్యా వృత్తి వారి గురించి సమాచారం అందించిన విదేశీయుడు డొమింగో పేస్‌. సమాజంలో స్త్రీలకు ఉన్నత స్థానం ఉండేది. వివాహాలు ఆడంబరంగా జరిగేవి. కన్యాశుల్కం, వరశుల్కం ఉండేవి. రాజకుటుంబ స్త్రీలు పరిపాలనలో జోక్యం చేసుకునేవారు. వీరికి సాహిత్యంలో ప్రావీణ్యం ఉండేది. ఆనాటి ప్రముఖ మహిళలైన తిరుమలాంబ, గంగాదేవి, తాళ్లపాక తిమ్మక్క అనేక రచనలు చేశారు. బానిస విధానం అమలులో ఉండేది. దీన్ని ‘బేనబాగ’ అనేవారు. సాధారణంగా యుద్ధ ఖైదీలను బానిసలుగా చేసి అమ్మేవారు. 


మత పరిస్థితులు: 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం ఆంధ్ర దేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. దిల్లీ సుల్తానులు, బహమనీ రాజులు పరమత ద్వేషానికి, విధ్వంసానికి ప్రసిద్ధులు. వీరి పాలనలో హిందువులు బాధలు పడ్డారు. హిందూ మత పరిరక్షణ, వైదిక ధర్మ సంస్థాపన ప్రధాన అంశాలుగా, విద్యారణ్యస్వామి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యం స్థాపితమైంది. రాజులు హిందూ మతస్థులైనప్పటికీ పరమత సహనం పాటించారు. రాజ్యంలో ముస్లింలు, క్రైస్తవులు, జైనులు ఉండేవారు. బౌద్ధమతానికి ఆదరణ లేదు. వీరి ప్రధాన దేవుడు విరూపాక్షుడు. కులగురువు క్రియాశక్తి.


శైవ మతం: విజయనగర వంశాల్లో మొదటిదైన సంగమవంశం శైవ మతాన్ని అనుసరించింది. శైవంలో స్మార్త శైవం, వీరశైవం అనే ప్రధాన శాఖలతో పాటు పాశుపతులు, కాలాముఖ శాఖవారు ఉండేవారు. కాకతీయుల కాలంలో ఆదరణ పొందిన పాశుపతానికి వీరికాలంలో ప్రాధాన్యం తగ్గింది. స్మార్త శైవానికి ప్రాధాన్యం ఉండేది. సంగమ వంశస్థులు కాలాముఖ శాఖ శైవులు. 


వైష్ణవ మతం: 14వ శతాబ్దంలో వేదాంత దేశికాచార్యులు వైదిక సంప్రదాయానికి చెందిన వైష్ణవ శాఖ అయిన ‘వడగలై’ను ఆంధ్ర దేశంలో స్థాపించారు. ఈయన కుమారుడు 8వరదాచార్యులు రేచర్ల సర్వజ్ఞ సింగభూపాలుడికి వైష్ణవ మతదీక్ష ఇచ్చాడు. దీనివల్ల తెలంగాణలో వైష్ణవం ప్రారంభమై సాళువ, తుళువ, అరవీటి వంశీకుల కాలంలో వ్యాప్తి చెందింది. మొదటగా సాళువ నరసింహరాయలు వైష్ణవ మతాన్ని ఆదరించారు. ఇతడి కాలానికి చెందినవారే తాళ్లపాక అన్నమాచార్యులు, తాతాచార్యులు. అన్నమాచార్యులు తిరుమల వేంకటేశ్వరస్వామిపై 32,000 సంకీర్తనలు రాశారు. ఈ కాలంలోనే తిరుమల వేంకటేశ్వరస్వామికి అధిక ప్రాచుర్యం లభించింది. తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయలు తన భార్యలతో కూడిన విగ్రహాలను ప్రతిష్ఠించాడు. తుళువ, అరవీటి వంశస్థులు వేంకటేశ్వరస్వామిని కులదైవంగా భావించారు. తుళువ వంశరాజులు తిరుమలలో అనేక నిర్మాణాలు చేశారు. వైష్ణవ ఆలయాల్లో పూజలు వైఖానస సంప్రదాయం ప్రకారం జరగడం ఈ కాలంలో ప్రారంభమైంది. వైష్ణవం తెంగల, వడగళ శాఖలుగా చీలింది. తెంగలశాఖకు రామానుజాచార్యులు ప్రధానప్రవక్త. వీరు తమిళ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. వడగళశాఖకు ప్రవక్త వేదాంత దేశికుడు. వీరు వైష్ణవంలో వైదిక పద్ధతులను పునరుద్ధరించారు. కొందరు రాజులు జైనమతాన్ని ఆదరించారు. రెండో దేవరాయలు జైనుల కోసం ‘పాన్‌సుపారీ’ ఆలయం నిర్మించి పార్శ్వనాథుడి విగ్రహం నెలకొల్పాడు. క్రైస్తవం కూడా ఆదరణ పొందింది.సెయింట్‌ జేవియర్‌ అనే క్యాథలిక్‌ మతాచార్యుడు అనేక మందిని క్రైస్తవ మతంలోకి మార్చాడు. క్రైస్తవాన్ని ఆదరిస్తున్నందువల్ల పోర్చుగీసు రాజు రెండో ఫిలిప్‌ విజయనగర పాలకులకు సందేశంతో కూడిన లేఖను పంపారు.


