భూమి మీద తప్ప ఇతర ఏ గ్రహంపైనా జీవం ఉనికి ఉన్నట్లు స్పష్టమైన సమాచారం లేదు.
దాదాపు రెండువేల మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై జీవకణాలు ఏర్పడ్డాయి. మొదట ఏకకణ జీవులు ఉద్భవించాయి. క్రమంగా జరిగిన మార్పుల వల్ల వాటి నుంచి ఆయా జీవజాతులు ఏర్పడ్డాయి.
భూమిపై అనేక రకాల జీవజాతులు ఉండటాన్ని జీవవైవిధ్యం లేదా బయోడైవర్సిటీ అంటారు.
నార్మన్ మేయర్స్ అనే శాస్త్రవేత్త బయోడైవర్సిటీ భావనను ప్రవేశపెట్టారు.
జీవవైవిధ్యం జాతుల స్థాయిలోనే కాకుండా స్థూల అణువుల స్థాయి నుంచి జీవ సమాజం లేదా బయోమ్ స్థాయి వరకు విస్తరించి ఉంటుంది.
ఎడ్వర్డ్ విల్సన్ అనే సామాజిక జీవశాస్త్రవేత్త వివిధ స్థాయుల్లోని జీవులను, వాటిలోని భేదాలను వివరించేందుకు జీవవైవిధ్యంలో కొన్ని స్థాయులను విభజించారు.
జీవవైవిధ్యంలోని స్థాయులు
జీవవైవిధ్యంలో మూడు స్థాయులు ఉన్నాయి. అవి:
జన్యు వైవిధ్యం

