• facebook
  • whatsapp
  • telegram

జంతురాజ్యం (ఏనిమేలియా)

విభాగం - సరీసృపాలు

* సరీసృపాలు బాహ్యోష్ణ జీవులు (ఇవి శరీర ఉష్ణోగ్రతను వాటి పరిసరాల ఉష్ణంతో మార్పిడి చేసుకుని క్రమపరచుకుంటాయి; శీతల రక్త జంతువులు), ఉల్బంతో ఉండే ఉల్బదారులు.

* కార్బోనిఫెరస్‌ యుగంలో లాబరింతోడాంట్‌ ఉభయచరాల నుంచి సరీసృపాలు ఉద్భవించాయి. ఇవి మీసోజాయిక్‌ మహాయుగంలో సర్వోన్నతమైన సకశేరుకాలుగా ఎదిగాయి. అందుకే మీసోజాయిక్‌ మహాయుగాన్ని సరీసృపాల స్వర్ణయుగంగా పేర్కొంటారు. చాలా సరీసృపాలు నీరు దూరని క్లిడాయిక్‌ గుడ్లను నేలపై పెడతాయి. రంధ్రాలు గల కాల్కేరియస్‌ కర్పరం గాలిని అనుమతిస్తుంది. దీనివల్ల ఆక్సిజన్‌ లభిస్తుంది.

* గుడ్లలో పిండబాహ్య త్వచాలు ఉంటాయి. అవి ఉల్బం (అమ్మియన్‌), ఆళిందం (అలంటోయిస్‌), పరాయువు (ఖోరియాన్‌), సొనసంచి (యోక్‌ సాక్‌). ఇవి గుడ్డును స్వతంత్ర జీవనాధార వ్యవస్థగా చేస్తాయి.

* క్లిడాయిక్‌ గుడ్లకు అదనంగా ‘నీటి నష్టాన్ని’ అరికట్టడానికి ‘పొడిపొలుసుల చర్మం’, నేలపై కదలడానికి అనువైన నఖసహిత రెండు జతల పంచాంగుళీయ ఉపాంగాలు, పుప్పుస శ్వాసక్రియ, అంతర ఫలదీకరణం మొదలైన కీలక అనుకూలనాలు సరీసృపాల మనుగడకు దోహదపడ్డాయి.

* సరీసృపాల్లో విలుప్త డైనోసార్స్‌ (అతిపెద్ద తొండలు), ప్రస్తుత తాబేళ్లు, మొసళ్లు, పాములు, తొండలు, బల్లులు, స్పినోడాన్‌ ఉన్నాయి. శీతల రక్త చతుష్పాదుల అధ్యయనాన్ని హెర్పటాలజీ (herpatalogy) అంటారు.

* ఇవి మొట్టమొదటి నిజ భౌమ్యజీవులు. సాధారణంగా పాకుతూ లేదా బొరియలు చేసుకుని జీవించే చతుష్పాదులు. వీటి శరీరం తల, మెడ[, మొండెం, తోకగా విభజితమై ఉంటుంది.

* చర్మం గరుకుగా, పొడిగా ఉంటుంది. బాహ్యాస్థిపంజరంలో కొమ్ము సంబంధిత బహిస్త్వచ పొలుసులు, ఫలకాలు, నఖాలు ఉంటాయి. నఖాలు మొట్టమొదటగా సరీసృపాల్లో ఏర్పడ్డాయని చెప్పవచ్చు.

* దంతవిన్యాసం అగ్రదంత (ఏక్రోడంట్‌), సమదంత (హోమో డంట్‌), బహువార దంత (పాలీడంట్‌) రకాలకు చెందినవి. మొసళ్లలో మాత్రం క్షీరదాల మాదిరిగా ధీకోడాంట్‌ దంత రకం ఉంటుంది కిలోనియాలో దంతాలు ఉండవు.

* ఊపిరితిత్తులు శ్వాసవాయువుల మార్పిడికి తోడ్పడతాయి. పర్శుకలు (పక్క టెముకలు), పర్శుకాంతర కండరాలు స్వేచ్ఛగా గాలి పీల్చడానికి తోడ్పడతాయి. ఈ లక్షణం సకశేరుకాల పరిణామంలో సరీసృపాల్లో మొదటిసారి ఏర్పడింది. సముద్ర తాబేళ్లలో వాయు వినిమయం ప్రసరణయుత అవస్కర కుడ్యం ద్వారా జరుగుతుంది.

* హృదయంలో అసంపూర్తిగా విభజన చెందిన నాలుగు గదులు ఉంటాయి. మొసలి హృదయంలో నాలుగు గదులు ఉంటాయి. సిరాసరణి (సిరాశయం లేదా సైనస్‌ వెనోసస్‌) ఉంటుంది. మూలమహాధమని ఉండదు. మూడు ధమనీచాపాలు నేరుగా జఠరిక నుంచి ఏర్పడతాయి. ఎర్రరక్తకణాలు కేంద్రకసహితంగా ఉంటాయి. 

* మూత్రపిండాలు అంత్యవృక్క (మెటా సెప్టిక్‌) రకానికి చెందుతాయి. ఇవి నీటిని సంరక్షించే అనుకూలనాన్ని ప్రదర్శించే యూరికోటెలిక్‌ జంతువులు.

* పాముల్లో తప్ప మిగతావాటిలో 12 జతల కపాలనాడులు ఉంటాయి. పాముల్లో ఇవి 10 జతలే ఉంటాయి. కర్ణభేరిత్వచం బాహ్య శ్రవణకోటరం లోపలి హద్దు వద్ద ఉంటుంది. మధ్య చెవిలో కర్ణస్తంభిక అనే ఒక శ్రవణాస్థి ఉంటుంది.

* ప్రత్యేక ఘ్రాణనిర్మాణాలు, జేకబ్‌సన్‌ అవయవాలు బల్లులు, పాముల్లో చాలా అభివృద్ధి చెందాయి.

* అంతర ఫలదీకరణం జరుగుతుంది. అధికంగా అండోత్పాదకాలు. కొన్ని పాములు శిశూత్పాదకాలు. గుడ్లు అధిక పీతకయుత, క్లిడాయిక్‌ రకానికి చెందినవి.

విభాగం - పక్షులు 

* ఇందులో కొన్ని విలుప్త, ఎక్కువ వర్తమాన పక్షులు ఉన్నాయి. ఇవి ఈకలున్న ద్విపాద అంతరోష్ణ (ఎండోథెర్మిక్‌) సకశేరుకాలు. ఆధునిక ఎగిరే పక్షుల్లో స్వరూప, అంతర్నిర్మాణ, శరీరధర్మాలపరంగా మార్పులు జరిగి ఎగరగలిగే జీవనానికి అనువుగా మారాయి. ఈకలు, రెక్కలు, బలమైన ఉరఃకండరాలు, వాతులాస్థులు, అధిక జీవక్రియారేటు గల అంతరోష్ణం, సునిశితమైన దృష్టి జ్ఞానం మొదలైన అనుకూలనాలు ఉన్నాయి. ఈ లక్షణాలున్న పక్షులు మాస్టర్స్‌ ఆఫ్‌ ఎయిర్‌ (వైహాయన నిష్ణాతులు)గా పరిణామం చెందాయి.

* ఆధునిక సజీవ పక్షుల్లో కాళ్లపై బాహ్యచర్మ పొలుసులు, అంతర జత్రుక ఉండటం, యూరికోటెలిజం, బృహత్‌ పీతక గుడ్లు, నాలుగు బాహ్య పిండత్వచాలతో అభివృద్ధిచెందడం మొదలైన నమూనా సరీసృప లక్షణాల ఆధారంగా హక్స్‌ లే అనే శాస్త్రవేత్త వీటిని దివ్యమైన సరీసృపాలుగా వర్ణించాడు.

