• facebook
  • whatsapp
  • telegram

ఆదేశిక సూత్రాలు

సాధారణంగా ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్య విభేదం ఏర్పడితే ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలని 37వ అధికరణం పేర్కొంటోంది. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉండదని కూడా ఈ అధికరణం ద్వారా స్పష్టం అవుతుంది. చంపకం దొరైరాజన్ కేసులో, కేరళ విద్యా బిల్లు కేసులో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని ధ్రువపరిచింది.

కాలానుగుణంగా ప్రభుత్వ పరిధి పెరగడంతో 1970వ దశకంలో ప్రజా సంక్షేమ చట్టాల అమలుకు కొన్ని ప్రాథమిక హక్కులు ఆటంకంగా మారాయి. దీంతో పార్లమెంట్ రాజ్యాంగ సవరణలు చేసింది. దీనికి న్యాయవ్యవస్థ విముఖత చూపింది.

‣ 1970 నుంచి ఆదేశిక సూత్రాల స్వభావాన్ని, దాన్ని అర్థం చేసుకునే విధానంలో ఇటు కార్యనిర్వాహక వర్గం, అటు న్యాయవ్యవస్థల దృక్పథాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు ఆదేశిక సూత్రాల అమలు విషయమై ఘర్షణ వాతావరణం నెలకొని ఉండేది.

‣ 1970వ దశకంలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సామ్యవాద విధానాల అమలు పట్ల మొగ్గు చూపించింది. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినప్పుడు అప్పటి సామ్యవాద USSR ఇచ్చిన మద్దతు వల్ల, కాంగ్రెస్‌లో వచ్చిన అంతర్గత చీలిక వల్ల ఇందిరాగాంధీ సామ్యవాదం వైపు మొగ్గు చూపినట్లు అర్థమవుతుంది. 1971లో చేసిన 25వ రాజ్యాంగ సవరణ ద్వారా 31 (c) అనే అధికరణాన్ని జోడించారు. 

‣ ఈ అధికరణం ఆదేశిక సూత్రాల్లోని 39 (b) (సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న సహజ వనరులపై రాజ్యానికి యాజమాన్య నియంత్రణ ఉండాలి. సమాజంలో అందరికీ వాటిని సమానంగా పంపిణీ చేయాలి), 39(c) (ఉత్పత్తి పరికరాలు, సంపద కేవలం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఆర్థిక విధాన రూపకల్పన) అమలుకు ప్రాథమిక హక్కుల్లోని 14, 19, 31వ అధికరణాలు అడ్డు తగిలితే వాటిని న్యాయసమీక్ష నుంచి మినహాయించాలని పేర్కొంటోంది.

‣ అయితే ఇది అంతకు ముందు గోలక్ నాథ్ కేసులో (1967) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అతిక్రమిస్తూ చేసిన రాజ్యాంగ సవరణగా మనకు కనిపిస్తుంది. గోలక్‌నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి 25వ రాజ్యాంగ సవరణ ద్వారా కార్యనిర్వాహక వర్గానికి, న్యాయస్థానానికి మధ్య ఒక రకమైన సంకట పరిస్థితి నెలకొంది. అయితే సుప్రీం కోర్టు కేశవానంద భారతి కేసు (1973)లో తీర్పు సందర్భంగా - రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందని అయితే రాజ్యాంగానికి 'ఒక మౌలిక స్వభావం' ఉందని, దాన్ని దెబ్బతీసే ఎలాంటి రాజ్యాంగ సవరణ చెల్లదని పేర్కొంది. పైన పేర్కొన్న మౌలిక స్వభావంలో న్యాయ సమీక్ష కూడా ఒక లక్షణమని కోర్టు స్పష్టం చేసింది. క్లుప్తంగా చెప్పాలంటే కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు ఉద్దేశం - 25వ రాజ్యాంగ సవరణ (39 (b), (c) లలోని సామ్యవాద ఆదర్శాలను చట్టం ద్వారా అమలు చేయడానికి ప్రాథమిక హక్కుల్లోని 14, 19, 31 అధికరణాలు అడ్డుపడినా ప్రభుత్వం అమలు చేసుకోవచ్చు)  హేతుబద్ధమైందే, కానీ పై విషయంలో కోర్టులకు న్యాయ సమీక్షాధికారం ఉంటుంది. 

