పర్యావరణ వ్యవస్థల్లోని విభిన్న జంతు, వృక్ష జాతుల సమూహాన్ని జీవవైవిధ్యంగా పేర్కొంటారు. ఇది ప్రత్యేకమైన సహజ సౌందర్యాన్ని కలిగి ఉంది.
పర్యావరణ వ్యవస్థల నిర్వహణకు, సుస్థిరాభివృద్ధికి జీవవైవిధ్యం కీలకమైంది.

జీవవైవిధ్య పరిరక్షణను రెండు రకాలుగా నిర్వచిస్తారు. అవి:
1. స్వస్థానీయ పరిరక్షణ లేదా ఇన్-సిటు కన్జర్వేషన్
2. పరస్థానీయ పరిరక్షణ లేదా ఎక్స్-సిటు కన్జర్వేషన్
ఇన్-సిటు కన్జర్వేషన్
మొక్కలు, అడవి జంతువులను వాటి సహజ ఆవాసాల్లోనే పరిరక్షించడాన్ని ఇన్-సిటు కన్జర్వేషన్ లేదా ఆన్‌సైట్ కన్జర్వేషన్ అంటారు. అక్కడ వాటి నిర్వహణ, పర్యవేక్షణ, పరిరక్షణ జరుగుతుంది.
ఒక కమ్యూనిటీ లేదా సమాజ వాతావరణంలో వివిధ జాతుల మొక్కలు లేదా జంతువులు కొనసాగడానికి లేదా శాశ్వతంగా ఉంచడానికి అనుమతి ఇవ్వడం ఇన్-సిటు పరిరక్షణ ప్రధాన లక్ష్యం. అంటే వీటి రక్షణకు ప్రజలు కూడా సహకరించాలి.
అడవి మొక్కల జన్యు వనరులను సంరక్షించడానికి ఇన్-సిటు పరిరక్షణ అనువైన పద్ధతి.
ప్రయోజనాలు:
భారీ స్థాయిలో ఆసక్తికరమైన యుగ్మ వికల్పాలు లేదా జన్యువుల పరిరక్షణకు తోడ్పడుతుంది.
సహజ ఆవాసాల బయట దీన్ని ఏర్పాటు చేయరు. ఈ పద్ధతి జాతులకు అనుకూలంగా ఉంటుంది.
జీవ వైవిధ్య ఉనికిని కాపాడటం ద్వారా జంతువులు, మొక్కల సహజ పరిణామాన్ని కొనసాగించడానికి వీలు కలుగుతుంది.
సహజ ఆవాసాల్లోని జాతులపై పరిశోధనను సులభతరం చేస్తుంది.
ఒక జీవ సమూహంపై ఆధారపడిన ఇతర జాతుల రక్షణకు హామీ ఇస్తుంది.
పద్ధతులు:
రక్షిత ప్రాంతాల వ్యవస్థ ద్వారా జీవవైవిధ్యం అధికంగా ఉన్న ప్రదేశాలకు రక్షణ కల్పించడం వల్ల ఇన్-సిటు పరిరక్షణ జరుగుతుంది.
భారతదేశంలో రక్షిత ప్రాంతాలను జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలుగా విభజించారు. ఇవి జీవులు నివసించడానికి, పర్యావరణపరంగా సున్నిత ప్రాంతాలు.
వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) నేషనల్ వైల్డ్‌లైఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎన్‌డబ్ల్యూఐఎస్)ను అభివృద్ధి చేసింది. దీని ప్రకారం మనదేశంలో 981 సురక్షిత ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో 104 జాతీయ ఉద్యానవనాలు కాగా, 566 వన్యప్రాణుల అభయారణ్యాలు (వైల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ), 214 కమ్యూనిటీ రిజర్వ్‌లు. మనదేశంలో సురక్షిత ప్రదేశాల భౌగోళిక వైశాల్యం 1,71,921 చ.కి.మీ. ఉంది. ఇది దేశ వైశాల్యంలో 5.03 శాతం. పులులు, సింహాలు, ఖడ్గమృగాలు, మొసళ్లు, ఏనుగులు లాంటి పెద్ద క్షీరదాల జనాభాను పునరుద్ధరించడంలో అభయారణ్యాలు తోడ్పడుతున్నాయి.
రక్షిత ప్రాంతాల ప్రధాన ప్రయోజనాలు, లక్షణాలు:
ఒక ప్రాంతంలో నివసించే అన్ని జాతుల జన్యు వైవిధ్యాన్ని సంరక్షించడం.
జాతులను వాటి సహజ ఆవాసాల్లో నివసించే విధంగా ప్రోత్సహించడం.
రక్షిత ప్రాంతాల్లో మానవ జోక్యం తక్కువగా ఉంటుంది.
రక్షిత ప్రాంతంలో కాలుష్యం, వేటను తనిఖీ చేయొచ్చు.