* జురాసిక్‌ యుగంలో ధీరోపాడ్‌ సరీసృపాల నుంచి ఉద్భవించిన పక్షులు క్రెటేషియస్‌ యుగంలో ఆధునికీకరణ చెందాయి.

* పక్షుల గురించి అధ్యయనం చేయడాన్ని ఆర్నిథాలజీ అంటారు. డా. సలీం అలీ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇండియన్‌ ఆర్నిథాలజిస్ట్‌. ఈయన్ను భారతదేశ పక్షి మనిషిగా అభివర్ణిస్తారు.

* శరీరం కోణాకారంలో తల, మెడ, మొండెం, అవశిష్ట తోకగా విభజితమై ఉంటుంది. పూర్వాంగాలు రెక్కలుగా మార్పు చెందాయి. చరమాంగాలు నడవడానికి, పరిగెత్తడానికి, ఈదడానికి, కొమ్మలను పట్టుకోవడానికి అనుకూలత చెంది ఉంటాయి.

* చర్మం పొడిగా, గ్రంథిరహితంగా ఉంటుంది. అయితే తోక ఆధారంలో ఒకే ఒక నూనె గ్రంథి లేదా ప్రీన్‌ గ్రంథి లేదా యురోపైజియల్‌ గ్రంథి ఉంటుంది.

వీటిలో బాహ్యాస్థిపంజరంలో బాహ్యచర్మ ఈకలు, కాళ్లపై ఉండే పొలుసులు, కాలివేళ్లకు ఉండే నఖాలు, ముక్కుపై ఉండే కొమ్ము స్వభావ తొడుగు (రాంఫోథీకా) ప్రత్యేక లక్షణంగా ఉంటాయి.

* పూర్తిగా అస్థీకరణ చెందిన అంతరాస్థిపంజరం ఉంటుంది. పొడవు ఎముకలు బోలుగా ఉండి గాలి కుహరాలను కలిగి ఉంటాయి.

* ఆధునిక ఎగిరే పక్షుల్లో బలమైన ఉరో కండరాలు ఉంటాయి. అవి - మహారసి (పెక్టోరలిస్‌ మేజర్‌), అల్పోరసి (పెక్టోరలిస్‌ మైనర్‌), కొరాకోబ్రేకియాలిస్‌.

* ప్రస్తుతం జీవించి ఉన్న పక్షుల్లో దంతాలు లేవు. ఆహారవాహిక తరచుగా ఆహారాన్ని నిల్వచేసే అన్నాశయంగా విస్తరించి ఉంటుంది. జీర్ణాశయం గ్రంథియుత జఠరిక, కండరయుత అంతర జఠరం విసిరేమరగా విభజితమై ఉంటాయి. సరీసృపాల్లో లాగా అవస్కరం మూడు గదులుగా విభజితమై ఉంటుంది.

* ఊపిరితిత్తులు కుదించినట్లు స్పంజికలాగా ఉంటాయి. వాయుకోశాలు ఉండవు. ఇవి వ్యాకోచించలేవు. వాయుగోణులు ఊపిరితిత్తులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. వాయుగోణులు నిరంతరం రక్తానికి ఆక్సిజన్‌ను అందిస్తాయి. అంతేకాకుండా ఎముకలకు వాతిలాస్థిత్వాన్ని  ఇస్తాయి.

* వాయు, శ్వాసనాళాలు కలిసే చోట శబ్దిని (సైరింక్స్‌) అనే ధ్వని ఉత్పాదకాంగం (ధ్వనిపెట్టె) ఉంటుంది. 

* నాలుగు గదుల హృదయం ఉంటుంది. సిరాశయం, మూలమహాధమని ఉండవు. కేవలం కుడి దైహిక చాపం మాత్రమే ఉంటుంది. వృక్కనిర్వాహక వ్యవస్థ  క్షీణించి ఉంటుంది. సరీసృపాల్లోలాగా ఎర్రరక్తకణాలు కేంద్రకసహితంగా ఉంటాయి.

* అంత్యవృక్క రకం మూత్రపిండాలు మూడు లంబికలతో ఉంటాయి. కేవలం ఆస్ట్రిచ్‌లలోనే మూత్రాశయం కనిపిస్తుంది. మిగతావాటిలో ఉండదు. పక్షులు సరీసృపాల మాదిరే యూరికోటెలిక్‌ జంతువులు.

* మెదడు పెద్దగా ఉంటుంది. ఘ్రాణ లంబికలు క్షీణించి ఉంటాయి. 12 జతల కపాలనాడులు ఉంటాయి. కళ్లలో దృఢఫలకాలు ఉంటాయి. కివిలో తప్ప మిగతా పక్షుల్లో ఘ్రాణశక్తి బాగా తక్కువగా ఉంటుంది.

* లైంగిక జీవులు వేర్వేరు. ఒక జత  ముష్కాలు ఉంటాయి. ప్రౌఢ పక్షిలో కుడి స్త్రీ బీజకోశం, కుడి స్త్రీ బీజవాహిక పూర్తిగా క్షీణించి ఉంటాయి. బాతులు, గీస్, ఎగరలేని పక్షుల్లో తప్ప ఇతర పురుష పక్షుల్లో సంపర్కాంగం ఉండదు.

* పక్షులన్నీ అండోత్పాదకాలు. గుడ్లు అధిక పీతక, క్లిడాయిక్‌ రకానికి చెందినవి. అంతర ఫలదీకరణం జరుగుతుంది. సరీసృపాల్లో మాదిరే అంతర్భంజిత, చక్రాభ విదళనం జరుగుతుంది. గుడ్డు నుంచి వచ్చిన పక్షుల పిల్లలు ఎగిరే పక్షుల్లో ఆర్టిసియల్‌గా, ఎగరలేని పక్షుల్లో ప్రికోసియల్‌గా ఉంటాయి.

ఉదా: కార్వస్‌ (కాకి), కొలంబా (పావురం), సిట్టాకులా (రామచిలుక), పావో (నెమలి), ఎటినోడైటిస్‌ (పెంగ్విన్‌), నియోఫ్రాన్‌ (రాబందు), కొరాసియస్‌ బెంగాలెన్సిస్‌ (బ్లూ జే - పాలపిట్ట). 

ఉభయ చరాలు

ఇవి మొట్టమొదటి చతుష్పాదులు. రెండు ఆవాసాల్లో అంటే నేల మీద, మంచినీటిలో జీవిస్తాయి. శరీరం తల, మొండెంగా స్పష్టంగా విభజితమై ఉంటుంది. తోక ఉండొచ్చు  లేదా ఉండకపోవచ్చు.

* ఇవి నీటి నుంచి వెలుపలికి వచ్చి నేలపై నడిచిన మొట్టమొదటి సకశేరుకాలు. ఈ చతుష్పాదులు వాటి పూర్వీకులైన చేపల లాగా (ఆస్టియోలెపిడ్స్‌) నీటిలో, భౌమ్య ఆవాసంలో  నివసించే సామర్థ్యం కలిగినవి.

ఇవి కార్బోనిఫెరస్‌ యుగంలో వృద్ధి చెందాయి. ఇవి పూర్తి స్థాయి భౌమ్య జీవులుగా ఏర్పడలేదు. ఎందుకంటే ప్రత్యుత్పత్తి, అభివృద్ధి ఇంకా జలావాసంలోనే జరుగుతోంది. ఎందుకంటే ఉభయ చరాల గుడ్లు నేలపై వెంటనే ఎండిపోతాయి. కఠినమైన భూతలంపై అనుకూలతకు తోడ్పడే కర్పరం లేదు.

* ఉభయ చరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బాట్రకాలజీ అంటారు.

* చర్మం నున్నగా, పొలుసులు లేకుండా (ఎపోడాకు చెందిన జీవుల్లో ఉంటాయి), తేమగా, గ్రంథులతో ఉంటుంది. రెండు జతల సమాన లేదా అసమాన పంచాంగుళీయక గమనాంగాలు ఉంటాయి (సిసీలియన్లలో మాత్రం గమనాంగాలు ఉండవు). 

