• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - యూరోపియన్ల రాక

పోర్చుగీస్‌ వారు

వీరు భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు. మనదేశం నుంచి చివరగా వెళ్లింది కూడా వీరే.

క్రీ.శ. 1498లో పోర్చుగల్‌కు చెందిన వాస్కోడిగామా యూరప్‌ నుంచి భారతదేశానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు. అతడు కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ మీదుగా ఆఫ్రికా చుట్టూ తిరిగి, కాలికట్‌ చేరుకున్నాడు. ఆ సమయంలో కాలికట్‌ను జామోరిన్‌ పాలిస్తున్నాడు.

క్రీ.శ. 1500లో పెడ్రో అల్వారెస్‌ కాబ్రల్‌ అనే మరో పోర్చుగీస్‌ యాత్రికుడు భారతదేశానికి వచ్చాడు. 

పోర్చుగీస్‌ వారు కాలికట్, కొచ్చిన్, కాననోర్‌లో తమ వాణిజ్య స్థావరాలను ఏర్పాటు చేశారు.

వాస్కోడిగామా క్రీ.శ. 1502లో మళ్లీ భారతదేశానికి వచ్చాడు.

భారతదేశంలో పోర్చుగీస్‌ వారి తరఫున ఫ్రాన్సిస్‌ డి అల్మడా గవర్నర్‌ అయ్యాడు. ఇతడు క్రీ.శ. 150209 వరకు ఈ పదవిలో ఉన్నారు. ఇతడు ‘బ్లూ వాటర్‌ పాలసీ’ విధానాన్ని అనుసరించాడు.

క్రీ.శ. 1509లో అల్మడా స్థానంలో అఫోన్సో డి అల్బెర్క్‌ (Alfan de Alberque’) గవర్నర్‌ అయ్యాడు. ఇతడు క్రీ.శ. 1510లో బీజాపూర్‌ నుంచి గోవాను స్వాధీనం చేసుకున్నాడు. గోవా భారతదేశంలోని పోర్చుగీస్‌ స్థావరాలకు రాజధానిగా మారింది.

ఇతడి కాలంలో పోర్చుగీస్‌ వారు పర్షియన్‌ గల్ఫ్‌లోని హూర్చుజ్‌ నుంచి మలయాలోని మలక్కా; ఇండోనేసియాలోని సుగంధ ద్వీపాల వరకు మొత్తం ఆసియాపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

క్రీ.శ. 1530లో నినో డా కున్హా ్బవిi-్న ద్చీ ద్యి-్త్చ్శ గవర్నర్‌ అయ్యాడు. ఇతడు గుజరాత్‌లోని బహదూర్‌ షా నుంచి డయ్యూ, బస్సేన్‌లను స్వాధీనం చేసుకున్నాడు

పశ్చిమ తీరంలోని సల్సెట్, డామన్‌; బొంబాయి; తూర్పు తీరంలోని మద్రాస్‌; బెంగాల్‌ సమీపంలోని హుగ్లీలో వీరు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. 

16వ శతాబ్దం చివరి నాటికి వీరు డామన్, డయ్యూ, గోవా మినహా స్వాధీనం చేసుకున్న భూభాగాలన్నింటినీ కోల్పోయారు.

క్రీ.శ. 1739లో మరాఠాలు సల్సెట్, బస్సేన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

పోర్చుగీస్‌ వారు భారతదేశానికి పొగాకు సాగును తీసుకొచ్చారు.

క్రీ.శ. 1556లో మొదటి ప్రింటింగ్‌ ప్రెస్‌ను గోవాలో ఏర్పాటు చేశారు.

క్రీ.శ. 1563లో మొదటిసారి ‘ది ఇండియన్‌ మెడిసినల్‌ ప్లాంట్స్‌’ అనే శాస్త్రీయ రచనను గోవాలో ప్రచురించారు.

వీరు సుగంధ ద్రవ్యాల (మిరియాలు) వ్యాపారాన్ని ఎక్కువగా నిర్వహించారు.

