• facebook
  • whatsapp
  • telegram

ఆంగ్లో-మరాఠా యుద్ధాలు

బ్రిటిష్, మరాఠాల మధ్య 18వ శతాబ్దం చివరి నుంచి 19వ శతాబ్దం ప్రారంభం మధ్య మూడు ఆంగ్లో-మరాఠా యుద్ధాలు జరిగాయి. వీటినే మరాఠా యుద్ధాలు అని కూడా అంటారు. వీటిలో బ్రిటిష్‌ వారి చేతిలో మరాఠాలు ఓడిపోయారు. దీంతో పశ్చిమ భారతదేశం పూర్తిగా ఆంగ్లేయుల ఆధిపత్యంలోకి వెళ్లింది.

పశ్చిమ భారతదేశం పత్తికి ప్రసిద్ధి. దీన్నే ఈస్టిండియా కంపెనీ బ్రిటన్‌కు ఎగుమతి చేసేది. ఆ ప్రాంతంలో పండిన పత్తిని పూర్తిగా తమ స్వాధీనం చేసుకోవాలని  ఆంగ్లేయులు భావించారు. అందుకోసం మరాఠా రాజ్యంలోని బొంబాయిపై పట్టు సాధించాలనుకున్నారు. మరాఠా నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను ఉపయోగించుకుని వీరు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు.

మరాఠా సమాఖ్యలో అయిదు ప్రధాన రాజవంశాలున్నాయి. అవి: పుణెలో పీష్వాలు, బరోడాలో గైక్వాడ్‌లు, ఇండోర్‌లో హోల్కర్లు, గ్వాలియర్‌లో సింధియాలు, నాగ్‌పుర్‌లో భోంస్లేలు. వీరి మధ్య అంతర్గత కుమ్ములాటలు జరిగేవి.

మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం (క్రీ.శ 1775-82)

* క్రీ.శ. 1772లో మాధవరావ్‌ పీష్వా మరణించాక, అతడి సోదరుడైన నారాయణరావు మరాఠా సామ్రాజ్య పీష్వా అయ్యాడు. కొన్నాళ్లకే అతడు మరణించాడు. తర్వాత రఘునాథరావు (నారాయణరావు భార్య సోదరుడు) పీష్వా అయ్యాడు. అతడు చట్టబద్ధమైన వారసుడు కాదు.

* నారాయణరావు మరణించేనాటికి అతడి భార్య గర్భవతి. ఆమె ఒక కొడుక్కు జన్మనిచ్చింది. ఆ శిశువు పేరు సవాయి మాధవరావు. అతడే చట్టబద్ధమైన పీష్వా. 

* నానా ఫడ్నవిస్‌ నాయకత్వంలోని 12 మంది మరాఠా నాయకులు ఆ శిశువును తమ పీష్వాగా ప్రకటించి, అతడి కింద వివిధ రాజప్రతినిధులను నియమించారు.

* రఘునాథరావు, మాధవరావు మధ్య సింహాసనం కోసం వివాదం చెలరేగింది.

* బ్రిటిష్‌ వారి సహాయం కోరిన రఘునాథరావు బాంబే ప్రభుత్వంతో 1775, మార్చి 7న సూరత్‌ ఒప్పందంపై సంతకం చేశాడు. దీని ప్రకారం మరాఠా రాజ్యంలోని సల్సేట్, బస్సేన్‌ భూభాగాలను; సూరత్, బ్రోచ్‌ జిల్లాల నుంచి వచ్చే ఆదాయంలో కొంతభాగాన్ని బ్రిటిష్‌ వారికి ఇవ్వాలి. దీనికి ప్రతిగా రఘునాథరావుకు ఆంగ్లేయులు 2,500 మంది సైనికులను అందించాలి.

* నానా ఫడ్నవిస్‌ కూడా బ్రిటిష్‌ వారి సాయం కోసం కలకత్తా బ్రిటిష్‌ కౌన్సిల్‌కు వెళ్లాడు. బొంబాయి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసిన కౌన్సిల్, 1776, మార్చి 1న ఫడ్నవిస్‌తో పురంధర్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం సూరత్‌ సంధి రద్దయ్యింది. సల్సేట్, బ్రోచ్‌ జిల్లాల నుంచి వచ్చే ఆదాయంలో కొంతభాగంతో పాటు, రూ.12,00,000లను కలకత్తా బ్రిటిష్‌ కౌన్సిల్‌కు ఇచ్చారు.

