• facebook
  • whatsapp
  • telegram

భారత పంచవర్ష ప్రణాళికలు - లక్ష్యాలు, ఫలితాల సమీక్ష

 నిర్ణీత కాలంలో ముందుగా నిర్ణయించిన లక్ష్యాలు, వాటి సాధన మార్గాల ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం చేసే కృషిని ప్రణాళికా ప్రక్రియ అంటారు. మన దేశంలో 1951 - 2017 మధ్య మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారు.
 

మొదటి పంచవర్ష ప్రణాళిక (1951 - 56)
1947 తర్వాత భారతదేశంలో రెండో ప్రపంచ యుద్ధం ప్రభావాలు, పాకిస్థాన్‌ విడిపోవడం, శరణార్థులు వలస రావడం లాంటి సమస్యల వల్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడటమే కాకుండా ద్రవ్యోల్బణ పెరుగుదల కూడా తీవ్రంగా ఉండేది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి గుల్జారీలాల్‌ నందా ఉపాధ్యక్షతన ప్రణాళికా సంఘం 1951లో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రారంభించింది. 
లక్ష్యాలు:
* రెండో ప్రపంచ యుద్ధం, దేశ విభజన వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో పునరావాస కల్పన చేయడం.
* ఆహార సమస్యను పరిష్కరించడం.
* ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం.
* రోడ్లు, రైల్వేలు, నీటిపారుదల సౌకర్యాలు లాంటివి కల్పించడం.
* సమాజాభివృద్ధి, విస్తరణ పనులను నిర్వహించడానికి పాలనా పరమైన వ్యవస్థలను నిర్మించడం.
 

రెండో పంచవర్ష ప్రణాళిక (1956 - 61)
1956 - 61 మధ్య కాలంలో వి.టి.కృష్ణమాచారి ఉపాధ్యక్షతన రెండో పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు. ఈ ప్రణాళికలో   పి.సి.మహలనోబిస్‌ రెండు రంగాల నమూనాను ఉపయోగించి పారిశ్రామికాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 
లక్ష్యాలు:
* శీఘ్ర పారిశ్రామికీకరణ
* అధిక జాతీయాదాయాన్ని వృద్ధి చేయడం
* ఉపాధి కల్పన
* సంపద పంపిణీలో అసమానతలు తగ్గించడం
 

మూడో పంచవర్ష ప్రణాళిక (1961 - 66)
సి.ఎం.త్రివేది ఉపాధ్యక్షతన ప్రణాళికా సంఘం 1961 - 66 మధ్య మూడో పంచవర్ష ప్రణాళికను అమలు చేసింది. 
లక్ష్యాలు:
* వ్యవసాయ రంగ ఉత్పత్తులు పెంచడం.
* ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం.
* ఉక్కు, ఇంధనం, రసాయనాలు, విద్యుత్‌ ఉత్పత్తి పరిశ్రమలను అభివృద్ధి చేయడం.
* ఉపాధి కల్పన
* జాతీయాదాయ వార్షిక వృద్ధిరేటును సాధించడం.
* ఆదాయ, సంపద అసమానతలు తగ్గించడం.
* అవకాశాల కల్పనలో సమానత్వం సాధించడం. 
* మానవ వనరుల గరిష్ఠ వినియోగం.
 

వార్షిక ప్రణాళికలు (1966 - 69)
1962లో భారత్, చైనా యుద్ధం; 1965లో భారత్, పాకిస్థాన్‌ యుద్ధం; 1965 - 66 మధ్య వచ్చిన కరవులు, 1966లో మూల్యహీనీకరణ వల్ల నాలుగో ప్రణాళిక ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ కారణాల వల్ల మూడో ప్రణాళిక తర్వాత మూడు వార్షిక ప్రణాళికలు అమలు చేశారు. అవి:
1) 1966 - 67
2) 1967 - 68
3) 1968 - 69
1966 - 69 మధ్య అమలు చేసిన మూడు వార్షిక ప్రణాళికల కాలాన్ని ప్రణాళిక విరామం లేదా ప్రణాళిక సెలవుగా పరిగణించారు. ప్రణాళికా సంఘం అశోక్‌ మెహతా ఉపాధ్యక్షతన ఈ మూడు వార్షిక ప్రణాళికలను రూ.6625 కోట్లతో అమలు చేసింది. ఈ ప్రణాళికలను ‘పిగ్మీ ప్రణాళికలు’ అంటారు.
 

