• facebook
  • whatsapp
  • telegram

ఛందస్సు

ఛందస్సు అనే పందం ఛద్‌ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. ఛద్‌ అంటే అర్థం ఆనందం, ఆహ్లాదం.
గురువు: ద్విమాత్రా కాలంలో పలికే అక్షరాన్నే గురువు అంటారు. గురువు గుర్తు అర్ధ వలయం.
నియమాలు:
* దీర్ఘాక్షరాలన్నీ గురువులు.
ఉదా: ఆ, ఈ, ఊ, ౠ, ఏ, ఓ
* ఐ, ఔ లు గురువులు
* , ః లతో కూడిన అక్షరాలు గురువులు 
* పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు
* ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలకు ఎడమ వైపున ఉండే అక్షరాలు గురువులు
* ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాల ఎడమ వైపున ఉన్న అక్షరాలు గురువులు కావాలంటే పదం కలిసి ఉండాలి. కలిసి ఉండటంతో పాటు ఊది పలకాలి లేదా ఒత్తి పలకాలి.
లఘువు: ఏకమాత్రా కాలంలో పలికేది లఘువు. దీని గుర్తు చిన్న నిలువు గీత.
నియమాలు:
* హ్రస్వాక్షరాలు అన్నీ లఘువులు
* పదాది అక్షరం సంయుక్తాక్షరమైతే దాని ముందు ఉన్న అక్షరం (దీర్గం లేకపోతే) లఘువు అవుతుంది.
 

ఛందస్సు రకాలు
 

1) వృత్త పద్యాలు
2) జాతి పద్యాలు
3) ఉపజాతి పద్యాలు
 

వృత్త పద్యాలు
 

లక్షణాలు: ఇవి సంస్కృత భాష నుంచి తెలుగులోకి ప్రవేశించాయి.
* ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి.
* ప్రతి పాదంలో అక్షర నియమం, గురు లఘు నియమం ఒకే విధంగా ఉంటాయి.
* గణాలు వరుసగా వస్తాయి.
* యతి మైత్రి చెల్లుతుంది.
* ప్రాస నియమం ఉంటుంది. 
యతి: మొదటి అక్షరానికి ఆ పాదంలో నియమిత స్థానంలో కలిగిన మరొక అక్షరానికి సంబంధాన్ని కూర్చడం. యతి మైత్రి చూసుకునేటప్పుడు అచ్చుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ప్రాస: పద్యపాదంలో 2వ అక్షరాన్ని ప్రాస అంటారు.

గణాలు - రకాలు

1) ఏకాక్షర గణాలు
2) రెండు అక్షర గణాలు
3) మూడు అక్షర గణాలు
 

ఏకాక్షర గణాలు: ఇవి రెండు.    
1) ల గణం - I
2) గ గణం - U
 

రెండు అక్షర గణాలు: ఇవి నాలుగు.
1) లలం - II
2) లగణం/పగణం - IU
3) గగం - UU
4) గలం/హగణం - UI
 

మూడు అక్షర గణాలు/నిసర్గ గణాలు:

భ గణం - UII
జ గణం - IUI
స గణం - IIU
య గణం - IUU
ర గణం - UIU
త గణం - UUI
న గణం - III
మ గణం - UUU

ముఖ్యాంశాలు:
* వృత్త పద్యాలు జంటలు జంటలుగా కనిపిస్తాయి. ఉత్పలమాల, చంపకమాల ఒక జంట; శార్దూలం, మత్తేభం రెండో జంటగా భావించాలి.
* ఉత్పలమాల, చంపకమాల పద్యాలు వృషాధిప శతకం, భాస్కర శతకాల్లో కనిపిస్తాయి.
* శార్దూల, మత్తేభ పద్యాలు శ్రీకాళహస్తీశ్వర, దాశరథీ శతకాల్లో ఉంటాయి. 
* ఉత్పలమాలను చంపకమాలగా, శార్దూలాన్ని మత్తేభంగా మార్చాలంటే మొదటి గురువును రెండు లఘువులుగా మార్చాలి.
* వృత్త పద్యాలను గుర్తించాలంటే ఇచ్చిన పాదం పొడవుగా ఉండాలి. అక్షరాలు లెక్కించినప్పుడు 19 అక్షరాలు వస్తే శార్దూలం, 21 వస్తే చంపకమాల, 20 వస్తే ఉత్పలమాల లేదా మత్తేభం అని గుర్తించాలి. 20 అక్షరాలు ఉంటే మొదటి అక్షరాన్ని పరిశీలించినప్పుడు అది లఘువు అయితే ఆ పద్యపాదం మత్తేభం, గురువు అయితే ఆ పద్యపాదం ఉత్పలమాల అని గుర్తించాలి.