క్షీణతకు కారణాలు:

అఫోన్సో డి అల్బెర్క్‌ తర్వాత వచ్చిన గవర్నర్లు సమర్థంగా లేకపోవడం.

బలవంతపు మత మార్పిడులు నిర్వహించడం.

మొగల్, మరాఠా సేనలతో ఘర్షణలు.

పోర్చుగీస్‌ వారు లాటిన్‌ అమెరికాలో బ్రెజిల్‌ను కనుక్కున్నాక,  భారత్‌పై కంటే బ్రెజిల్‌పైనే ఎక్కువ శ్రద్ధ చూపారు.

డచ్‌వారు

క్రీ.శ. 1602లో డచ్‌ ఈస్టిండియా కంపెనీ ఏర్పాటైంది.

దీని ప్రధాన పరిపాలనా కేంద్రం బటావియా.

డచ్‌ వారు తమ మొదటి కర్మాగారాన్ని ఆంధ్రాలోని మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు.

వీరు గుజరాత్‌లోని సూరత్, బ్రోచ్, కాంబే, అహ్మదాబాద్‌; కేరళలోని కొచ్చిన్‌; బెంగాల్‌లోని చిన్సురా; బిహార్‌లోని పట్నా; యూపీలోని ఆగ్రాలో ట్రేడింగ్‌ డిపోలను స్థాపించారు.

ఆ సమయంలో పులికాట్‌ (తమిళనాడు) వీరికి ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. తర్వాత దాన్ని నాగపట్నానికి మార్చారు.

17వ శతాబ్దంలో వీరు పోర్చుగీస్‌ వారిపై విజయం సాధించి, వారి ఆధీనంలో ఉన్న అనేక భూభాగాలను ఆక్రమించారు.

క్రీ.శ. 1657లో పులికాట్‌లో నాణేలు ముద్రించుకునేందుకు వీరికి అనుమతి లభించింది.

క్రీ.శ. 1759లో ఆంగ్లేయులకు, డచ్‌ వారికి మధ్య బెదర యుద్ధం జరిగింది. అందులో డచ్‌ వారు ఓడిపోయారు.

డచ్‌ వారు వస్త్ర వ్యాపారాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. నీలిమందు, సాల్ట్‌పీటర్, ముడి పట్టును ఎగుమతి చేశారు.

వీరి ముఖ్య స్థావరాలు: మచిలీపట్నం (1605), పులికాట్‌ (1610), సూరత్‌ (1616), భీమిలిపట్నం (1641), కరైకల్ల (1645), చిన్సురా (1653), కాసింబజోర్‌ (1658), బరనగోర్‌ (1658), పట్నా (1658), బాలాసోర్‌ (1658), నాగపట్నం (1658), కొచ్చి (1663). 

ఫ్రెంచ్‌ ఈస్టిండియా కంపెనీ 

దీన్ని క్రీ.శ. 1664లో ఫ్రెంచ్‌ రాజు లూయిస్‌ శ్రీఖిజు వద్ద మంత్రిగా ఉన్న కోల్బర్ట్‌ స్థాపించాడు.

క్రీ.శ. 1668లో ఫ్రాన్సిస్‌ కారన్‌ సూరత్‌లో మొదటి ఫ్రెంచ్‌ ఫ్యాక్టరీని నెలకొల్పాడు.

క్రీ.శ. 1673లో ఫ్రెంచ్‌ గవర్నర్‌ ఫ్రాంకోయిస్‌ మార్టిన్‌ పాండిచ్చేరిని నిర్మించాడు. ఇది భారతదేశంలో ఫ్రెంచ్‌ ఆస్తులకు ప్రధాన కార్యాలయంగా మారింది.

ఫ్రెంచ్‌ వారు క్రీ.శ. 1690లో బెంగాల్‌ గవర్నర్‌ షయిస్తా ఖాన్‌ ఆధీనంలో ఉన్న కలకత్తా సమీపంలోని చంద్రనాగోర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాలాసోర్, మాహే, ఖాసిం బజార్, కరైకల్లలో తమ కర్మాగారాలు స్థాపించారు.

