• facebook
  • whatsapp
  • telegram

ఆంగ్లో - మైసూర్‌ యుద్ధాలు

ఆంగ్లో - మైసూర్‌ యుద్ధాలు (క్రీ.శ. 1767-1799)

* విజయనగర సామ్రాజ్యం క్షీణించాక మైసూర్‌ స్వతంత్ర రాజ్యంగా మారింది.

* వడయార్‌ వంశానికి చెందిన వారు ఈ ప్రాంతాన్ని పాలించారు. 

* క్రీ.శ. 1399లో యదురాయ వడయార్‌ మైసూర్‌ రాజ్యాన్ని స్థాపించాడు.

* మైసూర్‌ రాజధాని శ్రీరంగపట్నం.

* క్రీ.శ. 1761 నాటికి ఈ మైసూర్‌ సామ్రాజ్యం హైదర్‌ అలీ ఆధీనంలోకి వచ్చింది.

హైదర్‌ అలీ (క్రీ.శ. 1722 - 82)

* ఇతడి అసలు పేరు హైదర్‌ నాయక్‌. తండ్రి ఫతే ముహమ్మద్‌- మైసూర్‌ సైన్య ఫౌజ్‌దార్‌ (జనరల్‌). హైదర్‌ అలీ కోలార్‌ జిల్లాలోని బుదికోట్‌లో జన్మించాడు.

* ఇతడు క్రీ.శ. 1755లో దిండిగల్‌ ఫౌజ్‌దార్‌ అయ్యాడు.

* హైదర్‌ తన సైన్యాన్ని ఫ్రెంచ్‌ సేనల సహకారంతో బలోపేతం చేశాడు.

* ఫ్రెంచ్‌ వారి సాయంతో దిండిగల్‌లో ఆయుధ కర్మాగారాన్ని స్థాపించాడు.

* ఇతడు అనేక యుద్ధాల్లో పాల్గొని, విజయాల్లో కీలక పాత్ర పోషించి మైసూర్‌ పాలకుల దృష్టిని ఆకర్షించాడు. 

* ఇతడు క్రీ.శ. 1759 నాటికి పూర్తి మైసూర్‌ సేనలకు నాయకత్వం వహించాడు.

* ఐరోపా వారు అనుసరించే సైనిక విధానాలను హైదర్‌ అలీ ఆచరించి, తన సైన్యాన్ని వ్యవస్థీకరించాడు.

* ఇతడు మైసూర్‌ రాజ్య సరిహద్దులను మరాఠా సామ్రాజ్యం, హైదరాబాద్‌ వరకు విస్తరింపజేశాడు.

* బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ సైనిక విస్తరణను సమర్థవంతంగా ఎదుర్కొన్న కొద్దిమంది స్థానిక పాలకుల్లో హైదర్‌ అలీ ఒకడు.

* ఇతడికి సుల్తాన్‌ హైదర్‌ అలీ ఖాన్, హైదర్‌ అలీ సాహెబ్‌ అనే బిరుదులున్నాయి.

* రాకెట్‌ ఆర్టిలరీ (ఫిరంగి)లను అభివృద్ధి చేసి, యుద్ధాల్లో వాటిని ఉపయోగించాడు.

* రెండో కర్ణాటక యుద్ధ సమయంలో శ్రీరంగపట్నం యుద్ధం, గోల్డెన్‌రాక్‌ యుద్ధం, షుగర్‌-లోఫ్‌ రాక్‌ యుద్ధం, టోడ్‌ మాన్‌ ఉడ్స్‌ యుద్ధాల్లో క్రియాశీలంగా పాల్గొన్నాడు.

* ఇతడు మూడో కర్ణాటక యుద్ధ సమయంలో త్రివాడి యుద్ధం, పాండిచ్చేరి యుద్ధాల్లో చురుగ్గా వ్యవహరించాడు.

* హైదర్‌ అలీ మైసూర్‌ రాజయ్యాక రాజధాని పేరును హైదర్‌నగర్‌గా మార్చాడు.

మొదటి ఆంగ్లో-మైసూర్‌ యుద్ధం (క్రీ.శ. 1767 - 69) 

* హైదర్‌ అలీ ఫ్రెంచ్‌ వారి సహకారంతో బళ్లారి, గుత్తి, కడప, కూర్గ్, మలబార్, సెరాలను జయించాడు.

* ఇతడ్ని నిలువరించేందుకు హైదరాబాద్‌ నిజాం, మరాఠాలు, ఆంగ్లేయులు కూటమిగా ఏర్పడి, యుద్ధం ప్రకటించారు.

* 1767, సెప్టెంబరు 25న ట్రింకోమలై యుద్ధం జరిగింది. బ్రిటిష్‌ కమాండర్‌ కల్నల్‌ జోసెఫ్‌ స్మిత్‌ చేతిలో హైదర్‌ అలీ ఓడిపోయాడు.