జాతీయ ఉద్యానవనం (నేషనల్ పార్క్)
ఇది ఒక రిజర్వ్ లాండ్, సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. దీన్ని సామాజిక ఆస్తిగా పేర్కొంటారు. మానవ అభివృద్ధి కార్యకలాపాలు, కాలుష్యం నుంచి దీనికి పూర్తిగా రక్షణ లభిస్తుంది.
కాలిఫోర్నియాలోని ‘ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్’ ప్రపంచంలోనే మొట్టమొదటి రక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. మనదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ‘హేలీ నేషనల్ పార్క్’. దీన్ని ప్రస్తుతం ‘జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్’ అని పిలుస్తున్నారు. దీన్ని 1935లో ఏర్పాటు చేశారు.
అభయారణ్యాలు
వన్యప్రాణుల రక్షణ వీటి ముఖ్య ఉద్దేశం.
అటవీ ఉత్పత్తులు సేకరించడం, కలప కోసం చెట్లను నరకడం ఇక్కడ నిషిద్ధం.
బయోస్పియర్ రిజర్వ్ ప్రాంతాలు
ఇవి వివిధ బయోమ్‌లలో జన్యు వైవిధ్యాన్ని సంరక్షించడానికి ఉద్దేశించిన రక్షిత ప్రాంతాలు. ఈ భావనను యునెస్కోకి చెందిన ‘మాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాం (ఎంఏబీ)’ ద్వారా అభివృద్ధి చేశారు.
1976లో ఎంఏబీ ప్రోగ్రాం దాదాపు 57 బయోస్పియర్ రిజర్వ్‌లను గుర్తించింది. తర్వాతి కాలంలో ఇలాంటి ప్రాంతాల సంఖ్య మరింత పెరిగింది. వీటిలో మూడు రకాల జోన్‌లు ఉంటాయి.
1. కోర్ జోన్ 2. బఫర్ జోన్
3. పరివర్తన జోన్ (Transition zone)
కోర్ జోన్: మానవ జోక్యం లేకుండా జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి అంకితమైన అంతర్గత జోన్.
బఫర్ జోన్: ఇది కోర్ జోన్ చుట్టూ ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలోని వనరులను కొంతమేర ఉపయోగించుకోవడానికి అనుమతిస్తారు. అయితే సాధారణ ప్రజలు ఇందులోకి ప్రవేశించలేరు. అంతరించిపోతున్న జాతుల గుర్తింపు, జాతుల కృత్రిమ ప్రచారం, కణజాల వర్ధన పద్ధతి (అంతరించిపోతున్న జాతులను వేగంగా లెక్కించడానికి చేసే ప్రక్రియ) మొదలైన విద్యా, పరిశోధన కార్యకలాపాలను ఇక్కడ నిర్వహిస్తారు.
పరివర్తన జోన్: ఈ ప్రాంతాన్ని బయోస్పియర్ రిజర్వ్ మేనేజ్‌మెంట్, స్థానిక ప్రజలు పరస్పరం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ అటవీ, వినోదం, పంటలు వేయడం మొదలైన కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది.
సహజ పర్యావరణ వ్యవస్థల్లో భాగంగా మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవుల జీవ వైవిధ్యం, జన్యు సమగ్రతను సంరక్షించడం ఈ రిజర్వ్ ప్రాంతాల లక్ష్యం. ప్రస్తుతం 131 దేశాల్లో దాదాపు 727 బయోస్పియర్ రిజర్వ్‌లు ఉన్నాయి. భారత్‌లోని బయోస్పియర్లు 18.
హాట్‌స్పాట్‌లు
‘‘హాట్‌స్పాట్‌లు అనేవి జాతుల్లో చాలా సమృద్ధిగా ఉన్న ప్రాంతాలు. ఇవి అధిక స్థానికతను కలిగి ఉండి, నిరంతరం ముప్పులో ఉంటాయి.’’ అని బ్రిటిష్ పర్యావరణవేత్త అయిన నార్మన్ మైయర్స్ పేర్కొన్నాడు.
బయోలాజికల్ హాట్‌స్పాట్‌లలో పశ్చిమ అమెజాన్ (కొలంబియా, ఈక్వెడార్, పెరూ), మడగాస్కర్, ఉత్తర - తూర్పు బోర్నియో, ఈశాన్య ఆస్ట్రేలియా, పశ్చిమ ఆఫ్రికా, బ్రెజిలియన్ అట్లాంటిక్ అడవులు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ అధిక జీవవైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటికి మానవ కార్యకలాపాల వల్ల ముప్పు పొంచి ఉంది.
ఎక్స్-సిటు కన్జర్వేషన్

ఈ ప్రాంతాల్లో వివిధ జాతుల సేకరణ, పరిరక్షణ జరుగుతాయి.

ఆఫ్‌సైట్ జాతుల పరిరక్షణ
అనేక రకాల వృక్ష జాతులను బొటానికల్ గార్డెన్స్, ఆర్బోరెటాలో భద్రపరుస్తారు. చెట్లు, పొదలతో ఉన్న తోటలను ఆర్బోరెటా అంటారు.
