• facebook
  • whatsapp
  • telegram

అలంకారాలు

అలంకారాల ప్రస్తావన మొదట రుగ్వేదంలో కనిపించింది. ‘అలం’ అనే సంస్కృత శబ్దం నుంచి పుట్టిందే అలంకారం. ‘అలం’ అంటే భూషణం అని అర్థం. కావ్యానికి భూషణం లాంటిది అలంకారం. తెలుగులో తొలి అలంకార శాస్త్ర గ్రంథం కావ్యాలంకార చూడామణి. తెలుగులో ప్రామాణికమైన అలంకార శాస్త్ర గ్రంథం కావ్యాలంకార సంగ్రహం.
అలంకారాలు రెండు రకాలు 
1) శబ్దాలంకారాలు 
2) అర్థాలంకారాలు
శబ్దాలంకారాలు: శబ్దానికి ప్రాధాన్యం ఉండేవి శబ్దాలంకారాలు. ఇవి రెండు రకాలు. 
1) అనుప్రాసాలంకారం 
2) యమకాలంకారం
అనుప్రాసాలంకారం: అనుప్రాస అంటే వచ్చిన అక్షరం లేదా పదం మళ్లీ మళ్లీ రావడం. అనుప్రాసలు నాలుగు.
1) వృత్యనుప్రాస
2) ఛేకానుప్రాస
3) లాటానుప్రాస
4) అంత్యానుప్రాస
వృత్యనుప్రాసాలంకారం: వృతి అంటే రీతి, ఆవృత్తి. ఒకే హల్లు అనేక సార్లు పునరావృతం కావడం వృత్యనుప్రాస.
ఉదా: * లక్ష్యభక్ష్యాలు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్షము లక్ష్యమా
* గంతులు వేతురు కౌతుకమున
ఛేకానుప్రాసాలంకారం: ఛేకులు అంటే అర్థం పండితులు, జంట. అర్థ భేదంతో కూడిన వ్యంజనముల జంట అవ్యవధానంగా రావడం ఛేకానుప్రాసాలంకారం.
ఉదా: * అనాథ నాథ నంద నందన నీకు వందనం
* ఓ మహిళా నీకు వంద వందనాలు
లాటానుప్రాసాలంకారం: శబ్దార్థ భేదం లేదా తాత్పర్య భేదంతో కూడిన జంట పదాలు వెంట వెంటనే వచ్చినట్లయితే దాన్ని లాటానుప్రాసాలంకారం అంటారు.
ఉదా: * హరిని భజియించు హస్తములు హస్తములు
* నరసింహుని చూడు చూడ్కులు చూడ్కులు
అంత్యానుప్రాసాలంకారం: పదం చివర లేదా పాదం చివర వచ్చిన అక్షరం లేదా పదం మళ్లీ మళ్లీ పునరావృతమవడమే అంత్యానుప్రాసాలంకారం.
ఉదా: * వేదశాఖలు వెలసెనిచ్చట
         ఆదికావ్యంబలెరె నిచ్చట
* అదిగదిగో మేడ
 మేడకున్నది గోడ
గోడ పక్కన నీడ
యమకాలంకారం: అర్థ భేదంతో కూడిన స్వర వ్యంజన సముదాయం వ్యవధానంగా లేదా అవ్యవదానంగా వచ్చినట్లయితే అది యమకం. 
ఉదా: * లేమా! ధనుజుల గెలువగ లేమా!
* ఈ తోరణము శత్రువుల తోరణమునకు సిద్ధంగా ఉన్నది.
ముక్తపదగ్రస్థాలంకారం: పాదాంతమున వదిలిన పదాన్ని తర్వాత పాదంలో గ్రహించడాన్ని ముక్తపదగ్రస్తాలంకారం అంటారు.
ఉదా: * సుదతీ నూతన మదనా
         మదనాగ తురంగ పూర్ణమనిమయ సదనా
* మనమేటికి నూతనమా
 తనమానిని ప్రేమదనకు చేర్చితిననుమా