* ఉరోస్థి (స్టెర్ణం) మొదటిసారిగా ఉభయచరాల్లో కనిపిస్తుంది. శ్వాసవాయువుల వినిమయం చర్మం సాయంతో ఎక్కువగా జరుగుతుంది. పుపుస, ఆస్యగ్రసని శ్వాసక్రియలు కూడా జరుగుతాయి.

* మూడు గదుల హృదయం, సిరాసరణి, మూల మహాధమని ఉంటాయి. మూడు జతల ధమనీ చాపాలు, అభివృద్ధి చెందిన నిర్వాహక వ్యవస్థలు ఉంటాయి. ఎర్రరక్త కణాలు కేంద్రక సహితంగా ఉంటాయి.

* మూత్రపిండాలు మధ్యవృక్క రకానికి చెందినవి. ప్రౌఢ జీవులు యూరియాను స్రవించే యూరియోటెలిక్‌ జీవులు.

* మెదడులో వెలుపలి పరాశిక, లోపలి మృద్వి అనే మెనింజెస్‌ ఉంటాయి. పది జతల కపాల నాడులు ఉంటాయి.

* మొట్టమొదటిసారిగా ఉభయచరాల్లో కర్ణభేరి, లాక్రిమల్, హర్డేరియన్‌ గ్రంథులు ఏర్పడ్డాయి.

* సాధారణంగా బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. అభివృద్ధి చాలా వరకు పరోక్షంగా ఉంటుంది.

* ఉదాహరణలు: బ్యూఫో (గోదురుకప్ప), రానా (కప్ప), హైలా (చెట్టు కప్ప).

* శీతాకాల సుప్తావస్థ, గ్రీష్మకాల సుప్తావస్థ: పూర్తి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అంటే అధిక చలి, పొడిగా, వేడిగా ఉన్న ఎండాకాలంలో కప్పలు మృదువైన తేమ నేలలో కూరుకుని తమను తాము ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడుకుంటాయి. ఈ కాలంలో కప్పలు వాటి జీవక్రియలను బాగా తగ్గించి గ్లైకోజన్, కొవ్వు నిల్వలపై జీవిస్తాయి. కేవలం చర్మ శ్వాసక్రియను మాత్రమే నిర్వహిస్తాయి. శీతాకాలంలో కప్పల చర్యారహిత జీవితాన్ని శీతాకాల సుప్తావస్థ (హైబర్నేషన్‌) లేదా శీతాకాల నిద్ర అంటారు. అదే ఎండాకాలంలో అయితే గ్రీష్మ కాల సుప్తావస్థ (ఈష్టివేషన్‌) లేదా గ్రీష్మకాల నిద్ర అంటారు.
కమొఫ్లేజ్‌ (Camouflage): కప్పలు వాటి పరిసరాలకు అనుగుణంగా చర్మం రంగును మార్చుకుంటాయి. దీనివల్ల వాటిని శత్రువులు గుర్తించవు. ఇలా శత్రువుల నుంచి రక్షించుకోవడానికి రంగులు (రక్షణాత్మక వర్ణత్వం) మార్చుకోవడాన్ని కమొఫ్లేజింగ్‌ అంటారు.

చతుష్పాదులు (టెట్రాపొడా జీవులు)

* టెట్రాపొడాలో ఉభయ చరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అనే నాలుగు విభాగాలున్నాయి. టెట్రాపొడా చాలావరకు భౌమ్య జీవులు. కొన్ని మాత్రం జలచరాలు లేదా ఉభయ చరాలు.

* వీటిలో సాధారణంగా రెండు జతల పంచాంగుళిక అంగాలు ఉంటాయి. ఊపిరితిత్తులు, శ్వాసవాయువుల మార్పిడికి ముఖ్యమైన అవయవాలు అయితే చాలావరకు ఉభయ చరాల్లో చర్మం కూడా వాయు వినిమయానికి ముఖ్య స్థానంగా ఉపయోగపడుతుంది.

ప్లాటిహెల్మింథిస్‌

* ఈ జీవుల దేహం పృష్టోదరాలుగా అణిగి ఉంటుంది. 

* అందువల్ల వీటిని బల్లపరుపు పురుగులు అంటారు. ఇవి మానవులతో పాటు జంతువుల్లోనూ నివసించే అంతర పరాన్నజీవులు.  

* ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగిన మొదటి జీవులు.

* ఇవి త్రిస్తరిత, శరీరకుహరరహిత లక్షణాలను, అవయవ స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి. 

* దేహంలో నిజ ఖండీభవనం ఉండదు. కానీ కొన్ని మిథ్యా ఖండీభవనాన్ని ప్రదర్శిస్తాయి. ఇవి మధ్యస్థ శీర్షతను కలిగి ఉంటాయి. ఈ జీవులు ఏకదిశా మార్గంలో ప్రయాణిస్తాయి.

* పరాన్న జీవుల్లో కొక్కేలు, చూషకాలు ఉంటాయి. జీర్ణవ్యవస్థ ఉంటే, నోరు మాత్రమే ఉంటుంది, పాయువు ఉండదు. నాడీవ్యవస్థ మితంగా ఎదిగి, మెదడు (మస్తిష్క నాడీసంధులు) నాడీదండాలను కలిగి నిచ్చెనలా ఉంటుంది. 

* ప్రత్యేక విసర్జక జ్వాలాకణాలు (ప్రాథమిక వృక్కాలు) ద్రవాభిసరణ క్రమతను, విసర్జనను నిర్వహిస్తాయి. 

* ఇవి ఉభయలింగజీవులు, అంతర ఫలదీకరణ జరుగుతుంది. పరోక్ష పిండాభివృద్ధి జరిగి, అనేక డింభక దశలు (మిరాసీడియం, స్పోరోసిస్ట్, రీడియా, సర్కేరియా) ఏర్పడతాయి. 

* కొన్ని జీవులు సాధారణంగా బహు పిండత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఉదా: లివర్షాక్‌ 

* ప్లనేరియాలో పునరుత్పత్తి అధిక స్థాయిలో ఉంటుంది. ఉదా: టీనియా, ఫాసియోలా, షిస్టోసోమా, డుగేసియా.

నిమటోడా

* మిథ్యా శరీరకుహరం, ఏకమార్గ ఆహారనాళం, నాళంలో నాళం నిమటోడా ప్రత్యేకతలు.

* నిమటోడా దేహం అడ్డుకోతలో వర్తులాకారంగా ఉంటుంది. అందుకే వీటికి ‘గుండ్రటి పురుగులు’ అని పేరు వచ్చింది. వీటిలో కొన్ని స్వేచ్ఛాజీవులు. మిగిలినవి మొక్కలు, జలచరాలు, భూచర జంతువుల్లో పరాన్నజీవులుగా జీవిస్తాయి.

* గుండ్రటి పురుగులు అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి. 

* ఇవి ద్విపార్శ్వ సౌష్టవ, మిథ్యాశరీరకుహర, త్రిస్తరిత జీవులు. 

* దేహం ఖండితరహితం. దీన్ని ఆవరించి పారదర్శకమైన, దృఢమైన రక్షక కొల్లాజన్‌ నిర్మిత అవభాసిని ఉంటుంది. 

* కొన్నిటిలో సిన్సీషియల్‌ లేదా బహుకేంద్రక బాహ్యచర్మం ఉంటుంది. 

* ఆహారనాళం సంపూర్ణంగా ఉంటుంది. ఇందులో నోరు బాగా అభివృద్ధి చెంది కండరసహిత గ్రసని, పాయువు ఉంటాయి. విసర్జక వ్యవస్థలో రెనిట్‌ గ్రంథులు (విసర్జక గ్రంథులు), కుల్యలు ఉంటాయి. 