* చంగామ యుద్ధం 1767, సెప్టెంబరు 3న జరిగింది.

* మొదటి ఆంగ్లో-మైసూర్‌ యుద్ధంలో బ్రిటిష్‌ వారు ఓడిపోయారు.

* 1769, ఏప్రిల్‌ 4న మద్రాస్‌ ఒప్పందంతో ఈ యుద్ధం ముగిసింది.

* రెండు పక్షాలు పరస్పరం ఆక్రమించుకున్న భూభాగాలను పునరుద్ధరించడానికి, మూడో పక్షం దాడి చేసినప్పుడు పరస్పరం సహకరించుకునేలా ఒప్పందం కుదిరింది.

రెండో ఆంగ్లో-మైసూర్‌ యుద్ధం (క్రీ.శ. 1780 - 84) 

* 1771లో మరాఠాలు హైదర్‌ అలీపై దాడి చేశారు. మద్రాస్‌ ఒప్పందం ప్రకారం ఆంగ్లేయులు ఇతడికి సహాయం చేయలేదు. దీంతో హైదర్‌ అలీ బ్రిటిష్‌ వారిని నమ్మలేదు.

* హైదర్‌ అలీ ఆధీనంలో ఉన్న మహే ప్రాంతాన్ని ఫ్రెంచ్‌ వారు తమ చేతుల్లోకి తీసుకున్నారు. దాన్ని ఆక్రమించేందుకు బ్రిటిష్‌ వారు ప్రయత్నించగా, హైదర్‌ అలీ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించాడు.

* 1780, సెప్టెంబరులో బ్రిటిష్, మైసూర్‌ సేనల మధ్య పొల్లిలూర్‌ యుద్ధం జరిగింది. ఇందులో బ్రిటిష్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ విలియం బైలీని హైదర్‌ అలీ కొడుకైన టిప్పు సుల్తాన్‌ ఓడించాడు.

* బ్రిటిష్‌ వారితో జరిగిన యుద్ధాల్లో హైదర్‌ అలీ ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఓడిపోతూ వచ్చాడు. 

* పోర్టో నోవో, పొల్లిలూర్, షోలింగూర్‌ యుద్ధాల్లో బ్రిటిష్‌ లెఫ్ట్టినెంట్‌ జనరల్‌ సర్‌ ఐర్‌ కూట్‌ చేతిలో హైదర్‌ అలీ ఓడిపోయాడు.

* 1782, డిసెంబరు 7న హైదర్‌ అలీ క్యాన్సర్‌ కారణంగా మరణించాడు. అతడి తర్వాత టిప్పు సుల్తాన్‌ యుద్ధాలను కొనసాగించాడు.

* 1782, ఫిబ్రవరిలో కుంభకోణం వద్ద జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్‌ బ్రిటిష్‌ సైన్యాధ్యక్షుడు బ్రైత్‌ వైట్‌ను ఓడించాడు.

* బ్రిటిష్‌ వారు హనోవర్, బెదనూర్, మంగళూరు, దిండిగల్, కోయంబత్తూర్, పాల్‌ఘాట్‌లను ఆక్రమించుకున్నారు.

* మద్రాస్‌ కొత్త బ్రిటిష్‌ గవర్నర్‌గా మెక్‌కార్టే నియమితుడయ్యాడు.

* 1784, మార్చి 11న జరిగిన మంగళూరు ఒప్పందం ద్వారా రెండో ఆంగ్లో-మైసూర్‌ యుద్ధం ముగిసింది. 

* ఈ ఒప్పందం ప్రకారం, రెండు వైపులా పరస్పరం స్వాధీనం చేసుకున్న భూభాగాలను పునరుద్ధరించి, యుద్ధ ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకరించారు.

మూడో ఆంగ్లో-మైసూర్‌ యుద్ధం (క్రీ.శ. 1790 - 92) 

* బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కారన్‌ వాలీస్‌ కారణంగా మరాఠాలు, నిజాం, ట్రావెన్‌కోర్, కూర్గ్‌ పాలకులు టిప్పు సుల్తాన్‌కు వ్యతిరేకమయ్యారు.

* 1789, డిసెంబరు 29న టిప్పు ట్రావెన్‌కోర్‌పై దాడి చేశాడు. ట్రావెన్‌కోర్‌ బ్రిటిష్‌ వారితో పొత్తులో ఉంది.

* టిప్పు సుల్తాన్‌కు వ్యతిరేకంగా బ్రిటిష్‌ వారు, మరాఠా - నిజాం పాలకులు కూటమిగా ఏర్పడ్డారు. ఇది మూడో ఆంగ్లో-మైసూర్‌ యుద్ధానికి దారి తీసింది.

