• facebook
  • whatsapp
  • telegram

విజయనగర సామ్రాజ్యం

సంప్రదాయ రాచరికంలో ప్రగతి పాలన!


దక్షిణ భారతదేశ చరిత్రలో విజయనగర యుగం మహోజ్వల ఘట్టం. సుమారు మూడు వందల ఏళ్ల పాటు కృష్ణా నదికి దక్షిణ ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించింది. ముస్లిం దాడుల నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడి, హిందూ సంస్కృతిని సంరక్షించింది. నీటిపారుదల రంగానికి సాంకేతికతను జోడించి వ్యవసాయంలో వెలుగులు నింపింది. సువిశాల సామ్రాజ్యాన్ని విభజించి వ్యవస్థాగత పాలన అందించింది. సమగ్ర పన్నుల విధానంతో ఆర్థికంగా, సైనికంగా శక్తిమంతంగా మారింది. నాటి రాజకీయ వ్యవస్థ, పరిపాలనా విధానాలు, చక్రవర్తితో పాటు ప్రజల ఆర్థిక పరిస్థితులు, ముఖ్యమైన పన్నులు, పరిశ్రమలు, స్వదేశీ, విదేశీ వాణిజ్యాల గురించి పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.


విజయనగర సామ్రాజ్యం అంటే కేవలం ఆంధ్రా ప్రాంత సామ్రాజ్యమే కాదు. దక్షిణ భారతదేశంలో భిన్న భాషా ప్రజల సముదాయం. ఇందులో ఆంధ్రులు, కన్నడికులు, తమిళులు ఉన్నారు.


పరిపాలన: విజయనగర పరిపాలన తెలుసుకోవడానికి ఆధార గ్రంథాలు ఆముక్తమాల్యద (శ్రీకృష్ణదేవరాయలు), రాయవాచకం (స్థానపతి), న్యూనిజ్సకలనీతి సమ్మతం (మడిక సింగన), పోర్చుగల్‌కు చెందిన డొమింగో పేజ్, న్యూనిజ్‌ రచనలు. వీరి పరిపాలన సంప్రదాయబద్ధ రాచరికం. సర్వాధికారి రాజు. సైనిక కేంద్రంగా పరిపాలన జరిగేది. రాజ్య రక్షణ, విస్తరణ కోసం రాజ్యాల మధ్య ఎడతెగని పోరాటాలు జరిగేవి. పరిపాలనలో రాజుకి సలహా ఇవ్వడానికి మంత్రి పరిషత్తు ఉండేది. దానికి అధ్యక్షుడు సర్వశిర (ప్రధాని). కృష్ణదేవరాయల కాలంలో ‘తిమ్మరసు’ సర్వశిరగా ఉన్నారు.  ఈ ప్రధానిని ‘సభానాయక’, ‘తంత్రనాయక’, కార్యకర్త అని పిలిచేవారు. మంత్రి పరిషత్తు సమావేశాలు తరచుగా రహస్యంగా జరిగేవి. ముఖ్యమైన వాటికి అధ్యక్షుడు - చక్రవర్తి. పరిపాలనా సౌలభ్యం కోసం రాజులు రాజ్యాన్ని విభజించారు.


రాష్ట్రం: బలమైన, ప్రధానమైన విభాగం. రాష్ట్రాలను రాజ్యాలుగా వ్యవహరించేవారు. వీటి పాలకులను రాజ్య ప్రతినిధులు లేదా దుర్గ దండనాయకులు అనేవారు. వీరు సాధారణంగా రాజకుమారులై ఉండేవారు. వీరికి నాణేలు ముద్రించే అధికారం, పన్నులు మినహాయించే అధికారం, కొత్త పన్నులు విధించే అధికారం ఉండేది. ఈ ప్రాంత అధికారులకు ఓడియ లేదా వడియార్‌ అన్న బిరుదులుండేవి. ఇలాంటి రాజ్యాలు అచ్యుతరాయల కాలంలో 17 ఉన్నట్లు శాసనాల్లో ఉంది.


సీమ: రాష్ట్రాలను సీమలుగా విభజించారు. రాజ్యంలో ముఖ్య విభాగం, స్థలాల సముదాయం. సీమ ముఖ్య అధికారి పారుపత్వంగారు. ఇతడు రెవెన్యూ విధులు నిర్వహిస్తాడు.పనిచేసే ప్రదేశాన్ని ‘చావడి’ అని పిలిచేవారు. విధి నిర్వహణలో కరణాలు అనే ఉద్యోగులు సహాయపడేవారు. ఆజ్ఞలను రాసే వ్రాయసగాండ్రు, రాజు దర్శన సమయం నిర్ణయించే ‘అవసరలు’ అనే అధికారులు ఉండేవారు.