నాలుగో పంచవర్ష ప్రణాళిక (1969 - 74)
ఆర్థిక స్థిరత్వ పరిస్థితులు ఏర్పడటంతో పంచవర్ష ప్రణాళిక విధానం పునరుద్ధరించబడింది. డి.ఆర్‌.గాడ్గిల్‌ ఉపాధ్యక్షతన ప్రణాళికా సంఘం 1969 - 74 మధ్య నాలుగో పంచవర్ష ప్రణాళికను అమలు చేసింది. ఆహార ధాన్యాల దిగుమతిని నిలుపుదల చేయడానికి ప్రభుత్వరంగ సంస్థలను తిరిగి నిర్మించే ప్రయత్నాలు చేశారు.
లక్ష్యాలు: 
* ధరల స్థిరత్వంతో కూడిన వృద్ధిని సాధించడం.
* ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి PL - 480 కింద వాటి దిగుమతులను నిలిపివేయడం.
* జాతీయాదాయ వార్షిక వృద్ధిరేటును సాధించడం.
 

అయిదో పంచవర్ష ప్రణాళిక (1974 - 79)
పి.ఎన్‌.హక్సర్‌ ఉపాధ్యక్షతన ప్రణాళికా సంఘం 1974 - 79 మధ్యకాలంలో అయిదో ప్రణాళికను అమలు చేసింది.
లక్ష్యాలు:
* పేదరిక నిర్మూలన
* స్వావలంబన
* స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటును పెంచడం.
* నిత్యావసర వస్తువులను సేకరించి పంపిణీ చేయడం.
* ఉపాధి కల్పన
* ఎగుమతులను ప్రోత్సహించడం.
1975లో కనీస అవసరాల పథకం కింద ప్రజలకు విద్య, తాగునీటి సరఫరా, వైద్య సేవలు, ఇల్లు, పోషకాహారం, గ్రామీణ విద్యుత్‌ సౌకర్యాలు, మురికివాడల అభివృద్ధి లాంటి చర్యలను ఈ ప్రణాళికలో చేపట్టారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడం, 20 సూత్రాల పథకానికి ప్రాధాన్యం కల్పించడం వల్ల ప్రణాళిక వ్యూహాలు, పథకాలు అమలు చేయలేకపోయారు. అంతేకాకుండా దేశంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం అయిదో ప్రణాళికను ఒక సంవత్సరం ముందుగానే (1978) ముగించింది. అయిదో ప్రణాళికను ‘పేదరిక నిర్మూలన ప్రణాళిక’ అని పిలుస్తారు.
 

నిరంతర ప్రణాళిక (Rolling Plan) (1978 - 80)
1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభత్వం మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చి నిరంతర ప్రణాళికను 1978, ఏప్రిల్‌ 1న పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ పద్ధతిలో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనతో పాటు ప్రతి సంవత్సరాంతంలో వార్షిక ప్రణాళికను సవరించే ఏర్పాటు చేశారు. 1980లో జనతా ప్రభుత్వం విఫలమవడంతో తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ప్రణాళికను రద్దు చేసింది. 
నిరంతర ప్రణాళికలో భాగంగా ఆరో ప్రణాళికను రెండుసార్లు ప్రవేశపెట్టారు. నిరంతర ప్రణాళికా కాలం 1978 - 83 కాగా దీని అమలు కాలం 1978 - 80.
 

ఆరో ప్రణాళిక (1980 - 85)
ఎన్‌.డి.తివారీ, ఎస్‌.బి.చవాన్‌లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా ఈ ప్రణాళికను అమలు చేశారు. దీన్ని నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అంటారు.
లక్ష్యాలు: 
* ఆర్థిక, సాంకేతిక స్వావలంబన
* జనాభా పెరుగుదల నిర్మూలన
* పర్యావరణ పరిరక్షణ
* పేదరిక నిర్మూలన
* ప్రాంతీయ అసమానతలు తగ్గించడం
* ఆర్థికాభివృద్ధి రేటును పెంచడం
 

ఏడో పంచవర్ష ప్రణాళిక (1985 - 90)
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడైన మన్మోహన్‌ సింగ్‌ ఆధ్వర్యంలో 1985 - 90 మధ్య కాలంలో ఈ ప్రణాళికను అమలు చేశారు. దీన్ని ‘శక్తి ప్రణాళిక’ అంటారు.
లక్ష్యాలు: 
* ఉత్పాదకత పెంచడం, ఉపాధి కల్పన, ఆహార ధాన్యాల సరఫరాను మెరుగు పరచడం
* స్వావలంబన   
* సామాజిక న్యాయం
* కుటుంబ నియంత్రణ
* పేదరిక నిర్మూలన
 