* నాడీవ్యవస్థలో పరిఆంత్ర నాడీవలయం - నాడీసంధులు, నాడులు ఉంటాయి. 

* దేహంలో ఆంఫిడ్లు, ఫాస్మిడ్లు లాంటి జ్ఞానాంగాలు ఉంటాయి. 

* ఇవి ఏకలింగ జీవులు. లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తాయి. సాధారణంగా ఆడజీవులు పొడవుగా, మగజీవుల కంటే పెద్దవిగా ఉంటాయి. 

* మగజీవుల పరాంతం వంపు తిరిగి, అవస్కర రంధ్రం, ఒకటి లేదా రెండు సంపర్క కంటకాలను కలిగి ఉంటుంది. అంతర ఫలదీకరణం జరుగుతుంది. ఇవి ఎక్కువగా అండోత్పాదకాలు (ఉదా: ఆస్కారిస్‌), కొన్ని అండ-శిశూత్పాదకాలు (ఉదా: ఉచరేరియా), పిండాభివృద్ధి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జరుగుతుంది. 

* ప్రత్యక్ష పద్ధతిలో ఏర్పడే పిల్ల జీవులు ప్రౌఢజీవులను పోలి ఉంటాయి. పరోక్ష పద్ధతిలో డింభక దశ ఉంటుంది. నాలుగు నిర్మోచనాలు జరిగాక ప్రౌఢజీవిగా మారుతుంది. ఉదా: ఆస్కారిస్, ఉచరేరియా, ఆంకైలోస్టోమా.

అనెలిడా

* అనెలిడా అనే పదాన్ని లామార్క్‌ ప్రతిపాదించాడు. 

* ఇవి జలచర (సముద్ర లేదా మంచినీటి) లేదా భూచర జీవులు. సాధారణంగా స్వేచ్ఛాజీవులు, కొన్ని పరాన్నజీవులు.

* ఈ జీవుల్లో శరీరనిర్మాణం అవయవ వ్యవస్థ స్థాయిని కలిగి ఉంటుంది. 

* వీటిలో ఖండిత దేహ నమూనా కనిపిస్తుంది. ఇవి త్రిస్తరిత, సమఖండ విన్యాసాన్ని (మెటామెరిజం) ప్రదర్శించే నిజ శరీరకుహర జీవులు. 

* వీటి దేహం, శరీరకుహరం అడ్డు విభాజకాలతో ఖండితాలుగా విభజితమవుతుంది.

* దేహకుడ్యంలో వర్తుల కండరాలు, ఆయత కండరాలు ఉంటాయి. ఈ కండరాలు గమనానికి సహాయపడతాయి.

* శరీరకుహరంలోని శరీరకుహరద్రవం ఒక జలస్థితిక అస్థిపంజరంలా పనిచేస్తూ, శరీర భాగాలకు బలాన్ని కలిగిస్తూ గమనానికి సహాయపడుతుంది. 

* జలచర అనెలిడా జీవులు పార్శ్వ ఉపాంగాలను కలిగి ఉంటాయి. వీటిని పార్శ్వ పాదాలు (పారాపోడియ) అంటారు. ఇవి ఈదడంలో సహాయపడతాయి.  ఉదా: నీరిస్‌

* కొన్ని జీవుల్లో కైటిన్‌ నిర్మిత శూకాలు, చూషకాలు కూడా చలనానికి తోడ్పడతాయి. వీటిలో శీర్షత ఎక్కువ ప్రస్ఫుటంగా ఉండి స్పష్టమైన తల, జ్ఞానాంగాలు ఉంటాయి. 

* సక్రియ శరీరకుడ్యం ద్వారా వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. నీరిస్‌ లోని ప్రసరణ సహిత పార్శ్వపాదాలు శ్వాసక్రియలో కూడా సహాయపడతాయి. 

* సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. హిమోగ్లోబిన్, క్లోరోక్రురిన్‌ లాంటి శ్వాసవర్ణకాలు ప్లాస్మాలో కరిగి ఉంటాయి. 

* వృక్కాలు ద్రవాభిసరణ క్రమతకు, విసర్జనక్రియకు ఉపయోగపడతాయి. వీటి నాడీ వ్యవస్థలో రెండు జతల నాడీ సంధులు గ్రసని చుట్టూ ఉండే పార్శ్వనాడుల ద్వారా కలపబడి నాడీ వలయం ఏర్పడుతుంది. 

* నేత్రాలు, స్పర్శాంగాలు, స్పర్శకాలు మొదలైన జ్ఞానావయవాలు కొన్ని జీవులలో ఉంటాయి. 

* ఇవి ఏకలింగ జీవులు (స్త్రీ, పురుష జీవులు వేరుగా ఉంటాయి. ఉదా: నీరిస్‌) లేదా ఉభయలింగ జీవులు (ఉదా: వానపాములు, జలగలు). ప్రత్యుత్పత్తి సాధారణంగా లైంగికంగా జరుగుతుంది. 

* ఉభయలింగ జీవులలో ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది. ఏకలింగ జీవులలో పరోక్ష పిండాభివృద్ధి జరుగుతుంది. జీవితచరిత్రలో ప్రత్యేకమైన ట్రోకోఫోర్‌ డింభకం ఏర్పడుతుంది. ఉదా: నీరిస్, ఫెరిటిమా (వానపాము), మెగాస్కోలెక్స్, హైరుడినేరియా (జలగ).

మొలస్కా

* జంతుసామ్రాజ్యంలో మొలస్కా రెండో అతిపెద్ద వర్గం. 

* మొలస్కా జీవులు భూచరాలు లేదా జలచరాలు (సముద్ర లేదా మంచినీటి).

* ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి (కొన్ని సౌష్ఠవరహితంగా ఉంటాయి. ఉదా: నత్త). ఇవి సీలోమేట్‌ జంతువులు. దేహాన్ని కప్పి కాల్కేరియస్‌ కర్పరం ఉంటుంది (చాలావరకు బాహ్యకర్పరం, కొన్నింటిలో అంతర కర్పరం ఉంటుంది. కొన్నింటిలో క్షీణిస్తుంది, మరి కొన్నింటిలో ఉండదు). 

* స్పష్టమైన తల, కండరయుత పాదం, అంతరాంగ సముదాయాన్ని కలిగి, ఇవి ఖండితరహితంగా ఉంటాయి. 

* అంతరాంగ సముదాయాన్ని కప్పి ఉంచుతూ ఒక మృదువైన ప్రావారం ఉంటుంది. ఇది కర్పరాన్ని ఏర్పరుస్తుంది. 

* టీనిడియా శ్వాస, విసర్జక విధులను నిర్వహిస్తాయి. తల పూర్వభాగంలో జ్ఞాన స్పర్శకాలు ఉంటాయి. 

* నిజసీలోమ్‌ మూత్రపిండాలు, బీజకోశాలు, పరిహృదయ కుహరానికి పరిమితమై ఉంటుంది. 

* రాడ్యులా ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడుతుంది.

* సెఫలోపొడా జీవులలో తప్ప మిగతా జీవులలో వివృత రక్తప్రసరణవ్యవస్థ ఉంటుంది. రక్తంలో రాగిని కలిగిన హీమోసయనిన్‌ అనే శ్వాసవర్ణకం ఉంటుంది. 

* నాడీవ్యవస్థలో నాడీసంధులు, సంధాయకాలు, సంయోజకాలు ఉంటాయి. స్పర్శకాలు, కళ్లు, ఓస్పేడ్రియం (నీటిస్వచ్ఛతను పరీక్షిస్తుంది - బైవాల్వియా, గాస్ట్రోపోడ్‌ జీవులలో ఉంటుంది) మొదలైన జ్ఞానాంగాలుంటాయి.