* ఈ యుద్ధంలో టిప్పు ఓడిపోయాడు.

* టిప్పు సుల్తాన్‌ 1792, మార్చిలో శ్రీరంగపట్నం ఒడంబడికపై సంతకాలు చేశాడు.

* ఈ ఒప్పందం ప్రకారం, టిప్పు తన భూభాగంలో సగభాగాన్ని (మలబార్, కూర్గ్, దిండిగల్, బారామహల్‌) వదులుకున్నాడు. ఆ భూమిని ఆంగ్లేయులు, మరాఠాలు, నిజాం విభజించి, పంచుకున్నారు.

* టిప్పు యుద్ధ నష్టపరిహారం కింద రూ.3.5 కోట్లు చెల్లించాడు.


నాలుగో ఆంగ్లో- మైసూర్‌ యుద్ధం (క్రీ.శ. 1798 - 99)

* టిప్పు తన నష్టాలను తగ్గించుకుని, కోటను బలోపేతం చేయడానికి ప్రయత్నించాడు.

* ముస్లిం ప్రజలు తనకు సాయం చేయాలని కోరాడు. అందుకోసం అరేబియా, కాన్‌స్టాంటినోపుల్, కాబూల్‌కు తన తరపున రాయబారులను పంపాడు. వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు.

* ఆ సమయంలో బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్న లార్డ్‌ వెల్లస్లీ ‘సబ్సిడరీ అలయన్స్‌ (సైన్య సహకార పద్ధతి)’ను ప్రవేశపెట్టి, కూటమి ఒప్పందాన్ని అంగీకరించాలని  టిప్పు సుల్తాన్‌ను కోరాడు. 

* దీన్ని టిప్పు వ్యతిరేకించాడు. దీంతో నాలుగో ఆంగ్లో-మైసూర్‌ యుద్ధం ప్రారంభమైంది.

* జనరల్‌ స్టువర్ట్‌ నేతృత్వంలోని బొంబాయి సైన్యం పశ్చిమం నుంచి మైసూర్‌పై దాడి చేసింది. 

* లార్డ్‌ వెల్లస్లీ సోదరుడైన ఆర్థర్‌ వెల్లస్లీ నేతృత్వంలోని మద్రాస్‌ సైన్యం శ్రీరంగపట్నంపై దండెత్తింది.

* 1799, మార్చి 5న సిద్ధేశ్వర్‌ యుద్ధం; 1799, మార్చి 27న మాలవెల్లీ యుద్ధం జరిగాయి. 

* శ్రీరంగపట్నంలో టిప్పు ఓడిపోయి, బ్రిటిష్‌ వారి చేతిలో మరణించాడు.

* మైసూర్, శ్రీరంగపట్నంలను బ్రిటిష్‌ వారు పునరుద్ధరించి మళ్లీ వడయార్‌ రాజవంశానికి చెందిన కృష్ణరాజ వడయార్‌  IIIకి అప్పగించి, అతడ్ని రాజుగా ప్రకటించారు.

* అతడు సబ్సిడీ అలయన్స్‌పై సంతకం చేశాడు. కృష్ణరాజకు మైసూర్‌ మధ్యభాగాన్నే అప్పగించారు. మిగిలిన ప్రాంతాన్ని బ్రిటిష్‌ వారు, నిజాం విభజించి పంచుకున్నారు.


టిప్పు సుల్తాన్‌ (క్రీ.శ.1750-99) 

* పూర్తి పేరు సుల్తాన్‌ ఫతే అలీ టిప్పు. తల్లిదండ్రులు ఫాతిమా, హైదర్‌ అలీ.

* 1750, నవంబరు 20న దేవనహళ్లిలో జన్మించాడు. 1799, మే 4న శ్రీరంగపట్నంలో మరణించాడు.

* శృంగేరీ శారదా ఆలయానికి  విలువైన ఆభరణాలను విరాళంగా ఇచ్చాడు. 

* శంకరాచార్యులను జగద్గురువు అని పేర్కొన్నాడు.

* ఫ్రెంచ్‌ వారి కోరిక మేరకు మైసూర్‌లో మొదటి చర్చిని నిర్మించాడు.

* కొత్త క్యాలెండర్‌ను; ఏకరీతి బరువులు, కొలతలను ప్రవేశపెట్టాడు.

* వాణిజ్యం కోసం ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్, చైనా, బర్మా, రష్యాలకు  రాయబారులను పంపాడు.

* మైసూర్‌లో ‘లిబర్టీ ట్రీ’ని నాటాడు.

* జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేశాడు. 

* ఫ్రాన్స్‌కు చెందిన ‘జాకోబియన్‌ క్లబ్‌’లో సభ్యుడిగా ఉన్నాడు.

Posted Date : 05-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