• facebook
  • whatsapp
  • telegram

విప‌త్తులు - నిర్వ‌హ‌ణ‌

విపత్తులు - నిర్వహణనిర్వచనాలు

‘‘సమాజం లేదా కమ్యూనిటీ సాధారణ నిర్మాణానికి, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ, అకస్మాత్తుగా లేదా తీవ్రంగా సంభవించే ఆపదే విపత్తు.’’     - ఐక్యరాజ్యసమితి.

‘‘ప్రభావిత కమ్యూనిటీ లేదా ప్రాంతం వెలుపలి నుంచి సహాయాన్ని కోరుకునేంతగా కోలుకోలేని విధంగా ప్రమాదానికిగురై, ఆర్థిక, ప్రాణ నష్టాన్ని కలిగించి, ఆరోగ్య సేవలను పతనం చేసే ఏదైనా ఘటనను విపత్తు అంటారు.’’     - ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)

‘‘ఏదైనా ప్రాంతంలో ప్రకృతిసిద్ధంగా లేదా మానవ కల్పిత కారణాల వల్ల లేదా ప్రమాదవశాత్తు లేదా నిర్లక్ష్యం వల్ల ప్రమాదం సంభవించి, సంబంధిత ప్రాంతంలో కోలుకోలేని విధంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టానికి కారణమయ్యే ఉపద్రవం లేదా ప్రమాదమే విపత్తు.’’     - విపత్తు నిర్వహణ చట్టం 2005

‘‘సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు ప్రాణాలను లేదా పర్యావరణాన్ని సంరక్షించడానికి అసాధారణ అత్యవసర చర్యలు అవసరమయ్యే ఉపద్రవ పరిస్థితిని విపత్తు అంటారు.’’     - కేంద్ర హోం మంత్రిత్వశాఖ


 అకస్మాత్తుగా సంభవించే ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవ తప్పిదాల వల్ల జరిగే సంఘటనలను ‘విపత్తులు’ అంటారు. వీటి వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతాయి.

​​​​​​​ విపత్తును ఆంగ్లంలో ‘డిజాస్టర్‌’ అంటారు.

​​​​​​​ ‘డిజాస్టర్‌’ అనే ఆంగ్ల పదం ‘డిస్‌’, ‘ఆస్టర్‌’ అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది.

​​​​​​​ గ్రీకులో ‘డిస్‌’ అంటే చెడు లేదా దుష్ట; ‘ఆస్టర్‌’ అంటే నక్షత్రం అని అర్థం.


విపత్తు సంభావ్యత

ఒక సమాజం, వ్యవస్థ, నిర్మాణం, భౌగోళిక ప్రాంతం ప్రమాదానికి లేదా విపత్తుకు గురయ్యే అవకాశం ఉండటాన్ని విపత్తు సంభావ్యత అంటారు.

 ఇది ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆర్థిక పరిస్థితి, నిరక్షరాస్యత, అవగాహన లేమి, పట్టణీకరణ, జనాభా పెరుగుదల మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది.

రకాలు

సంభవించే వేగం, కాలాన్ని బట్టి విపత్తులను  రెండు రకాలుగా విభజించారు.

1. నిదానంగా సంభవించి రోజులు, నెలల తరబడి కొనసాగే విపత్తులు:

​​​​​​​ కరవు, వాతావరణ కాలుష్యం, కీటకాల ద్వారా సంభవించే వ్యాధులు.

2. వేగంగా, ఆకస్మికంగా విస్తరించి, ముగిసిపోయే విపత్తులు:

​​​​​​​ ఇవి స్వల్పకాలం లేదా దీర్ఘకాలం ఉండొచ్చు. ఉదా: భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడం, తుపానులు, వరదలు, అగ్ని ప్రమాదాలు, కొండచరియలు విరిగిపడటం.

సంభవించే కారణాల ఆధారంగా విపత్తులు రెండు రకాలు.

సహజసిద్ధమైనవి: 

​​​​​​​  ప్రకృతి సహజ కారణాల వల్ల ఏర్పడిన విపత్తులు మానవ, భౌతిక, ఆర్థిక, పర్యావరణ నష్టాలకు దారితీస్తాయి.

ఉదా: భూకంపాలు, సునామీ, తుపాను, వరదలు, కరవు, సముద్రకోత, వేడిగాలులు, అతిశీతల గాలులు, టోర్నడోలు, హరికేన్‌లు మొదలైనవి.

మానవకారక విపత్తులు: ప్రభావిత ప్రజలు ఎదుర్కోలేని విధంగా మానవ, ఆర్థిక, పర్యావరణ నష్టాలకు దారితీసే మానవ ప్రేరేపిత వైపరీత్యాన్ని మానవకారక విపత్తు అంటారు.