‣​​​​​​​ కేశవానంద భారతి కేసులో పేర్కొన్న అంశాలను పక్కనబెట్టిన ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఈ సవరణ ప్రకారం కేవలం 39(b), (c) కాకుండా ఏ ఆదేశిక సూత్రాల అమలు కోసమైనా చట్టాలు చేసినప్పుడు అవి ప్రాథమిక హక్కుల్లోని 14, 19 అధికరణాలకు విరుద్ధంగా ఉన్నా అవి ఆమోదయోగ్యమైనవే. అయితే మినర్వా మిల్స్ కేసులో సుప్రీం కోర్టు 42వ రాజ్యాంగ సవరణలో ఆదేశిక సూత్రాలకు ఇచ్చిన ఆధిపత్యాన్ని కొట్టివేసింది.

‣​​​​​​​ ఫలితంగా 39 b, c అధికరణాల అమలు కోసం (ఒకవేళ అవి ప్రాథమిక హక్కుల్లోని 14, 19 అధికరణాలతో సంఘర్షించినా) చట్టాలను రూపొందించుకోవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే వీటిపై న్యాయస్థానాలకు న్యాయసమీక్షాధికారం ఉంటుంది.

‣​​​​​​​ 1980వ దశకంలో, ఆ తర్వాత ఆదేశిక సూత్రాల స్వభావం పట్ల న్యాయస్థానాల దృక్పథంలో గణనీయమైన మార్పు కనిపిస్తూ వస్తోంది. న్యాయస్థానాలు ఇప్పుడు వ్యక్తి హక్కులకు (ప్రాథమిక హక్కులు) ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో సామాజిక హక్కులకు (ఆదేశిక సూత్రాలు) కూడా అంతే ప్రాముఖ్యం ఇస్తున్నాయి. ఆదేశిక సూత్రాలను అమలు చేయమని న్యాయస్థానాలు, ప్రభుత్వాలకు పదేపదే చెబుతున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి పౌరస్మృతి (44వ అధికరణం), మద్యపాన నిషేధం (47వ అధికరణం) అమలు చేయమని న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాయి.

‣​​​​​​​ 39వ అధికరణానికి అదనంగా 'A' భాగాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. దీని ప్రకారం న్యాయవ్యవస్థ పేదవర్గాల ప్రయోజనాలను కాపాడి, సామాజిక న్యాయాన్ని సమకూర్చేలా వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి. 

 

40వ అధికరణం 

ఈ అధికరణం ప్రకారం గ్రామ పంచాయతీ వ్యవస్థలను నెలకొల్పి స్వపరిపాలనా విధానంలో గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలి. ఇది మహాత్మాగాంధీ ఆశయం. ప్రతి గ్రామం ఒక చిన్న గణతంత్రంగా (Little Republic) ఎదగాలని ఆయన భావించేవారు. స్వరాజ్యం గ్రామ స్వరాజ్యంగా మారితేనే దేశం బాగుంటుందనేది ఆయన అభిప్రాయం. అందుకే ఆయన అభీష్టాన్ని ఆదేశిక సూత్రాల్లో జోడించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధత కల్పించారు. తద్వారా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను నెలకొల్పి, గ్రామ పంచాయతీలకు, మండలాలకు, జిల్లా యంత్రాంగానికి అనేక విధులను కేటాయించారు.

 

41వ అధికరణం

నిరుద్యోగం, వృద్ధాప్యం, అనారోగ్యం, అంగవైకల్యం లాంటి అశక్తతతో బాధపడేవారికి తగిన ఉద్యోగ, విద్యా సదుపాయాలను కల్పించేందుకు తమ ఆర్థిక పరిస్థితికి లోబడి ప్రభుత్వాలు కృషి చేయాలి.

‣​​​​​​​ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మంజూరు చేస్తున్న పింఛన్లు, విద్యార్థులకు అందిస్తున్న ఉపకారవేతనాలు ఈ కోవకే చెందుతాయి. 

 

42వ అధికరణం 

రాజ్యం కార్మికులకు న్యాయమైన పని పరిస్థితులను కల్పించడం (Human conditions of work), స్త్రీలకు ప్రసూతి సౌకర్యం కల్పించడం.