* విసర్జకావయవాలు అంత్యవృక్కాలు (సాధారణంగా మూత్రపిండాలు అంటారు). సాధారణంగా ఇవి ఏకలింగజీవులు, అండోత్పాదకాలు. పిండాభివృద్ధి పరోక్షంగా జరిగి, విశేషగుణం కలిగిన శైలికామయ వెలిజర్‌ డింభకం (రూపాంతరం చెందిన ట్రోకోఫోర్‌ డింభకం) ఏర్పడుతుంది. ఉదా: పైలా, పింక్టాడా, సెపియా, లాలిగో, ఆక్టోపస్, ఎప్లీసియా, డెంటాలియం

ఆర్థ్రోపోడా


* జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం ఆర్థ్రోపోడా. ఇందులో అతిపెద్ద విభాగం ఇన్సెక్టా. భూమి మీద నామీకరించిన జాతులలో మూడింట రెండువంతుల పైన ఆర్థ్రోపోడా జీవులే. జంతుజాతులలో ఇవి 80% వరకు ఉంటాయి 

* ఇవి ద్విపార్శ్వసౌష్ఠవం, సమఖండ విన్యాసం కలిగిన నిజశరీర కుహర (షైజోసీలోమేట్లు) జంతువులు.

* వీటి దేహం కైటిన్‌ నిర్మిత బాహ్యాస్థిపంజరంతో కప్పి ఉంటుంది. ఇది దేహ రక్షణకు, నీటి నష్ట నివారణకు తోడ్పడుతుంది. దేహ పెరుగుదలను అనుమతించడానికి ఆవర్తనంగా ఇది విసర్జితమవుతుంది. ఈ ప్రక్రియను నిర్మోచనం అంటారు. 

* దేహం ఖండితాలుగా విభజించబడి తల, ఉరం, ఉదరం అనే భాగాలను కలిగి ఉంటుంది. వీటికి కీళ్లు కలిగిన ఉపాంగాలు ఉంటాయి. వీటి కండరాలు రేఖిత రకానికి చెందినవి; వేగంగా చలించడానికి తోడ్పడతాయి

* శరీరకుహరం క్షీణించి బీజకోశాలు, విసర్జకాంగాల చుట్టూ ఉండే ప్రదేశానికి పరిమితమవుతుంది. శరీరకుహరం ఒక రక్తకుహరం (హీమోసీల్‌). కానీ ఇది నిజమైన శరీరకుహరం కాదు: 

* ఈ జీవులలో మొప్పలు, పుస్తకాకార మొప్పలు, పుస్తకాకార ఊపిరితిత్తులు లేదా వాయునాళాల లాంటి శ్వాసావయవాలుంటాయి. వివృత రక్తప్రసరణవ్యవస్థ ఉంటుంది. హృదయం పృష్ఠభాగంలో ఉంటుంది. కొన్ని జీవులలో (ఉదా: క్రస్టేషియన్లు) రక్తం లేదా రక్త శోషరసం రాగి (కాపర్‌) కలిగిన శ్వాసవర్ణకం హీమోసయనిన్‌ను కలిగి ఉంటుంది. 

*  నాడీవ్యవస్థ అనెలిడా రకానికి చెంది, నాడీ వలయం (ఆహారవాహిక చుట్టూ), ద్వంద్వ ఉదర నాడీదండాన్ని కలిగి ఉంటుంది. స్పర్శశృంగాలు, నేత్రాలు (సంయుక్త, సరళ), సంతులన కోశాలు (సమతాస్థితి అవయవాలు) లాంటి జ్ఞానాంగాలుంటాయి. విసర్జన మాల్ఫీజియన్‌ నాళికలు, హరిత గ్రంథులు, కోక్సల్‌ గ్రంథుల ద్వారా జరుగుతుంది.

* ఇవి చాలావరకు ఏకలింగ జీవులు. సాధారణంగా అంతర ఫలదీకరణ జరుగుతుంది. ఇవి చాలావరకు అండోత్పాదకాలు. పిండాభివృద్ధి ప్రత్యక్ష లేదా పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. జీవిత చరిత్రలో ఒకటి నుంచి అనేక డింభక దశలు ఏర్పడి రూపవిక్రియ చెంది ప్రౌఢజీవులుగా మారతాయి. ఉదా: ఆర్థిక ప్రాముఖ్య కీటకాలు - ఎపిస్‌ మెల్లిఫెరా (తేనెటీగ), బాంబిక్స్‌ మోరి (పట్టు పురుగు), లాక్సిఫర్‌ లక్కా (లక్కపురుగు);

* వ్యాధికారక జీవులకు సామాన్యమైన వాహకాలు- ఎనాఫిలిస్, క్యూలెక్స్, ఎడిస్‌ జాతుల దోమలు 

* సమూహాలుగా నివసించే చీడలు - లోకస్టా (మిడత);

సజీవ శిలాజం - లిమ్యులస్‌ 

కార్డేటా

* ఈ సమూహం అధిక జాతులు ఉన్న పెద్ద జంతువర్గం. పృష్ట వంశం లేదా నోటో కార్డ్‌ను కలిగి ఉండటం దీని ముఖ్య లక్షణం. కార్డేటా జంతువుల జీవిత కాలంలో ఏదో ఒక దశలో ఇది కనిపిస్తుంది.

* సకశేరుకాలు ప్రికేంబ్రియన్‌ కాలంలో ఇకైనోడర్మ్‌ డింభకం లాంటి పూర్వీకుల నుంచి ఉద్భవించాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

*  కార్డేటాలో ప్రోటోకార్డేట్స్‌ (ట్యునికేట్స్, లాన్సెట్స్‌), సకశేరుకాలు (సైక్లోస్టోమేటాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు) ఉన్నాయి.

* ఇందులో చాలావరకు జలచర జీవులు; కొన్ని ఉభయచరాలు లేదా భౌమ్య జీవులు. వీటి శరీర పరిమాణం ఆకారంలో తేడాలు ఉన్నప్పటికీ వాటి ప్రాథమిక శరీర రచనలో పోలికలు ఉంటాయి.

* ప్రస్తుతం ఉన్న సకశేరుక జంతువుల్లో సముద్ర క్షీరదమైన నీలి తిమింగలం (బెలనాప్టిరా మస్కులస్‌) అతి పెద్దది. రెండో స్థానంలో తిమింగలం షార్క్‌ (రైనోడాన్‌ టైపస్‌) ఉంది.

లక్షణాలు: కార్డేటాకు నాలుగు ప్రధాన లక్షణాలు ఉన్నాయి.

పృష్ట వంశం:

* ఇది పృష్ట మధ్యరేఖ మీదుగా ఆహార నాళానికి, పృష్ట నాడీదండానికీ మధ్య ఉండే ఒక స్థితిస్థాపక కడ్డీ లాంటి నిర్మాణం. పిండంలో కనిపించే మొదటి అంతర అస్థిపంజర భాగం. 

* ఇది పిండ పృష్ట వంశ మధ్యత్వచం నుంచి ఏర్పడుతుంది. దీని అంతర్భాగంలో రిక్తికాయుత కణాలు ఉంటాయి. వాటిని ఆవరిస్తూ లోపల మందమైన తంతుయుత సంయోజక కణజాలపు తొడుగు, బయట పలచటి స్థితిస్థాపక సంయోజక కణజాలపు తొడుగులు ఉంటాయి.

పృష్టనాళికాయుత నాడీదండం:

* పృష్ట వంశానికిపైన, పృష్ట శరీరకుడ్యానికి కింద ఒకే ఒక నాడీదండం ఉంటుంది. ఇది బోలుగా, నాళంలా, ద్రవంతో నిండి ఉంటుంది. ఇది అకశేరుకాల్లోలాగా కాకుండా నాడీకణ సంధి రహితంగా ఉంటుంది. 

* పిండదశలో పృష్టవంశంపై ఉన్న బహిత్వచపు పొర పృష్ట మధ్యభాగం కిందకి కుంగి నాడీదండం ఏర్పడుతుంది. 