వృత్త పద్యాలు


 

జాతి పద్యాలు

ఇవి ప్రధానంగా నాలుగు. అవి: 
1) కందం
2) ద్విపద     
3) తరువోజ
4) మధ్యాక్కర

లక్షణాలు:
* నాలుగు పాదాల నియమం ఐచ్ఛికం.
* ఉపగణాలు అధికంగా కనిపిస్తాయి.
* గణాలు వరుసగా రావాల్సిన అవసరం లేదు.
* వచ్చిన గణమే ఎన్నిసార్లయినా రావచ్చు.
* ముందుగానే మూడు అక్షరాలను ఒక గణంగా విభజించకూడదు.
* యతి మైత్రి చెల్లుతుంది.
* ప్రాస నియమం ఉంటుంది.

ముఖ్యాంశాలు:

* ఉపగణాలు అంటే సూర్యగణాలు, ఇంద్రగణాలు.

సూర్యగణాలు రెండు 

1) న గణం - III
2) హ గణం - IU

ఇంద్రగణాలు ఆరు 

నల - IIII
నగ - IIIU
సల - IIUI
భ - UII
ర - UIU
త - UUI
* జాతి, ఉపజాతి పద్యాల్లో యతిమైత్రి కుదరాలి అంటే కనీసం ఆ పాదంలో నాలుగు లేదా నాలుగు కంటే ఎక్కువ గణాలు ఉండాలి. కానీ తక్కువగా ఉన్నప్పుడు ఆ పాదంలో యతిమైత్రి చెల్లదు.
* నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గణాలు కలిగిన పాదంలో మొదటి గణం మొదటి అక్షరానికి, చివరి గణానికి ముందు ఉండే గణం మొదటి అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది.

కందం  
కందం అంటే అర్థం అందమైంది, చిన్నది. మొదటిసారి కంద పద్యాలు కుర్క్యాల శాసనంలో కనిపించాయి. ‘కందం రాసిన వాడే కవి, పందిని చంపిన వాడే బంటు’ అనేది సామెత. అంటే కంద పద్యాలు రాయడం కష్టం అని అర్థం. తిక్కన, సోమయాజి కంద పద్యాలు రాయడంలో ప్రసిద్ధులు.

లక్షణాలు:
* నాలుగు పాదాలు ఉంటాయి.
* నల, గగ, భ, జ, స అనే గణాలు వస్తాయి.
* 1, 3 పాదాల్లో మూడు గణాలు; 2, 4 పాదాల్లో అయిదు గణాలు వస్తాయి. 
* 1, 2 పాదాలను మొదటి భాగంగా; 3, 4 పాదాలను రెండో భాగంగా విభజించాలి.
* ప్రతి భాగంలో 1, 3, 5, 7 బేసి గణాల్లో జ గణం రాకూడదు.
* ప్రతి భాగంలోని 6వ గణంలో తప్పనిసరిగా జ గణం లేదా నల గణం రావాలి.
* 2, 4 పాదాల చివర తప్పకుండా గురువు ఉండాలి.
* 2, 4 పాదాల్లో 1 - 4 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది. 
* ప్రాస నియమం ఉంటుంది.
ఉదా: ఆ పరమ పురంధ్రుల యం
       దే పుణ్యాంగణ యుభిక్షయిడద య్యెకటా

ద్విపద
మాత్రా ఛందస్సులో ఉండి లయబద్ధంగా పాడుకోవడానికి వీలైంది. ద్విపదను తెలుగుకు పరిచయం చేసినవారు పాల్కురికి సోమనాథుడు. ఈయన తెలుగులో రాసిన తొలి దేశీ పురాణం బసవ పురాణం ద్విపద ఛందస్సులోనే రాయబడింది. తెలుగులో తొలి రామాయణం అయిన ‘రంగనాథ రామాయణం’ కూడా ఈ ఛందస్సులోనే రాయబడింది. గౌరన ‘నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం’ అనే గ్రంథాలను ద్విపదలోనే రాశారు. 

లక్షణాలు:
* రెండు పాదాలు ఉంటాయి.
* ప్రతి పాదంలో మూడు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం ఉంటాయి. 
* ప్రతి పాదంలో 1 - 3 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది. 
* ప్రాస నియమం ఉంటుంది. 
ఉదా: నిరుపమ విజ్ఞాన నిధి వశిష్ఠుండు

ముఖ్యాంశాలు
* ఇచ్చిన పద్య పాదం పొట్టిగా ఉంటే అది ద్విపద లేదా ఆటవెలది లేదా తేటగీతి అవుతుంది.
* పొట్టిగా ఉంటే గురువు, లఘువులను గుర్తించి గణ విభజన చేసి ఇంద్ర, సూర్యగణాల ప్రకారం గుర్తిస్తే మొదటి గణమే ఇంద్రగణమని మనకు స్పష్టమైతే ఈ పద్య పాదాన్ని ద్విపదగా గుర్తించాలి.
* ద్విపద మాదిరిగానే లక్షణాలను కలిగి ఉండి ప్రాస నియమం లేకపోతే దాన్ని మంజరీ ద్విపద అంటారు. వీటిని తెలుగుకు పరిచయం చేసినవారు శ్రీనాథుడు.

