• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ ఉనికి - నైసర్గిక స్వరూపం

ఉనికి 

మనరాష్ట్రం భారతదేశంలోని ఆగ్నేయ తీరంలో  12o.41', 19o.07ఉత్తర అక్షాంశాలు, 76o.50',  84o.07'  తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. 

విస్తీర్ణం: 1,62,970 చ.కి.మీ విస్తీర్ణాన్ని కలిగి, మొత్తం దేశంలో 8.87 శాతం భూభాగాన్ని కలిగి, విస్తీర్ణపరంగా దేశంలో 7వ స్థానంలో ఉంది.

* రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 13. వీటిని 26కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం 2022, జనవరి 25న నోటిఫికేషన్‌ ఇచ్చింది.

* ఆంధ్రప్రదేశ్‌ దేశానికి ఆగ్నేయ దిశలో, తాళపు చెవి ఆకారంలో విస్తరించి ఉంది.

* రాష్ట్రంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా అనంతపురం. రెండో స్థానంలో కర్నూలు ఉంది.

* విస్తీర్ణపరంగా అతిచిన్న జిల్లా శ్రీకాకుళం. రెండో స్థానంలో విజయనగరం ఉంది.

సరిహద్దులు: 

తూర్పు - బంగాళాఖాతం

పడమర - కర్ణాటక

ఉత్తరం - ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ

దక్షిణం - తమిళనాడు

* 2014, జులై 17న ఖమ్మం జిల్లాకు (తెలంగాణ) చెందిన మొత్తం 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. భద్రాచలం రెవెన్యూ డివిజన్‌కు చెందిన 4 మండలాలను (చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం - రెవెన్యూ గ్రామం మినహా) తూర్పుగోదావరిలో జిల్లాలో, పాల్వంచ రెవెన్యూ డివిజన్‌ నుంచి 3 మండలాలను (కుక్కునూరు, వేలేరుపాడు, 
బూర్గంపాడు) పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేశారు. వీటిని పోలవరం ఆర్డినెన్స్‌ బిల్లుతో కలిపారు.

తీరరేఖ: 

రాష్ట్రానికి మొత్తం 974 కి.మీ. పొడవైన తీరరేఖ ఉంది.

దేశంలో పొడవైన తీరరేఖను కలిగిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మొదటిది గుజరాత్‌.

రాష్ట్రంలో పొడవైన తీరరేఖను కలిగిన జిల్లా శ్రీకాకుళం కాగా, తక్కువ తీరరేఖ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది.

భారత ప్రామాణిక రేఖాంశమైన 82o . 30' తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ మీదుగా వెళ్తుంది.

నైసర్గిక స్వరూపం

నైసర్గిక స్వరూపం అనేది ఒక ప్రాంత పద నిర్మాణ శాస్త్రంలో దాని మూలం, పరిణామ సమయం, భౌతిక అమరికతో వ్యవహరిస్తుంది. మనరాష్ట్రాన్ని ప్రధానంగా మూడు సహజ మండలాలుగా విభజిస్తారు. అవి: 

1. పడమటి పీఠభూమి  

2. తూర్పు కనుమలు   

3. తీరమైదానం

పడమటి పీఠభూమి 

* ఈ ప్రాంతం ప్రధానంగా గ్రానైట్, క్వార్ట్జ్, అతి పురాతన ఆర్కియన్‌నీస్, షిష్ట్‌ శిలలతో ఏర్పడింది.

* ఈ పీఠభూమికి ఉత్తర భాగంలో ఉన్న గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో గోండ్వానా శిలలు ఉన్నాయి.

* రాయలసీమలోని అనంతపురం, నంద్యాల ప్రాంతాలు పడమటి పీఠభూమిలో  అంతర్భాగంగా ఉన్నాయి.

* అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కొంత భాగం మైసూరు పీఠభూమిలో అంతర్భాగంగా ఉన్నాయి.

* పడమటి పీఠభూమికి ఉత్తరాన ఉన్న గోండ్వానా శిలల్లో బొగ్గు లభిస్తుంది

తూర్పు కనుమలు  

* తీరమైదానానికి, పడమటి పీఠభూమికి మధ్యలో ఉత్తర, దక్షిణంగా ఈ తూర్పు కనుమలు వ్యాపించి ఉన్నాయి.

* ఈ కనుమలు చార్నోకైట్, ఖొండలైట్‌ శిలలతో ఏర్పడ్డాయి.

ఉత్తరాన ఉన్న తూర్పు కనుమలను ‘తూర్పుశ్రేణులు’ అని, దక్షిణాన ఉన్న తూర్పు కనుమలను ‘కడప శ్రేణులు’ అని అంటారు.

వీటి సగటు ఎత్తు 915 మీటర్లు.

* తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తయిన శిఖరం ‘జిందగడ’ శిఖరం. ఇది విశాఖపట్నంలోని అరకులోయ వద్ద ఉంది. దీని ఎత్తు 1690 మీటర్లు.

* బోండా జాతి గిరిజనులు అరకు ప్రాంతంలోని కొండల్లో, దట్టమైన అడవుల్లో జీవిస్తున్నారు.

* చిత్తూరులోని ‘ఏనుగు ఎల్లమ్మ’ కొండ తూర్పు కనుమల్లోని వేసవి విడిది కేంద్రం. ఈ ప్రాంతాన్నే ‘హార్స్‌లీ హిల్స్‌’ అంటారు.

శాఖలు: కృష్ణానదికి దక్షిణంగా తూర్పు కనుమలకు రెండు శాఖలు ఉన్నాయి. అవి: 

వెలుపలి శాఖ: ఇందులో నల్లమల కొండలు, వెలికొండలు ఉన్నాయి.