* ఉన్నత కార్డేటాల్లో దీని పూర్వభాగం పెద్దగా విస్తరించి మెదడుగా, మిగిలిన భాగం వెన్నుపాముగా విభేదనం చెందుతుంది.

గ్రసని మొప్ప చీలికలు లేదా రంధ్రాలు:

* గ్రసని పార్శ్వ కుడ్యంలో వరుసగా గ్రసని చీలికలు లేదా రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా గ్రసని కుహరం నుంచి నీరు బయటకు ప్రవహిస్తుంది. ఇవి బాహ్య అంతస్త్వచం నుంచి ఏర్పడతాయి. 

* ప్రాథమిక కార్డేట్లు, చేపలు, కొన్ని ఉభయచరాల్లో ఇవి జీవితాంతం ఉంటాయి. 

* గ్రసని కుడ్యరంధ్రాలు ప్రసరణ పటలికల అభివృద్ధి వల్ల మొప్పలు (బ్రాంకి)గా మారి శ్వాస వాయువుల మార్పిడికి తోడ్పడతాయి. అనేక ఉభయచరాల్లో ఇవి డింభక దశలో ఉండి ప్రౌఢ జీవుల్లో కనిపించవు. ఉల్బధారుల్లో క్రియారహిత గ్రసని కోశాలు పిండాభివృద్ధి ప్రారంభంలో ఏర్పడి, ఆ తర్వాత అదృశ్యమవుతాయి. పిండాభివృద్ధి ప్రారంభంలో ఇవి కనిపించడం వల్ల ఈ జీవుల పూర్వీకులు జలచరాలని తెలుస్తోంది.

పాయు పరపుచ్ఛం (పోస్ట్‌ ఆనల్‌టైల్‌):

* సకశేరుకాల పుచ్ఛం పాయువుకు పరభాగంలో పెరిగి ఉంటుంది. చాలా జాతుల్లో ఇది పిండాభివృద్ధి చివరి దశలో కనిపించదు. 

* దీనిలో అస్థిపంజర మూలపదార్థాలు, కండరాలు ఉంటాయి. అయితే శరీరకుహరం, అంతరాంగ అవయవాలు ఉండవు.

* జలచర జీవులు ముందుకు కదలడానికి, కంగారూ లాంటి కొన్ని భౌమ్య జీవుల్లో సమతుల్యతా అవయవంగా ఇది తోడ్పడుతుంది. 

* కార్డేట్లు డ్యుటెరోస్టోమియేట్‌ స్థితిని, వ్యాసార్ధ - అనిర్ధారిత విదళనాన్ని, ఆంత్ర శరీర కుహరాన్ని ఇకైనోడర్మ్‌తో పంచుకుంటాయి.

ఇరత లక్షణాలు:

* ద్విపార్శ్వ సౌష్టవం, త్రిస్తరిత లక్షణం, అవయవ స్థాయి వ్యవస్థీకరణ, దేహఖండీభవనం, శీర్షత, ఆంత్రకుహర శరీరకుహరం (ఉన్నత కార్డేట్లలో దీని స్థానంలో ద్వైతీయక షైజోసీలిక్‌ శరీకకుహరం ఉంటుంది), సంపూర్ణ ఆహారనాళం, బంధిత లేదా సంవృత రక్తప్రసరణ వ్యవస్థ, ఉదర కండరజనిత హృదయం, ఫాస్ఫోక్రియాటిన్‌ మొదలైనవి కార్డేట్ల ఇతర ముఖ్య లక్షణాలు.

కార్డేటా వర్గాన్ని మూడు ఉపవర్గాలుగా విభజించారు. అవి: 

యూరోకార్డేటా లేదా ట్యునికేటా:

* యూరోకార్డేటాలన్నీ సముద్ర జీవులు. నీటి ఉపరితలం నుంచి అధిక లోతు వరకు కనిపిస్తాయి. ఇవి వృంతరహిత (ఎసీడియన్స్‌) లేదా నీటిపై తేలే (సాల్ప, డోలియోలం), ఏకాంత (ఎసీడియా) లేదా సహనివేశ (పైరోసోమా) జంతువులు.

* శరీరం ఖండితరహితమై, మిగిలిన జంతువుల్లోలాగా కాకుండా సెల్యులోజ్‌ నిర్మితమైన కంచుకంతో ఆవరించి ఉంటుంది. 

* శరీరకుహరం ఉండదు. అయితే గ్రసని చుట్టూ బహిస్త్వచంతో ఆవరించి ఉన్న ఏట్రియల్‌ కుహరం ఉంటుంది. మొప్ప చీలికలు, పాయువు, జననేంద్రియ నాళాలు, దీనిలోకి తెరుచుకుని ఉంటాయి.

* గ్రసని ఉదరకుడ్యంపై ఉండే అంతర కీలితం సకశేరుకాల థైరాయిడ్‌ గ్రంథి ఏర్పాటును సూచిస్తుంది. ఏట్రియల్‌ పృష్ట లేదా పర ఏట్రియల్‌ రంధ్రం ద్వారా బయటికి తెరుచుకుంటుంది. సంపూర్ణ జీర్ణనాళం ఉంటుంది. అంతర్నిర్మాణం గ్రసనికుడ్యంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ మొప్ప చీలికలు ఉంటాయి.

* వివృతరక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. హృదయం నాళాకారంలో ఉదర భాగంలో ఉంటుంది. రక్త ప్రవాహాన్ని ఏకాంతరంగా వ్యతిరేక దిశల్లో పంపడం దీని ప్రత్యేకత.

* నాడీ వ్యవస్థ ప్రౌఢ జీవుల్లో ఒక పృష్ట నాడీ సంధిగా ఉంటుంది. ఇది ద్విలింగ లేదా ఉభయ లైంగిక జీవులు. జీవి అభివృద్ధి దశలో తోకతో స్వేచ్ఛగా ఈదే టాడ్‌పోల్‌ డింభకంలా ఉంటుంది. ఈ డింభకంలో తోక భాగాన, బోలుగా ఉన్న నాడీదండం; తోకకు పరిమితమైన పృష్టవంశం ఉంటాయి. అందుకే ఈ జీవులను యూరోకార్డేటాలు అంటారు.

ఉదా: ఎసీడియా, సాల్ప, డోలియోలం, పైరోసోమా, ఆయికోఫ్లూరా

సెఫలోకార్డేటా:

* ఇవి సముద్రం అడుగున తక్కువ లోతులో ఇసుకలో కూరుకుని ఉంటాయి. చిన్న చేపల్లా పారదర్శకంగా ఉంటాయి. మధ్యస్థ వాజాలుంటాయి. వీటిని సాధారణంగా నమూనా సకశేరుకాలు అంటారు. వీటిలో సకశేరుకాల ముఖ్య లక్షణాలైన పృష్ట వంశం నాళికాయుత నాడీదండం, గ్రసని చీలికలు జీవితాంతం ఉంటాయి. వృష్టవంశం పరాంతం నుంచి నాడీ దండాన్ని దాటి పూర్వాంతం వరకు ఉంటుంది. అందుకే వాటిని సెఫలోకార్డేట్లు అంటారు.

* కండరాలు కండర ఖండితాలుగా (కండరాల దిమ్మలు) ఏర్పడి ఉంటాయి. ఆంత్రకుహరం ఉంటుంది. ఇవి శైలికామయ లేదా గాలన పోషకాలు. గ్రసనిని చుట్టి బహిస్త్వచంతో ఆవరించిన ఏట్రియల్‌ ఉంటుంది. గ్రసని ఉదరకుడ్యంపై ఎండోస్టైల్‌ ఉంటుంది. శ్వాసవాయువుల వినిమయం చాలా వరకు బాహ్య శరీర ఉపరితలంలో జరుగుతాయి. 