ఆఫ్‌సైట్ ప్రాంతాల్లో విత్తన బ్యాంకులు, కణజాల వర్ధన సౌకర్యాలు అనేక నమూనాలను సంరక్షించడంలో సహాయపడ్డాయి.
క్యాప్టివ్ బ్రీడింగ్ ప్రోగాం ద్వారా జంతుప్రదర్శనశాలల్లో జంతువులను బంధించి, పెంచడం వల్ల అంతరించిపోతున్న జాతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం అంతరించిపోతున్న జంతువులను జంతుప్రదర్శనశాలల్లో పెంచి, వాటి సంతతి వృద్ధి చెందాక తిరిగి అవి ఉండే సహజ ఆవాసాల్లోకి ప్రవేశపెట్టడం.
జీన్ బ్యాంక్ పరిరక్షణ
జన్యు బ్యాంకులు జెర్మ్ ప్లాజమ్‌ను సంరక్షించే ప్రదేశాలు. స్వభావం ఆధారంగా జెర్మ్ ప్లాజమ్‌లను నాలుగు రకాలుగా విభజించారు. అవి:
విత్తన బ్యాంకులు: ఆచరణీయమైన విత్తనాలను నిల్వ చేసే ప్రదేశాలు.
పండ్ల తోటలు: నిర్దిష్ట మొక్కలను పెద్ద సంఖ్యలో పెంచే ప్రదేశాలు.
టిష్యూ కల్చర్: ఇవి కణజాల వర్ధన ప్రయోగశాలలు.
ఈ పద్ధతిలో విత్తనం లేని లేదా క్రమరహిత విత్తనాలను కలిగి ఉన్న మొక్కలను రూపొందిస్తారు.
వీటి కోసం కాలస్, పిండాలు, పుప్పొడి రేణువులను సేకరించి షూట్ టిప్ కల్చర్ నిర్వహిస్తారు.
టిష్యూ కల్చర్ ముఖ్యంగా అంతరించిపోతున్న జాతులను వేగంగా పెంచడం, చిన్న ప్రాంతాల్లో జన్యురూపాలను నిర్వహించడం, వైరస్ లేని రెమ్మల ఉత్పత్తి మొదలైనవాటికి ఉపయోగపడుతుంది.
క్రయోప్రిజర్వేషన్: ఈ సాంకేతికతను ఉపయోగించి మొక్కల విత్తనాలను, జంతువుల స్పెర్మ్‌ను, గుడ్లు, పిండ కణాలను సంరక్షిస్తారు. ఈ ప్రక్రియలో సంబంధిత పదార్థాన్ని ద్రవ నైట్రోజన్‌లో -196o C వద్ద నిల్వచేస్తారు.
పరిరక్షణ
వృథా, క్షీణతను నిరోధించి, సహజ వనరులను వినియోగించడాన్ని పరిరక్షణ అంటారు. తేమ తగ్గినప్పుడు లేదా తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసినప్పుడు అనేక వృక్ష జాతుల విత్తనాలు ఎక్కువ కాలం ఉపయోగించేవిగా ఉంటాయి. కానీ తాజా విత్తనాలు పొందాలంటే విత్తనాలు క్రమానుగతంగా మొలకెత్తాలి. ఈ పద్ధతి అరుదైన జాతుల రక్షణ, పరిరక్షణను నిర్ధారిస్తుంది.
లక్ష్యాలు:
పర్యావరణ నాణ్యత, స్వచ్ఛతను కాపాడటం.

పర్యావరణ అభివృద్ధి కార్యక్రమాలు
పర్యావరణ వ్యవస్థల స్థిరమైన పరిరక్షణ కోసం ప్రభుత్వం స్థానికంగా నివసించే వివిధ సంఘాలతో కలసి పర్యావరణ-అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు అందించడం; అటవీ సంబంధిత ఉత్పత్తుల స్థిరమైన లభ్యత ద్వారా ఆయా సంఘాల ఆర్థిక అవసరాలను తీర్చడం ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం.
చిత్తడి నేలలు, మడ అడవులు, పగడపు దిబ్బలు మొదలైన పర్యావరణ వ్యవస్థల శాస్త్రీయ నిర్వహణ, మేలైన ఉపయోగం కోసం కూడా అనేక కార్యక్రమాలను ప్రారంభించారు. ఇంటెన్సివ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రయోజనాల కోసం ప్రభుత్వం 21 చిత్తడి నేలలు, మడ ప్రాంతాలను; 4 పగడపు దిబ్బ ప్రదేశాలను గుర్తించింది.
రామ్‌సర్ కన్వెన్షన్ ప్రకారం భారతదేశంలో ఆరు ముఖ్యమైన చిత్తడి నేలలను ‘రామ్‌సర్ సైట్స్’గా ప్రకటించారు.
వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ప్రకారం, అయిదు సహజ ప్రదేశాలను ‘ప్రపంచ వారసత్వ ప్రదేశాలు’గా గుర్తించారు.