* బొంబాయి ప్రభుత్వం పురంధర్‌ ఒప్పందాన్ని బేఖాతరు చేసి, రఘునాథరావుకు రక్షణ కల్పించింది. నానా ఫడ్నవిస్‌ కూడా ఆ ఒప్పందానికి వ్యతిరేకంగా పశ్చిమ తీరంలో ఒక నౌకాశ్రయాన్ని ఫ్రెంచ్‌ వారికి అప్పగించాడు. దీంతో బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ వారన్‌ హేస్టింగ్స్‌ భారతదేశంలోని అన్ని ఫ్రెంచ్‌ నౌకాశ్రయాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించాడు. ఈ పరిణామమే మొదటి మరాఠా యుద్ధానికి కారణమైంది.

* బొంబాయి ప్రభుత్వం కాక్‌బర్న్‌ నాయకత్వంలో మరాఠాలతో యుద్ధం చేసింది. దీన్నే తెల్గావ్‌ యుద్ధం అంటారు. ఇది 1779, జనవరి 9న జరిగింది. ఇందులో  ఓడిపోయిన బ్రిటిష్‌ వారు, వడ్గావ్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం పురంధర్‌ సంధి ద్వారా పొందిన అన్ని ప్రయోజనాలను వారు వదులుకోవాలి. 

* బెంగాల్‌ బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ వారన్‌ హేస్టింగ్స్‌ ఈ ఒప్పందాన్ని తిరస్కరించి, కల్నల్‌ గొడ్డార్డ్‌ ఆధ్వర్యంలో భారీ సైన్యాన్ని భారతదేశం అంతటా మోహరించాడు.

* గొడ్డార్డ్‌ 1780, ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌ను, డిసెంబరులో బస్సేన్‌ను స్వాధీనం చేసుకున్నాడు.

* 1780లో కెప్టెన్‌ పోఫాం నేతృత్వంలోని మరొక బెంగాల్‌ బ్రిటిష్‌ దళం గ్వాలియర్‌ను స్వాధీనం చేసుకుంది. 1781, ఫిబ్రవరి 16న పోఫాం మహదాజీ సింధియాను ఓడించాడు.

* సింధియా మధ్యవర్తిత్వం ద్వారా 1782, మే 17న మరాఠాలు, ఆంగ్లేయుల మధ్య సాల్బే సంధి కుదిరి, యుద్ధం ముగిసింది.

* దీని ప్రకారం ఆంగ్లేయులు బస్సేన్, ఇతర భూభాగాలను వదులుకున్నారు. సల్సేట్‌ భూభాగాలు బ్రిటిష్‌ వారికి లభించాయి.

* మరాఠా పీష్వాగా మాధవరావును నియమించారు. రఘునాథరావుకు పింఛన్‌ను మంజూరు చేశారు. హైదర్‌ అలీకి వ్యతిరేకంగా బ్రిటిష్‌ వారికి సాయం చేసేందుకు పీష్వా అంగీకరించాడు.

రెండో ఆంగ్లో-మరాఠా యుద్దం (క్రీ.శ.1803-06)  

* ఆంగ్లేయులు క్రీ.శ.1799లో టిప్పు సుల్తాన్‌ను ఓడించి, మైసూర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరాఠా సామ్రాజ్యం మినహా మిగిలిన భారత భూభాగం అంతా బ్రిటిష్‌ వారి ఆధీనంలోకి వచ్చింది.

* 1800, మార్చి 13న నానా ఫడ్నవిస్‌ మరణించాక మరాఠాల మధ్య అనైక్యత, అంతర్గత విభేదాలు పెరిగాయి.

* మాధవరావు II మరణంతో బాజీరావ్‌ II (రఘునాథరావు కొడుకు) పీష్వా అయ్యాడు.

* 1802లో జరిగిన పుణె యుద్ధంలో ఇండోర్‌ హోల్కర్ల అధిపతి యశ్వంతరావు హోల్కర్‌ పీష్వాలు, సింధియాలను ఓడించాడు.

* యుద్ధంలో ఓడిపోయిన పీష్వా బాజీరావ్‌ II, సాయం కోసం అప్పటి బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వెల్లస్లీ దగ్గరకు వెళ్లాడు. బాజీరావ్‌ సబ్సిడరీ అలయెన్స్‌కు (సైన్య సహకార పద్ధతి) ఒప్పుకుని 1802, డిసెంబరు 31న బస్సేన్‌ ఒప్పందంపై సంతకం చేశాడు. దీని ప్రకారం అతడు బ్రిటిష్‌ వారికి తన రాజ్య భూభాగాన్ని అప్పగించి, అక్కడ వారి సైన్యాన్ని నిర్వహించాలి.

* సింధియాలు, భోంస్లేలు ఈ ఒప్పందాన్ని అంగీకరించలేదు. ఇదే రెండో ఆంగ్లో-మరాఠా యుద్ధానికి కారణమైంది.

* హోల్కర్లు కూడా బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు.

* ఈ యుద్ధాల్లో మరాఠా సేనలన్నీ బ్రిటిష్‌ వారి చేతిలో ఓడిపోయాయి. 