స్థలం: కొన్ని గ్రామాల సముదాయం. ఒక్కో ‘స్థలం’లో 10 నుంచి 60 గ్రామాలుండేవి. ఈ ప్రాంతానికి పెద్దలు రెడ్డి లేదా గౌడ. స్థల కరణాలు అధికారులు. కావలిదారు శాంతిభద్రతల విధులు నిర్వహించేవారు.


గ్రామం: చివరి పరిపాలన విభాగం. గ్రామంలో ‘ఆయగాండ్రు’ అనే 12 మంది అధికారులు ఉండేవారు. వారు కరణం, రెడ్డి, తలారి, పురోహితుడు, కంసాలి, కుమ్మరి, వడ్రంగి, కాసె (ఇళ్లు కట్టేవారు), కమ్మరి, చాకలి, మంగళి, మాదిగ. వీరిలో ముఖ్యలు రెడ్డి - గ్రామ పెద్ద, కరణం - భూసంబంధ లెక్కలు చూసే అధికారి, తలారి - గ్రామ పోలీసు, పురోహితుడు - మంచి చెడులు చూసే అధికారి. వీరి పదవి సాధారణంగా వంశపారంపర్యంగా వచ్చేది. గ్రామ అధికారులకు ‘మిరాశి’ మాన్యాలు ఉండేవి. వీటినే భట్టు వృత్తి మాన్యాలు లేదా జాతికట్టు మాన్యాలు అనేవారు. ఆయగాండ్రు మిరాశి భూములపై చెల్లించే పన్ను ‘జోడి’. సామ్రాజ్యంలో అయిదు రకాల గ్రామాలుండేవి.


అమర గ్రామాలు: సైనిక వ్యయానికి కేటాయించిన ప్రత్యేకమైన రెవెన్యూ గ్రామాలు. వీటి అధికారులను అమరనాయకుడు లేదా పాలెగారు అనేవారు. సాళువ, తుళువ, ఆరవీటి వంశాలు ఇక్కడి నుంచి వచ్చినవే.


బ్రహ్మదీయ గ్రామాలు: ఇవి పండితులకు ఇచ్చిన గ్రామాలు. వీరు ప్రభువులకు శాస్త్రాలు, విద్యలు నేర్పుతారు. ఆ ప్రాంతాలను అగ్రహారాలు లేక శ్రోత్రియాలని పిలిచేవారు. వీటికి పన్నుల మినహాయింపు ఉండేది.


దేవాదాయ, మఠపుర గ్రామాలు: ఇవి మఠాధిపతులకు ఇచ్చిన గ్రామాలు. వీరు శైవవైష్ణవ ధర్మాన్ని ప్రచారం చేసేవారు. ఈ గ్రామాలపై బోడి లేదా శ్రోత్రియం అనే పన్ను విధించేవారు.


ఉబ్బిలి గ్రామాలు: రాజుకు సేవ చేసిన ఉద్యోగులు, కవులు, కళాకారులకు ఇచ్చిన గ్రామాలు.


భండారవాడ గ్రామాలు: రాజు ప్రత్యక్ష పాలనలో ఉండే గ్రామాలు. వీటి ద్వారా వచ్చే ఆదాయం రాజుకి చెందుతుంది. రాజోద్యోగులు నేరుగా నిర్వహించేవారు. ఈ గ్రామాల్లో కొన్నింటిని పన్ను వసూలుకు గుత్తకు ఇచ్చేవారు. ఇవి సాధారణంగా ‘స్థలపతి’ అధీనంలో ఉండేవి.


ఆర్థిక పరిస్థితులు: ప్రధాన వృత్తి వ్యవసాయం. ముఖ్య ఆదాయ వనరైన భూమిశిస్తుకు సంబంధించిన పత్రాలను అథువన తంత్రం అంటారు. వ్యవసాయ అభివృద్ధికి కాలువలు, చెరువులు నిర్మించారు. పెనుకొండ సమీపంలో శిరువేరు తటాకాన్ని మొదటి బుక్కరాయలు నిర్మించాడు. అనంతపురంలో నరసాంబుధి తటాకాన్ని సాళువ నరసింహరాయలు,  నాగులపురం, కంభం చెరువులను శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు. పోర్చుగీసు వారి సహాయంతో తుంగభద్ర నదిపై ఆనకట్టను కూడా ఆయనే కట్టించాడు. బుక్కరాయల ప్రతినిధి భాస్కరుడు పోరుమామిళ్ల వద్ద అనంతసాగరం చెరువు తవ్వించాడు. చెరువు మరమ్మతులకు ఇచ్చే భూమి దశబంధు మాన్యం లేదా కట్టుకోడగ. వీరికాలంలో విలాస వస్తువు వరి అన్నం.

రాజ్యంలోని భూములను రెండు తరగతులుగా విభజించారు. 

1) వ్యవసాయ యోగ్యమైన భూమి 

2) వ్యవసాయ యోగ్యం కాని భూమి.