సాహిత్యం: విజయనగర రాజులు సాహిత్యం, విద్యావ్యాప్తికి కృషి చేశారు. విజయనగర సామ్రాజ్యంలో తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళ సాహిత్యాలు అభివృద్ధి చెందాయి. తెలుగు సాహిత్యానికి వీరికాలం స్వర్ణయుగం. విజయనగర పాలకులంతా తెలుగు సాహిత్యాన్ని పోషించారు. ‘ఉత్తర హరివంశం’ రచించిన నాచన సోముడిని మొదటి బుక్కరాయలు ఆదరించారు. నాచన సోముడికి ‘అష్ట భాషా మహాకవి’ అనే బిరుదు ఉంది. ఇతడికి మొదటి బుక్కరాయలు ‘పెంచికల్‌ దిన్నె’ అనే అగ్రహారం ఇచ్చారు. ఎర్రన రాసిన ‘హరివంశం’ అనే గ్రంథాన్ని నాచన సోముడు ‘ఉత్తర హరివంశం’ పేరుతో అనువదించాడు. సాళువ నరసింహరాయల ఆస్థాన కవి పిల్లలమర్రి పినవీరభద్రుడు. ఆయన రాసిన గ్రంథాలు జైమనీభారతం, శకుంతలా పరిణయం. జైమనీభారతంలో ‘వాణి నా రాణి’ అని పలికారు. నంది మల్లయ్య, ఘంట సింగన జంట కవులుగా ప్రసిద్ధి చెందారు. వీరిని సాళువ నరసింహరాయలు పోషించారు. వీరి రచనలు వరాహ పురాణం, వరలక్ష్మీ పురాణం. వరాహ పురాణాన్ని తుళువ నరసనాయకుడికి అంకితం ఇచ్చారు. సంస్కృత నాటకాన్ని తెలుగు కావ్యంగా రచించిన మొదటి కవులు వీరు. దూబగంటి నారాయణ కవి ‘పంచతంత్రం’ గ్రంథం రాసి ‘బసవరాజ’ అనే ఉదయగిరి పాలకుడికి అంకితం ఇచ్చారు. చరిగొండ ధర్మన ‘చిత్రభారతం’ అనే గ్రంథాన్ని రాశారు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో ‘ఆముక్తమాల్యద’ అనే గ్రంథం రాశారు. అష్టదిగ్గజాలుగా పిలిచే 8 మంది కవులను పోషించారు. కృష్ణదేవరాయల ఆస్థానం పేరు ‘భువనవిజయం’.
 రచయిత: గద్దె నరసింహారావు 

 

Posted Date : 26-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