తరువోజ
తెలుగులో తొలి పద్య శాసనం అయిన అద్దంకి శాసనంలో తరువోజ పద్యాలు మొదటగా కనిపించాయి. ఇవి దంపుడు పాటలను పోలి ఉంటాయి.

లక్షణాలు:
* ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి.
* ప్రతిపాదంలో మూడు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం, మూడు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం ఉంటాయి.
* ప్రతిపాదంలో 1 - 3 - 5 - 7 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది.
* ప్రాస నియమం ఉంటుంది.

మధ్యాక్కర
ఈ పద్యాలు మొదట యుద్ధమల్లుడు వేయించిన బెజవాడ శాసనంలో కనిపించాయి. తర్వాత నన్నయ, ఎర్రన రాసిన అరణ్య పర్వాల్లో కూడా ఉన్నాయి. విశ్వనాథ సత్యనారాయణ రాసిన మధ్యాక్కరులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
ఆరుద్ర కూడా శుద్ధ మధ్యాక్కరులు అనే గ్రంథాన్ని రచించారు.

లక్షణాలు:
* ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి
* ప్రతిపాదంలో రెండు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం ఉంటాయి.
* 1 - 5 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది.
* ప్రాస నియమం ఉంటుంది.

ఉపజాతి పద్యాలు

లక్షణాలు:
* నాలుగు పాదాల నియమం రావచ్చు, రాకపోవచ్చు.
* ఉప గణాలు వస్తాయి.
* మూడు మూడు అక్షరాలను మొదటగానే గణంగా విభజించకూడదు.
* వచ్చిన గణమే ఎన్నిసార్లయినా రావచ్చు.
* వరుసక్రమం పాటించాల్సిన అవసరం లేదు.
* ప్రాస నియమం ఉండదు.
* ప్రాస యతి చెల్లుతుంది.

ఆటవెలది
ఆటవెలది అంటే అర్థం నాట్యగత్తె. ఈ పద్యాలకు ప్రసిద్ధి చెందిన శతకాలు వేమన, తెలుగు బాల శతకం.

లక్షణాలు:
* దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి.
* ప్రతి పాదంలో అయిదు గణాలు వస్తాయి.
* 1 - 3 పాదాల్లో మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉంటాయి.
* 2 - 4 పాదాల్లో అయిదు సూర్యగణాలు ఉంటాయి.
* ప్రతిపాదంలో 1 - 4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది. 
* యతి చెల్లనప్పుడు ప్రాసయతి వేసుకోవాలి.
* ప్రాస నియమం ఉండదు.
ఉదా: పొదలి పొదలి చెదల పొంగారి పొంగారి
        మించి మించి దిశలు ముంచి ముంచి

తేటగీతి
తేటగీతి అంటే అర్థం ఒక పాట.

లక్షణాలు:
* ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి.
* ప్రతి పాదంలో ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
* 1 - 4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది.
* ప్రాసయతి చెల్లుతుంది.
* ప్రాస నియమం ఉండదు.
ఉదా: శ్రమలు లేకయె ఫలంబులు దుమకబోవు

ముఖ్యాంశాలు: 
* గురు, లఘువులను గుర్తించి సూర్య, ఇంద్రగణాల ప్రకారం గణ విభజన చేసినప్పుడు వరుసగా సూర్యగణాలు ఉంటే అది ఆటవెలది.
* వరుసగా ఇంద్ర గణాలు కనిపిస్తే అది ద్విపద.
* ఒక సూర్యగణం వెంటనే ఇంద్రగణం కనిపిస్తే అది తేటగీతి.

సీసం
ఇది జానపద బాణీలో పాడటానికి వీలైంది.

లక్షణాలు:
* ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి.
* ప్రతి పాదంలో ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వస్తాయి.
* ప్రతి పాదాన్ని రెండు సమ భాగాలుగా విభజించాలి.
* ప్రతిపాదంలో 1, 3, 5, 7 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది.
* ప్రాస నియమం ఉండదు.
* ప్రాసయతి ఉంటుంది.
* సీస పద్యం తర్వాత తప్పకుండా ఆటవెలది లేదా తేటగీతి రాయాలి. అప్పుడే అది సంపూర్ణ సీసం లేదా ఎత్తు గీతి సీసం అవుతుంది.
ఉదా: హరి హర బ్రహ్మల పురిటి బిడ్డల జేసి
       జోల పాడిన పురంద్రీ లలామ

రచయిత: సూరె శ్రీనివాసులు

Posted Date : 04-02-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