వార్షిక ప్రణాళికలు (1990 - 92) 
బడ్జెట్‌ లోటు వల్ల విదేశీ చెల్లింపుల సంక్షోభం ఏర్పడింది. దిగుమతుల సరళీకృతం వల్ల విదేశీ చెల్లింపులు ప్రతికూలంగా మారాయి. ప్రాధాన్యత లేని రంగాల్లో విదేశీ పెట్టుబడులు పెరిగి, బహుళ జాతి కంపెనీలు మార్కెట్‌పై నియంత్రణ అధికారం ఏర్పరచుకున్నాయి. రుణాలపై వడ్డీ చెల్లింపులకు మన దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అప్పులపై ఆధారపడి ప్రత్యేక ఆంక్షలకు లోబడాల్సి వచ్చింది. 1991, జులై 24న పి.వి. నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో నూతన ఆర్థిక సంస్కరణలు (సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ - ఎల్‌పీజీ) చేపట్టారు. ఏడో ప్రణాళిక తర్వాత ఎనిమిదో ప్రణాళిక ఆలస్యంగా ప్రారంభమైంది. అందువల్ల 1990 - 92 మధ్య రెండు వార్షిక ప్రణాళికలు (1990 - 91, 1991 - 92) అమలు చేశారు. 1990 - 92 మధ్య కాలాన్ని ‘అనధికార ప్రణాళిక సెలవు’ అని పిలుస్తారు.
 

ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక (1992 - 97)
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలో 1992 - 97 మధ్య ఈ ప్రణాళికను అమలు చేశారు.
లక్ష్యాలు: 
* నిర్బంధ ప్రాథమిక విద్య
* జనాభా పెరుగుదల నియంత్రణ
* ఉపాధి కల్పన
* తాగునీటి సదుపాయాన్ని కల్పించడం
* వైద్య సేవలు విస్తరించడం
* మౌలిక వసతుల అభివృద్ధి
* వ్యవసాయ రంగం వృద్ధి
* మానవ వనరుల అభివృద్ధి
 

తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక (1997 - 2002)
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడైన మధు దండావతే నేతృత్వంలో 1997, ఏప్రిల్‌ 1 నుంచి ఈ ప్రణాళిక అమల్లోకి వచ్చింది.
లక్ష్యాలు: 
* వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి
* జాతీయాదాయ వృద్ధిని సాధించడం
* ఆహార భద్రత కల్పించడం
* జనాభా పెరుగుదల నియంత్రణ
* కనీస అవసరాల కల్పన
ఉదా: విద్య, ఆరోగ్యం, తాగునీరు, ఇల్లు 
* ధరల నియంత్రణ
* స్త్రీ సాధికారత, పంచాయతీ వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం
 

పదో పంచవర్ష ప్రణాళిక (2002 - 2007)
కె.సి.పంత్‌ ఉపాధ్యక్షతన ప్రణాళికా సంఘం 2002 - 2007 మధ్య ఈ ప్రణాళికను అమలు చేసింది. 
లక్ష్యాలు: 
* జాతీయాదాయ వృద్ధిరేటు సాధించడం
* పేదరిక నిష్పత్తిని 5% తగ్గించడం
* సార్వత్రిక విద్యా వ్యాప్తి
* శ్రామికులకు లాభదాయక ఉపాధి
* గ్రామాల్లో తాగునీటి సదుపాయం కల్పించడం
* శిశుమరణాల రేటు తగ్గించడం
* ప్రసూతి మరణాల రేటు తగ్గించడం 
* నదుల కాలుష్యాన్ని శుద్ధి చేయడం
* అక్షరాస్యతను పెంచడం
 