క్రీ.శ. 1742లో భారతదేశంలో ఫ్రెంచ్‌ గవర్నర్‌గా జోసెఫ్‌ ఫ్రాంకోయిస్‌ డూప్లెక్స్‌ రావడంతో ఆంగ్లో-ఫ్రెంచ్‌ వివాదాలు ప్రారంభమై,  ఫలితంగా కర్ణాటక యుద్ధాలు జరిగాయి.

ఆంగ్లో-ఫ్రెంచ్‌ పోటీ:

18వ శతాబ్దంలో భారతదేశంపై తమ తమ ఆధిపత్యం కోసం ఫ్రెంచ్‌ వారు, ఆంగ్లేయులు పోటీ పడ్డారు. మొగల్‌ సామ్రాజ్య పతనం కారణంగా ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని వారు ఉపయోగించుకోవాలని అనుకున్నారు.

వీరి మధ్య మూడు కర్ణాటక యుద్ధాలు జరిగాయి. వాటిలో ఆంగ్లేయులు గెలిచారు.

ఫ్రెంచ్‌ వారి వైఫల్యానికి కారణాలు:

ఆంగ్లేయుల వాణిజ్య, నౌకాదళ ఆధిపత్యం ఎక్కువగా ఉండటం.

ఫ్రెంచ్‌ ఈస్టిండియా కంపెనీకి ఫ్రెంచ్‌ ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేకపోవడం.

బ్రిటిష్‌ వారికి బెంగాల్‌లో బలమైన స్థావరాలు ఉండగా, ఫ్రెంచ్‌ వారికి దక్కన్‌లో మాత్రమే మద్దతు లభించింది.

ఫ్రెంచ్‌ వారికి ఒకే ఓడరేవు (పాండిచ్చేరి) ఉండగా, బ్రిటిష్‌ వారి ఆధీనంలో (కలకత్తా, బొంబాయి, మద్రాస్‌) ఉన్నాయి.

ఫ్రెంచ్‌ జనరల్స్‌ మధ్య అభిప్రాయ భేదాలు.

ఐరోపా యుద్ధాల్లో ఇంగ్లండ్‌ గెలిచి, పూర్తి శక్తిమంతంగా మారడం.

డేన్స్‌ (డెన్మార్క్‌) 

ఈస్టిండియా కంపెనీ

దీన్ని క్రీ.శ. 1616లో నెలకొల్పారు.

క్రీ.శ. 1620లో ట్రాన్క్విబార్‌ (తమిళనాడు)లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు.

వీరు క్రీ.శ. 1676లో సేరంపూర్‌ (బెంగాల్‌)లో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వీరు ఎక్కువ కాలం తమ ప్రభావాన్ని చూపలేకపోయారు.

క్రీ.శ. 1845లో భారతదేశంలోని తమ ఆస్తులను బ్రిటిష్‌ వారికి విక్రయించారు.

బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ

తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి ఇంగ్లిష్‌ అసోసియేషన్‌ లేదా ఈస్టిండియా కంపెనీ ఏర్పడింది.

వ్యాపారనిమిత్తం మొదటిసారి భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయుడు జాన్‌ మిల్డెన్‌హాల్‌.

క్రీ.శ. 1599లో ‘ది మర్చంట్‌ అడ్వెంచర్స్‌’ అని పిలిచే ఆంగ్ల వ్యాపార బృందం భారత్‌లో తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అనుమతి కోరుతూ రాణి ఎలిజబెత్‌ ఖి దగ్గరకు వెళ్లారు. క్రీ.శ. 1600 డిసెంబరు 31న ఆమె వ్యాపారానికి అంగీకరిస్తూ రాయల్‌ చార్టర్‌ (అధికారిక మంజూరు)ను చేశారు. ఈ విధంగా ‘బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ’ ఆవిర్భవించింది.