* రక్తప్రసరణ వ్యవస్థ సంవృత రకానికి చెందింది. హృదయం, రక్త కణాలు, శ్వాసవర్ణకం ఉండవు. సొలినోసైట్లను కలిగి ఉండే ప్రాథమిక వృక్కాలు విసర్జక అంగాలుగా పనిచేస్తాయి. 

* గ్రసని భాగంలో బీజవాహికలు లేని అనేక జతల బీజకోశాలు ఉంటాయి. బాహ్యఫలదీకరణం, పరోక్ష అభివృద్ధి జరుగుతుంది. స్వేచ్ఛగా ఈదే శైలికామయ డింభక దశ ఉంటుంది.

* ఉదా: బ్రాంకియోస్టోమా (ఆంఫియాక్సస్‌ లేదా లాన్లెట్‌)

వర్టిబ్రేటా/ సకశేరుకాలు/ క్రేనియేటా:

* ఈ సమూహ జంతువులు పిండ దశలో పృష్ట వంశంతో ఉంటాయి. ప్రౌఢజీవుల్లో దీని స్థానంలో పాక్షికంగా లేదా సంపూర్ణంగా మృదులాస్థి లేదా అస్థికశేరుదండం ఉంటుంది.

* సకశేరుకాలన్నీ కార్డేట్లు. కానీ, కార్డేట్లు అన్ని సకశేరుకాలు కావు.

* వీటిలో ప్రధాన కార్డేటా లక్షణాలతో పాటు జతల ఉపాంగాలు (వాజాలు లాంటివి), దవడలు కలిగి లేదా దవడలు లేకుండా ఉంటాయి.

* ఉదర హృదయం కండరయుతంగా ఉండి రెండు, మూడు లేదా నాలుగు గదులను కలిగి ఉంటుంది. మధ్యవృక్క లేదా అంత్యవృక్క మూత్రపిండాలు విసర్జన, ద్రవాభిసరణక్రమత అవయవాలుగా ఉంటాయి.

యూరోకార్డేటా, సెఫలోకార్డేటాలను ప్రోటో కార్డేటా అంటారు.

హెమికార్డేటా - అర్ధ సకశేరుకాలు

* ఈ వర్గం చిన్న సముదాయాన్ని కలిగి ఉంటుంది. క్రిములు/ పురుగులు లాంటి సముద్ర జీవులు దీని కిందకు వస్తాయి. ఇవి ద్విపార్శ్వ సౌష్టవాన్ని ప్రదర్శిస్తాయి.

* ఇవి త్రిస్తరిత లక్షణం కలిగిన నిజశరీర కుహర జీవులు. శరీరం స్తూపాకారంలో ఉండి, పూర్వాంతంలో తుండం, కాలర్, పొడవైన మొండెం ఉంటాయి.

* ఒక మధ్య ఆస్య అంధ బాహువు స్టోమోకార్డ్‌లోకి విస్తరించి ఉంటుంది. పృష్ట హృదయం కలిగిన సంవృత ప్రసరణ వ్యవస్థ ఉంటుంది.

* జతలు కలిగిన మొప్ప చీలికల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ఇవి గ్రసనిలోకి తెరుచుకుంటాయి.

* విసర్జన ముఖపూర్వతుండ గ్రంథుల ద్వారా జరుగుతుంది. పరోక్ష అభివృద్ధి టార్నేరియా డింభకాన్ని కలిగి ఉంటుంది.

* ఈ వర్గానికి చెందిన ప్రధాన జీవులు: బెలనోగ్లాసస్, సాకోగ్లాసస్‌

ఇకైనోడర్మేటా

* ఇవన్నీ సముద్ర జీవులు. ఇకైనోడర్మ్‌లు అకశేరుక ద్వితీయ ముఖధారులు, ఆంత్ర శరీర కుహర జీవులు.

* ప్రౌఢ ఇకైనోడర్మ్‌లు వ్యాసార్ధ సౌష్టవం (పంచకిరణ వ్యాసార్ధ సౌష్టవం) కలిగి ఉంటాయి. కానీ వీటి డింభకాలు ద్విపార్శ్వ సౌష్టవాన్ని ప్రదర్శిస్తాయి.

* చర్మం మందంగా ఉంటుంది. అస్థి ఖండాలు ముళ్లకు ఆధారమిస్తాయి. అందుకే వీటికి ఇకైనోడర్మేటా (ముళ్ల చర్మం కలిగిన జంతువులు) అనే పేరు వచ్చింది. కొన్ని జీవుల్లో ముళ్లు రూపాంతరం చెంది పెడిసిల్లేరియాలుగా ఏర్పడ్డాయి.

* ఇకైనోడర్మ్‌లు జలప్రసరణ లేదా అంబులేక్రల్‌ వ్యవస్థ అనే విశిష్ట లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇది శరీర కుహర ఉత్పాదితం. చలనానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి, ఆహార రవాణకు, శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది. నీరు రంధ్ర ఫలకం ద్వారా జలప్రసరణ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. వీటి ప్రసరణ వ్యవస్థ వివృత రకం.

* హృదయం, రక్తనాళాలు ఉండవు. చర్మీయ జలశ్వాస నిర్మాణాలు (ముళ్ల మధ్య నుంచి ఏర్పడిన పలచటి దేహకుడ్య బాహ్య పెరుగుదలలు) వీటి శ్వాస అవయవాలు. అవస్కర శ్వాసవృక్షాలు లాంటివి సీ కుకుంబర్స్‌లో శ్వాస అవయవాలు.

* ప్రత్యేక విసర్జక అంగాలు ఉండవు. అందువల్ల విసర్జన సరళమైన వ్యాపనం ద్వారా జరుగుతుంది.

* నాడీ వ్యవస్థ తక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. మెదడు ఉండదు. బలహీన జ్ఞానాంగాలు ఉంటాయి.

* ఇవి ఏక లైంగికాలు, లైంగిక ద్విరూపకతను ప్రదర్శించవు. లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సాధారణంగా బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. పరోక్ష పిండాభివృద్ధిలో స్వేచ్ఛగా ఈదే ద్విపార్శ్వ సౌష్టవం కలిగిన డింభకాలు ఏర్పడతాయి. ఈ జీవుల్లో అసాధారణ పునరుత్పత్తి శక్తి ఉంటుంది. 

* ఈ జీవులను పరభక్షి పట్టుకున్నప్పుడు అసాధారణ ఆత్మచ్ఛేదన; స్వయం అంగచ్ఛేదం లేదా స్వయం అవయవచ్ఛేదనాన్ని ప్రదర్శిస్తాయి. అలా కోల్పోయిన దేహ భాగాలు పునరుత్పత్తి అవుతాయి. 

* డైప్లూరులా (Dipleurula) అనే పరికల్పిత డింభకాన్ని ఇకైనోడర్మ్‌ల వంశకర్తగా పరిగణిస్తారు.

* ఈ వర్గానికి చెందిన ప్రధాన జీవులు: ఎస్టీరియస్, ఎకైనస్, కుకుమేరియా

విభాగం: సైక్లోస్టోమేటా

* ఇవి దవడ భాగం లేని సకశేరుకాలు. 

* మంచినీరు లేదా సముద్ర జలాల్లో నివసిస్తాయి. 

* శరీరం పొడవుగా సన్నగా ఈల్‌లాగా పొలుసులు లేకుండా ఉంటుంది. మృదులాస్థి అస్థిపంజరం ఉంటుంది. 

* నోరు వలయాకారంగా ఉండి చూషకంలాగా పనిచేస్తుంది. నాలుకపై కొమ్ము పదార్థ నిర్మిత దంతాలు ఉంటాయి. 

* 6-15 జతల మొప్పచీలికలు శ్వాస అవయవాలుగా పనిచేస్తాయి. 

* హృదయం రెండు గదులతో ఉంటుంది. వృక్క నిర్వాహక వ్యవస్థ లేదు. మధ్యవృక్క రకానికి చెందిన మూత్రపిండాలు ఉంటాయి.