ఉదాహరణ: అగ్ని ప్రమాదాలు, రసాయన (లేదా) పారిశ్రామిక ప్రమాదాలు, పర్యావరణ కాలుష్యం.

1984 - భోపాల్‌ గ్యాస్‌ ఘటన.

1997 - దిల్లీలోని ఉపహార్‌ సినిమాహాల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం.

2004 - కుంభకోణం (తమిళనాడు) పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదం.

లక్షణాలు

​​​​​​​​​​​​​​విపత్తులు ఆకస్మికంగా, అతివేగంగా సంభవిస్తాయి.

​​​​​​​వీటి స్వభావాన్ని ముందుగా ఊహించలేం.

​​​​​​​పర్యావరణ వనరులను ధ్వంసం చేసి ఒక ప్రాంత సుస్థిరాభివృద్ధిని దెబ్బతీస్తాయి.

​​​​​​​ప్రజల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరమైన వనరులను ధ్వంసం చేస్తాయి.

విపత్తు నిర్వహణ

విపత్తులు లేదా అత్యవసర పరిస్థితులపై నియంత్రణ సాధించడం, వాటి ప్రభావాన్ని తగ్గించడానికి లేదా వాటి నుంచి కోలుకోడానికి దోహదపడే విధానాలను అందించే ప్రక్రియను ‘విపత్తు నిర్వహణ’ అంటారు.

​​​​​​​​​​ దేశంలో మొదటిసారి పదో పంచవర్ష ప్రణాళికలో విపత్తుల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

​​​​​​​ విపత్తుల నిర్వహణకు కేటాయించే ఆర్థిక సాయంపై తప్పనిసరిగా సమీక్ష జరగాలని 12వ ఆర్థిక సంఘం పేర్కొంది.

​​​​​​​ కేంద్రంలో హోం మంత్రిత్వ శాఖ కొత్త నోడల్‌ మంత్రిత్వశాఖగా విపత్తుల నిర్వహణను చేపడుతోంది.

​​​​​​​ దేశంలో విపత్తుల నిర్వహణకు UNDP  సహాయం చేస్తుంది.

​​​​​​​ పంచాయతీలు, జిల్లా యంత్రాంగాన్ని పటిష్ఠం చేసి, విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధం చేయడం విపత్తు నిర్వహణ ముఖ్య ఉద్దేశం.

దశలు:

మొదటి దశ - విపత్తు సంభవించడం

రెండో దశ - అత్యవసర స్పందన, సాయం

మూడో దశ - పునరావాసం, పునర్నిర్మాణం

నాలుగో దశ - నష్ట నివారణ

అయిదో దశ - ప్రజల సంసిద్ధత

విపత్తులు - ప్రాథమిక పదాలు

వైపరీత్యాలు (Hazards): సహజ లేదా మానవ కార్యకలాపాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం కలిగించే శక్తి ఉన్న ప్రమాదకరమైన  పరిస్థితే వైపరీత్యం.

​​​​​​​హజార్డ్‌ అనే పదం పురాతన ఫ్రెంచ్‌ భాష నుంచి వచ్చింది.

దుర్భలత్వం (Vulnerability): ఏదైనా భౌగోళిక ప్రాంతం లేదా కమ్యూనిటీలో సంభవించే వైపరీత్యం వల్ల జరిగే నష్టం తీవ్రత పెరిగితే ఆ ప్రాంత పరిస్థితుల పరిధిని ‘దుర్భలత్వం’ అంటారు.

సామర్థ్యం (Capacity): ఏదైనా కమ్యూనిటీ ప్రాంతంలో సంభవించిన వైపరీత్యం వల్ల నష్టపోయిన ఆస్తులు, వనరులు, జీవనోపాధిని పునరుద్ధరించుకోగల శక్తి లేదా నైపుణ్యాలనే ఆ కమ్యూనిటీ సామర్థ్యం అంటారు. ఇది ఆ కమ్యూనిటీలోని ప్రజల సాంఘిక, ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. 

విపత్కర స్థితి (Risk): వైపరీత్యాలు లేదా దుర్భలత్వ పరిస్థితుల మధ్య పరస్పర చర్యల కారణంగా ఆర్థిక, అంతర్జాతీయ కార్యకలాపాలు, పర్యావరణ క్షీణతతో పాటు మరణాలు సంభవించడం, జీవనోపాధి కోల్పోవడం లాంటి హానికరమైన పర్యవసనాలు చోటు చేసుకునే సంభావ్యతను విపత్కర స్థితి అంటారు.


Posted Date : 29-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