క్రీ.శ. 1609లో సూరత్‌లో వ్యాపార కేంద్రాన్ని నెలకొల్పేందుకు అనుమతి కోరుతూ విలియం హాకిన్స్‌ మొగల్‌ చక్రవర్తి జహంగీర్‌ ఆస్థానానికి వెళ్లాడు. క్రీ.శ. 1612లో జహంగీర్‌ అతడి ప్రతిపాదనను అంగీకరించారు. 

క్రీ.శ. 1613లో కెప్టెన్‌ బస్ట్‌ సూరత్, కాంబాయా, అహ్మదాబాద్, గోవాల్లో ఫ్యాక్టరీలు స్థాపించేందుకు అనుమతి పొందాడు.

క్రీ.శ. 1615లో ఇంగ్లండ్‌ రాజు జేమ్స్‌ ఖి తన రాయబారిగా సర్‌ థామస్‌ రోను మొగల్‌ ఆస్థానానికి పంపాడు. అతడు భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో కర్మాగారాలు నిర్మించడానికి అనుమతి తీసుకున్నాడు.

క్రీ.శ. 1619లో ఆంగ్లేయులు ఆగ్రా, అహ్మదాబాద్, బరోడా, బ్రోచ్‌లలో ఫ్యాక్టరీలు స్థాపించారు.

ఆంగ్లేయులు దక్షిణ భారతదేశంలో తమ మొదటి కర్మాగారాన్ని క్రీ.శ. 1626లో మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు.

క్రీ.శ. 1633లో ఈస్టిండియా కంపెనీ మొదటిసారి తూర్పు భారతదేశంలో ఫ్యాక్టరీలు నెలకొల్పింది. ఒడిశాలోని హరిహరపూర్, పట్నా, బాలాసోర్‌లలో వీటిని స్థాపించారు.

కోరమండల్‌ తీరంలో (బెంగాల్, బిహార్, ఒడిశా) ఆంగ్లేయుల ప్రధాన కార్యాలయంగా మచిలీపట్నం ఉండేది. క్రీ.శ. 1661లో దీన్ని మద్రాస్‌కు మార్చారు.

క్రీ.శ. 1668లో పశ్చిమ తీరంలోని కంపెనీకి బొంబాయి ప్రధాన కార్యాలయంగా మారింది.

క్రీ.శ. 1690లో జాబ్‌ చార్నాక్‌ బెంగాల్‌లోని సుతానుతి ప్రాంతంలో కార్మాగారాన్ని స్థాపించాడు.

ఈస్టిండియా కంపెనీ క్రీ.శ. 1698లో బెంగాల్‌లోని సుతానుతి, కలికట, గోవింద్‌పూర్‌ గ్రామాలను అక్కడి జమీందార్‌ నుంచి కొనుగోలు చేసింది. తర్వాతి కాలంలో ఆ ప్రాంతమే కలకత్తా నగరంగా అభివృద్ధి చెంది, ఈస్టిండియా కంపెనీ వ్యాపార రాజధానిగా మారింది.

బొంబాయిలో కంపెనీ ముద్రించిన నాణేలను మొగల్‌ సామ్రాజ్యం అంతటా  అనుమతించారు.

కంపెనీ నిర్మించిన ప్రతి కర్మాగారం గవర్నర్‌ ఇన్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఉండేది. దీనికి గవర్నర్‌ అధ్యక్షుడిగా ఉండేవాడు. ఇందులో సీనియర్‌ వ్యాపారులు సభ్యులుగా ఉండేవారు.

పాలన విధానాలను నిర్ణయించే సర్వోన్నత అధికారం కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌కు ఉండేది.

మద్రాస్, బొంబాయి, కలకత్తాల్లోని బ్రిటిష్‌ స్థావరాలు అభివృద్ధి చెందుతున్న నగర కేంద్రాలుగా మారాయి.

బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ భారత్‌లో సార్వభౌమ రాజ్య హోదాను పొందేందుకు మొగ్గు చూపింది.

Posted Date : 14-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