* ఈ జీవులకు ప్రధాన ఉదాహరణలు: పెట్రోమైజాన్‌ (లాంప్రే), మిక్సిన్‌ (హాగ్‌ చేప/ స్టైమ్స్‌ ఈల్‌). 

లాంప్రేలు: 

ఇవి గుడ్లు పెట్టడానికి సముద్రం నుంచి నదులకు వలస వెళ్తాయి. దీన్నే ఎనాడ్రోమస్‌ వలస అంటారు. అవి గుడ్లు పెట్టాక మరణిస్తాయి. గుడ్లు నుంచి బయటకు వచ్చిన అమ్మోసిట్‌ డింభకం రూపవిక్రియ తర్వాత ప్రౌఢజీవిగా సముద్రానికి తిరిగి చేరుతుంది.

హాగ్‌ చేపలు: 

ఇవి పూర్తిగా సముద్రజీవులు. ఇవి చనిపోయిన లేదా చనిపోతున్న చేపలను తింటాయి. ఏవైనా ఇతర జీవులు వీటిని తినడానికి వచ్చినా లేదా ఏదైనా అపాయకరమని భావించినా ఈ జీవులు తమ శ్లేష్మకోశాల నుంచి పాల లాంటి ద్రవాన్ని విడుదల చేస్తాయి. ఇది నీటిని తాకగానే జిగురుగా మారుతుంది. వీటిలో ప్రత్యక్ష అభివృద్ధి ఉంటుంది.

అధి విభాగం - నేతోస్టోమేటా

* ఇవి దవడలు ఉన్న సకశేరుకాలు. 

* వీటిలో ద్వంద్వ ఉపాంగాల (ఉరో శ్రోణి వాజాలు లేదా పూర్వ, చరమాంగాలు)కు లోపలి చెవిలో మూడు అర్ధచంద్రాకార కుల్యలు ఉంటాయి. 

* పృష్ట వంశం స్థానంలో పాక్షికంగా లేదా పూర్తిగా ఏర్పడిన అకశేరుదండం ఉంటుంది.

* దీనిలో దవడలు ఉన్న చేపలు, చతుష్పాదులు (టెట్రాపొడా జీవులు) ఉన్నాయి. చేపలు, ఉభయచరాలను కలిపి ఇక్తియోప్సిడా అని; సరీసృపాలు, పక్షులను కలిపి సారాప్సిడా అని అంటారు.

అధివిభాగం - ఏనేతా

* ఇవి దవడలు లేని చేపల లాంటి ప్రాథమిక జలచర సకశేరుకాలు. 

* వీటిలో ద్వంద్వ ఉపాంగాలు ఉండవు. లోపలి చెవిలో ఒకటి లేదా రెండు అర్ధచంద్రాకార కుల్యలు ఉంటాయి. 

* పృష్ట వంశం ప్రౌఢజీవిలో ఉంటుంది. దీనిలో విలుప్త విభాగం ఆస్ట్రకోడర్మి, జీవించి ఉన్న విభాగం సైక్లోస్టోమేటా ఉన్నాయి.

చేపలు

* చేపలు దవడలు కలిగిన మొట్టమొదటి సకశేరుకాలు. ఇవి మొప్పల ద్వారా శ్వాసించే పూర్తి జలచర జీవులు. 

* సైలూరియన్‌ కాలంలో విలుప్త, దవడలు లేని ఆస్ట్రకోడర్మ్‌ చేపల నుంచి ఇవి ఉద్భవించాయి.

* డివోనియన్‌ కాలంలో చేపలు అతిపెద్ద సమూహంగా ఏర్పడ్డాయి. ఈ యుగాన్ని చేపలకు స్వర్ణయుగం అంటారు.

* ఇవి అధిక భిన్నత్వం ఉన్న అతిపెద్ద సకశేరుక సమూహం.

* శరీర ఆకారం, పరిమాణం, రంగులో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి.

* వాణిజ్య ప్రయోజనాల రీత్యా ఇవి మానవుడికి చాలా ముఖ్యమైనవి. సీలకాంత్‌ (సముద్ర జీవులు), డిప్నాయ్‌ (మంచినీటి జీవులు) ప్రస్తుతం ఉన్న లంబికా వాజ చేపల్లో ముఖ్యమైనవి.

* చేపలలో షార్క్‌లు (సొరచేపలు), రేచేపలు, కిరణజాల చేపలు అధిక పరిమాణంలో ఉంటాయి.

* లాటిమేరియాలు ఆస్టియోలెపిడ్‌ చేపల సమూహానికి చెందినవి. తర్వాతి ఉన్నత శ్రేణి సకశేరుకాల పరిణామానికి ఇవి తోడ్పడ్డాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తారు.

* చేపల గురించిన అధ్యయనాన్ని ఇక్తియాలజీ అంటారు.

* ఇవి శీతలరక్త సంపూర్ణ జలచర జంతువులు. వీటి శరీరం కండె ఆకారంలో; తల, మొండెం, తోకగా విభేదనం చెంది ఉంటుంది. 

* అంతరాస్థి పంజరం మధ్యస్త్వచ పొలుసులు లేదా అస్థిఫలకాలతో ఏర్పడింది. 

* కొన్ని చేపల్లో పొలుసులు ఉండవు. మృదులాస్థి లేదా అస్థి నిర్మిత అంతరాస్థి పంజరం ఉంటుంది. 

* చలనానికి అద్వంద్వ వాజాలు (మాధ్యమిక, పుచ్ఛవాజాలు), ద్వంద్వ వాజాలు (ఉరో, శ్రోణి వాజాలు) ఉంటాయి. 

* దంతాల్లో అగ్రదంత, సమదంత, బహువార దంత అనే రకాలు ఉన్నాయి.

* మొప్పలతో శ్వాసవాయువుల మార్పిడి జరుగుతుంది. 

* హృదయం రెండు గదులతో మొప్పలకు రక్తాన్ని అందిస్తుంది. దీన్ని జలశ్వాస హృదయం (బ్రాంకియల్‌ హృదయం) అంటారు. 

* చేపల్లో ఏకప్రసరణ జరుగుతుంది. అంటే ప్రసరణలో రక్తం ఒకసారి మాత్రమే హృదయాన్ని చేరుతుంది. 

* శరీర అవయవాల నుంచి సిరా రక్తం/ ఆక్సిజన్‌ లేని రక్తం మాత్రమే హృదయానికి చేరుతుంది. దీన్ని ‘సిరా హృదయం’ అంటారు.

* మూత్రపిండాలు మధ్యవృక్క రకం. 

* ఇవి సాధారణంగా అమ్మోనోటెలిక్‌ జీవులుగా ఉంటాయి. మృదులాస్థి చేపలు మాత్రం యూరియోటెలిక్‌ జీవులుగా ఉంటాయి.

* కపాల నాడులు (క్రేనియల్‌ నాడులు) 10 జతలు ఉంటాయి. 

* లోపలి చెవిలో మూడు అర్ధచంద్రాకార కుల్యలు ఉంటాయి. 

* నీటి కదలికలు, కంపనాలను గుర్తించడానికి పార్శ్వరేఖ జ్ఞానాంగ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. 

* నేత్రాలకు రెప్పలు ఉండవు. నిమేషక పటలం లేదా నిక్టిటేటింగ్‌ త్వచం కనుగుడ్డును రక్షిస్తూ ఉంటుంది. 

* స్త్రీపురుష జీవులు వేరుగా ఉంటాయి. అంతర లేదా బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. అభివృద్ధి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జరుగుతుంది. 

* చేపల్లో ప్రస్తుతం రెండు విభాగాలు ఉన్నాయి. అవి: 

1. కాండ్రిక్తిస్‌ (మృదులాస్థి చేపలు) 

2. ఆస్టిక్తిస్‌ (అస్థి చేపలు) 

Posted Date : 06-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