జీవావరణ వైవిధ్యం
జన్యు వైవిధ్యం
ఒక జాతిలోని జన్యువుల వైవిధ్యాన్ని జన్యువైవిధ్యం అంటారు.
వాటి విస్తరణ పరిధిని అనుసరించి ఒక జాతి జీవులు అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శించవచ్చు.
జన్యు వైవిధ్యం వాతావరణ మార్పులకు అనుగుణంగా అధికమవుతూ జీవుల మనుగడకు లాభదాయకంగా ఉంటుంది.
మనదేశంలో 50,000 కంటే ఎక్కువ వరి రకాలు, సుమారు 1000 రకాల మామిడి మొక్కలు ఉన్నాయి. జన్యువుల వైవిధ్యం వల్లే ఇది సాధ్యమైంది.
జాతుల వైవిధ్యం
జాతుల స్థాయిలో కనిపించే వైవిధ్యాన్ని జాతుల వైవిధ్యం అంటారు.
పశ్చిమ కనుమల్లో నివసించే ఉభయచర జీవుల (ఏంఫీబియన్స్) జాతుల వైవిధ్యత తూర్పు కనుమల్లో నివసించే జీవుల కంటే అధికంగా ఉంటుంది.
జీవావరణ వైవిధ్యం
జీవావరణ వ్యవస్థ లాంటి ఉన్నతస్థాయి వ్యవస్థలో ఉండే వైవిధ్యాన్ని జీవావరణ వైవిధ్యం అంటారు.
ఎడారులు, వర్షాధార అడవులు, మడ అడవుల లాంటి జీవావరణ వ్యవస్థలు ఉన్న మనదేశం స్కాండినేవియన్ దేశమైన నార్వే లాంటి ఇతర అనేక దేశాలతో పోలిస్తే అధిక వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది.
భిన్నత్వ సూచికలు
జీవావరణ వైవిధ్యాన్ని గుర్తించడానికి ఆల్ఫా, బీటా, గామా భిన్నత్వాల సూచికలు తోడ్పడతాయి.
ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జీవసమాజాన్ని లేదా జీవావరణ వ్యవస్థలోని జాతులను లెక్కించడం ద్వారా ఆల్ఫా వైవిధ్యాన్ని కొలుస్తారు.
వేర్వేరు జీవావరణ వ్యవస్థల్లో ఉన్న జాతుల భిన్నత్వాన్ని బీటా వైవిధ్యం అంటారు. ఒక్కో జీవావరణ వ్యవస్థలో ఉండే ప్రత్యేక జాతుల సంఖ్యతో పోల్చి దీన్ని గణిస్తారు.
విస్తృత జీవావరణ మండలంలోని వివిధ జీవావరణ వ్యవస్థల్లో మొత్తం భిన్నత్వాన్ని మదించడం ద్వారా గామా వైవిధ్యాన్ని కొలుస్తారు.
నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే నివసించే ప్రత్యేక జాతులను స్థానిక జాతులు అంటారు.
జీవవైవిధ్య విస్తరణ అక్షాంశం, జాతి విస్తీర్ణత సంబంధాలపై ఆధారపడుతుంది.
అక్షాంశం ఆధారంగా జీవవైవిధ్యం విస్తరిస్తుంది. ఉన్నత అక్షాంశాలతో పోలిస్తే నిమ్న అక్షాంశ ప్రదేశాల్లో ఎక్కువ జాతులు నివసిస్తూ ఉంటాయి. అంటే, ధ్రువప్రాంతాల నుంచి భూమధ్యరేఖ వైపు ప్రయాణించే కొద్దీ భూచర జీవుల్లో జీవవైవిధ్యం పెరుగుతుంది. ఉష్ణ మండలాలు, సమశీతోష్ణ మండలాల్లో అధిక సంఖ్యలో జాతులు నివసిస్తాయి. జీవుల నివాసానికి సమశీతోష్ణ లేదా ధ్రువప్రాంతాల కంటే ఉష్ణ మండలాలు అనుకూలం.
దక్షిణ అమెరికా ఖండంలోని అమెజాన్, ఉష్ణమండల వర్షారణ్యాల్లో అధిక జీవివైవిధ్యం కనిపిస్తుంది.
తక్కువ జాతులు ఉన్న సమాజాలతో పోలిస్తే ఎక్కువ జాతులు ఉన్న జీవ సమాజాలు అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ స్థిర జీవ సమాజాలు అస్థిరతను సులభంగా తట్టుకుంటాయి. జీవుల వైవిధ్యంలో జరిగే పెరుగుదల అధిక ఉత్పాదకతకు దోహదపడుతుంది.
ఇతర మండలాలతో పోలిస్తే ఉష్ణమండల అక్షాంశాలు దీర్ఘకాలంగా ప్రకృతి అలజడులకు లోనవుతాయి. దీని వల్ల ఆ ప్రాంతంలో జీవ పరిణామానికి అవసరమైన సుదీర్ఘ కాలవ్యవధి లభిస్తుంది. ఇది జాతుల ఉత్పత్తికి, వాటి భిన్నత్వానికి దారితీస్తుంది.
సమశీతల మండలాలతో పోలిస్తే ఉష్ణమండల వాతావరణ పరిస్థితులు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి, భవిష్యత్ మార్పులను అంచనా వేసేలా ఉంటాయి. ఇలాంటి స్థిర వాతావరణం ఉన్న పరిసరాల్లో నివసించే జీవులు వాటి వృత్తిరీత్యా ప్రత్యేక లక్షణాలను సంతరించుకుంటాయి. తద్వారా వాటిలో వైవిధ్యత మరింత విస్తరించింది.
ఈ ఉష్ణ మండలాల్లోని అపరిమిత సౌరశక్తి, నీరు మొదలైన వనరుల లభ్యత వల్ల ఆహారోత్పత్తి అధికంగా జరిగి జీవవైవిధ్యతకు కారణమైంది.
విలక్షణమైన వృక్షజంతు సముదాయం, సహజ జీవావరణ సముదాయం ఉండి, సహజ సరిహద్దులు ఉన్న ప్రాంతాన్ని విస్తృత జీవావరణ మండలం అంటారు.ఒక నిర్ణీత విస్తీర్ణం ఉన్న ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్యను జాతి సమృద్ధత అంటారు. జాతుల సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ జాతి సమృద్ధత పెరుగుతుంది.
రివెట్‌పాపర్ దృగ్విషయం
పాల్ ఎల్రిచ్ ప్రతిపాదించిన రివెట్‌పాపర్ దృగ్విషయం ఆవరణ వ్యవస్థ పనితీరులో జాతి ప్రాముఖ్యతను తెలుపుతుంది.