లోపలిశాఖ: ఇందులో ఎర్రమల కొండలు, శేషాచలం కొండలు, పాలకొండలు ఉన్నాయి. తూర్పు కనుమలు ఉత్తరాన 70 కి.మీ. పొడవు, 1200 మీటర్లు ఎత్తులో ఉన్నాయి.

నల్లమల అడవులు ఆంధ్రప్రదేశ్‌లో దట్టమైన అడవులు.

యారాడ కొండలు, డాల్ఫిన్‌ నోస్‌లు సముద్ర అలల తాకిడి నుంచి విశాఖ ఓడరేవును రక్షిస్తున్నాయి.

తీరమైదానం

ఇది తూర్పు కనుమలకు, బంగాళాఖాతానికి మధ్య విస్తరించి ఉంది.

ఈ మైదానం చాలా వరకు నదులు తెచ్చిన ఒండ్రుమట్టి వల్ల ఏర్పడింది.

 ఇది ఉత్తరాన శ్రీకాకుళం దగ్గర ఉన్న మహేంద్రగిరి నుంచి దక్షిణాన నెల్లూరు జిల్లాలోని పులికాట్‌ సరస్సు వరకు విస్తరించి ఉంది. దీని పొడవు సుమారు 974 కి.మీ.

 ఈ తీరమైదానం ఉత్తర, దక్షిణ భాగాల్లో సన్నగా ఉంటుంది. మధ్య భాగంలో కృష్ణా - గోదావరి నదులు ఏర్పరచిన డెల్టాల వల్ల సుమారు 160 కి.మీ. వెడల్పుతో ఉంటుంది.

గార్డెన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌

 గోదావరి నదికి ఏడు పాయలు ఉన్నాయి. వాటిలో మొదటి రెండూ గౌతమి, వశిష్ట. వీటి మధ్య ఉన్న ప్రాంతమే ‘కోనసీమ’గా ప్రసిద్ధి చెందింది. 

ఈ ప్రాంతంలో కొబ్బరి, అరటి తోటలను విస్తారంగా సాగు చేస్తారు. దీన్నే ‘ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానవనం’ (Garden of Andhra Pradesh) అంటారు.

తూర్పు తీరంలోని సరస్సులు 

కొల్లేరు సరస్సు:

* కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న పల్లపు ప్రాంతం ‘కొల్లేరు సరస్సు’గా ఏర్పడింది.

* ఇది పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మధ్య ఏర్పడిన మంచి నీటి సరస్సు.

* దీని వైశాల్యం 245 చ.కి.మీ.

పులికాట్‌ సరస్సు: 

* ఇది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు, తమిళనాడు రాష్ట్రానికి మధ్య ఉంది. సముద్ర నీరు తీరమైదానంలోకి చొచ్చుకు రావడం వల్ల ‘పులికాట్‌ సరస్సు’ ఏర్పడింది. 

* ఇది  ఉప్పు నీటి సరస్సు. దీని విస్తీర్ణం 460 చ.కి.మీ.

* ఈ సరస్సు అధిక భాగం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.

* 1976లో ప్రభుత్వం ఈ ప్రాంతంలో పులికాట్‌ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

శిలలు - రకాలు

* ఆంధ్రప్రదేశ్‌లోని దక్కన్‌ పీఠభూమిలో ఈ కింది శిలా స్వరూపాలు కనిపిస్తాయి. అవి:

1. దాద్వార్‌ శిలలు    2. కడప శిలలు        3. కర్నూలు శిలలు    

4. గోండ్వానా శిలలు  5. దక్కన్‌ నాపలు    6. రాజమండ్రి శిలలు

దాద్వార్‌ శిలలు:  

* ఇవి దేశంలోనే అతి ప్రాచీన శిలలు.

* వీటిని మొదట కర్ణాటకలోని దాద్వార్‌ ప్రాంతంలో కనుక్కున్నారు.

* ఈ శిలలు లావా విస్పోటనం వల్ల ఏర్పడ్డాయి.

* మనరాష్ట్రంలో ఈ రకమైన శిలలు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో లభ్యమవుతున్నాయి.

* ఈ శిలల్లో ముడి ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఇవి ఆర్థికపరంగా చాలా ముఖ్యమైనవి.

కడప శిలలు: 

* ఇవి దాద్వార్‌ శిలల అవశేషాల వల్ల ఏర్పడ్డాయి.

కడప శిలల్లో సిమెంట్‌ గ్రేడ్, సున్నపురాయి నిల్వలు, రాతినార ఉంటాయి.

గోండ్వానా శిలలు:

* కృష్ణా, గోదావరి నదీ లోయల్లో ఈ శిలలు కనిపిస్తాయి.

*ఇవి ఎర్రటి ఇసుక రాళ్లను కలిగి ఉంటాయి.

*గోదావరి నది దిగువ భాగంలో ఉన్న బొగ్గు గనులు గోండ్వానా శిల రకానికి చెందినవే.

దక్కన్‌ నాపలు: 

ఇవి ఎక్కువగా ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో లభ్యమవుతాయి.

బసాల్ట్‌ శిలల రకానికి చెందిన ఇగ్నియస్‌ రాళ్లు వీటిలో ఎక్కువగా ఉంటాయి.

రాజమండ్రి శిలలు:

* సముద్రం ఉప్పొంగి ఇసుక, సున్నం, మట్టి అవక్షేపంగా మారడం వల్ల ఇవి ఏర్పడ్డాయి.

* ఈ శిలల్లో పెట్రోలియం, సహజ వాయువులు అధికంగా లభిస్తాయి.


 

Posted Date : 09-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