‣​​​​​​​ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం కోసం అనేక చట్టాలను చేపట్టాయి.

‣​​​​​​​ గర్భిణులకు ఉచిత వైద్యపరీక్షలు, అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు ఈ కోవకు చెందినవే.

‣​​​​​​​ 1961లో ప్రసూతి రక్షణ చట్టాన్ని రూపొందించారు.

 

43వ అధికరణం

వ్యవసాయ, పారిశ్రామిక, ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులకు హేతుబద్ధమైన, గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన వేతనాలు చెల్లింపునకు సంబంధించి అవసరమైన శాసనాలను రూపొందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. వారికి తగినంత విరామ సమయం, సాంఘిక, సాంస్కృతిక అవకాశాలను కల్పించాలి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘ ప్రాతిపదికపై లేదా వ్యక్తి ప్రాతిపదికపై కుటీర పరిశ్రమల సంఖ్యను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి.

‣​​​​​​​ కార్మికుల కోసం కనీస వేతన చట్టాన్ని (1948) రూపొందించారు.

‣​​​​​​​ గ్రామీణ అభివృద్ధి కోసం సమాజ వికాస పథకాన్ని (1952) ప్రవేశపెట్టారు. 

‣​​​​​​​ కుటీర పరిశ్రమలు రాష్ట్ర జాబితాకు చెందినప్పటికీ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు, చేనేత మగ్గాల బోర్డు, కాయిర్ బోర్డును ఏర్పాటు చేశారు.

‣​​​​​​​ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా '43 (A)' ను రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం పరిశ్రమల నిర్వహణలో కార్మికులను భాగస్వాములను చేసే చట్టాలను రూపొందించాలి.

 

44వ అధికరణం

‣​​​​​​​ భారతదేశంలో పౌరులందరికీ ఒకే విధమైన ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.

‣​​​​​​​ ఆదేశిక సూత్రాల్లో అత్యంత సున్నితమైన, వివాదాస్పదమైన అంశమిది.

‣​​​​​​​ వివాహం, విడాకులు, ఆస్తి పంపకాల విషయంలో న్యాయస్థానాలు ప్రస్తుతం మన చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి.

‣​​​​​​​ ఈ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తే మన చట్టాల (Personal Law) స్థానంలో దేశంలో అందరికీ ఒకే చట్టం అమల్లోకి వస్తుంది.

‣​​​​​​​ మైనారిటీ (ముస్లిం, క్రిస్టియన్) మత పెద్దలు ఇందుకు సుముఖంగా లేరు.

‣​​​​​​​ రాజ్యాంగ నిర్మాణ సభ సమావేశాల్లో (Constituent Assembly debates) డా.బి.ఆర్.అంబేడ్కర్ ఉమ్మడి పౌరస్మృతికి అనుకూలంగా తమ వాదనలను వినిపించారు. తర్వాతి కాలంలో దేశ న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్లును రూపొందించారు. లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించినా రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఆమోదం తెలపకపోవడంతో అంబేడ్కర్ తన పదవికి రాజీనామా చేశారు. 

‣​​​​​​​ ఎస్.ఆర్.బొమ్మై కేసులో (1994) సుప్రీం కోర్టు ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది.

‣​​​​​​​ అంతకుముందు 1985లో షాబానో కేసులో సి.ఆర్.పి.సి. ప్రకారం విడాకులు పొందిన తన భర్త నుంచి భరణం (ధరావత్తు) పొందాలన్న షాబానో వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. అయితే ఈ తీర్పును నీరుగారుస్తూ అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పార్లమెంట్‌లో Muslim Women (Protection of Rights on Divorce) 1986 చట్టాన్ని తీసుకొచ్చింది.

‣​​​​​​​ శారదా ముద్గల్ కేసులో పెళ్లి కోసం మతం మార్చుకోవడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది

‣​​​​​​​ ​​​​​​​ప్రస్తుత పరిస్థితి: మూడు సార్లు 'తలాక్' చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ షయారా బానో పెట్టుకున్న అభ్యర్థన సుప్రీంకోర్టు ముందు పరిశీలనలో ఉంది.

 

​​​​​​​

Posted Date : 01-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