పదకొండో పంచవర్ష ప్రణాళిక (2007 - 2012)
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా ఆధ్వర్యంలో ఈ ప్రణాళికను అమలు చేశారు. దీని ప్రధాన లక్ష్యం ‘సత్వర, సమ్మిళిత వృద్ధి’. 
లక్ష్యాలు:
* స్థూల జాతీయోత్పత్తిలో 9% వృద్ధిని సాధించడం.
* పేదరిక నిర్మూలన
* ఉపాధి కల్పన
* విద్య, వైద్యం లాంటి సౌకర్యాల అభివృద్ధి
* నిలకడ గల వృద్ధి, పర్యావరణ పరిరక్షణ
* మౌలిక సదుపాయాల అభివృద్ధి 
ఉదా: ఇల్లు, విద్యుత్, రోడ్లు
* 11వ ప్రణాళికలో విద్యపై అధిక కేటాయింపులు చేయడం వల్ల దీన్ని ‘విద్యా ప్రణాళిక’ అని పిలుస్తారు.
* సత్వర, సమ్మిళిత వృద్ధి అనే భావనను తొలిసారిగా ఈ ప్రణాళికలో ఉపయోగించారు.
 

పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012 - 2017)
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడైన మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా ఆధ్వర్యంలో 2012 - 2017 మధ్య కాలంలో ఈ ప్రణాళికను అమలు చేశారు. దీని ప్రధాన లక్ష్యం ‘వేగవంతమైన, నిలకడ గల, అధిక సమ్మిళిత వృద్ధిని సాధించడం’.
లక్ష్యాలు:
* ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు సామర్థ్యాన్ని 9 - 10% పెంచడం
* నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధికల్పన
* నాణ్యమైన విద్య, వైద్య సేవలను అందించడం
* వ్యవసాయాభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మార్పులు
* రవాణా సౌకర్యాల విస్తరణ
* ఇంధన వనరుల పెంపు
* సాంకేతిక, నవకల్పనల వృద్ధి
* సమ్మిళిత వృద్ధి సాధనకు మార్కెట్‌ల సామర్థ్యాన్ని పెంచడం
* పర్యావరణ పరిరక్షణ
* వికేంద్రీకరణ అమలు
* పట్టణీకరణ యాజమాన్యం
 

నీతి ఆయోగ్‌ విజన్‌ ప్రణాళిక కాలం (2017 - 2032)
భారత పంచవర్ష ప్రణాళిక ముసాయిదా స్థానంలో నీతి ఆయోగ్‌ నూతన విజన్‌ ముసాయిదా, కార్యాచరణ విధానాన్ని ప్రకటించింది. 2017, ఏప్రిల్‌ 23న అయిదు మార్పులు చేసి మెరుగుపరిచిన నూతన విజన్‌ ముసాయిదాను సామాజిక లక్ష్యాలైన పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్య సేవల పురోగతికి 15 ఏళ్ల (2017 - 32) దీర్ఘకాలానికి ప్రభుత్వ కార్యచరణ విధానాలను నీతి ఆయోగ్‌ నిర్ణయించింది. కొత్తగా జాతీయ అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఏడేళ్ల కాలానికి (2017 - 2024) ఒక నూతన కార్యచరణ విధానాన్ని నిర్ణయించింది. 2017 - 20 మధ్య కాలానికి అవసరమైన నిధులను అంచనా వేయడానికి మూడేళ్ల కార్య నిర్వాహక ఎజెండాను రూపొందించారు. ఈ విధంగా నీతి ఆయోగ్‌ నూతన విజన్‌ ముసాయిదా ప్రకారం 15 ఏళ్ల దీర్ఘదర్శి ప్రణాళిక, ఏడేళ్ల మధ్యంతర ప్రణాళిక, మూడేళ్ల స్వల్పకాలిక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నారు. 
 

భారత ఆర్థిక వ్యవస్థ రూపాంతరానికి చేపట్టాల్సిన కార్యచరణలోని ముఖ్యాంశాలు 
* వ్యవసాయ రంగ అభివృద్ధి
* రెండో హరిత విప్లవ సాధనకు కృషి
* నగదు రహిత లావాదేవీల విధానాలను ప్రోత్సహించడం (2016, నవంబరు 8న కరెన్సీ నోట్ల రద్దు) 
* సాంఘిక సేవల కల్పనను మెరుగు పరచడం 
ఉదా: విద్య, వైద్యం, తాగునీరు
 

మూడేళ్ల కార్యచరణ ప్రణాళిక ముఖ్యాంశాలు
* 2015 - 16 ధరల్లో దీర్ఘకాలిక 15 సంవత్సరాల ప్రణాళికలో కేటాయింపులు. 
* 2015 - 16లో రూ.137 లక్షల కోట్ల నుంచి 2031 - 32 నాటికి రూ.439 లక్షలకు కుదించారు.

రచయిత: బండారి ధనుంజయ్‌

Posted Date : 08-02-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