అర్థాలంకారాలు


అర్థానికి ప్రాధాన్యం ఉండే అలంకారాలు అర్థాలంకారాలు.
1) ఉపమాలంకారం: ఉపమేయాన్ని ఉపమానంగా మనోహరమైన సాదృశ్యాన్ని వర్ణించి చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. ఇందులో ప్రధానంగా నాలుగు భాగాలు ఉంటాయి.
ఉపమేయం: దేన్ని పోలుస్తారో దాన్ని ఉపమేయం అంటారు. దీనికే వర్ణ్యం, ప్రస్తుతం, ప్రకృతం, విషయం అనే పేర్లు ఉన్నాయి.
ఉపమానం: దేనితో పోలుస్తారో దాన్ని ఉపమానం అంటారు. దీనికే అవర్ణ్యం, అప్రస్తుతం, అప్రకృతం, విషయి అనే పేర్లు ఉన్నాయి. 
సమాన ధర్మం: ఉపమేయ, ఉపమానాలు రెండింటిలో సమానంగా కనిపించే ధర్మమే సమాన ధర్మం.
ఉపమావాచకం: ఉపమానాన్ని సమానధర్మంతో కలిపే పదాన్ని ఉపమావాచకం అంటారు.
ఉదా: * వలె, పోలె, లాగా, లా, కరణి, భంగి, పగిడి, మాడ్కి, విధము, రీతి చందంబున  
* ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది
* ఓ కృష్ణా నీ కీర్తి హంసలాగా ఆకాశగంగలో మునుగుచున్నది
* శ్రీమంత్‌ చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉన్నది
* తరితీపు వెన్నెలలు విరిసి కొన్న విధాన
పై నాలుగు అంగాలు కలిసి ఉంటే దాన్ని పూర్ణోపమాలంకారం అని, ఏదైనా ఒక అంగం లోపిస్తే దాన్ని లుప్తోమాలంకారం అంటారు.
2) ఉత్ప్రేక్షాలంకారం: ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్షాలంకారం అంటారు.
ఉదా: * ఆ ఏనుగు నడిచే కొండయా అన్నట్లున్నది
* ఆమె ముఖం చంద్రబింబం కాబోలు
* మండే ఎండ నిప్పుల కొలిమా అన్నట్లున్నది
* అతడి ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహమేమోనని భయపడ్డాను
ఈ అలంకారంలో ఊహను తెలిపే పదాలు సాధారణంగా ఉంటాయి. అవి అన్నట్లు, కాబోలు, ననగా, ఏమో, ఓహో, తలచెదన్, భావించెదన్, ఊహించెదన్‌ లాంటివి.
3) రూపకాలంకారం: ఉపమేయానికి ఉపమానంతో అభేదాన్ని లేదా తాద్రూప్యమును వర్ణించి చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు.
ఉదా: * విద్యాధనమును దొంగలు దొంగలింపలేరు
* లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి
* అభినుతేందు చంద్రికాంబోధి యఖిలంబు నీట నిట్టలముగ నిట్ట వొడిచె
* వారి మనసు అప్పుడే తీసిన వెన్నలాంటిది
* లేగను దగ్గరకు తీసుకొని ముద్దుల వర్షం కురిపించాడు
4) అతిశయోక్తి అలంకారం: గోరంతలను కొండంతలు చేసి వర్ణించడాన్ని అతిశయోక్తి అంటారు.
ఉదా: మా ఊరిలో సముద్రమంత చెరువు ఉంది.
5) స్వభావోక్తి అలంకారం: జాతి, గుణ క్రియలతో స్వభావ సిద్ధంగా వర్ణించి చెప్పడాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. దీన్నే జాత్యలంకారం అని కూడా అంటారు.
ఉదా: * జింకలు బిత్తరచూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి.
* అనుచున్‌ జేవురు మీరు కన్నుగతో నాస్పందితోష్ఠంబుతో 
6) అర్థాంతరన్యాసాలంకారం: సామాన్యాన్ని విశేషంతో లేదా విశేషాన్ని సామాన్యంతో సమర్థించి చెప్పడాన్ని అర్థాంతరన్యాసాలంకారం అంటారు.
ఉదా: * హనుమంతుడు సముద్రాన్ని దాటెను అనేది సామాన్యం 
మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా! అనేది విశేషం 
* శివాజీ బీజాపూరు కోటను జయించాడు
 వీరులకు సాధ్యం కానిది లేదు కదా!
7) దృష్టాంతాలంకారం: వాక్యాలకు బింబ ప్రతిబింబ భావాన్ని వర్ణించి చెప్పడాన్ని దృష్టాంతాలంకారం అంటారు.
భాస్కర శతకం దృష్టాంతాలంకారంలో ఉంటుంది.
ఉదా: ఓ రాజా నీవే కీర్తిమంతుడవు చంద్రుడే కాంతిమంతుడు.
8) శ్లేషాలంకారం: అనేక అర్థాలు వచ్చేలా వాక్యాల్లో శబ్దాలను కూర్చడం.
ఉదా: బీ మిమ్ము మాధవుడు రక్షించు గాక!
వివరణ: * మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించు గాక
మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించు గాక
* రాజు కువలయానందకరుడు (రాజు = ప్రభువు, చంద్రుడు; కువలయము = భూమి, కలువ)
* నీవేల వచ్చెదవు
9) నిందాస్తుతి అలంకారం: నింద చేత స్తుతి తోచునట్లు చెప్పే అలంకారాన్ని నిందాస్తుతి అలంకారం అంటారు.
ఉదా: ఓ గంగా! పాపాత్ములను కూడా పావనము చేయుచున్నావు, నీకు వివేకమెక్కడిది.
10) దీపకాలంకారం: ప్రకృతాప్రకృతములకు ధర్మసామ్యం చెప్పడాన్ని దీపకాలంకారం అంటారు.
ఉదా: ఓ రాజా! నీవే కీర్తిమంతుడవు చంద్రుడే కాంతిమంతుడు.
11) సమాసోక్తి అలంకారం: ప్రస్తుత వస్తువును వర్ణిస్తున్నప్పుడు అప్రస్తుతం స్ఫురిస్తే దాన్ని సమాసోక్తి అలంకారమంటారు.
ఉదా: చంద్రుని తప్ప వేరొకని చకోర పక్షే పక్షుల్లో శ్రేష్ఠమైంది.


రచయిత: సూరె శ్రీనివాసులు

Posted Date : 04-02-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