* నాగ్‌పుర్‌ పాలకుడైన రఘుజీ భోంస్లే II 1803, డిసెంబరు 17న బ్రిటిష్‌ వారితో డియోగావ్‌ ఒప్పందం చేసుకున్నాడు. దీని ప్రకారం ఆంగ్లేయులు కటక్, బాలాసోర్, వార్దా నదికి పశ్చిమాన ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.

* సింధియాలు 1803, డిసెంబరు 30న సుర్జీ-అంజ్‌గావ్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ద్వారా బ్రిటిష్‌ వారికి రోహ్‌తక్, గంగా-యమునా దోబ్, గురుగ్రామ్, ఢిల్లీ, ఆగ్రా, బ్రోచ్, గుజరాత్‌లోని కొన్ని జిల్లాలు, బుందేల్‌ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలు, అహ్మద్‌నగర్‌ కోట ప్రాంతాలు దక్కాయి.

* హోల్కర్లు 1805లో రాజ్‌ఘాట్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం వారు బ్రిటిష్‌ వారికి టోంక్, బుండి, రాంపురాలను అప్పగించారు.

మూడో ఆంగ్లో-మరాఠా యుద్ధం (క్రీ.శ. 1817-18)

* రెండో ఆంగ్లో-మరాఠా యుద్ధం తర్వాత మరాఠా రాజులపై బ్రిటిష్‌ వారి నియంత్రణ అధికమైంది. మరాఠాలు తాము కోల్పోయిన భూభాగాలను, ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవాలని భావించారు.

* అప్పటి బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ హేస్టింగ్స్‌.

* ఆ సమయంలో పిండారీలు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. వీరికి మరాఠాల సహకారం ఉందని ఆంగ్లేయులు భావించారు. ఇదే మూడో  ఆంగ్లో-మరాఠా యుద్ధానికి ప్రధాన కారణంగా నిలిచింది. దీన్నే పిండారీ యుద్ధం అని కూడా అంటారు.

* మరాఠా రాజులు పీష్వా బాజీరావ్‌ II, మల్హర్‌రావ్‌ హోల్కర్, ముధోజీ II భోంస్లే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడ్డారు. 

* మరో మరాఠా పాలకుడైన దౌలత్‌రావ్‌ షిండే కూటమిలో కలవకుండా బ్రిటిష్‌ వారికి మద్దతిచ్చాడు. షిండే, బ్రిటిష్‌ వారి మధ్య 1817లో గ్వాలియర్‌ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం షిండే రాజస్థాన్‌ను ఆంగ్లేయులకు అప్పగించాడు. 

* 1818లో బ్రిటిష్‌ వారికి, మల్హర్‌రావ్‌ హోల్కర్‌కు మధ్య మందాసోర్‌ ఒప్పందం జరిగింది. 

* ఖడ్కి, కోరెగావ్‌ యుద్ధాల్లో పీష్వా బాజీరావ్‌ II ఓడిపోయి, 1818లో బ్రిటిష్‌ వారికి లొంగిపోయాడు. ఆంగ్లేయులు అతడ్ని కాన్పూర్‌ సమీపంలోని బితూర్‌కు పంపి, రూ.8,00,000 పెన్షన్‌ ఇచ్చారు. బాజీరావ్‌ ఆధీనంలోని అనేక ప్రాంతాలు బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమయ్యాయి.

* బాజీరావ్‌ దత్తపుత్రుడు నానా సాహెబ్‌ 1857లో కాన్పూర్‌లో జరిగిన తిరుబాటుకు నాయకత్వం వహించినవారిలో ఒకడు.

* సితాబుల్దీ యుద్ధంలో భోంస్లే, మహిద్‌పూర్‌ యుద్ధంలో హోల్కర్‌ ఓడిపోయారు. నాగ్‌పుర్‌ చుట్టుపక్కలా భోంస్లే ఆధీనంలో ఉన్న ఉత్తర ప్రాంతం, బుందేల్‌ ఖండ్‌లో పీష్వా భూభాగాలతో సహా సౌగోర్, నెరబుద్ధా ప్రాంతాలన్నీ బ్రిటిష్‌ ఇండియాలో భాగమయ్యాయి.

* పిండారీల నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు బ్రిటిష్‌ ఇండియా ఆధీనంలో సెంట్రల్‌ ప్రావిన్సులుగా మారాయి.

* ఈ యుద్ధం మరాఠా సామ్రాజ్య అంతానికి దారితీసింది.

* బ్రిటిష్‌ వారు పోరాడి గెలిచిన ప్రధాన యుద్ధాల్లో ఇది ఒకటి. దీని వల్ల పంజాబ్, సింధ్‌ మినహా మిగిలిన భారత భూభాగంలోని చాలా ప్రాంతాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బ్రిటిష్‌ వారి ఆధీనంలోకి వచ్చాయి.

Posted Date : 30-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