వ్యవసాయ యోగ్యం కాని భూములపై పుల్లరి అనే స్వల్ప ఆదాయం వచ్చేది. నీటివసతి ఉన్న భూమిని నిరాంబిక (మాగాణి), నీటి వసతి లేని భూమిని కాడాంభర (మెట్ట) అని పిలిచేవారు. నిరాంబికపై  ధాన్యరూపంలో, కాడాంభరపై ధనరూపంలో పన్ను ఉండేది. నిరాంబిక భూములపై సాధారణంగా 1/2 (సంగోరు), 1/3 (ముంగోరు) వసూలు చేసేవారు. కొన్నిరకాల ఇనాము భూములపై 1/6 వంతు పన్ను వసూలు చేసేవారు. రాజుకి మరో ప్రముఖ ఆదాయం ‘శుల్కాదాయం’. ఇది వర్తకం మీద విధించే పన్ను. శ్రీరంగపట్నం వద్ద ఉన్న తామ్రశాసనం వీరి కాలం నాటి పన్నుల వ్యవస్థ గురించి వివరిస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు వివాహ పన్నును పూర్తిగా రద్దు చేశాడు. సమయసుంకం అనే కొత్త పన్ను ప్రవేశపెట్టారు. ఇది కుల కట్టుబాట్లు పాటించని వారిపై వేసే శిక్షల వల్ల వచ్చే ఆదాయం. 


ప్రతి ప్రభుత్వ శాఖ అధ్యక్షుడిని ‘సంప్రతి’ అని పిలిచేవారు. ప్రభుత్వ శాఖల సమాచారం స్థానపతి రాసిన రాయవాచకంలో ఉంది. ప్రతి శాఖలో ఒక సంప్రతి, అతడి కింద లెక్కలు రాయడానికి కరణాలు ఉండేవారు. ప్రతి శాఖ కార్యాలయం పేరు ‘రాయసం’. నాటి ప్రముఖ శాఖలు అట్టవన- రెవెన్యూ అధికారి, కందాబార- సైనిక శాఖ, పటేల్‌ - గ్రామపెద్ద, తలారి-గ్రామ పోలీసు, సుంకాధికారి - పన్నువసూలు, ప్రాడ్వివాక్కులు- న్యాయాధికారులు. భాండారశాఖ- కోశ శాఖ, ధర్మాసన- న్యాయశాఖ, బేగరి - వెట్టిచాకిరి పర్యవేక్షణ, మదనార్కుడు- అశ్వశాల ప్రధానాధికారి. రాయబారులను స్థానపతులు అనేవారు.


పరిశ్రమలు: లోహ, వస్త్ర, వజ్ర, దంత పరిశ్రమలు ప్రధానమైనవి. నూనెలు, బెల్లం తయారీ కుటీర పరిశ్రమలుగా ఉండేవి. కలంకారీ వస్త్రాలు, మస్లిన్‌ వస్త్రాలు ప్రసిద్ధి. నాటి వస్త్రపరిశ్రమ కేంద్రాలు తాటిపత్రి, ఆదోని, గుత్తి, వినుకొండ మొదలైనవి. వజ్రాల పరిశ్రమకు కర్నూలు, గుత్తి, అనంతపురం ప్రముఖ కేంద్రాలు. బంగారం, వెండి నగలు, ఇనుము, కంచు, లోహాలతో గృహోపకరణాలు తయారీకి ‘పంచాణం’ అనే లోహపరిశ్రమ ఉండేది. ఆనాటి ప్రముఖ వర్తక కేంద్రాలుగా పెనుగొండ, వినుకొండ, ఆధోని, మార్కాపురం, మంగళగిరి ఉండేవి. ప్రధాన రేవు పట్టణాలు కాలికట్, కన్ననూర్, మచిలీపట్నం, మోటుపల్లి. వీరికాలం నాటి విదేశీ వర్తకం గురించి వివరించిన విదేశీయులు బార్బోసా, అబ్దుల్‌ రజాక్‌. వర్తక సంఘాల ద్వారా విదేశీ, స్వదేశీ వ్యాపారం జరిగేది. వర్తకసంఘ అధికారిని శెట్టి/శ్రేష్ఠి అనేవారు.


ఎగుమతులు: సుగంధద్రవ్యాలు, కళంకారీ వస్త్రాలు, నూలు వస్త్రాలు, దంతపు వస్తువులు, వజ్రాలు.


దిగుమతులు: గుర్రాలు, ముత్యాలు, చైనాపట్టు పాదరసం, మందుగుండు సామగ్రి. 


నాణేలు: బంగారం - వరాహ, ప్రతాప, పణం, చిన్నం, కాట; వెండి - తార్, మాన్, ఘట్టె, పన్, పెసాడో. రాగి - జిటలు కాసులు.  అన్నిటికంటే పెద్ద నాణెం వరాహ. 


 


రచయిత: గద్దె నరసింహారావు 

Posted Date : 12-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