ఒక్కో రివెట్‌ని తొలగించడం ద్వారా విమానానికి జరిగే దీర్ఘకాలిక ప్రమాదాన్ని తెలియజేశాడు.

అలాగే జీవసమాజం నుంచి కొన్ని సందిగ్ధ జాతులను తొలగించడం వల్ల ఆ జీవావరణ వ్యవస్థ నాశనమవుతుంది.
జీవవైవిధ్యానికి హాని కారకాలు
జాతుల విలుప్తతకు దారితీసే నాలుగు ప్రధాన కారణాలు (అరిష్ట చతుష్టయం)
i) ఆవాస క్షీణత - శకలీకరణ లేదా ముక్కలవడం
ii) వనరుల అతివినియోగం
iii) స్థానికేతర జాతుల చొరబాటు
iv) సహవిలుప్తత
ఆవాస క్షీణతకు ప్రధాన కారణం అడవుల నరికివేత. భూ మండలంపై 14% ఉన్న ఉష్ణప్రాంత వర్షాధార అడవులు క్రమంగా క్షీణించి ప్రస్తుతం 4 శాతానికి పరిమితమయ్యాయి. అటవీ భూములను సాగు భూములుగా మార్చడం కూడా ఆవాస క్షీణతకు ఒక ప్రధాన కారణం.

సహజ ఆవాసాలను విచ్ఛిత్తి చేసే ప్రక్రియను ఆవాస శకలీకరణ అంటారు. దీనికి భౌగోళిక ప్రక్రియలు లేదా మానవ ప్రేరిత చర్యలు ప్రధాన కారణాలు.

సాల్బర్ సముద్ర ఆవు, ఉత్తర అమెరికాకు చెందిన పాసింజర్ పావురం మనుషుల మితిమీరిన వినియోగానికి బలవుతున్నాయి. దీని కారణంగా విలుప్తత జరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

నైల్‌పర్చ్ అనే చేపను తూర్పు ఆఫ్రికాలోని లేక్ విక్టోరియా సరస్సులోకి ప్రవేశపెట్టారు. దీనివల్ల ఆ సరస్సులోని 200 జాతుల స్థానిక సిక్లిడ్ చేపలు క్షీణించాయి.

ఒక జీవి విలుప్తత మరో జీవి విలుప్తతకు దారితీస్తుంది. దీన్ని సహవిలుప్తత అంటారు. మొక్కలు, పరాగ సంపర్కకారుల సహజీవనం ఇలాంటి సహవిలుప్తతకు కారణం. పరాగసంపర్కకారుల విలుప్తత మొక్కల విలుప్తతకు దారితీస్తుంది.
మాదిరి ప్రశ్నలు
1. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
జ: మే 22
2. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ - 2021 ముఖ్య ఉద్దేశం?
జ: మనమంతా పరిష్కారంలో భాగం, ప్రకృతి కోసం
3. కిందివాటిలో సరైనవి ఏవి?
i) 2021 గణాంకాల ప్రకారం భూమిపై ఉన్న జీవ సముదాయంలో 82% ప్రపంచ జీవద్రవ్యం మొక్కలతో భర్తీ అయింది.
ii) జీవాలు 86% భౌమ్య ఆవాసాల్లో, 13% లోపలి పొరల్లో, 1% సముద్ర ఆవాసాల్లో ఉంటాయి.
iii) భూమిపై ఉన్న సుమారు రెండు మిలియన్ల జాతులకు సంబంధించిన ఆధారాలు, గుర్తింపు లక్షణాలు మనకు లభించాయి.
iv) ఎక్కువ స్థానీయజాతులు ఉష్ణమండల ఆవాసాల్లో ఉన్నాయి.
జ: i, ii, iii, iv
4. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ (NBA) ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నెలకొల్పింది?
జ: 2003
5. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ (NBA) ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
జ: చెన్నై
6. బయోడైవర్సిటీ భావనను ప్రతిపాదించింది ఎవరు?
జ: నార్మన్ మేయర్స్